మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి

332

-జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు
*సీఎం జగన్ పాలనలో విప్లవాత్మకమైన మార్పులు, సంస్కరణలతో మహిళలకు లబ్ది చేకూరుస్తున్నాం – రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.
* సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన స్వయం సహాయక సంఘాల మహిళలు, ఎమ్మెల్యే
* 2453 సంఘాలకు రూ.21.14 కోట్ల మెగా చెక్కు అందజేత
మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం వైయస్సార్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా రాప్తాడులోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అధ్యక్షత వహించారు.

తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని మహిళా సంఘ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే లు ప్రారంభించారు. మహిళా సంఘ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ, మహిళలు సంతోషంగా ఉంటే కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుందని భావించిన ముఖ్యమంత్రి మహిళల ఆర్థికాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారన్నారు. పొదుపు సంఘాల అక్కాచెల్లెళ్లకు బాసటగా నిలిచేందుకు వైయస్సార్ ఆసరా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో నాలుగు విడతల ద్వారా 2453 సంఘాలకు 84.64 కోట్ల రూపాయలు లబ్ధి కల్పిస్తున్నారన్నారు. మొదటి విడతగా రాప్తాడు నియోజకవర్గంలోని రాప్తాడు మండలానికి చెందిన 691 సంఘాలకు రూ.7.11 కోట్లు, అనంతపురం రూరల్ మండలానికి చెందిన1083 సంఘాలకు రూ.9.56 కోట్లు, ఆత్మకూరు మండలానికి చెందిన 679 సంఘాలకు రూ.4.49 కోట్లు వెరసి 2453 సంఘాలకు రూ.21.14 కోట్ల రూపాయలు లబ్ధి కల్పించడం జరిగిందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైయస్ఆర్ సున్నా వడ్డీ, వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా తో పాటు మహిళల సంక్షేమానికి వైయస్సార్ పెన్షన్ కానుక, వైయస్సార్ బీమా, వైయస్సార్ చేదోడు, అమ్మ ఒడి, కాపు నేస్తం, నేతన్న నేస్తం, వైఎస్సార్ గోరుముద్ద తదితర పథకాల ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకి నేరుగా నగదును జమ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన మహిళా సంఘ సభ్యులు అందరూ లక్షాధికారుల నుంచి కోట్లాధికారులుగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

సీఎం జగన్ పాలనలో విప్లవాత్మకమైన మార్పులు, సంస్కరణలతో మహిళలకు లబ్ధి చేకూరుస్తున్నాం – ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

వైయస్సార్ ఆసరా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన లో విప్లవాత్మకమైన మార్పులు, సంస్కరణలు ప్రవేశపెట్టి అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే వరుస సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు లబ్ధి కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళా పక్షపాతి అని సున్నా వడ్డీ, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత పథకాల ద్వారా రాష్ట్రంలోని మహిళలకు 56, 911 కోట్ల రూపాయల లబ్ధిని కల్పించారన్నారు.

దివంగత నేత వైయస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 40 లక్షల ఇళ్ల నిర్మాణాలను నిర్మించి దేశంలోనే రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపారన్నారు. అదే ఒరవడిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తూ 30 లక్షల ఇళ్ల స్థలాలను మహిళల పేరిటే రిజిస్ట్రేషన్ చేసి అందించడమే కాకుండా, ఆ స్థలాలలో గృహాలను కూడా నిర్మించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. దివంగత నేత వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాలంలో ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, భూ పంపిణీ, 108, 104 అంబులెన్స్ సర్వీసులు లాంటి పథకాలు ప్రారంభించారని, ఆ పథకాలను వివిధ రాష్ట్రాలలో వివిధ పథకాల పేరుతో అమలు చేస్తున్నారన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 1088 అంబులెన్సులను ప్రారంభించి పలు రాష్ట్రాల దృష్టిని ఈ రాష్ట్రంవైపు చూసేలా చేసిందన్నారు. ఈ కార్యక్రమంతో దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయన్నారు. ఆ విధంగా మనసు పెట్టి పరిపాలన చేసే ముఖ్యమంత్రిని ఈరోజు మనమంతా చూస్తున్నామన్నారు. తన పాదయాత్రలో వేల కిలోమీటర్లు నడిచి ప్రజల కష్టాలను గమనించి అధికారం లోకి రాగానే ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సంక్షేమ పథకాల ప్రవేశపెట్టి, ఒక సంక్షేమ క్యాలెండర్ ని కూడా రూపొందించి క్రమం తప్పకుండా, ఇచ్చిన మాటను నిలబెట్టుకుని వివిధ వర్గాల ప్రజలందరికీ లబ్ధి చేకూరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే కొనియాడారు.15 నెలల కాలంలోనే సంక్షేమ పథకాలతో 58 వేల కోట్ల రూపాయల మేర ప్రజలకు లబ్ధి కల్పించిన ఘనత తమ ప్రభుత్వందేనన్నారు.

రాప్తాడు నియోజకవర్గంలో పదివేల మంది మహిళలతో ఒక డైరీని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇందులో ఇప్పటికే 3690 మంది మహిళలు సభ్యులుగా నమోదు చేసుకున్నారన్నారు. డైరీ ఏర్పాటుకు సంబంధించి యంత్రాలను కూడా తెప్పిస్తున్నామని ఆయన తెలిపారు. రాప్తాడు నియోజకవర్గంలో ఫుడ్ పార్క్, వెజిటబుల్ ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేసేందుకు 14 ఎకరాల భూమిని మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ను కోరామన్నారు. ఆ భూమిని కూడా ఉచితంగా అందించాలని కోరగా, జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు లేఖలు కూడా వ్రాసి తన సంపూర్ణ సహకారాన్ని అందించారని ఎమ్మెల్యే ప్రశంసించారు. కోవిడ్ మహమ్మారిని అంతమొందించేందుకు 18 గంటల పాటు పనిచేస్తూ జిల్లా కలెక్టర్ విశేష కృషి చేస్తున్నారన్నారు.

తాను కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నియోజకవర్గంలో 3.50 లక్షల మాస్కులను, లక్ష శానిటైజర్ లను ఉచితంగా పంపిణీ చేశామని ఎమ్మెల్యే తెలిపారు.

డిఆర్డి ఏ పిడి నరసింహా రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 11వ తేదీన అమరావతి నుండి వైయస్సార్ ఆసరా పథకం ద్వారా మహిళలకు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించి నేరుగా మహిళల ఖాతాలకు సొమ్మును బదిలీ చేశారన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో వివిధ పథకాల ద్వారా 31,223 లబ్ధిదారులకు 48.10 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందించిందన్నారు. జగనన్న తోడు కార్యక్రమం కింద చిరు వ్యాపారులకు పది వేల రూపాయల చొప్పున ప్రభుత్వం రుణాన్ని అందిస్తోందని, అందుకు సంబంధించిన వడ్డీని ప్రభుత్వమే చెల్లించడం జరుగుతుందని ఆయన తెలిపారు. త్వరలో వైఎస్సార్ భీమా కార్యక్రమం కూడా ప్రారంభించడం జరుగుతుందని, దీంతోపాటు పీఎం సురక్ష యోజన, పీఎం జీవన్దాన్ తదితర కార్యక్రమాలకు సంబంధించి గ్రామ వాలంటీర్ల ద్వారా సంబంధిత పత్రాలు పొంది మహిళలు లబ్ధి పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా రాప్తాడు మండలానికి చెందిన మహిళా సంఘ సభ్యులు ఉష మాట్లాడుతూ, వైయస్సార్ ఆసరా పథకం ద్వారా తమకు నెలకు ముందే దసరా పండుగ వచ్చిందని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా వివిధ పథకాల ద్వారా తమ సంఘ సభ్యులు పొందిన లబ్ధిని గూర్చి విపులంగా వివరించింది.
ఈ కార్యక్రమంలో రాప్తాడు మండలం జ్యోతి మండల సమాఖ్య అధ్యక్షురాలు పాపులమ్మ, ఆత్మకూరు మండలం కావేరి మండల సమాఖ్య అధ్యక్షురాలు ప్రభావతి, అనంతపురం రూరల్ మండలం వెన్నెల మండల సమాఖ్య అధ్యక్షురాలు అంజనా దేవి, రాప్తాడు నియోజకవర్గం మార్కెట్ యాడ్ ఛైర్మెన్ నాగేశ్వర రెడ్డి, తోపుదుర్తి మహిళా సహకార డైరీ చైర్మన్ తోపుదుర్తి నయనతారెడ్డి, నియోజకవర్గ మహిళా సంఘం సభ్యులు, స్థానిక ఎంపీడీవో, తహసిల్దార్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.