తెలంగాణ క్యాడర్‌లో పెరుగుతున్న జోష్
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

‘ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా… బుల్లెట్ దిగిందా లేదా’.. బండి సంజయ్ స్పీడును చూస్తే, ఈ డైలాగు గుర్తుకురాక తప్పదు. అవును..  తెలంగాణలో బీజేపీ ‘బండి’ శరవేగంగా పరుగులు పెడుతోంది. కేసీఆర్ సర్కారు ప్రజావ్యతిరేక నిర్ణయాలపై కమల దళపతి బండి సంజయ్ సీనియర్ల సహకారం లేకపోయినా, మొండిగా పార్టీ బండిని జనంలోకి తీసుకువెళుతున్నారు. రాష్ట్ర బీజేపీ చరిత్రలో.. ఎవరూ ఊహించని మెరుపు నిర్ణయాలతో, సంజయ్ తెరాస సర్కారుకు చెమటలు పట్టిస్తున్నారు. బీజేపీ-కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల నుంచి పాతుకుపోయిన సీనియర్లు చేయని మొండి ధైర్యాన్ని బండి సంజయ్ చేస్తుండటంతో, కమలం క్యాడర్‌లో జోష్ కనిపిస్తోంది.

కేసీఆర్ సారథ్యంలో తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఇప్పటివరకూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన వారంతా ఇందిరాపార్కు పరిమితమయ్యారు. వారిని పోలీసులు అక్కడే అరెస్టు చేసేవారు. దానితో కాసేపు ముందుకు వెళ్లేందుకు ప్రతిఘటించినట్లు నటించడం-మీడియా, వీడియోగ్రాఫర్లు ఆ తతంగాన్ని కవర్ చేసిన తర్వాత, పోలీసు వ్యాన్లలో కూర్చుని చేతులెత్తి నినాదాలు చేయడం వంటి దృశ్యాలు, కొన్నేళ్ల నుంచి అలవాటుగా మారాయి. నిజానికి ఏ పార్టీ అయినా ఛలో అసెంబ్లీకి పిలుపునిస్తే, వారిని మధ్యలోనే అరెస్టు చేస్తారన్న కనీస పరిజ్ఞానం ఉన్న ఎవరికయినా ఉంటుంది. కాబట్టి..  సమైక్య ఆంధ్రప్రదేశ్ నాటి మాదిరిగా, ఏ యూత్ కాంగ్రెస్సో,  ఏబీవీపీనో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, ఎంపిక చేసుకున్న కార్యకర్తలతో మెరుపు ముట్టడి చేసేవి. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో తెరాస కూడా, కొన్నిసార్లు ఇలాంటి మెరుపు నిర్ణయాలు తీసుకునేది.

ఉద్యమ ప్రస్థానం నుంచి సీఎంగా వచ్చిన కేసీఆర్, ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నాచౌక్‌ను తొలగించారు. దానిని కోర్టు  కొట్టివేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి లాంటి నాయకుల ఏకపాత్రాభినయం, వ్యక్తిగత హడావిడి తప్ప, మిగిలిన ఏ ఒక్క నాయకుడు గొంతు విప్పేందుకే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఒక్కముక్కలో చెప్పాలంటే, ఉద్యమాల ద్వారా ఏర్పడ్డ ప్రభుత్వం.. అవే ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేయడంలో విజయం సాధించింది. అలాంటి తెలంగాణలో, ఇప్పుడు ప్రజా ఉద్యమాలు లేవు. రాజకీయ పార్టీల ఉద్యమాలు లేవు. మావోయిస్టు-మానవ హక్కుల సంఘాల ఉద్యమాలు అంతకంటే లేవు. ఎవరైనా నోరెత్తితే కేసులు-అరెస్టులు. అందుకే కొన్ని గొంతులే ప్రశ్నిస్తున్నాయి. మిగిలిన గళాలు మూగబోతున్నాయి. అటు సమైక్య రాష్ట్రంలో, పాలకులపై స్వేచ్ఛగా ఝళిపించిన మీడియా  కలాలు-గళాలు ఇప్పుడు భయంతో బిక్కుబిక్కుమంటున్నాయి. మొత్తంగా తెలంగాణ సమాజంలో స్వేచ్ఛకు సంకెళ్లు వేళ్లాడుతున్నాయి.

ఇప్పుడు ప్రశ్నించే ఆ కొన్ని గొంతుల్లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డయితే, రెండో గొంతు బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్. రేవంత్‌రెడ్డి పేరయితే తెలుగు రాష్ట్రాలకు సుపరిచితం. కానీ బండి సంజయ్ పేరు కరీంనగర్ దాటి వినిపించలేదు.  అలాంటి ‘అపరిచత పాత్ర’ నుంచి తన పోరాటంతో తెలంగాణకు సుపరిచితుడిగా మారిన సంజయ్ దూకుడు, తెలంగాణ బీజేపీ క్యాడర్‌లో సమరోత్సాహం నింపింది. తాజా అసెంబ్లీ మెరుపు ముట్టడిలో సంజయ్ వ్యూహం, రాజకీయ పరిశీలకులను నోరెళ్లబెట్టించింది. ఇప్పటివరకూ అసెంబ్లీ గేటు వరకూ ఏ పార్టీ కార్యకర్తలు వెళ్లిన దాఖలాలు లేవు. ఎందుకంటే అక్కడ అంత పకడ్బందీగా బందోబస్తు ఉంటుంది. అయినా సంజయ దళం వాటిని ఛేదించుకుని వెళ్లడం విశేషం.  బీజేపీలో పేరుగొప్ప నాయకులు, జాతీయ స్థాయి నాయకులు, తాము తప్ప పార్టీ మరో గతి లేరనుకుని భ్రమ పడేవారంతా..  అసెంబ్లీ ముట్టడిలో సంజయ్ పన్నిన గెరిల్లా వ్యూహానికి బిత్తరపోవలసి వచ్చింది. వారిలో ఏ ఒక్కరు ఇంత సాహసోపేత నిర్ణయం తీసుకోలేకపోయారు. అసెంబ్లీ ముట్టడి అంతా సంజయ్ సొంత వ్యూహంతో జరగడం, అందులో హైదరాబాద్ లో మోతుబరి నాయకుల పాత్ర నయాపైసా కూడా లేకపోవడం విశేషం.

సీఎం కేసీఆర్‌ను నేరుగా విమర్శించేందుకే భయపడుతున్న పరిస్థితిలో.. ఆయనను జైలుకు పంపిస్తామన్న హెచ్చరికలతో, సంజయ్ తెలంగాణ జనం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఫలితంగా బీజేపీ కార్యక్రమాలపై సహజంగానే జనంలో ఆసక్తి పెరిగింది. ఈ విషయంలో  ‘ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా’ అన్న డైలాగు, బండి స్పీడును సరిపోయేలా క నిపిస్తోంది. పార్టీ – ప్రభుత్వ పదవులు పొంది, పాతుకుపోయిన బీజేపీ సీనియర్లు కూడా, సంజయ్ స్థాయి దూకుడులో పదిశాతం కూడా ప్రదర్శించలేకపోతున్నారు. ఎంతోమంది పార్టీ అధ్యక్షులు- కేంద్రమంత్రులుగా చేసినా, ఇప్పటివరకూ తెలంగాణ సమర యోధులు-నిజాం బాధితుల ఇళ్లు-సమాధుల వద్దకు వెళ్లే ఆలోచన-ధైర్యం చేయలేకపోయారు. ఈ విషయంలో సంజయ్ చూపిన తెగువకు, తెలంగాణ సమాజమే ముగ్ధురాలవుతోంది. నిరంతరం జనంలోనే ఉంటున్న సంజయ్ స్పీడు అందుకునే నాయకులెవరూ, ఆ పార్టీలో భూతద్దం వేసినా కనిపించడం లేదు.

అసెంబ్లీ ముట్టడిలో గెరిల్లా వ్యూహం అమలు చేసిన సంజయ్, అందులో రాజధాని నాయకులను దూరంగా ఉంచడం సరైనదేనన్న వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. హైదరాబాద్ నేతలు హడావిడి చేయడానికి, మీడియాలో ప్రచారానికి, గాంభీర్యానికి, పెద్ద గొంతుతో నినాదాలకు తప్ప.. పార్టీ విస్తృతికి ఉపయోగపడరని, పార్టీ వల్ల నాయకులు ఎదగడమే తప్ప, నాయకుల వల్ల పార్టీ ఎదిగే పరిస్థితి- ఆరోజులు ఎప్పుడో పోయాయన్న భావన, బీజేపీ సానుభూతిపరులలో చాలాకాలం నుంచీ ఉంది. దివంగత ఆలె నరేంద్ర,  బద్దం బాల్‌రెడ్డి, బాలనర్శింహ, నర్శింగరావు, నందరాజ్‌గౌడ్, గుండుకృష్ణ, టోపీ శంకర్‌తోపాటు..  ఇంద్రసేనారెడ్డి, జీ.ఆర్ కరుణాకర్, చింతల రామచంద్రారెడ్డి, సుభాష్‌చందర్జీ, రామచందర్‌రావు వంటి దూకుడుగా వ్యవహరించే నాయకుల వల్ల పార్టీ విస్తరించింది. వారంతా నిరంతరం క్షేత్రస్థాయిలోనే ఉండి, కార్యకర్తల సంఖ్యను పెంచేవారు. అలాంటి దూకుడు-భావోద్వేగం నింపే నాయకులెవరూ, ఇప్పుడు కనిపించడం లేదన్న వ్యాఖ్యలు కూడా పార్టీలో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే రాజాసింగ్‌లో అలాంటి లక్షణాలు పుష్కలంగా ఉన్నా, ఎందుకో ఆయనకు పెద్దగా ప్రోత్సాహం లభించడం లేదన్న విమర్శలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

రాజధాని నగరంలో పేరుకు పెద్ద నాయకులున్నప్పటికీ, వారిలో జనసమీకరణ చేసే స్థాయి నాయకులెవరూ పెద్దగా లేరు. పెద్ద పెద్ద పదవులు పొందిన అగ్రనాయకులు కూడా పార్టీ కార్యక్రమాలకు ఇద్దరు, ముగ్గురుతో.. మరికొందరు ఒక్కరే వచ్చే పరిస్థితి కొనసాగుతోందన్న వ్యాఖ్యలు చాలాకాలం నుంచి వినిపిస్తున్నాయి. అసలు హైదరాబాద్‌లో పార్టీ, లిమిటెడ్ కంపెనీగా మారిందన్న విమర్శలు కొన్నేళ్ల నుంచీ వినిపిస్తూనే ఉన్నాయి. దానికి తెరదించే ప్రయత్నాలు చేయని క్రమంలో, సంజయ్ నగర పార్టీని ప్రక్షాళన చేయాలన్న సూచన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి గమనించినందుకే.. సంజయ్,  రాజధాని నాయకులను నమ్ముకోకుండా, ఇతర జిల్లాల నుంచి గుట్టుప్పుడు కాకుండా అసెంబ్లీ ముట్టడి చేసిన ట్లు కనిపిస్తోంది.

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner