ఏమిటీ…డిక్లర్వేషాలు?

224

సంతగించాలా? వద్దా?
రెడ్డిగారి ఇష్టమైతే ఇక ధర్మమెందుకు?
సర్కారీ స్వామి మాట్లాడరేం?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

దేశం మొత్తానికి తెలిసిన ఓ ప్రముఖుడు తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చారు. అర్చకులు-అధికారులు ఆయనకు, బంగారు వాకిలి వద్ద ఎదురేగి స్వాగతం పలికారు. కానీ వచ్చిన ఆ పెద్దాయన, లోపలకు అడుగుపెట్టకుండా హటాత్తుగా ఏదో గుర్తుకొచ్చినట్లు, బంగారు వాకిలి వద్దనే ఆగిపోయారు. లోపల ఉన్న అధికారులు, అర్చకులేమో అత్యుత్సాహంతో లోపలికి రమ్మని ఆహ్వానిస్తున్నారు. కానీ ఆ ప్రముఖుడు తల అడ్డంగా ఊపి,  అన్యమతస్థులకు ఇచ్చే ఆ డిక్లరేషన్ ఏదీ అని అడిగి తెప్పించుకుని, అందులో సంతకం చేసిన తర్వాతనే లోపలికి వెళ్లారు.
– ఇంతకూ ఎవరూ అడగకపోయినా.. తనంతట తానే డిక్లరేషన్ ఇచ్చి, పరమత ధర్మాన్ని పాటించిన ఆ పెద్దాయన, అప్పటి భారత ప్రథమ పౌరుడయిన అబ్దుల్ కలాం.  ఎన్నిసార్లు తిరుమలకు వెళ్లినా డిక్లరేషన్ ఇవ్వని నాయకులకు, అలాంటి వారు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని సెలవిచ్చే పెద్దలకు, అబ్దుల్ కలాం తీరు ఎప్పటికయినా  ఆదర్శమవుతుందా?

తిరుమలలో కొలువుదీరిన శ్రీవారికి వరస వెంట వరస వస్తున్న కష్టాలు చూస్తే.. సమస్యలు తీర్చే దేవరకే ఇన్నేసి సమస్యలొస్తే, ఇక  తీర్చేవారన్న సందేహం వస్తుంది. శ్రీవారిని దర్శించుకునే అన్యమతస్తులు ఇచ్చే డిక్లరేషన్‌పై, ఇప్పుడు టీటీడీ దేవుళ్లే తీర్పులిచ్చేయడం రచ్చగా మారింది. స్వామిని దర్శించుకునే అన్యమతస్తులిక డిక్లరేషన్ అవసరం లేదని, టీటీడీ పెద్ద శ్రీమాన్ సుబ్బారెడ్డి తాజాగా ఓ తీర్పు వెలువరించారు. సరే దానిపై హిందూ సమాజంలో అగ్గిరేగి, నానా యాగీ అయింది. దానితో  చివరాఖరకు దిద్దుబాటకు దిగిన,  కొండపై కొలువుదీరిన ప్రకాశం పెద్దారెడ్డిగారు ధర్మం- సంప్రదాయాలపై దయదలచి, సీఎం జగన్ మాత్రమే డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని, మిగిలినవారంతా ఇవ్వాలని సెలవిచ్చారు. ఈ డిక్లరేషన్ వ్యవహారంపై లోక్‌సభలో గళం విప్పిన వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు, టీటీడీని మరోసారి దేశప్రజల దృష్టికి తీసుకువెళ్లడంలో విజయం సాధించారు.

శ్రీవారిని దర్శించుకునే అన్యమతస్తులు.. డిక్లరేషన్ ఇవ్వాల్సిన పనిలేదని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చేసిన ప్రకటన, హిందూ సమాజంలో దుమారం రేపింది. దీనిపై టీడీపీ-బీజేపీ, హిందూ మహాసభ సహా, హిందూ ధర్మ సంస్థలు, భువనేశ్వరీ పీఠాథిపతి కమలానంద భార తీ స్వామి సహా విరుచుకుపడ్డారు. దానితో దిద్దుబాటుకు దిగిన ఒంగోలు పెద్దారెడ్డి గారు.. టీటీడీ యాక్ట్ రూల్ 136 ప్రకారం, హిందూయేతరులంతా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని, ఆ విషయంలో టీటీడీ కట్టుబడి ఉందని సెలవిచ్చారు. డిక్లరేషన్ పవిత్ర గుర్తించినందుకు సంతోషం.

అయితే, సీఎం జగన్ మాత్రమే డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని మినహాయింపు ఇచ్చారు.  పూజ్యులయిన రెడ్డిగారు ప్రస్తావించిన, టీటీడీ యాక్ట్ రూల్ 136లో అన్యమతస్తులైన ముఖ్యమంత్రులు,  డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్న క్లాజు ఉన్న విషయం ఉందో లేదో కూడా సెలవిస్తే, భక్తుల జన్మ ధన్యమయ్యేది. అప్పుడు ఈ రచ్చ కూడా జరగదు కదా? మిగిలిన అన్యమతస్తులకు ఉన్న ‘తప్పరిసరి డిక్లరేషన్’ జగన్‌కు అవసరం లేదంటే.. జగనన్న హిందువేనని సుబ్బారెడ్డన్న సర్టిఫికెట్ ఇస్తున్నట్లే కదా? మరి అదే విషయాన్ని.. అంటే జగన్మోహన్‌రెడ్డి క్రైస్తవుడు కాదు, హిందువేనని నిర్భయంగా ప్రకటిస్తే అసలు ఈ పంచాయితీనే ఉండదు కదా? గతంలో అనేకసార్లు జగనన్న డిక్లరేషన్ ఇవ్వలేదు కాబట్టి, ఇప్పుడు కూడా అక్కరలేదని చెప్పడమంటే, జగనన్నకు నిబంధనలు అవసరం లేదని చెప్పడమే కదా? ఆ ప్రకారం గతంలో ప్రధానిగా ఉన్న ఇందిరమ్మ, రాష్ట్రపతిగా ఉన్న కలాం కంటే జగనన్నే మొనగాడని చెప్పడమే రెడ్డిగారి కవి హృదయంలా కనిపిస్తోంది. అబ్బాయి కోసం బాబాయి, ఆ మాత్రం మినహాయింపు ఇవ్వాల్సిందే మరి!

గతంలో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ, రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలామ్ తిరుమల వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చారు. సరే అబ్దుల్ కలామంటే ముస్లిం కాబట్టి ఇచ్చారనుకుందాం. మరి ఇందిరమ్మ ఎందుకిచ్చారు? ఎందుకిచ్చారంటే.. ఆమె జన్మత: బ్రాహ్మణురాలయినా, ఒక పార్శీ వ్యక్తిని పెళ్లాడినందున.. ఆమెను పార్శీగానే పరిగణిస్తారు. అందువల్లనే ఆమె డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చింది. మరి సోనియాగాంధీ, వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు జగన్‌ను డిక్లరేషన్ ఇవ్వాలని రిజిస్టరు తెచ్చి ఇచ్చినా, వారు దానిపై సంతకం పెట్టలేదు. ఎందుకంటే వారంతా క్రైస్తవులు కాబట్టి. కానీ ఇప్పుడు సుబ్బారెడ్డి సూత్రీకరణ ప్రకారం జగన్ పక్కా హిందువన్న మాట!  వైఎస్ పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు సోనియా తిరుమలకు వచ్చారు. ఐవి సుబ్బారావు ఈఓగా ఉన్న ఆ కాలంలో..నాటి టీటీడీ అధికారులు డిక్లరేషన్ రిజిస్టర్ వారి ముందు పెట్టగా, వైఎస్ సదరు అధికారిపై కస్సుమనడంతో ఆ అధికారి వెళ్లిపోయారు. జగన్ కూడా తర్వాత అదే పని చేశారు. సో.. అలా వైఎస్ కుటుంబం తిరుమలకు వెళ్లినా, డిక్లరేషన్ ఇచ్చే సంప్రదాయాన్ని గానీ, పట్టువస్త్రాలు సమర్పించే సమయంలో భార్యతో గానీ వెళ్లే సంప్రదాయం ఇప్పటివరకూ పాటించలేదు. ఇది బహిరంగమే.

ఇప్పుడిక సుబ్బారెడ్డి గారి పుణ్యాన,  జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన పనిలేదని చెప్పారు కాబట్టి.. దానిపై పెదవి విప్పి, ధర్మసూత్రం చెప్పాల్సింది జగద్గురువు-జగన్గురువైన కలియుగ ఆదిశంకరాచార్య అయిన శ్రీశ్రీశ్రీశ్రీ స్వరూపానందులవారే. ధర్మాన్ని పాటించాలని హితవు పలికి,  శిష్యుడికి డిక్లరేషన్ ఇవ్వాలని చెబుతారా? లేక మేమే గంగ-గోదావరిలో ముక్కు మూసి.. మునకేయించి, పుష్కర స్నానాలు చేయించినందున, తన శిష్యుడు జగన్ కంటే పెద్ద హిందువు ఎవరుంటారని సెలవిస్తారో చూడాలి. ఒకవేళ అదే చెబితే, ఇందిరమ్మ-కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చి పొరపాటు చేశారన్న ముక్క కూడా అదే నోట చెబితే, అఖిల కోటి భక్తుల జన్మలు.. జన్మజన్మలకూ తరిలించినట్లే.

హిందూ ధర్మాలు-శాస్త్రాలను ఇంతగా తిరగరాస్తున్న స్వాములోరు.. అదే నోటితో, పట్టు వస్త్రాల సమర్పణ సమయంలో భార్య అవసరం లేదని కూడా, ఒక ఫర్మానా జారీ చేస్తే, వచ్చే తరాలకు అదొక కొలబద్దగా నిలిచిపోతుంది కదా? మరి కమలానంద భారతీ స్వామి గారేమో, దంపతులే పట్టువస్త్రాలు సమర్పించాలని.. వైదిక సంప్రదాయం ప్రకారం ఏ పుణ్య కార్యమైనా దంపుతులే కలసి చేయాలని,  హిందూ ధర్మంలో మగవాడు మాత్రమే చేసేది తద్దినం-పిండం పెట్టడానికని చెబుతున్నారు. సరే కమలానంద భారతీ స్వామిగారంటే ఒక మామూలు పీఠాథిపతి. సీఎంలు, మినిస్టర్లు, సెలబ్రిటీలను మచ్చిక చేసుకునేంత లోకజ్ఞానం గానీ, స్థితప్రజ్ఞత-ప్రాప్త కాలజ్ఞత గానీ లేదనుకుందాం. మరి.. ఆదిశంకరుల అంశలో పుట్టి, అన్ని వేదాలు అవపోసన పట్టిన త్రికాలజ్ఞాని-లోకరక్షకుడయిన, విశాఖ పీఠాథిపతుల వారు ఈ విషయంలో ఏదో ఒకటి తేల్చేస్తే.. హిందూ సమాజానికి గొప్ప ‘మేళ్లు’ చేసినవారవుతారు.

టీటీడీలో ఇంత  ‘శాస్త్రబద్ధంగా’ జరుగుతున్న ఈ రచ్చను,  ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్‌సభలో తన ప్రస్తావన ద్వారా దేశానికి చాటడం మరో విశేషం. ఒక వ్యక్తి కోసం ఏపీలో దేవాలయాల నిబంధనలు మారుస్తున్నారని, ఆలయాపై కావాలనే దాడులు జరుగుతున్నందున, వాటిపై కమిషన్ వేయాలన్న రాజు గారి డిమాండ్, సహజంగానే అక్కడే ఉన్న సహచర పార్టీ ఎంపీలకు ములుకుల్లా తగిలాయి. ‘అన్యమతస్తుల డిక్లరేషన్‌లో జగన్ ఎందుకు సంతకం చేయలేదు? సెక్యులర్‌వాదిగా ఆయన సంతకం చేయాలి. నిబంధనలు అమలుచేయని చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ బాండ్లలో టీటీడీ నిధులు పెట్టుబడి పెట్టి, దేవుడి సొమ్ము దోచుకునే ప్రయత్నం జరుగుతోంద’ని రాజు కక్కాల్సిందంతా కక్కి, కడి గేశారు.

కొత్తగా హిందూదళం ఏర్పాటుచేసిన హిందూ మహాసభ రాష్ట్ర దళపతి వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ కూడా, టీవీ చర్చల్లో టీటీడీ డిక్లరేషన్ యవ్వారాన్ని కడిగిపారేశారు. శాస్త్రాన్ని-ధర్మాన్ని మార్చే అధికారం టీటీడీకి ఎవరిచ్చారని నిలదీశారు. మొత్తానికి టీటీడీ డిక్లరేషన్ కథ అలా ముందుకెళ్లిందన్నమాట. అవునూ.. మనలోమాట. సర్వదర్శనం ద్వారా వచ్చే అన్యమతస్తులను ఎలా గుర్తిస్తామన్న సుబ్బారెడ్డన్న..  మరి వీవీఐపీ మార్గం ద్వారా వచ్చే అన్యమతస్థుల నుంచి డిక్లరేషన్ తీసుకోవచ్చు కదా?