‘నాని డిక్లరేషన్’పై నోరు విప్పరేమి?

251

కస్సుమనని కమలదళం
కరోనాతో పోల్చినా మౌనమే
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఆంధ్రావాళ్లు ఎంత అదృష్టవంతులో..  వారి అదృష్టం దరిద్రంలా పట్టింది. ఒక మంత్రి గారేమో ఏ మతానికీ లేని ఆచారాలు తిరుపతి వెంకన్నకు ఎందుకంటారు. మూడు సింహాలు దొంగలెత్తికెళ్లినా, ఆంజనేయస్వామి విగ్రహాలు ధ్వంసమయినా, రథాలు తగులుబెట్టినా ఆ దేవుళ్లకేమీ కాదంటారు. టీటీడీ చైర్మన్‌గారేమో సీఎం మినహా  అంతా డిక్లరేషన్ ఇవ్వాలంటారు. ఇంకొందరు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులేమో జడ్జీలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటారు. ఇంతమంది మేలిమి ముత్యాలు,  తమ రాష్ట్రాల్లో లేకపోవడంపై పరాయి రాష్ట్ర పజలు కుమిలిపోతున్నారు. ఆంధ్రాకు మాత్రమే పట్టిన ఈ అదృష్టాన్ని చూసి అసూయతో కుళ్లుకుంటున్నారు. కొడాలి నాని లాంటి మంత్రులు తమకూ లేనందుకు, అనేక మంది ముఖ్యమంత్రులు విచారపడుతున్నారు. జగనన్న అదృష్టాన్ని చూసి ఈర్ష్యపడుతున్నారు.

ఏపీ మంత్రి కొడాలి నాని తెలుసు కదా? చాలా సాత్వీకంగా, హుందాగా, మాటల్లో ఒక్క బూతు మాట కూడా లేకుండా, అచ్చ తెలుగులో చెవులకు ఇంపుగా, తెలుగుభాషా పండితులు సైతం.. చివరాఖరకు గురజాల అప్పారావు ఆత్మ కూడా అసూయపడేంత స్థాయిలో మాట్లాడే ‘అతికొద్ది మంత్రుల్లో’ ఆయనొకరు. ఎన్నికల ముందు అధికార టీడీపీపై  జగన్ విడిచిన బాణం షర్మిలక్కయితే, ఎన్నికల తర్వాత విపక్షమైన టీడీపీపై  జగనన్న సంధించిన బాణమే కొడాలి నాని. నిజానికి ఆయన చాలా చక్కగా మాట్లాడతారు. ముఖ్యంగా తేటలొలికే తెలుగుభాషకు ఆయనో బ్రాండ్ అంబాసిడర్. తెలుగుతల్లి ఆయనను చూసి, రోజుకు కనీసం నాలుగయిదుసార్లయినా మురిసి ముక్కలవుతుంటుంది.  కానీ గిట్టని వారు మాత్రం.. ఆయనను బూతుల మంత్రి అని, ఎవరడమ్మ మొగుడు మంత్రి అని విమర్శిస్తూ ఆడిపోసుకుంటారు. ఆయనలోని తెలుగు కవి హృదయాన్ని మాత్రం, గుడివాడ ప్రజలు తప్ప ఎవరూ ఇంతవరకూ అర్ధం చేసుకోకపోవడమే దురదృష్టకరం.

నిన్నటికి నిన్న చూడండి. సీఎం జగనన్న తిరుమలకు వెళితే డిక్లరేషన్ ఎందుకివ్వాలి? అసలు ఆ దిక్కుమాలిన సంప్రదాయం పెట్టిందెవరని సెలవిచ్చిన నానికి..  ప్రభువులపై ఎంత భక్తి? చర్చిలకు వెళితే లేని డిక్లరేషన్, మసీదులకు వెళితే అడగని డిక్లరేషన్ ఒక్క తిరుమలకే ఎందుకన్న కొడాలి ప్రశ్న-ఆవేదనకు, ఈ భూమ్మీద జవాబిచ్చే వారు లేరు.  హిందుత్వంపై పేటెంటీ ఉందని జబ్బలు చరచుకునే కాషాయదళం రాష్ట్ర నేతలు కూడా, మౌనంగానే ఉన్నందున.. కొండమీదున్న టీటీడీ పాలకమండలి సభ్యులు కూడా,  ‘కొడాలి నానికి అన్నయ్యలే’ కాబట్టి.. ఇక నాని వేసిన ప్రశ్నకు వెంకన్నే సమాధానం ఇచ్చుకోవాలి. ఎప్పుడిస్తారో మరి.

 ‘ఆంజనేయ స్వామి బొమ్మ చెయ్యి విరిగితే ఆంజనేయుడికి వచ్చిన నష్టమేమీ లేదు. 10 కిలోల వెండి పోతే దుర్గమ్మకు వచ్చే నష్టమేమీలేదు. అంతర్వేది రథం తగులబడితే అంతర్వేది స్వామికి వచ్చే నష్టమేమీ లేదు’- ఇప్పటివరకూ అమరావతిపై పేలుతున్న కొడాలి నాని మాటల తూటాలు, ఇప్పుడు దేవుళ్లకూ తగిలిన తీరు చూస్తే.. ఆంధ్రాలో జగనన్న అండ్ అదర్స్ దేవుడిని సహా, ఎవరినీ లెక్కబెట్టే పరిస్థితిలో లేరన్నది బుర్ర-బుద్ధీ ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది. జగనన్న తిరుమలకు వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఎందుకివ్వాలన్న కొడాలి ప్రశ్న, జగనన్నపై భక్తికి నిదర్శనమనుకున్నా… అసలా దిక్కుమాలిన సంప్రదాయం ఎవరు పెట్టారన్న ప్రశ్న మాత్రం, ఆచారాలు-సంప్రదాయాలను సవాలు చేసేదే! గతంలోనే ‘నీ అమ్మ మొగుడిని అడిగి వెళ్లాలా’ అని అచ్చ తెలుగులో అడిగిన నాని నుంచి.. ఇలాంటి ప్రశ్నలు రాకపోతే ఆశ్చర్యం గానీ, వస్తే పెద్ద ఆశ్చర్యమేమీ లేదు.

‘జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని బిజేపీకి చెందిన ఇద్దరు ముగ్గురు చిన్న చిన్న నాయకులు మాట్లాడుతున్నారు. సోము వీర్రాజు జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని కోరలేదు. ఆయన ఎవరికీ డిక్లరేషన్ అక్కర్లేదు అన్నట్లు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి చేసిన ప్రకటనపై మాత్రమే మాట్లాడార’ని కొడాలి నాని సెలవిచ్చినా.. ఇప్పటివరకూ కమలదళాలు కస్సుమనకపోవడమే విడ్డూరం. అంతేనా? ‘హిందూవాదులు, మతపెద్దలు డిక్లరేషన్ అడగటం లేదు. చంద్రబాబు మాత్రమే అడుగుతున్నాడు. నిజమైన హిందూవాదులు, మతం కోసం జీవితాలను ఇచ్చిన వారి నుంచి అభ్యంతరాలు లేవ’న్న మంత్రి గారి మాటలు చూస్తే.. జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత భాజపా.. హిందుత్వాన్ని, మతాన్ని అటకెక్కించిందని, భాజపేయలు అసలు నిజమైన హిందూవాదులు కారేమోనన్న కొత్త అనుమానాలకు తెరతీసినట్లు కనిపిస్తోంది.

గతంలో ఇదే నాని.. బీజేపీని కరోనా వైరస్‌తో పోల్చినా, సోమన్న దళం సైలెంటయిపోయింది. మంత్రి మాటలపై విరుచుకుపడి చీల్చి చెండాడుతుందనుకున్న కాషయదళం.. ఓ మామూలు నాయకుడితో మాట్లాడించి, మమ అనిపించింది. అదేమిటని అడిగితే.. నానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకూడనుకునే, ఓ నాయకుడితో ఖండన ఇప్పించామని ఓ పార్టీ పెద్ద చెప్పారు. సరే. పార్టీ వ్యూహం బాగానే ఉంది. మరి బీజేపీపై ఏ బుచ్చయ్యచౌదరో, ఏ జవహరో, ఏ బుద్దా వెంకన్నో విమర్శిస్తే మాత్రం.. ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజే రంగంలోకి దిగి ఎందుకు స్పందిస్తున్నారో, కమలదళాలకు అంతుపట్టడం లేదు. అంటే బహుశా.. తెలుగుతమ్ముళ్లు ఇంకా అధికారంలోనే ఉన్నారని భావిస్తున్నారు కామోసు! ఇంతకూ.. రాజ్యసభలో తమ ప్రభుత్వ అవసరాలను ఆపద్బాంధవుడిలా ఆదుకుంటున్న జగనన్న, తిరుమలకు వెళితే డిక్లరేషన్ ఇవ్వాలా? వద్దా అని భాజపేయులు డిమాండ్ చేస్తారా.. లేదా? చూడాలి.