కొత్త బాంబు పేల్చిన సుంకర పద్మశ్రీ
ఇప్పుడెవరిపై కేసు పెడతారో?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

‘సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి నేలమాళిగలో  శ్రీవారి పింక్ డైమండ్ ఉంది. సీబీఐ వాళ్లు ఇప్పుడు వెళ్లి వెతికితే దొరుకుతుంది‘
– గత ఎన్నికల ముందు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి
‘ కనిపించకుండా పోయిన కనకదుర్గమ్మ రథంలోని మూడు సింహాల గురించి ప్రత్యేకంగా వెతకడం ఎందుకు? అక్కడే ఉన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంట్లో వెతికితే సరి‘
– మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు
‘ కనకదుర్గమ్మ రథంలోని మూడు సింహాలు మాయమవుతుందన్నారు. అవి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లు నా అనుమానం’
– ఇది తాజాగా ఒక చానెల్ చర్చలో కాంగ్రెస్ రాష్ట్ర నేత సుంకర పద్మశ్రీ సంచలన ఆరోపణ

ఆంధ్ర రాష్ట్ర బురద రాజకీయాలు, చివరికి దేవుడిని కూడా వదలడం లేదని ఈ ప్రకటనలు చూస్తుంటే ఎవరికయినా అర్ధమవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు.. తిరుమల శ్రీవారికి చెందిన పింక్ డైమండ్ మాయమయిందన్న వార్త భక్తుల్లో ఆందోళన రేపింది. అప్పుడు తెరపైకొచ్చిన వైకాపా ఎంపి విజయసాయిరెడ్డి, విభ్రాంతికరమైన ఆరోపణ చేశారు. ఆ డైమండ్ అప్పటి సీఎం చంద్రబాబు నివాసంలోనే ఉందని చెప్పారు. అప్పట్లో ఆయన ఆరోపణపై చాలా చర్చ జరిగింది. అయితే దానిని నాటి -నేటి టీటీడీ ఈఓ సింఘాల్ ఖండించారు. అసలు ఆలయంలో పింక్ డైమండ్ అనేదే లేదన్నారు. కానీ ఉద్యోగం నుంచి ఉద్వాసనకు గురయిన టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు కూడా, విజయసాయి ఆరోపణలనే బలపరిచారు. దానిపై విచారణ జరపాలని ప్రెస్‌మీట్ పెట్టి డిమాండ్ చేశారు. దానిపై నాటి టీటీడీ పాలకవర్గం విజయసాయిపై పరువునష్టం దావా వేసింది. అందుకోసం 2 కోట్లు కోర్టులో డిపాజిటు కూడా చేసింది.

రోజులు గిర్రున తిరిగాయి. అటు అధికారం ఇటొచ్చింది. చంద్రబాబు స్థానంలో జగన్మోహన్‌రెడ్డి సీఎం అయ్యారు. మరి ఎన్నికల ముందు.. తన పార్టీ పింక్ డైమండ్ పోయిందని చేసిన ఆరోపణపై, అధికారంలోకి వచ్చిన ఆయన పార్టీ విచారణ జరిపించడమే కదా ధర్మం? మరి ఆ పని చేసిందా? చేయలేదు. పైగా.. కొత్తగా టీటీడీ ప్రత్యేక అధికారిగా వచ్చిన ధర్మారెడ్డి అంతటి ధర్మప్రభువు,  అసలు ఆలయంలో పింక్ డైమండ్ లేదని తీర్పునిచ్చారు. అంతేనా? అంతకుముందు టీటీడీ పాలకమండలి, విజయసాయిపై వేసిన పరువునష్టం దావా ఉపసంహరించుకుంది. మళ్లీ ఇప్పటి వరకూ జగనన్న దళం ఆ పింక్ డైమండ్ గురించి నోరెత్తితే ఒట్టు. దాన్ని టీడీపీ ప్రశ్నిస్తే ఒట్టున్నర.

పొనీ, ఆ అంశంలో వైకాపా చేతిలో పరువు పోగొట్టుకుని, టన్నుల కొద్దీ బురద పూయించుకున్న తెలుదేశం పార్టీ అయినా..  మీరే అధికారంలో ఉన్నారు కదా.. ఇప్పుడు ఆ పింక్ డైమండ్ సంగతి తేల్చండని,  ఏమైనా రొమ్ము విరుచుకు నిలబడిందా అంటే అదీ లేదు. ఆ కేసులో ఇంప్లీడ్ అయి, సీబీఐ విచారణ కోరిందా అంటే అదీ లేదు. అసలిప్పటి వరకూ ఆ అంశాన్ని ప్రస్తావించేందుకే, తమ్ముళ్ల చొక్కా లాగులు తడిసిపోతుండటడమే విచిత్రం. నాడు పార్టీ మేధావి యనమల తన వియ్యంకుడిపై ప్రేమతో కాంట్రాక్టులతోపాటు, టీటీడీ పీఠమెక్కించిన సుధాకర్ యాదవ్ ఏమయ్యారో ఎవరికీ తెలియదు. మరి దీన్ని బట్టి బాబు తీరు చూసిన వాళ్లెవరయినా మౌనం అర్ధాంగీకారమని భావించే ప్రమాదం లేదూ? ఇన్ని అంశాలపై ఎదురుదాడి చేస్తున్న బాబు, పింక్ డైమండ్‌లో మాత్రం మౌనం వహించడం వింతగానే ఉంది.

సరే.. తెలుగుదేశంలో పేపర్‌టైగర్లు, జ్ఞానమూర్తులు, మేధావులు, న్యాయకోవిదులకు తక్కువ లేదు. అయితే అన్నీ ఉన్నా అయిదోతనమే లేదని.. కాంగ్రెస్ రాష్ట్ర నేత సుంకర పద్మశ్రీ చేసిన సంచలన ఆరోపణ చూస్తే నిజమేనని అర్ధమవుతుంది. బెజవాడ కనకదుర్గమ్మ రథంలోని నాలుగు సింహాలలో, మూడు సింహాలు మాయమయిన ఘటన దుమారం రేపుతోంది. విపక్షాలన్నీ గుళ్ల మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయ్యన్నపాత్రుడేమో, అవి వెల్లంపల్లి ఇంట్లోనే ఉన్నాయని ఆరోపిస్తున్నారు. విజయసాయిరెడ్డి అండ్ అదర్స్, రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి ఘటనల వెనుక చంద్రబాబే ఉన్నారని, అంతర్వేది రథాన్ని కూడా బాబే తగులబెట్టించారని ఆరోపిస్తున్నారు.

ఈ సమయంలో.. పద్మశ్రీ చేసిన సంచలన ఆరోపణ వీటిని కొత్త దారి పట్టించింది. కనకదర్గమ్మ గుడిలో పోయిన మూడు సింహాలు.. సీఎం జగన్ ఇంట్లోనే ఉన్నాయని ఆమె చేసిన ఆరోపణ, ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెరలేపింది. మహాటీవీ చర్చలో పాల్గొన్న ఆమె, ఈ ఆరోపణ చేయడం కలకలం సృష్టించింది. గతంలో విజయసాయిరెడ్డి.. నాటి సీఎం బాబుపై చేసిన ఆరోపణలే, ఇప్పుడు నేటి సీఎం జగన్మోహన్‌రెడ్డిపై పద్మశ్రీ చేయడం చర్చనీయాంశమయింది. నాడు పింక్ డైమండ్‌పై సీఎం బాబుపై ఆరోపణలు చేసినా, అప్పటి సర్కారు విజయసాయిపై ఎలాంటి కేసు పెట్టలేదు. కాబట్టి ఆ సహజ సూత్రం ప్రకారమే ఇప్పుడు పద్మశ్రీపైనా ఎలాంటి కేసు పెట్టే చాన్సు ఉండదు. ఒకవేళ ఆమెపై కేసు పెడితే, ఇలాంటి ఆరోపణ చేసిన వైకాపా ఎంపి విజయసాయిపై కూడా కేసు పెట్టాల్సి ఉంటుంది. మరి  పద్మశ్రీ సంచలన ఆరోపణ,  ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.

అయినా.. ఏపీలో రేణుకాచౌదరి మాదిరిగా, లేడీ ఫైర్‌బ్రాండ్ అయిన సుంకర పద్మశ్రీకి ఇలాంటి కేసులు కొత్తేమీకాదు. మగ నేతలకు వందరెట్ల ధెర్యం ఉన్న ఆమె, సర్కారుపై విరుచుకుపడే తీరులోనే తెగువ కనిపిస్తుంటుంది. అమరావతి మహిళలకు డబ్బులెక్కువయి పేకాట ఆడుతున్నారన్న వార్తమ నేపథ్యంలో, ఆమె తన కాలి చెప్పు పైకి తీసి జగనుద్దేశించి చెప్పుతో కొడతానని హెచ్చరించి సంచలనం రేపారు. అప్పటివరకూ టీడీపీ నేతలు కూడా, జగన్‌ను విమర్శించే సాహసం చేయలేకపోయారు. అది పద్మశ్రీకే సాధ్యమయింది.  అప్పుడు టీడీపీ అయినా, ఇప్పుడు వైసీపీ సర్కారయినా.. వాటి నిర్ణయాలను చూపుడు వేలితో ప్రశ్నిస్తూ..  రోడ్డెక్కే  ఈ నాయకురాలు నాగమ్మచేసే హడావిడితో, బెజవాడ పోలీసులకూ భయమే. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఠికానా లేకపోయినా, కాళ్లూ చేతులూ కూడగట్టుకుని.. ఏపీలో పార్టీ ఇంకా బతికే ఉందని నిరూపించుకునేందుకు, ఇలాంటి ఫైర్‌బ్రాండ్ చేస్తున్న ప్రయత్నాలు మెచ్చదగ్గవే..

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner