జగమొండి.. జగన్!

438

న్యాయవ్యవస్థతో పోరుకు రె‘ఢీ’
మైండ్‌గేమ్ మొదలయింది
అంబటి, వివేకా, మనుసింఘ్వీ కేసులు మర్చిపోతే ఎలా?
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవ్యవస్థ-అధికార పార్టీ  మధ్య యుద్ధం మొదలయింది. కోర్టులపై చూసేందుకే భయపడే పరిస్థితి నుంచి.. ఏకంగా కోర్టులపైనే యుద్ధం ప్రకటించిన ప్రత్యేక పరిస్థితి నెలకొంది. తన సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై వరస వెంట వ్యతిరేక తీర్పులిస్తున్న హైకోర్టును, జాతీయ స్థాయిలో ముద్దాయిగా నిలబెట్టాలన్న వైకాపా వ్యూహం విజయవంతమయింది. దమ్మాలపాటి-ఎన్వీరమణ కుమార్తెలపై ఏసీబీ పెట్టిన కేసుపై స్టే విధించిన హైకోర్టు, ఆ వార్తలను ప్రచురించి-ప్రసారం చేయకూడదన్న ఆదేశాన్ని, అధికార పార్టీ సహజంగానే జీర్ణించుకోలేకపోయింది. దేశ అత్యున్నత న్యాయస్థానంలో కీలకంగా ఉన్న వ్యక్తిని.. ఏసీబీ కేసు పేరుతో బయటకు లాగి, రచ్చ చేయాలన్న అధికార పార్టీ వ్యూహం హైకోర్టులో తలకిందులయింది. హైకోర్టు ఆదేశాలిచ్చినా బేఖాతరు చేస్తూ, తొలుత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముఖంగా, తర్వాత విజయసాయిరెడ్డి రాజ్యసభలోనూ అదే అంశాన్ని ప్రస్తావించడం తెగింపే కాదు. న్యాయవ్యవస్థతో అమీతుమీ తేల్చుకోవాలన్న సమరనినాదమే. అందుకే జగన్మోహన్‌రెడ్డి జగమొండి.

అవును. నిజమే. జగన్మోహన్‌రెడ్డి జగమొండి. అందులో ఎవరికీ సందేహం లేదు. తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినట్లు తలాడించి ఉంటే, ముందు కేంద్రమంత్రి, తర్వాత ముఖ్యమంత్రి అయి ఉండేవారన్నది బహిరంగ రహస్యం. కానీ ఇటలీమాట వినకుండా.. ఓదార్పుతో జనంలోకి వెళ్లి,  సోనియమ్మను ధిక్కరించి 16 నెలల పాటు జైలు గోడల మధ్య జీవించిన యోధుడిని, జగమొండి కాక ఏమనాలి? తనను చూసి కాకుండా తన తండ్రిని చూసయినా, తనకు ఓటేయాలన్న మొండి పట్టుదలతో తొలి ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టకుండా, ప్రతిపక్షంలోనే కూర్చున్న జగనన్నను జగమొండి అని కాక ఏమనాలి? తనకు 151 సీట్లు కట్టబెట్టినందున.. తన శాసనాలను ఎవరూ ప్రశ్నించకూడదని, తన రాష్ట్రంలో న్యాయవ్యవస్థ సహా ఇతర రాజ్యాంగబద్ధ సంస్థలన్నీ, తాను చెప్పినట్లే వినాలని భావించే జగనన్నను జగ మొండి అనక ఏమనాలి? ఐఏఎస్‌లయినా-ఐపిఎస్‌లయినా తనకు ఇష్టం లేకపోతే.. వాళ్లంతా కొలువుతో ఉండకూడదని లక్ష్మణగీతలు గీసే సీఎంలు ఎవరైనా ఉన్నారా? హైకోర్టు చెప్పినా ఉన్నతాధికారులను విధుల్లోకి తీసుకోని పాలకులెవరయినా ఉన్నారా? ఎస్‌ఈసీని తొలగించే సమయంలో, కులం వ్యాఖ్యలు ఏ సీఎం అయినా చేశారా? కోర్టులపై, తీర్పులిచ్చే జడ్జీలపై ఇప్పటివరకూ ఏ పాలక పార్టీ అయినా బురదచల్లిందా? లేదు. లేదు. అంత ధైర్యం ఎవరికీ సాధ్యం కాదు. కోర్టులను ఢీకొనేంత దమ్ము ఎవరికీ ఉండదు. ఒక్క జగన్మోహన్‌రెడ్డికి తప్ప! అందుకే అభిమానుల దృష్టిలో  జగనన్న మొనగాడే కాదు. జగమొండి కూడా!!

తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, తదనంతర పరిణామాలు చూద్దాం. అమరావతి భూముల వ్యవహారంలో, ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలిసినందుకే వారు తక్కువ రేటుకు భూములు కొన్నారని, అందులో భాగంగా గత సర్కారులో పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాసరావు అనే న్యాయవాదితోపాటు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ కుమార్తెలు కూడా ఉన్నారని, ఏసీబీకి ఒక రెడ్డిగారు ఫిర్యాదు చేశారు. దానికి ఆధారాలేవీ చూపించలేదు. సరే దానిపై హైకోర్టు స్టే ఇచ్చింది. దానితోపాటు, ఈ అంశంపై ఎలక్ట్రానిక్/ ప్రింట్/సోషల్ మీడియాలో చర్చించకూడదని ఆదేశించింది, దానితో సాయంత్రానికే సమాచార శాఖ కూడా, హైకోర్టు ఉత్తర్వు ప్రకారం ఫలానా వార్తను ప్రచురించకూడదని మీడియాకు సమాచారం పంపింది. హైకోర్టు స్వయంగా ఆదేశించినందువ ల్ల.. ఇక పై ఆ అంశంపై ఎవరూ చర్చించరు కామోసనుకున్న సమయంలో.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏకంగా మీడియా సమావేశమే పెట్టి హైకోర్టు తీర్పు వెనుక ఉద్దేశాన్ని కడిగేశారు.

ఇది కోర్టు భాషలో చెప్పాలంటే అసాధారణ అంశమే. శివుడాజ్ఞ లేనిదే చీమనయినా కుట్టదన్నట్లు.. జగనన్న ఆదేశం లేకపోతే, సజ్జలన్న నోరు విప్పరన్నది ‘జగన్వి’దితం. ‘  ‘‘ఈ ఆర్డరు చూశాక పెద్దలకయితే ఒక తీర్పు, మరొకరికయితే మరో తీర్పు అన్నట్లుగా ఉంది. దేశంలో అత్యున్నత పలుకుబడి గల శక్తులన్నీ  ఏకమయ్యాయి. ఎఫ్‌ఐఆర్‌లోని వ్యక్తులు, అందులోని అంశాలు మీడియా, సోషల్ మీడియాలో రాకూడదని ఆదేశాలిచ్చింది. దీన్నో విశేషంగా-కొత్త సంప్రదాయంగా మా పార్టీ-ప్రభుత్వం భావిస్తోంది. ఎవరికో ఏదో చురుక్కుమనిపించిందనిపించింది. ఇలాంటి చర్యల వల్ల  న్యాయ వ్యవస్థకున్న నిష్పాక్షికతపై నమ్మకం సడలితే, అందుకు ఆ వ్యవస్థే బాధ్యత వహించాల్సింది తప్ప ఇతరులను నిందించలేం. నిందితులుగా ఉన్న వారిని తప్పించాలనుకోవడం, దొంగలకు రక్షణ ఇవ్వడం వంటిదే. కోర్టులు ముందుగానే ఒక అభిప్రాయానికి రాకూడదు కదా? మీడియాకు గ్యాగ్ ఆర్డరివ్వడమంటే మాట్లాడకుండతా నోరు బిగించేయడమే. ఇది ఓవర్ యాక్షన్‌లా అనిపిస్తుంది. దమ్మాలపాటి, సుప్రీంకోర్టు జడ్జి కూతుళ్లు ఉన్నారు కాబట్టి, ఇందులో ముందుకు వెళ్లకూడదని వీళ్లు హైకోర్టును అడిగారట. వారేమైనా చేస్తే వాటిని ప్రశ్నించకూడదా? దీని దారం పట్టుకుని లాగితే చంద్రబాబు దగ్గరకు వెళుతుంది.  గతంలో జగన్‌పై కేసులు వేసినప్పుడు, తప్పేమిటి దర్యాప్తు జరుగుతుంది. కడిగిన ముత్యంలా బయటకు రావచ్చంటూ న్యాయమూర్తులు మాట్లాడారు. అంటే మీకే గౌరవ మర్యాద, ప్రతిష్టలున్నాయా? జగన్‌కు గౌరవ మర్యాదలు అప్పుడు లేవా?’’- ఇవీ సజ్జల హైకోర్టు తీర్పుపై చేసిన వ్యాఖ్యలు.

సజ్జల ఆరోపణలు- వ్యాఖ్యలు పరిశీలిస్తే… హైకోర్టు ఇచ్చే తీర్పుల వెనుక ఢిల్లీ పెద్ద ఉన్నారని, వీరందరితో చంద్రబాబుకు బాదరాయణ సంబంధం ఉందని చెప్పీ-చెప్పనట్లు చెప్పడమే. నిజానికి సజ్జల కవి హృదయం కూడా అదేనన్నట్లు మెడమీద తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది. సుప్రీంకోర్టు జడ్జి కూతుళ్ల పాత్రను కూడా లెక్కచేయకుండా మాట్లాడారంటే, కోర్టుతో కయ్యానికి రెఢీగా..  యుద్ధనినాదం చేసినట్లుగానే అర్ధమవుతుంది. ప్రధానంగా.. ఆయన మీడియా నోరు కట్టేయడాన్ని ప్రస్తావించి, చాలా ఆవేదన వ్యక్తం చేయడమే వింత. పైగా దాన్ని ఓ విశేషం- కొత్త సంప్రదాయంగా అభివర్ణించడం మరో ఆశ్చర్యం. దానిపై తర్వాత ముచ్చటించుకుందాం.

ఇక ఇదే అంశంపై వైకాపా అగ్రనేత, ఎంపి విజయసాయిరెడ్డి కూడా రాజ్యసభలో ప్రస్తావించడం అనూహ్యమేమీ కాదు. వ్యూహాత్మకమే. ఏపీ హైకోర్టు తీరును దేశవ్యాప్తంగా చర్చించాలన్నదే వైకాపా అసలు లక్ష్యం. ఫలితంగా హైకోర్టు జడ్జిలను బదిలీ చేస్తే,  ఆ ఖాతా కచ్చితంగా వైకాపా అకౌంటులోకే వెళుతుంది. ఇప్పుడున్న జడ్జీలను ఏపీలో ఉంచకూడదన్న బలీయమైన కాంక్ష,  వైకాపాలో కనిపిస్తూనే ఉంది. విజయసాయి నిర్మొహమాటంగా-నిర్భయంగా హైకోర్టుపై చేసిన వ్యాఖ్యల పరిణామాలేమిటన్నది పక్కనపెడితే.. ఆయన మాటలదాడి ఎవరికయితే తగలాలనుకున్నారో ఆ పెద్దకు తగిలింంది. వైకాపా లక్ష్యం కూడా అదే. తాము లక్ష్యంగా ఎంపిక చేసుకున్న ‘ఢిల్లీ పెద’్ద విశ్వసనీయతను దెబ్బతీయడం ద్వారా, మరో ఏడాదిలో ఆయన ఎక్కనున్న నిచ్చెన అందకుండా చేయాలన్న వ్యూహం వైకాపా అడుగుల్లో విస్పష్టంగా కనిపిస్తోంది.

 ‘‘ ఏపీలో న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత, పక్షపాతంతో ఉంది. దాని ఉత్తర్వుల వల్ల ఏపీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అది అసాధారణంగా వ్యవహరిస్తోంది. గత సర్కారు హయాంలో చేసిన తప్పులు కప్పిపుచ్చడానికి ఇలా వ్యవహరిస్తున్నారు. మీడియా కవరేజీ, పబ్లిక్ స్క్రూటినీ లేకుండా తప్పించుకోవాలని చూస్తున్నారు’’- ఇదీ రాజ్యసభలో విజయసాయిరెడ్డి చేసిన ప్రసంగం. ఇక బయట ధర్నాలో మాట్లాడిన ఆయన, తన మాటల దాడి కొనసాగించారు. ‘న్యాయవ్యవస్థ పక్షపాతంతో వ్యవహరిస్తోంది. న్యాయస్థానాలు మీడియా నోరు నొక్కుతోంది. పౌరుల ప్రాథమిక హక్కులు హరిస్తున్నాయి. తాజా వివాదంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని’ డిమాండ్ చేశారు. అంటే హైకోర్టు నుంచి ఎదురవుతున్న తమ ఇబ్బందులన్నీ ఏకరవు పెట్టడం ద్వారా.. కోర్టులు వైకాపాను ప్రత్యర్థిగా చూస్తోందన్న విషయాన్ని విస్పష్టంగా చాటారన్న మాట.

సరే.. ఇక అటు సజ్జల, ఇటు విజయసాయిరెడ్డి హైకోర్టు తీర్పు..  మీడియా గొంతు నులుముతున్నట్లుందన్న  ఆవేదన వ్యక్తం చేయడమే తమాషా. సజ్జల మరో అడుగు ముందుకేసి, దీన్ని విశేషం-కొత్త సంప్రదాయంగా అభివర్ణించడం ఇంకో తమాషా. సజ్జల స్వతహాగా రాజకీయ నాయకుడు కాదు. పూర్వాశ్రమంలో జర్నలిస్టు. కాబట్టి మిగిలిన వారిలా, ఆధారాల్లేకుండా మాట్లాడుతారనుకోవడం సహజం. కానీ ఆయన కూడా,  తప్పులో  కాలేసి మాట్లాడటం వింతగానే అనిపించింది. అయితే.. కోర్టులకు, ఫలానా వార్తలు ప్రచురించి-ప్రసారం చేయకూడదన్న ఆదేశాలు, ఇప్పుడే కొత్త కాదన్నది ఆయన తెలుసుకోకపోవడమే ఆశ్చర్యం.

ఇప్పటి సత్తెనపల్లి వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఒక మహిళతో మాట్లాడిన ఆడియోను ఏబీఎన్ ప్రసారం చేసింది. దానితో ఆయన కోర్టుకెళ్లి, దానిని ప్రసారం చేయకుండా నిలిపేయాలని కోర్టుకెళ్లారు. ఫలితంగా అప్పటి జడ్జి నూతి రామ్మోహన్‌రావు, ఆ ఆడియోను ప్రసారం చేయవద్దని ఆదేశించారు. హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి కేసును.. మీడియాకు వెల్లడించకుండా ఆదేశించాలని ఆయన కుమార్తె కోర్టుకెళ్లగా, జడ్జి ఆమేరకు ఆదేశాలిచ్చారు. అఫ్జల్ గురు కేసుపై కూడా మీడియా చర్చించవద్దని కోర్టు ఆదేశించింది.  ఇక కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి అభిషేక్ మను సింఘ్వీ ఒక మహిళతో ఉన్న వీడి యో వైరల్ అయినప్పుడు, దానిని ప్రసారం-ప్రచురణ కాకుండా చూడాలని కోర్టుకెళ్లారు. జడ్జి ఆ మేరకు ఉత్తర్వులిచ్చారు కూడా.

 ఇక సమైక్య రాష్ట్రంలో గవర్నరుగా ఉన్న ఎన్‌డి తివారీ, మహిళలతో మసాజ్ చేయించుకున్న దృశ్యాలను ఏబీఎన్ ప్రసారం చేసింది. దానిపై ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ కోర్టుకెళ్లగా, వాటిని ప్రసారం చేయకుండా ఆదేశాలిచ్చింది. ఇక గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు, ఆయన వద్ద ఓఎస్డీగా పనిచేసిన జనార్దన్‌రెడ్డి కూడా,  మహిళలకు సంబంధించిన ఆరోపణల్లో ఇరుక్కున్నారు. దానితో వాటిని ప్రసారం-ప్రచురించవద్దని కోరుతూ ప్రముఖ న్యాయవాది రవితేజ కోర్టును ఆశ్రయించారు. ఫలితంగా కోర్టు ఆ మేరకు ఆదేశాలిచ్చింది. మరి ఇన్ని నిదర్శనాలు, ఉదాహరణలు కళ్లెదుటే ఉంచుకుని.. కోర్టు మీడియా నోరు నొక్కుతోందని ఆరోపించడం సమంజసమా? అసమంజసమా? సో.. కోర్టులు మీడియాపై ఆదేశాలివ్వడంలో విశేషం-కొతద్త సంప్రదాయమేమీ లేదన్నది అర్ధమవుతుంది.

అన్నట్లు.. ఐజెయు అనే పేరు గొప్ప జర్నలిస్టు యూనియను, బెడవాడ ప్రెస్‌క్లబ్‌లో అమరన్నకు సన్మానం చేసిన,  శ్రీనివాసరెడ్డి అనే వీరవిప్లవ జర్నలిస్టు నాయకుడికీ  హటాత్తుగా పత్రికా స్వేచ్ఛ గుర్తుకొచ్చింది. ఇదే కోర్టు.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, ఎన్డీ తివారీ వ్యవహారం, అంబటి రాంబాబు కేసులో మీడియాపై ఆంక్షలు విధించినప్పుడు… ఈ ఆర్తనాదాలు, హాహాకారాలు,  పత్రికా స్వేచ్ఛ ఏమయింది?  కాకి ఎత్తుకెళ్లిందా? ఈ అస్త్రాలన్నీ అప్పుడు జమ్మిచెట్టు ఎక్కించారా? హలో జర్నలిస్టు నాయకులూ.. మీకర్ధమవుతోందా?