-రవీంద్ర ఇప్పల
రాజధాని భూముల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని జగన్ సారథ్యంలోని వైసీపీ మొదటి నుంచీ ఆరోపిస్తోంది. చంద్రబాబు ప్రభు త్వం ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందని అసెంబ్లీతో పాటు వెలుపల ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఆధారాలతో సహా బయట పెట్టారు. తాము అధికారంలోకి వస్తే రాజధాని భూములపై విచారణ జరిపిస్తామని గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో జగన్ పదేపదే చెబు తూ వచ్చారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకొంది.
రాజధాని భూములపై తాజాగా ఏసీబీ దూకుడు పెంచింది. పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే విచారణపై హైకోర్టు స్టే విధించింది. విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ఇవన్నీ అందరూ ఊహించినవే. అందుకే ఎవరూ ఆశ్చర్యపోవడం లేదు. అయితే న్యాయస్థానాలను ఆశ్రయించి దర్యాప్తును నిలుపుదల చేయించుకోవడంతో ఇక ఏమీ కాదా? అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.ఏపీ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల టీడీపీ నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ …అమరావతి భూముల్లో ఏదో జరిగిపోయిందని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేశారన్నారు. 16 నెలలైనా అందులో ఏం కనుక్కున్నారని ప్రశ్నిం చారు. మంత్రివర్గ ఉపసంఘాలు, సిట్లు వేసి తమ ఆరోపణలను తామే రాసుకోవడం తప్ప వారు కనుక్కున్నదేమీ లేదన్నారు. పని చేయడం మాని బురదజల్లడానికి ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శలు గుప్పించారు.
పైకి చంద్రబాబు ఇలాంటివి ఎన్ని మాట్లాడినా …లోలోపల అతన్ని రాజధాని అంశం నిద్ర లేకుండా చేస్తున్నారు. మూడు రాజధానుల అంశాన్ని జగన్ తెరమీదకి తెచ్చిన ఆ క్షణమే …. చంద్రబాబు ఆర్థిక సామ్రాజ్యం కూలిపోయింది. ఇక ఆయన కలలు కన్న అమరావతి …శాశ్వత భ్రమరావతిగానే మిగిలిపోయింది. బాబును నమ్ముకుని అత్యాశకు పోయిన వారి నిండా ముని గారు. మరోవైపు ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారనే అభిప్రాయాలు జనాల్లోకి బాగా వెళ్లాయి.
తన హయాంలో అసలు సీబీఐనే అడుగు పెట్టనివ్వనన్న పెద్ద మనిషి …. ఇప్పుడు మాత్రం మతపరమైన అంశాల్లో ఆ దర్యాప్తు కోరడం విచిత్రంగా ఉంది. మరోవైపు రాజధాని భూములపై జగన్ సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్రానికి లేఖ రాయడానికి ఆయన వెన్నులో వణుకు పుట్టిస్తోంది. సీబీఐ కాకుంటే ….తన చేతిలో ఉన్న ఏసీబీతో దర్యాప్తు చేయించేందుకు సీఎం జగన్ దూకుడు ప్రదర్శిస్తుండడం బాబులో ఆందోళన కలిగిస్తోంది.
ఇలాంటి పరిణామాలను చంద్రబాబు ముందే పసిగట్టే ….మోడీతో సఖ్యతగా మెలిగేందుకు బాబు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ అక్కడి నుంచి సానుకూల సంకేతాలు రావడం లేదు. మరోవైపు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ రాజకీయ భవిష్యత్‌ను జగన్ చేతుల మీదుగా విధ్వంసం చేసేందుకు భారతీయ జనతా పార్టీ గట్టి పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది. రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని బీజేపీ నేతలు కూడా గట్టిగా విమర్శిస్తున్నారు. ఈ రోజు కాకుంటే రేపైనా సీబీఐ దర్యాప్తు తప్పదని బీజేపీ నేతలు హెచ్చరిస్తుండడం టీడీపీకి నిద్రలేని రాత్రులు మిగుల్చుతోంది.
అన్నిటికి మించి ఏసీబీ, సీబీఐ దర్యాప్తులకు టీడీపీ భయపడుతుండడంతో ….రాజధాని భూముల్లో దోపిడీకి పాల్పడిందనే ఆరోపణలకు బలం ఇచ్చినట్టవుతోంది. రాజకీయ క్షేత్రంలో జనానికి మించిన న్యాయ నిర్ణేతలు మరెవరూ లేరు. రాజధాని భూముల్లో చంద్రబాబు ప్రభుత్వం భారీగా భూకుంభకోణానికి పాల్పడిందని ఏపీ ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. దాని పర్యవసానమే గత సార్వత్రిక ఎన్నికల్లో కనీసం రాజధాని ప్రాంతాల్లో కూడా టీడీపీ గెలవలేకపోయింది.
మరో వైపు వయసు పైబడుతుండడం కూడా బాబుకు ఇబ్బందిగా మారింది. నిత్యం ఏదో ఒక రాజకీయ సంక్షోభం. తన పాలనలో జరుగుతున్న అక్రమాలపై ప్రస్తుత సర్కార్ దర్యాప్తు అంటుండడంతో మానసికంగా చంద్రబాబు చాలా ఇబ్బందులు ఎదుర్కొం టున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. న్యాయస్థానాల్లో స్టేలు పొందడం వల్ల దర్యాప్తులను ఆపుకోవచ్చని, అయితే జనంలో ఏర్పడిన అభిప్రాయాల్ని తొలగించుకోవడం ఎలా అనేదే చంద్రబాబుకు పెద్ద సవాల్ అవుతోందని టీడీపీ నాయకులు అంటున్నారు.
టీడీపీ నేతలు పదేపదే న్యాయస్థానాలకు వెళుతూ పాలన సవ్యంగా సాగకుండా అడ్డుకుంటున్నారనే వ్యతిరేక అభిప్రాయం జనంలో బాగా స్థిరపడుతోంది. రాజకీయాల్లో ఇది అంత మంచి ధోరణి కాదు. ఎందుకంటే అంతిమంగా రాజకీయ భవిష్యత్‌ను తేల్చేది ప్రజాకోర్టే. ఈ మానసిక సంఘర్షణ, సంక్షోభం మధ్య చంద్రబాబు సతమతం అవుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తు న్నాయి. వ్యవస్థల్ని అడ్డు పెట్టుకుని ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్న జగన్‌పై జనంలో సానుకూల వాతావరణం ఉందనే చేదు నిజం బాబులో ఆందోళన కలిగిస్తోంది.
కంటికి కనిపించే వ్యవస్థలు విధించే శిక్షల కంటే… కనిపించకుండా కొన్ని దండనలు విధిస్తుంటాయి. అదే అంతరాత్మ అనే కోర్టు. ఇది మనసుకు సంబంధించింది. అందుకే కనీసం అంతరాత్మకైనా సమాధానం చెప్పుకోమని పెద్దలు చెబుతుంటారు. కొన్ని విషయాల్లో విచక్షణకు వదిలేస్తున్నామంటారు. ఎందుకంటే భౌతికపరమైన శిక్షల కంటే మానసికమైన శిక్షలే జీవితాంతం మనిషిని వెంటాడుతాయి కాబట్టి.
ఇప్పుడు చంద్రబాబు కూడా వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకుని కోట్లు మెట్లు ఎక్కకపోవచ్చు. కానీ ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు మాత్రం ఆయన మనసును కుదురుగా ఉండనివ్వవన్నది నిజం.