కొడాలి నానికి తిరుమల వెంకన్న బామ్మర్దట..
విమర్శలకు చిక్కిన వ్యాఖ్యలు
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

సోము వీర్రాజు.. ఆంధ్రాలో కమలదళానికి కొత్త దళపతి అయినా, పార్టీకి మాత్రం పాత ‘కాపు’. ఆయన బాగా మాట్లాడతారని అందరికీ తెలుసు. కానీ ఆయనలో దాగున్న వెటకారపుతనమంతా, ఆయన అధ్యక్షుడయ్యాకే అందరికీ తెలిసిస్తోంది. అధ్యక్షుడయిన తొలినాళ్లలో టీవీ9 ఇంటర్వ్యూలో రజనీకాంత్‌తో మాట్లాడిన వెటకారపు మాటలు, ఎదురుదాడి ముచ్చటేసింది. ‘మాకు అధికారం ఇస్తే 13 జిల్లాలను 13 రాష్ట్రాలను చేస్తాం. మాకు అధికారం ఇప్పించండి రజనీకాంతుగారూ’ అని చేతులు ఊపుతూ చేసిన, వెటారపు వ్యాఖ్యలు, మాకళ్లతో చూస్తాం వెంఖటకృష్ణగారూ, మీ కళ్లతో చూడమంటే ఎలా’ అన్న మాటలు వీర్రాజుకు మీడియాపై ఉన్న అభిప్రాయమేమిటో స్పష్టం చేశాయి. ఆ తర్వాత కూడా మీడియాతో ఆయన అదే పంథా కొనసాగిస్తున్నారు. సోమన్న నేరుగా చెప్పకపోయినా.. కమ్మ మీడియా అంతా రెండుకళ్లతో చూస్తున్నాయని, అవన్నీ చంద్రబాబు భక్తమండలి అని అర్ధమయ్యేలా మాట్లాడుతూనే ఉన్నారు. మీడియాపై ఎదురుదాడి చేయడం ద్వారా.. ‘సోము వీర్రాజు ఎందుకు చెబుతున్నాడో అర్ధం చేసుకోండి’ అనే కొత్త పదాలతో, మీడియా భయపడిపోతుందన్నది సోమన్న వ్యూహం కావచ్చు. సరే జగన్ మీడియా-అధికార గెజిట్‌లో మాత్రం సోమన్న ప్రకటనలు, ప్రెస్‌మీట్లు ఎలాగూ తాటికాయంత అక్షరాలతో.. అది కూడా బాబుపై చేసిన విమర్శలు మాత్రమే వస్తుంటాయి. అది వేరే విషయం.

తాజాగా రాష్ట్రంలో వివాదానికి కారణమయిన.. తిరుమల డిక్లరేషన్ వ్యవహారంపై వీరన్న దళం, సర్కారుపై బాగానే విరుచుకుపడుతోంది. అంటే సోమన్న దళం.. హిందూ ఆలయాలపై దాడుల అంశంలో,  ఓ 20 విమర్శలు జగనన్నపై- మరో 80 విమర్శలు నాటి సీఎం చంద్రన్నపై చేస్తూ, ఆవిధంగా ముందుకువెళుతోందన్న మాట. సరే ఎవరి అజెండా, ఎవరి ప్రేమలు  వారివనుకోండి! అంతకుముందు.. సీబీఐ విచారణకు ఆదేశించిన తర్వాత కూడా,  చేసిన ‘చలో అమలాపురం’ అరెస్టుల క్రతువు, నాయకుల హడావిడితోపాటు.. ముఖ్యమైన ముగ్గురు-నలుగురు నాయకులు,  ఇళ్లకే పరిమితమయ్యేలా వేసుకున్న ఎత్తుగడ ముచ్చట్లు, చూడ ముచ్చటగానే కనిపించాయి.

అంతటి గొప్ప నాయకుడయిన వీరన్న.. తిరుమలకు వెళ్లే వారు డిక్లరేషన్ ఇవ్వాల్సిన పనిలేదన్న మంత్రి కొడాలి నానిపై.. అలవాటులో పొరపాటుగా, పొరపాటులో అలవాటుగా చేసిన వెటకారం వికటించింది. ఫలితంగా విమర్శల చేతికి చిక్కిపోయారు. ‘‘తమ్ముడికి తెలియక పాపం తెలియక మాట్లాడుతున్నాడు. డిక్లరేషన్ ఎవరు పెట్టారని అడుగుతున్నారు. వెంకన్న ఏమైనా కొడాలి నానికి బామ్మరిదా?’ అని.. వీర్రాజు, అలవాటు ప్రకారం చేసిన వెటకారం బూమెరాంగయింది. దీనిపై ఇటీవలే బీజేపీ నుంచి వెలి వేయబడిన టీటీడీ మాజీ సభ్యుడు ఓ.వి.రమణ.. వీరన్నపై విరుచుకుపడ్డారు.

‘‘అంటే వీరన్న దృష్టిలో కొడాలి నాని కూడా దేవుడని భావిస్తున్నారా? అసలు హిందువులకు ప్రతినిధులమని చెప్పుకునే బీజేపీ ప్రెసిడెంటుగా ఉన్న వీర్రాజు, మంత్రిని వెంకన్న మీకు బామ్మరిదా అనడం ఏమిటి? హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడేవారు మనుషులేనా? ఇదేనా మీకు దేవుడిపై ఉన్న భక్తి?  అసలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ ఆలయం బాగుపడిందో చెప్పండి? ఆ పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఒకటి మాట్లాడతాడు. ఇక్కడ సోము వీర్రాజు ఇంకొటి మాట్లాడతాడు. వెంకన్నను రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నార’ని భాజపాపై రమణ ధ్వజమెత్తారు.

అన్నట్లు.. సోమన్న బెజవాడలో ప్రెస్‌మీట్ పెట్టి చంద్రబాబు భక్తిని ప్రశ్నించారు. ఆ సందర్భంలో హైదరాబాద్‌లో కూర్చుని హిందూ మతం గురించి మాట్లాడుతున్నారని, ట్వీట్లు చేస్తున్నారని, అంతర్వేది ఎందుకు వెళ్లలేదని ఓ వెటకార బాణం వేశారు. అయితే.. ‘మరి మీ మిత్రపక్షమైన జనసేన దళపతి పవన్ కూడా హైదరాబాద్‌లోనే ఉండి మాట్లాడుతున్నారు కదా’ ఓ విలేకరి అంతే  ఉత్సాహంతో వేసిన వెటకారపు ప్రశ్న, సోమన్నకు చికాకెత్తించింది. వెంటనే పైకి లేచి, ‘మీ రెండు కళ్లతో మీరు చూసుకోండి. నేనెలా చూడాలో అలానే చూశా’నని వెళ్లిపోయారు. అంటే.. ఇక్కడ వీరన్న కవిహృదయమేమిటంటే.. మీడియా ఇప్పటిదాకా చంద్ర బాబు రెండుకళ్ల సిద్ధాంతంతో చూస్తుంది కాబట్టి, ఇకపై తన కంటితో చూడాలని చెప్పడమన్నమాట!  కొడాలి నానిపై ఇప్పుడింత ఫైరవుతున్న సోమన్న.. మొన్నామధ్య అదే నాని,  కమలం అనేది ఓ కరోనా వైరస్ అని తిట్టిపోసినా కిక్కురుమనలేదు.  ఎందుకో మరి?

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner