శేఖరన్న అలా.. జగనన్న ఇలా..

349

వ్యవసాయ బిల్లులపై గురుశిష్యుల దారులు వేరయా
 డిప్యూటీ చైర్మన్‌పై అవిశ్వాసానికి వైసీపీ నై.. తెరాస సై
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

వారిద్దరికీ  ఉమ్మడి శత్రువు ఒకరే. అందుకే ఆయనను ఓడించేందుకు ఇద్దరూ చేతులు కలిపారు. తర్వాత లక్ష్యం నెరవేరింది. శిష్యుడిని గద్దెనెక్కించిన గురువు మాటలకు శిష్యుడు విలువిచ్చాడు. పాలనా పద్ధుతులన్నీ గురువుగారివే అమలుచేస్తున్నారు.  పార్లమెంటు ఎన్నికల ముందు.. కాలం ఖర్మం కలసివస్తే ఇద్దరూ కలసి, కేంద్రంలో చక్రం తిప్పవచ్చన్న ఊసులు చేశారు. గురువుగారయితే, శిష్యుడి రాష్ట్రం చేస్తున్న నీటిచౌర్యాన్ని కూడా పెద్ద మనసుతో మన్నించి, విపక్షాలు విసిరే అస్త్రాలను తాను మోస్తున్నారు. ఆ బంధం ఇంకా విజయవంతంగానే నడుస్తోంది. కానీ.. ఇప్పుడు గురువు కేంద్రంపై కత్తులు రువ్వుతుంటే, ఆయన శిష్యుడు మాత్రం దన్నుగా నిలవకుండా, అదే కేంద్రం పల్లకీ మోస్తున్నారు. కేంద్రం కష్టాల్లో ఉన్న ప్రతిసారీ శిష్యుడు అభయహస్తం ఇచ్చి ఆదుకుంటుంటే, గురువు మాత్రం గుర్రుగా ఉన్నారు. అదీ గురుశిష్యులయిన కేసీఆర్-జగనన్న..  ఏకత్వంలో భిన్నత్వం-భిన్నత్వంలో ఏకత్వ యవ్వారం!

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. పార్లమెంటులో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై, అపూర్వ సహోదరుల్లా వ్యవహరిస్తున్న తెరాస-వైకాపా భిన్న మార్గం పట్టడం ఆసక్తిరేపింది. బిల్లులను వైకాపా కనీసం సూచనలు-సవరణలయినా చేయికుండా, నిరభ్యంతరంగా సమర్థించింది. అదే తెరాస.. ముక్తకంఠంతో వ్యతిరేకించింది. అదొక్కటే కాదు, బిల్లులను వ్యతిరేకిస్తున్న వారితో కలసి గళం కలిపింది. పార్లమెంటు బయట ధర్నా కూడా చేసింది. ఆ బిల్లుల వల్ల దేశీయ వ్యవసాయం కుదేలవుతుందని, తెలంగాణ రైతుకు అన్యాయం జరుగుతుందని ఎలుగెత్తింది.

అయితే వైకాపా కూడా ధర్నా చేసింది. దేనిమీదంటే.. బాబు అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలని, న్యాయస్థానాల జోక్యం పెరిగిందన్న అంశంలో ప్లకార్డులు పట్టుకుంది. ఇదీ.. రెండు పార్టీల ధర్నాల మధ్య వ్యత్యాసం! తెరాస రైతన్న కోసం గర్జిస్తే, వైకాపా రాజకీయ అంశాలపై గళమెత్తిందన్న మాట. ఇక బీజేపీ చేతిలో చావుదెబ్బ తిని, ముక్కుతూ మూలుగుతూ ఉన్న టీడీపీ కూడా కేంద్రానికే మద్దతునిచ్చినా, కాస్తంత సంసారపక్షంగా వ్యవహరించింది. అంటే కొన్ని సూచనలు చేసిందన్న మాట. బిల్లుపై రైతాంగంలో ఆందోళన నెలకొన్నందున, మిరంత స్పష్టత కావాలని కోరింది.  మొత్తానికి బిల్లును మాత్రం వ్యతిరేకించలేదు. అదీ సంగతి.

ఇటీవలి కాలంలో కేసీఆర్.. కేంద్రంలోని భాజపా సర్కారు విధానాలపై ఒంటికాలితో లేస్తున్నారు. తన రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లే ప్రతి అంశంపై నిప్పులు చెరుగుతున్నారు. గతంలో రాజ్యసభలో కొన్ని బిల్లులకు మద్దతునిచ్చిన తెరాస ఇప్పుడు, తన వైఖరి పూర్తిగా మార్చుకుని భాజపా వ్యతిరేక దశలో నడుస్తోంది. ప్రధానంగా వ్యవసాయ బిల్లు అమలయితే, తెలంగాణ రైతులతోపాటు.. దేశ రైతాంగానికి వాటిల్లే నష్టాన్ని, కూలంకషంగా వివరిస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, తెలంగాణ లో ఆయనను వ్యతిరేకించే వర్గాలను సైతం మెప్పించింది. అందులోని షరతులు అంగీకరిస్తే, తెలంగాణ రైతుపై పడే భారాన్ని ఆయన విపులీకరించమే దానికి కారణం.

వ్యవసాయ బిల్లుల వల్ల వచ్చే నష్టాలపై కేసీఆర్ చేసిన హెచ్చరిక, ఏపీ సీఎం జగ్మోహన్‌రెడ్డి పార్టీ పాటించకుండా ఎందుకు తలాడించి, బిల్లుకు జై కొట్టారో ఏపీ రైతులకు అర్ధం కాలేదు. ‘‘వ్యవసాయ బిల్లు తేనె పూసిన కత్తి. దానివల్ల కార్పొరేట్ కంపెనీలకే లాభం. ఇది కార్పొరేట్ గద్దలు దేశమంతా విస్తరించేందుకు ఉపయోగపడతుంది. రైతులు తమకున్న కొద్దిపాటి సరుకును, ఖర్చులు భరించి లారీలతో దేశమంతా అమ్మడం సాధ్యమేనా? నిజానికి ఇది వ్యాపారులకు పనికొచ్చే బిల్లు. మనదేశంలో మక్కలు పుష్కలంగా పండుతున్నాయి. సుంకం తగ్గించి దిగుమతి చేసుకుంటే, మన రైతుల పరిస్థితి ఏమిట’ని కేసీఆర్ కేంద్ర విధానాన్ని దునుమాడారు.

తన రాజకీయ నిర్దేశకుడయిన కేసీఆర్ అంతటి అనుభవశాలి బిల్లును వ్యతిరేకిస్తే, ఆయన శిష్యుడ యిన జగన్ మాత్రం, అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తవుతోంది.  తెలంగాణ సీనియర్ మంత్రి హరీష్‌రావు అన్నట్లు.. కేవలం కేంద్రం ఇచ్చే డబ్బులకు ఆశపడే, ఏపీ సర్కారు కేంద్రానికి తలూపిందని చేసిన వ్యాఖ్య ప్రస్తుతం ఆంధ్రాలో చర్చనీయాంశమవుతోంది. వ్యవసాయానికి మీటర్లు బిగించడాన్ని జగన్ సమర్ధిస్తున్న వైనం, రైతాంగంలో అలజడి రేపుతోంది. మరి ఈ విషయంలో గురువుగారయిన శేఖరన్న, శిష్యుడయిన జగనన్నకు సలహా ఇవ్వలేదా? లేక ఇచ్చినా  శిష్యపరమాణువు ‘దేనిలెక్క దానిదేనని’ పట్టించుకోలేదా? తెలంగాణ-ఏపీ సంబంధాలు ఇప్పటికి బహు భేషుగ్గానే ఉన్నందున, గురుశిష్యుల బంధం నాగార్జున సిమెంట్‌లా ధృడంగానే ఉన్నట్లు లెక్క. మరి ఎక్కడో తేడా కొడుతోంది!

తాజాగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌పై పెట్టిన అవిశ్వాసంలోనూ, గురుశిష్యులు తలో మార్గం పట్టడం ఆశ్చర్యం కలిగింది. వ్యవసాయ బిల్లుల ఆమోదం అంశంపై కన్నెర్ర చేసిన విపక్షాలన్నీ, భాజపా సర్కారుపై కారాలు మిరియాలు నూరుతున్నాయి. దానితో డిప్యూటీ చైర్మన్‌పై, అవిశ్వాసం పెట్టాలని 12 పార్టీలు నిర్ణయించాయి. అందులో రాష్ట్రంలో తన రాజకీయ ప్రత్యర్ధి అయిన, కాంగ్రెస్ పార్టీ సంతకం చేసినప్పటికీ.. రైతుల అంశం కాబట్టి, కేసీఆర్ పార్టీ కూడా అవిశ్వాస నోటీసుపై సంతకం చేయడం సంచలనం  సృష్టించింది. సహజంగా అయితే.. ఏదైనా అంశాలలో కాంగ్రెస్‌ను అనుసరిస్తే, దానిపై భాజపా రాష్ట్రంలో యాగీ చేసే అవకాశం ఉన్నందున, తెరాస దానికి దూరంగా ఉండాల్సి ఉంది.

కానీ కేసీఆర్ అలాంటి భేషజాలకు పోకుండా, రైతు అజెండానే అన్ని పార్టీలు తీసుకున్నందున, తెరాస కూడా దానిపై సంతకం పెట్టింది. కానీ, వైకాపా మాత్రం అవిశ్వాస నోటీసుకు దూరంగా ఉండటం మరో విశేషం. అసలు వ్యయసాయ బిల్లుల వల్ల తమ రైతులకు నష్టమన్న ఆందోళనతో.. ఎన్డీఏ భాగస్వామి అకాళీదళ్ వంటి పార్టీనే కేంద్రం నుంచి బయటకు వస్తే, ఎన్డీఏతో ఎలాంటి బాదరాయణ సంబంధం లేని జగన్ పార్టీ మాత్రం,  ఆ బిల్లుకు జై కొట్టడం వింతలో వింత! ఏం చేస్తాం. ఎవరి అవసరాలు వారివి!!

1 COMMENT