అవును.. ఆ ముగ్గురూ ఇష్టపడ్డారు!

177

బీజేపీ-వైసీపీ-టీడీపీ అపూర్వ కలయిక
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

‘పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీ అంతు చూస్తాం. మేము తలచుకుంటే కౌతాలం మండలంలో ఒక్క  బీజేపీ జెండా కూడా కట్టలేదు. నువ్వు ఇక్కడ ఒక్క అడుగు కూడా పెట్టలేవు. మోదీపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. మోదీ గురించి ఏపీలో మాట్లాడేందుకు బీజేపీ నేతలకు అర్హత లేదు’
– ఇది కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి పురుషోత్తంరెడ్డికి,  వైసీపీ మాజీ సర్పంచ్ అవతారం ఇచ్చిన వార్నింగ్.
దీన్ని చూసి కమలదళాల ఆగ్రహం కట్టలు తెంచుకుని, క్షేత్ర స్థాయిలో తమ పార్టీ నేతలను బెదిరిస్తున్న సదరు వైసీపీ నేతల సంగతి చూసేందుకు.. సోమన్న దళం, పంచెలు ఎగగట్టుకుని, యుద్ధరంగంలోకి దూకుతుందేమోనన్న భ్రమల్లో ఉండకండి. ఎందుకంటే అలాంటి ఆలోచన భ్రమే కాబట్టి. అలాంటి కోరిక  అత్యాశనే కాబట్టి!

ఏపీలో వైకాపా-టీడీపీ బద్ధశత్రువులు. రాష్ట్రంలో వారిది పాము-ముంగిస వైరం. కానీ ఢిల్లీలో మిత్రపక్షాలు.కాలం-ఖర్మం కలసొస్తే వచ్చే ఎన్నికల్లో, పవనన్నయ్యతో కలసి అధికారం ఏర్పాటుచేస్తామంటోంది. ఆ పార్టీ  వైకాపా-టీడీపీతో యుద్ధం చేస్తానంటోంది.అయినా సరే.. ఢిల్లీ బీజేపీ బాద్‌షాలకు ఏం కష్టం వచ్చినా, వారిని ఆదుకునేందుకు వైకాపా-టీడీపీ ఎవ‘రెడీ’గా ఉన్నామంటూ, పోటీలు పడి మరీ మద్దతునిస్తుంటాయి. ఏపీలో ఆ రెండు పార్టీలతో యుద్ధం చేస్తున్న ఢిల్లీ బీజేపీ బాద్‌షా కూడా.. సైద్ధాంతిక మడిబట్టను వదిలేసి,  ఆనందంగా వారి మద్దతు తీసుకుంటారు. మరి ఇప్పుడు ఆ ప్రకారంగా వైకాపా-టీడీపీ మిత్రపక్షాలా? శత్రుపక్షాలా? వారిపై యుద్ధం చేస్తామని చెప్పుకునే భాజపా కూడా, వారికి మిత్రులా? శత్రువా?ఏమిటీ గందరగోళమని బుర్రలుగోక్కుంటున్నారా? ప్లీజ్ ఇంతోటి చిన్న విషయానికి అంత పని మాత్రం చేయకండి. కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే.. భాజపా సైద్ధాంతిక మడి బట్టల పాతివ్రత్యం, వైకాపా-టీడీపీ రాజకీయ నిబద్ధత ఏమిటన్నది ఇట్టే అర్ధమవుతుంది. అదేమిటో విని తరించండి.

రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరిగింది. సభలోని 245 మంది సభ్యుల్లో  భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ బలం 113 మాత్రమే. అంటే లెక్కలు తెలిసిన ఎవరికయినా, ఎన్డీఏ నిలబెట్టిన అభ్యర్ధి ఏ మాత్రం కష్టపడకుండా ఓడిపోవడం ఖాయం. కానీ అది వాజపేయి-అద్వానీల కమలం నాటి కథ. తన సర్కారుకు ప్రత్యర్ధులు ఓటేసే పరిస్థితి ఉన్నా, దానితో సర్కారు గట్టెక్కుతుందని తెలిసినా.. సతె్తకాలపు సతె్తయ్య లాంటి వాజపేయి దానికి ససేమిరా అని, తన ప్రభుత్వాన్ని తానే కూల్చుకున్నారు. ఆ జంటది శ్యాంప్రసాద్ ముఖర్జీ సిద్ధాంతం. మరి ఇప్పుడు వారి స్థానంలో ఉన్నది సతె్తకాలపు సతె్తయ్యలు కాదు. మోదీ-అమిత్‌షా వంటి గండరగండలు. వాజపేయి-అద్వానీ మాదిరిగా.. ఈ జంట సైద్ధాంతిక మొహమాటాలు-నైతిక యవ్వారాల వంటి చాదస్తాలను అస్సలు పట్టించుకోదు. ఈ జంటది అలెగ్జాండర్ సిద్ధాంతం. విజయాలను తమ ఖాతాలో వేసుకుంటూ వెళ్లడమే దాని పరమార్ధం.

అందుకే  రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్ధి హరివంశ్ నారాయణ్ సింగ్ రెండోసారి కూడా గెలిచేశారు. అదేంటీ.. 113 మంది ఎంపీల బలం మాత్రమే ఉన్న సభలో, అది ఎలా సాధ్యమవుతుందని అమాయకంగా ప్రశ్నించకండి! మోదీ- అమిత్‌షా జంట ప్రత్యేకతనే అది. సరే.. భాజపా గొప్పతనం-రాజకీయ సిద్ధాంతం- రాజనీతిజ్ఞత-నైతిక విలువల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కాబట్టి, దానిని కాసేపు పక్కనబెడతాం. ఏపీలో రోజూ కీచులాడుకుని, కాట్లాడుకునే వైసీపీ-టీడీపీ పవిత్ర బంధం- అతి పవిత్ర రాజకీయ సిద్ధాంతాల గురించి చర్చిద్దాం.  రాజ్యసభలో బలం లే క, ప్రతి బిల్లుకూ కనిపించీ-కనిపించని అదృశ్య హస్తాల అండతో, ప్రతిసారీ బయటపడుతున్న భాజపాకు.. గాలి జనార్దన్‌రెడ్డి మాటల్లో చెప్పాలంటే, ఏపీలో వైకాపా-తెదేపా దేవుడిచ్చిన మిత్రుల్లా అవతరించారు. జగనన్నకు గాలి జనార్దన్‌రెడ్డి దేవుడిచ్చిన తమ్ముడయితే, భాజపాకు వైకాపా- తెదేపా దేవుడిచ్చిన మిత్రులన్న మాట!

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో, ఎన్డీఏ అభ్యర్ధికి వైకాపా అన్ని పార్టీల కంటే ముందే మద్దతునిచ్చింది. ఈ పరుగు పందెంలో ఎక్కడ వెనుకబడితే, ఢిల్లీ బాద్‌షాలకు కోపమొస్తుందోనన్న భయంతో.. తెదేపా కూడా ఎన్డీఏ అభ్యర్ధికే జైకొట్టింది. ఇది వింత-విచిత్రంగా లేదూ? మామూలుగా అయితే, వైకాపా ఎన్డీఏలో లేదు. అటు యుపీఏ గూటిలోనూ లేదు. కాబట్టి దానికి  సొంత వైఖరి తీసుకునే అవకాశం ఉంది. కానీ, విచిత్రంగా ఢిల్లీ బీజేపీ బాద్‌షాకు రాజ్యసభలో ఏ చిన్న కష్టం వచ్చినా, వారు అడక్కుండానే అండగా నిలుస్తున్నారు.

అదే వైకాపా.. రాష్ట్రంలో బీజేపీ అగ్రనాయకులపై టన్నుల కొద్దీ ఆరోపణలు చేస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడిపైనే బురద చల్లుతుంది. భాజపా నేతలపై కేసులు పెడుతుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల చేతులు నరికేస్తుంది. అయినా సరే.. భాజపా బాద్‌షాలకు అవి పెద్ద పట్టింపు కాదు. అలాంటి పిచ్చి చాదస్తాలు పట్టించుకుంటే, రాజ్యసభలో గట్టెక్కడం కష్టం. మరి అలాగయితే ఏపీలో పార్టీ భవిష్యత్తు- కార్యకర్తల భ ద్రత అంటారా? ఎగిరెగిరి దంచినా అదే కూలీ ఎగరకుండా దంచినా అదే కూలీ అన్నట్లు.. ఏపీలో పార్టీ ఎదిగేదీ లేదు, చచ్చేది లేదు. ఎన్ని క్రేన్లు తెచ్చినా సమాధి నుంచి పైకి తీసుకురావడానికి, ఇంకెన్ని దశాబ్దాలు పడుతుందో ఎవరికీ తెలియదు. అందువల్ల ఇప్పటి అవసరం రాజ్యసభ గండం కాబట్టి, దాని నుంచి బయటపడటమే స్థితప్రజ్ఞత. ఇదీ బీజేపీ నయా రాజకీయ సిద్ధాంతం.

మీరు తన్నినట్లు నటించండి. మేము ఏడ్చినట్లు నటిస్తామన్నట్లు.. వైకాపా కూడా ఈ మిత్ర-శత్రుత్వ నాటకాన్ని బాగానే రక్తికట్టిస్తోంది. జగనన్న పాలనలో జరుగుతున్న గుళ్లపై దాడులు, రథాల దహనకాండపై సోమన్న దళం అలా దాడి చేసి, విరుచుకుపడుతూనే ఉంటుంది.  వైకాపా మాత్రం తక్కువ తింటుందా? మరి మీరు చంద్రబాబుతో కలసి ఉన్నప్పుడు జరిగిన దహనాకాండ, అవమానాల సంగతేమిటని, రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని కేంద్రాన్ని నిలదీస్తూనే వైకాపా ఉంటుంది. కన్నా-సుజనాపై ఆరోపణలు సంధిస్తూనే ఉంటుంది.

అందుకే కదా? ఢిల్లీ బాద్‌షాలు.. వైకాపా కోసం,  అమరావతి వ్యవహారంలో కేంద్ర జోక్యం లేదని అఫిడవిట్ ఇవ్వడం, ఆర్ధిక సమస్యల్లో ఉన్నప్పుడల్లా ఏదో ఒక ఖాతా నుంచి జగనన్న సర్కారును ఆదుకోవడం, వగైరా ప్రత్యుపకారాలు చేస్తుంది! అందుకే కదా..  బాబు జమానాలో పోలవరానికి 6 వేల కోట్లు ఖర్చు పెడితే, అవి జగనన్న వచ్చిన తర్వాత విడుదల చేసింది.  అదే బాబు, ఉపాథి హామీ నిధులు 1960 కోట్లు ఖర్చు పెడితే, జగనన్న వచ్చిన తర్వాత విడుదల చేసింది. 14వ ఆర్ధిక సంఘం 5 వేల కోట్లు ఖర్చు పెడితే, జగనన్న వచ్చిన తర్వాతనే వాటిని విడుదల చేసింది.  బాబు జమానాలో వసూలు చేసిన 27000 కోట్ల జీఎస్టీ వసూళ్లు, జగనన్న వచ్చిన తర్వాత కేంద్రం విడుదల చేసింది. బడ్జెట్ లోటు నిధులు 3 వేల కోట్లను బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసింది.

సరే.. వైకాపా అంటే అధికారంలో ఉంది కాబట్టి.. కేంద్రంతో అనేకానేక అవసరాలు, కేసుల బాదరాయణ సంబంధాలున్నాయి కాబట్టి, భాజపాతో అది అంటకాగుతుందని అనుకోవచ్చు.  మరి విపక్షంలో ఉన్న టీడీపీకి..  భాజపా కూటమి అభ్యర్ధికి జై కొట్టాల్సిన అవసరం ఏమిటన్నది ప్రశ్న. ఏడాదిన్నర నుంచి, మోదీ-అమిత్‌షా కరుణా కటాక్ష వీక్షణాల కోసం పరితపిస్తున్న తెదేపాయులకు.. ఈ ఎన్నిక అనుకోని అవకాశమయితే, దానిని నేర్పుగా వాడుకున్న తెలివి భాజపాది. మద్దతు పేరుతో దగ్గరయేందుకు తమ్ముళ్ల పాట్లు చూస్తుంటే, అసలు టీడీపీ-భాజపా మిత్రపక్షమా? శత్రుపక్షమా అన్నది అర్ధం కాదు. ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి అన్నట్లు.. గల్లీలో శత్రుత్వం ఢిల్లీలో మిత్రత్వం నెరిపే తమ్ముళ్ల తెలివి తెల్లారినట్లే ఉంది.