కన్నా-కోవా వర్గాలకు చోటేదీ?
హైదరాబాద్ నేతలకు బెర్త్ లేదట
మరి ఆ ముగ్గరికీ మినహాయింపా?
బీజేపీలో చిత్ర విచిత్రాలు
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

బీజేపీ ఏపీ ఇన్చార్జి సునీల్ దియోథర్, తెలంగాణ రాష్ట్ర సంఘటనా కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌కు ఆ పార్టీ నాయకత్వం ఉద్వాసన చెప్పబోతుందన్న చర్చ జరుగుతోంది. పార్లమెంటు సమావేశాల తర్వాత జరిగే జాతీయ పార్టీ విస్తరణలో వారి తొలగింపు ఖాయమంటున్నారు. ఏపీలో సునీల్ నిర్వాకంపై దాదాపు నేతలంతా గుర్రుగా ఉండగా, తెలంగాణ లో మంత్రి శ్రీనివాస్ ఏకపక్ష వైఖరిపై సీనియర్లు అంతకంటే ఎక్కువ సీరియస్‌గా ఉన్నారు. ఏళ్లతరబడి నిరాఘాటంగా పనిచేస్తున్న మంత్రి దిశానిర్దేశంలో, పార్టీ పాతికేళ్లు వెనక్కి వెళ్లిందని, నచ్చిన వారికే పదవులిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఏపీ బీజేపీ ఇన్చార్జి సునీల్ దియోథర్‌ను మార్చాలని ఇప్పటికే చాలామంది నాయకులు, నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో.. ఆయనను తొలగించాలని, అటు నాయకత్వం కూడా నిర్ణయించిందంటున్నారు. ఆయన కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కోసం ప్రయత్నిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. పార్టీలో క్షేత్రస్థాయి జరిగే వాస్తవాలు తెలుసుకోకుండా, ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శ చాలాకాలం నుంచీ ఉంది. పార్టీ నేత లంకా దినకర్‌కు నోటీసులివ్వాలని పట్టుపట్టడం, అది కుదరకపోవడంతో కనీసం పురిఘళ్ల రఘురాంకయినా నోటీసులివ్వాలని ఒత్తిడి చేయడం, ఆయన హయాంలోనే ఓవి రమణ, పార్టీ ఆఫీసుకు భూమి ఇచ్చిన వెలగపూడి గోపాలకృష్ణను సస్పెండ్ చేయడం వంటి పరిణామాలు గుర్తు చేస్తున్నారు. సునీల్ ఆధ్వర్యంలోనే అసెంబ్లీ ఎన్నికలు-నిధుల పంపిణీ  జరిగినా, గతంలో ఉన్న నాలుగుసీట్లలో ఒక్క సీటు కూడా గెలిపించలేకపోవడం, ఆయన వైఫల్యమేనని స్పష్టం చేస్తున్నారు.

కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణను ఖండించలేని నాయకుడు, ఇన్చార్జిగా ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తమయింది. పైగా సునీల్ ఒక వర్గానికే దన్నుగా నిలుస్తున్నారన్న ఫిర్యాదులు కూడా లేకపోలేదు. ఇక ఏపీ పార్టీ సంఘటనా కార్యదర్శి మధుకర్ రెడ్డి, కూడా సరైన దిశానిర్దేశం చేయడంలో విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చురుకుగా వ్యవహరించడం, పార్టీ విస్తరించడం, పార్టీకి దిశానిర్దేశం ఇవ్వడంలో ఆయన పూర్తిగా వెనుకబడిపోయారంటున్నారు. ఈ విషయంలో గతంలో పనిచేసిన రవీందర్‌రాజు బెటరంటున్నారు. కాకపోతే ఆయన ఇప్పుడు  రాష్ట్ర పార్టీలో ఉన్న  కీలక వ్యక్తిని, అప్పట్లో అధ్యక్షుడిగా చేసేందుకు ప్రయత్నించినా, మిగిలిన విషయాల్లో మాత్రం చురుకుగానే వ్యవహరించారని చెబుతున్నారు. జగన్ ప్రభుత్వంపై ఏ విధానం అనుసరించాలన్న అంశంపై స్పష్టత ఇవ్వడంలో  అటు సునీల్-ఇటు మధుకర్‌రెడ్డి విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇక తెలంగాణ రాష్ట్ర సంఘటనా కార్యదర్శిగా కొన్నేళ్ల నుంచీ పనిచేస్తున్న మంత్రి శ్రీనివాసరావుపై,  లెక్కలేనన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు.. నియోజకవర్గానికి ఒకరిని నెలకు పదివేల రూపాయలు, వాహనం సమకూర్చి చేశారంటున్న ఖర్చు వల్ల..  జిల్లాల్లో ఒక్క సీటు కూడా రాకపోగా, గతంలో ఉన్న 5 సీట్లలో నాలుగు పోయాయని గుర్తు చేస్తున్నారు. గతంలో పార్టీలో పనిచేసిన అనుభవం లేకపోయినప్పటికీ, ఏబీవీపీ విభాగం నుంచి వచ్చిన ఆయనకు, సంఘటనా కార్యదర్శి పదవి ఇవ్వడంపై అప్పుడే నిరసన వ్యక్తమయింది. ఆయన సీనియర్లను ఏమాత్రం లెక్కచేయడం లేదని, సొంత వ్యవస్థతో పార్టీని నడిపిస్తున్నారని, ఇటీవలి రాష్ట్ర కమిటీ కూర్పులో కూడా ఆయన ప్రభావమే ఉందంటున్నారు. డాక్టర్ లక్ష్మణ్ వర్గాన్ని పూర్తి స్థాయిలో తొక్కివేశారస్న చర్చ జరుగుతోంది. చివరకు రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సహా, సీనియర్లందరినీ పక్కకుపెట్టి మంత్రి శ్రీనివాస్ మాత్రమే ఏకపాత్రాభినయం చేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

రెండు నెలల క్రితం వరకూ.. ఏపీ-తెలంగాణ అధ్యక్షులుగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ-కోవా లక్ష్మణ్ వర్గాలను,  పూర్తిగా విస్మరించడంపై కమలదళాలు కస్సుమంటున్నాయి. సునీల్ దియోథర్- జీవీఎల్ సంయుక్త సారథ్యంలోనే ఏపీ కమిటీలు వే శారంటున్నారు. ఇందులో వైసీపీ సర్కారుపై విరుచుకుపడే పాత కమిటీ నేతలందరినీ, వ్యూహాత్మకంగా పక్కనబెట్టారంటున్నారు. పైగా మానసికంగా వైకాపాకు సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉండే రెడ్డి వర్గానికి, అది కూడా రాయలసీమ రెడ్లకు ఎక్కువ శాతం పదవులు దక్కడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

ఇక హైదరాబాద్‌లో నివసించే ఏపీ పార్టీ నేతలందరికీ,  ఉద్వాసన పలకడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కన్నా సారధ్యంలో బాగా చురుకుగా పనిచేసిన సినీ నటి కవిత, విల్సన్‌తోపాటు.. ఎప్పుడూ పెద్దగా  కనిపించని దినేష్‌రెడ్డి, ఐవైఆర్ కృష్ణారావు, దాసరి శ్రీనివాసులు, కెవి రావు, డిసి రోశయ్య,  సురేష్ రాంభొట్లతోపాటు.. గత ఎన్నికల్లో పోటీ చేసిన జయప్రకాష్ వల్లూరు, ఇస్కా సునీల్ వంటి నేతలంతా హైదరాబాద్‌లోనే ఉంటారు. వీరిలో కవిత, గత ఎన్నికల్లో కర్నాటకలో కూడా ప్రచారం చేయగా, విల్సన్ టీవీ చర్చల్లో ప్రత్యర్ధి పార్టీలపై విరుచుకుపడి, భాజపా వాణి వినిపిస్తున్నారు. వీరిలో విల్సన్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా పనిచేయగా, కవితను ఇప్పటి బీజేపీ రాష్ట్ర ప్రముఖుడితోపాటు.. అప్పటి మరో రాష్ట్ర పార్టీ ప్రముఖుడు కూడా హైదరాబాద్ వచ్చి మరీ, పట్టుపట్టి పార్టీలో చేర్చారు.

అయితే, రెండు నెలల వరకూ పార్టీకి పనికి వచ్చిన తాము, ఇప్పుడు ఎందుకు పనికిరాని వారిమయ్యామో అర్ధం కావడం లేదని ఆ నేతలు వాపోతున్నారు. మొన్నటి వరకూ తాము కన్నా లక్ష్మీనారాయణ ఇంట్లో కాకుండా, పార్టీకే పనిచేశామని.. ఇప్పుడు ఫలానా వర్గమంటూ ముద్ర వేసి, దానికి  మరి హైదరాబాద్ అనే ఓ ప్రాతిపదికను ఎంచుకోవడం విచిత్రంగా ఉందంటున్నారు. మరి అదే ప్రాతిపదిక అయితే.. ఎంపీ సుజనా చౌదరి-సీఎంరమేష్- పురందీశ్వరి కూడా హైదరాబాద్ వాసులే.  మరి వారిని కోర్ కమిటీలో ఎలా చేర్చారని, వారికి మాత్రమే మినహాయింపు ఇచ్చారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.  అసలు ఏపీ కమిటీతో సంబంధమే లేకుండా,  ఢిల్లీలో ఉండే  జీవీఎల్ నరసింహారావును.. ఏపీ పార్టీ సమావేశాలకు ఏవిధంగా ఆహ్వానిస్తున్నారన్న ప్రశ్నలు సంధిస్తున్నారు.

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner