ఆంధ్రాలో దేవాలయాలు..అంతేగా..అంతేగా!?

706

(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

నిత్యం చచ్చే వాళ్లకు ఏడ్చేవాళ్లెవరన్నట్లు… ఆంధ్రాలో దేవతా విగ్రహాల ధ్వంసాలు, రథాల దహనకాండ, అర్చకులపై దాడులు, దేవాలయ భూముల అమ్మకాలు, దేవాలయాల్లో అన్యమత ఉద్యోగులు, పరిసరాల్లో అన్యమత ప్రచారాలు విజయవంతంగా జరుగుతున్నప్పుడు,  ఆ పరంపరలో కొత్తగా వెలుగుచూసే ఘటనలు రొటీనే తప్ప అందులో ప్రత్యేకతేమీ ఉండదు. ఆంధ్రాలో ఇప్పుడు అదే జరుగుతోంది. కాబట్టి వేటికీ పెద్దగా హాశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ రధంలోని నాలుగు వెండి సింహాలలో మూడు మాయం, అదే బెజవాడ నిడమానూరులో సాయిబాబా విగ్రహ విధ్వంసం, మొన్నామధ్య గోదావరి జిల్లాలో వినాయక విగ్రహానికి మలం పూయడం వంటి ఘటనలను ఇతర రాష్ట్రాల ప్రజలకు కొత్తగా అనిపించవచ్చు. వినాయకచవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వని పాలకులు, వైఎస్ జయంతికి ఏకంగా ఉత్తర్వులే ఇచ్చినా ఎందుకు కిక్కురుమనరని ఇతర రాష్ట్రాల వారికి అనిపించవచ్చు. కానీ, ఆంధ్రాలో భక్తులకు అవి రోజూ దర్శనమిచ్చే రొటీన్ దృశ్యాలే. అది కూడా మీడియా పుణ్యాన వెలుగులోకి వస్తున్న ఘటనలే. హిందువుల చర్మం ఐదారు టన్నుల  మందం కాబట్టి, వారిలో కులపిచ్చి తప్ప.. అందులో కోస్తాలో కులపిచ్చి ఎప్పుడో ముదిరిపోయింది కాబట్టి.. హిందుత్వ భావన ఎప్పుడో చచ్చిపోయింది కాబట్టి.. ప్రశ్నించే తత్వం రెండువేల నోటు తీసుకున్నప్పుడే సమాధి అయింది కాబట్టి.. ప్రభుత్వం బతికిపోయింది. అంటే హిందుత్వ భావన చచ్చిపోయి, పాలకులు బతికిపోయారన్నమాట. ఇదే ఏ యూపీలోనో, మహారాష్ట్రలోనో  జరిగితే పాలకుల బొమ్మ తిరగబడి ఉండేది. కానీ  జరిగింది ఆంధ్రాలో కదా? మరి అక్కడ అంతేగా.. అంతేగా! అదన్నమాట.

ఇప్పుడు ఇలాంటి ఘటనలకు నిరసనగా, కమళదళపతి సోము వీరన్న కమలదళాలతో కట్టక ట్టుకుని గవర్నర్ వద్దకు వెళ్లినా, ప్రచారం తప్ప ఫలితం లేదు. ఇలాంటి ఘటనను వాడుకుని,  ఆరేడడుగుల గోతిలో ఉన్న బీజేపీని హిందుత్వ కార్డు పెట్టి, క్రేన్లతో లేపుదామన్న కమలదళాల ప్రయత్నం వల్ల, కంఠశోష- ఆయాసం తప్ప జరిగేది-ఒరిగేదీ సున్నా. అసలు ఆంధ్రా జనంలో కులతత్వం తప్ప మతభావన లేనప్పుడు, కాషాయపార్టీ ఎన్ని క్రతువులు చేపట్టినా ఉపయోగం ఉండదు. కాకపోతే ‘మేమూ ఉన్నామని’ చెప్పుకోవడానికి మాత్రం.. ఈ వినతిపత్రాలిచ్చే యవ్వారాలు, ఫొటో ఫినిషింగులూ  అక్కరకొస్తాయేమో? భాజపేయులు గవర్నరు వద్దకు వెళ్లిన శుభముహూర్తంలోనే, బెజవాడ సమీపంలోని నిడమానూరులో సాయిబాబా విగ్రహం మొండేన్ని వేరు చేశారంటే… ఆంధ్రాలో ఈ అరాచకాన్ని అదుపు చేసే దమ్ము ఎవరికీ లేదని, మెడపై తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది. కానీ కమలదళాలది మాత్రం దింపుడుకళ్లెం ఆశ!

జగనన్న సీఎం అయినప్పటి నుంచీ ఇప్పటిదాకా.. దేవాలయాలపై ఇలాంటి సంఘటనలు 11 జరిగాయని, కొత్తగా హిందూ మఠం తెరిచిన తెలుగుదేశం మఠాథిపతి చంద్రబాబు నాయుడు లెక్కబెట్టి మరీ చెప్పారు. అడిగేవాడు-అడ్డుకునేవాడు-కన్నెర్ర చేసేవాడు  లేకపోతే.. 11 కాదు, 111 సంఘటనలు  జరుగుతాయి. అయినా, ఇప్పుడు కొత్తగా హిందూ మఠం తెరిచిన బాబూజీ జమానాలోనే, 46 గుళ్లు బెజవాడలో నేలమట్టం చేయించిన పుణ్యం మర్చిపోతే ఎలా?  ఆ పాపంలో భాజపా పీఠాధిపతుల పాత్ర కూడా ఉంది కదా? మరి ఇప్పుడీ ఈ ప్రవచనాలెందుకు? భాజపా పీఠాథిపతులు కూడా బాబు జమానా అపచారాన్ని ఇప్పుడు ఎత్తిపోస్తున్నారు. మరి నాటి జమిలి పాలనలో, వారిదీ ఒక కాలు-ఒక చేయి కూడా ఉంది కదా? ఇప్పుడెందుకీ కుమిలిపాట్లు? వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వని జగనన్న సర్కారు.. వైఎస్ జయంతికి మాత్రం, ఏకంగా జీఓనే ఇచ్చిందన్న బాబూజీ విమర్శను చూస్తే, నవ్వాలో ఏడవాలో అర్ధం కాదు.

వినాయక చవితి అంటే హిందువులు మాత్రమే చేసుకునే పండుగ. ఆ పండుగలో భక్తులు వందలు-వేల సంఖ్యలో వస్తారు. వాళ్లంతా వస్తే కరోనా వస్తుంది. అందుకే చవితి ఉత్సవానికి అనుమతి ఇవ్వలేదు. పైగా భాజపా పీఠాథిపతి వీర్రాజు స్వామి కూడా..  విగ్రహం ఒక్కరోజు పెట్టి, అదేరోజు నిమజ్జనం చేయాలని హిందువులందరికీ ఫత్వా జారీ చేశారాయె. ఇక రోగి-వైద్యుడి చందం మాదిరిగా, ఇదే సందనుకుని, హిందువుల ఆత్మ అయిన జగన్మోహన్‌రెడ్డి కూడా చవితి ఉత్సవం కుదరదని ఆర్డర్లేశారు. కానీ వైఎస్ అలాకాదు కదా? ఆయన అందరి దేవుడు. ఎందరికో ‘మేళ్లు’ చేసిన మహానుభావుడు. పైగా పాలకులకు వేలుపు. ఆయన వర్ధంతి రోజున ఎన్ని వందలు-వేల మంది వచ్చినా.. ఎవరికీ కరోనా రాదు, గిరోనా రాదు. కాబట్టే అధికారిక ఉత్తర్వులిచ్చారు.  ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’కి ఇది కూడా తెలియకపోతే ఎలా?