భట్టి సవాలు..  తలసాని జవాబు!

543

 డబుల్ బెడ్‌రూములు చూపించిన శ్రీనివాసయాదవ్
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

రాజకీయాల్లో సవాళ్లు-ప్రతి సవాళ్లు సహజం. ఒకరిపై మరొకరు టన్నుల కొద్దీ విమర్శలు-ఆరోపణలు, దానిని నిరూపించాలని సవాళ్లు, నిరూపిస్తామన్న ప్రతి సవాళ్లు రాజకీయాల్లో సర్వ సాధారణం. కానీ విచిత్రమేమిటంటే… వాటిని ఎవరూ నిరూపించరు. నిరూపించాలని పట్టుపట్టరు. చివరకు మరో సమస్య తెరపైకి రాగానే, పాత సవాళ్లు సమాధి అవుతుంటాయి. కొత్త సవాళ్లు వినిపిస్తుంటాయి. కానీ..హైదరాబాద్‌లో ఇప్పుడా సంప్రదాయం పూర్తిగా రివర్సయింది. సభలో సవాలు చేసిన విపక్ష నేత  ఇంటికి స్వయంగా ఓ మంత్రి వెళ్లి, ఆయన విసిరిన సవాలుకు జవాబును ససాక్ష్యాలతో నిరూపించి, విపక్షనేతతో నోరెళ్లబెట్టించిన వైనమిది. ఆ సవాలు విసిరిన విపక్ష నేత భట్టి విక్రమార్క అయితే, ఆయన ఇంటికి వెళ్లి మరీ సవాలుకు జవాబు చూపిన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. చరిత్రలో తొలిసారిగా చోటుచేసుకున్న ఈ ఘటనను చూద్దాం.

తెలంగాణ ఫైర్‌బ్రాండ్ తలసాని శ్రీనివాస యాదవ్… ఏం చేసినా హాట్ హాట్‌గానే ఉంటుంది.  పార్టీ నాయకత్వానికి ఆయన ఓ బాణం లాంటి వాడు. ఇప్పుడు కేసీఆర్ సంధించిన ఆ బాణం, విపక్షాల నోళ్లు మూయించింది. ఎలాగంటే.. డబుల్‌బెడ్‌రూము నిర్మాణాలపై తెలంగాణ శాసనసభలో వాడి వేడి చర్చ జరిగింది. ఆ సందర్భంలో డబుల్‌బెడ్ రూము నిర్మాణాలపై చర్చ మళ్లింది. తాము లక్ష ఇళ్లు కట్టి ఇస్తామని, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దానితో భట్టి జోక్యం చేసుకుని ఇళ్లు ఎన్నికలప్పుడే కనిపిస్తాయని, లక్ష ఇళ్లు ఎక్కడ ఉన్నాయో చూపాలని సవాల్ చేశారు. అంతలో సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ జోక్యం చేసుకున్నారు. ‘రేపు ఉదయం మీ ఇంటికి వస్తా. హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ బెడ్‌రూములు కడుతున్నారో మీకు చూపిస్తా’నని భట్టికి సవాల్ విసిరారు. అందుకు స్పందించిన భట్టి కూడా ‘టైమెప్పుడో చెబితే ఇంటికి వస్తా. లక్ష ఇళ్లు ఎక్కడ ఇచ్చారో, ఎక్కడ కట్టారో చూపాలి’ అని ప్రతి సవాల్ చేశారు.

సభలో సవాళ్లు-ప్రతి సవాళ్లు సహజమే కాబట్టి, తర్వాత వాటి గురించి ఎవరూ మాట్లాడరని రోటీన్‌గా అంతా అనుకున్నారు. ఇక దానితో ఆ కథ ముగిసిపోయిందనుకున్నారు. కానీ..మంత్రి తలసాని ఊరుకుంటారా? లేదుకదా! అందుకే గురువారం ఉదయమే, హటాత్తుగా అధికారసహితంగా భట్టి ఇంటికి వెళ్లారు. దానితో అవాక్కవడం భట్టి వంతయింది. మాట ముచ్చట్లు అయిన తర్వాత.. భట్టిని తన కారులో ఎక్కించుకున్న తలసాని.. జియాగూడ, గోడె ఖబర్, అంబేద్కర్‌నగర్, కట్టెలమండి, సీసీ నగర్, కొల్లూరులోని డబుల్ బెడ్‌రూము ఇళ్లను పరిశీలించారు. మళ్లీ శుక్రవారం ముషీరాబాద్, ఎల్బీనగర్, కొల్లూరులోని ఇళ్లను పరిశీలించనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు, ఎమ్మెల్యే జి.సాయన్న,  మేయర్ బొంతు రామ్మోహన్ కూడా వీరి పర్యటనలో ఉన్నారు.

ఒక మంత్రి..  విపక్ష నేత సవాలు స్వీకరించడమే కాకుండా, దానికి జవాబుగా ఆయన ఇంటికి వెళ్లి మరీ, తమ ప్రభుత్వం చేస్తున్న పనులను చూపించడం చరిత్రలో ఇదే తొలిసారి. దానిని తలసాని సాధించగా, సవాల్ చేసిన వైనం నిజమా కాదా అన్న అంశాన్ని ప్రత్యక్షంగా మంత్రితో కలసి వచ్చిన భట్టి కూడా, హుందాగా వ్యవహరించి ఒక సత్సంప్రదాయానికి తెరలేపారు. నిజానికి నగరంలో డబుల్‌బెడ్ రూములపై తలసాని ఇప్పటికి అనేక సార్లు జిల్లా యంత్రాంగంతో సమీక్షలు నిర్వహించారు. ఇటీవలి కాలంలో అయితే మంత్రి కేటీఆర్ కూడా, ఇళ్ల నిర్మాణాలపై సీరియస్‌గా దృష్టి సారిస్తున్నారు.  నగర పాలక సంస్థ ఎన్నికలకు ముందుగానే ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకూ తెలంగాణలో డబుల్‌బెడ్ రూములు, తొలుత పూర్తి చేసిన ఘనత కూడా తలసాని దక్కించుకున్నారు. ఆయన తన సనత్‌నగర్ నియోజకవర్గంలో రాష్ట్రంలో అందరికంటే ముందుగానే ఇళ్లు పూర్తి చేశారు. నాటి గవర్నర్ నరసింహన్ సైతం డబుల్ బెడ్‌రూం ఇళ్లను చూసి, తాను ఇక్కడే ఉండిపోవాలనుందని వ్యాఖ్యానించారంటే, అవి ఏ స్థాయిలో ఆయనను ఆకట్టుకున్నాయో అర్ధమవుతుంది.

 తలసాని కార్మికమంత్రిగా ఉన్నప్పుడు.. విపక్ష నేత పిజెఆర్ అనేకసార్లు సవాళ్లు విసిరినప్పుడు, తలసాని వాటిని స్వీకరించారు. అయితే పిజెఆర్ ఒక్క సందర్భంలో కూడా ముందుకురాలేదు. ఇప్పుడు విపక్ష నేత భట్టి విక్రమార్క మాత్రం ముందుకురావటం విశేషం. తజా పరిశీలనలో, డబుల్ బెడ్‌రూములపై ఒక్క విమర్శ కూడా చేయని భట్టి.. తమ ఇంజనీరింగ్ బృందం పరిశీలనకు వచ్చిన తర్వాత తన అభిప్రాయేమిటో చెబుతానన్నారు. కానీ, అసెంబ్లీలో బెడ్‌రూములపై భట్టి చేసిన విమర్శలకు-క్షేత్రస్థాయి పరిశీలనలో ఆయన తీరు పరిశీలిస్తే.. వాటిపై ఆయన సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తుంది. మౌనం అర్ధాంగీకారం కదా?