జగన్‌కు జయ ‘జయరామ’

263

ఈఎస్‌ఐలో అచ్చెన్న సరే.. జయరాముడి మాటేమిటి?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఏపీలో ఏరికోరి ఆణిముత్యాలను మంత్రులుగా పెట్టుకున్న జగనన్న ‘సరైన ఫలితాలు’ రాబడున్నారు. కార్మికమంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం ఆ శాఖలో కనబరుస్తున్న విశేష ప్రతిభాపాటవాలు, అదేశాఖలో పనిచేసి మొన్నీ మధ్యనే జైలు నుంచి విడుదలయిన అచ్చెన్నాయుడిని తలపిస్తోంది. జయరాం ఇలాకాలో ఇటీవలే పేకాట డెన్ బయటపడి, ఆయన సమీప బంధువుపై కేసు నమోదవగా, ఆ తర్వాత భూకబ్జా ఆరోపణలు. ఇప్పుడు తాజాగా పుత్రరత్నానికి బెంజి కారు బహుమతి కథ. ఇవన్నీ  జగనన్న సర్కారు ప్రభ.. దివిటీల్లా వెలిగేందుకు కారణమవుతున్నాయి.

నీతి నిజాయితీకి మారుపేరయిన జయరాం ఇలాకాలో.. గత ఏడాది నుంచీ ఇసుక లోడు కర్నాటక సరిహద్దులు దాటి, అదే లారీల నుంచి మద్యం బాటిళ్లు వస్తున్నాయన్న విషయం బయట జిల్లాలకు తెలియలేదు. ఎలాగూ కర్నూలుకే తిరిగి వెళుతున్నందున, ఖాళీగా వెళ్లే బదులు అందులో మందుబాటిళ్లు తీసుకువెళుతున్నారట. అయితే అంత మాత్రాన, అవన్నీ జయరాం భక్తులే తీసుకువస్తున్నారని ఆరోపిస్తే ఎలా? చాలకాలం నుంచీ గుమ్మనూరు అడ్డాగా..  బళ్లారి, కర్నూలు, పరిసర ప్రాంతాల్లోని పేకాటరాయుళ్లు చెలరేగిపోతున్నారన్న రహస్యాన్ని అడిషినల్ ఎస్పీ గౌతమి శాలి బట్టబయలు చేశారు. అందులో మంత్రి గారి సమీప బంధువు కూడా ఉండటంతో కేసు పెట్టారు. అంతమాత్రాన పేకాట క్లబ్‌ను మంత్రి గారే నడిపిస్తున్నారంటే ఎలా? ఆయన సరదా పడి ఏదో భూమి కొన్నారో లేక సరదాగా దానిని ‘సద్వినియోగం’ చేసుకుంటున్నారే అనుకోండి. అంతమాత్రాన దానిని కబ్జా చేశారని లేనిపోని ఆరోపణలు చేస్తే ఎలా?

ఇప్పుడు చూడండి. ఆయన పుత్రరత్నం ఏదో బెంజ్ కారు దగ్గర ఫొటోలు దిగితే, దాన్ని కూడా యాగీ చేసి, ఆ కారు ఓ నిందితుడు బహుమతిగా ఇచ్చారని ఆరోపిస్తే ఇక నీతి నిజయితీకి స్థానం ఎక్కడ? ఈఎస్‌ఐ ద్వారా మందులు సరఫరా చేసే టెండరు వ్యవహారాన్ని, ఈఎస్‌ఐ స్కామ్‌లో 14వ నిందితుడిగా ఉన్న  కార్తీక్ అనే వ్యక్తికి అప్పగించారట.  ఆ కార్తీక్ తన మిత్రుడైన మంత్రిగారబ్బాయి పుట్టినరోజున ఓ బుల్లి బెంజికారును బహుమతిగా ఇచ్చారట. గుమ్మనూరు యువసేన పేరుతో ఉన్న ఫేస్‌బుక్ పేజీలో ఆ అపురూప దృశ్యాలు కూడా పెట్టారట. బహుమతిగా ఇస్తే  తప్పేంటట? వాళ్లిద్దరూ ఫ్రెండ్సు.ఫ్రెండిషప్పులో ఇచ్చుకోవడాలూ-పుచ్చుకోవడాలూ ఉంటాయన్న విషయం కూడా తెలియకపోతే ఎలా? ఈఎస్‌ఐ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న అచ్చెన్నాయుడు 80 రోజులు జైల్లో ఉంటే, బెంజికారు కానుకలు తీసుకున్న మంత్రిగారు మాత్రం బయట ఉండటమేమిటన్న లాజిక్కుతో మంత్రి జయరాముడిని ఉక్కిరిబిక్కిరి చేయడం ఏం ధర్మం? అప్పటికీ తన పుత్రరత్నం ఆ కారు దగ్గర నిలబడి ఫొటో తీసుకుంటే తప్పేమిటని, మంత్రిగారు నెత్తీ నోరూ కొట్టుకున్నా.. ఎవరైనా విమానం దగ్గర నిలబడి ఫొటోలు దిగితే ఆ విమానం వారిదవుతుందా అన్న మంత్రి గారి లాజిక్కును అర్ధం చేసుకోకపోతే ఎలా?  ఎవరూ వినరేం? పైగా, ఈఎస్‌ఐ స్కాములకు అడ్డుగా ఉన్నారని ఆ శాఖ అధికారి ఉదయలక్ష్మిపై సీఎంఓకి ఫిర్యాదు చేశారన్న నిందలు వేస్తే ఎలా?

అసలు ఆ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడున్నాడే.. ఈ వ్యవహారంపై ఆయన ఎంతలేసి ఆరోపణలు చేస్తున్నారు? ఆ ఎమ్మెల్సీ అర్జునుడు, బుద్దా వెంకన్నలున్నారే వాళ్లు ఎన్నెన్ని ఆరోపణలు చేస్తున్నారు?  ఆ బెంజికారు పుట్టినరోజు కానుక కాదట. మంత్రికే ఇచ్చిన లంచమట. కారుకు ఫైనాన్స్ చేయించి మరీ ఇచ్చారట. సరే ఇవన్నీ చెబితే చెప్పారు. కానీ వాటిని మీడియా సమక్షంలోనే ఏసీబీకి ఫోను చేసి, ఫిర్యాదు చేయడానికి పాత్రుడికి ఎంత ధైర్యం? పైగా ఆ ఫొటోలు కూడా విడుదల చేస్తారా?  ఆయనది గుండెనా? చెరువా?

కడిగిన ముత్యం లాంటి జయరాముడిని నోటికొచ్చినట్లు విమర్శిస్తే, గుమ్మనూరులోని పేకాటరాయుళ్లకు కోపం రాదూ? కర్నూలు-బెంగళూరు సరిహద్దు యాత్రలు చేస్తూ జీవనోపాథి పొందుతున్న, జయరాముడి భక్తులకు ఒళ్లు మండదూ? అసలు నిజాయితీనే ఇంటిపేరున్న వారినే క్యాబినెట్‌లో పెట్టుకున్నారని భావిస్తున్న జగనన్న అభిమానులు, ఈ యవ్వారాలను సహిస్తారా అంట? అయ్యన్నపాత్రుడు ఏసీబీకి ఫిర్యాదు చేశారు కాబట్టి… అమరావతి భూముల వ్యవహారంలో, ఎవరో రెడ్డి గారి ఫిర్యాదు మేరకు కేసులు పెట్టినట్లే, ఇక్కడ పాత్రుడు కూడా అదే ఏసీబీకి ఫిర్యాదు చేశారు కాబట్టి, మంత్రి జయరాముడిపై కేసు నమోదు చేయాలనుకోవడం తప్పు కదూ?! ఆశ మంచిదే. అత్యాశే ప్రమాదం!!