దేవినేని ఉమపై కేసుకు రంగం సిద్ధం?

1
21

మేనల్లుడిపై లంచాల ఫిర్యాదులు
వైసీపీ ఎమ్మెల్యే వద్దకు బాధితులు
మీడియా ముందుకు బాధిత ఉద్యోగులు?
ఆ తర్వాతనే పోలీసులకు ఫిర్యాదు?
విజయవాడ: జగన్ సర్కారుపై ఒంటికాలితో విరుచుకుపడుతున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై త్వరలో కేసుల ఉచ్చు బిగయనుంది. టీడీపీ అధికారంలో ఉండగా, ఆయన మేనల్లుడు  పేరుతో వంశీ చేసిన వసూళ్లు ఇప్పుడు ఉమాపై ఉచ్చు బిగించేందుకు కారణమవుతున్నాయి.  టీడీపీ యువనేత లోకేష్, కెఇ కృష్ణమూర్తి కుమారుడి పేరు కూడా సదరు వంశీకృష్ణ దందాలు చేశారన్న ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే ఒకరు దృష్టి సారించినట్లు సమాచారం.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. విజయవాడ రూరల్ వరలక్ష్మిపురం, తులసీనగర్‌కు చెందిన నాదెళ్ల వంశీకృష్ణ అప్పట్లో ఏసీబీకి చిక్కిన ఉద్యోగులకు, సీఎంఓలో డిపార్ట్‌మెంట్ ఎంక్వయిరీ రాయిస్తానంటూ లక్షల రూపాయలు వసూలు చేశారన్న ఫిర్యాదులున్నాయి. వీరిలో గుంటూరుకు చెందిన ఓ ఉద్యోగికి మాయమాటలు చెప్పి, అతనితో అప్పు చేయించి మరీ లక్షల రూపాయలు గుంజినట్లు సమాచారం. ఇక కర్నూలు జిల్లాలో దేవదాయ శాఖ ఉద్యోగితోపాటు, ఏసీబీకి చిక్కిన ఒక పోలీసు అధికారి నుంచి కూడా అప్పట్లో మంత్రిగా ఉన్న దేవినేని ఉమ మేనల్లుడి పేరుతో భారీ స్థాయిలో డబ్బు గుంజినట్లు ఆరోపణలొచ్చాయి. నెలలు, ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు తిరిగి రాకపోగా,  నయాపైసా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు ఆయన తండ్రిని నిలదీయగా, మరికొందరు దేవినేని ఉమకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే వాటిలో కొన్ని కేసులను స్వయంగా ఉమ సెటిల్ చేసినట్లు చెబుతున్నారు. మరికొందరికి వంశీకృష్ణ కుటుంబసభ్యులు చెక్కులు, కొంత డబ్బు ఇచ్చినా అవి బౌన్సు అయినట్లు తెలుస్తోంది.

ఈ విధంగా వంశీ.. దేవినేని ఉమా, లోకేష్, కెఇ కృష్ణమూర్తి  పేరుతో లక్షల రూపాయల్లో వసూలు చేసిన వైనం, కృష్ణాజిల్లాకు చెందిన  ఓ వైసీపీ ఎమ్మెల్యే దృష్టికి వెళ్లింది. ఇటీవలి కాలంలో ఆ ఎమ్మెల్యే అవినీతిపై దేవినేని ఉమ వరసగా ఆరోపణలు చేస్తున్నారు. దానితో రంగంలోకి దిగిన సదరు ఎమ్మెల్యే అనుచరులు, వంశీ బాధితులను ఒకచోట చేర్చి వారి నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నట్లు సమాచారం.  బాధితుల ఫిర్యాదులో.. దేవినేని ఉమ పేరు చెబితేనే తాము డబ్బులిచ్చామని పేర్కొన్నట్లు సమాచారం. తాము ఉమ ఇంటికి వెళ్లినప్పుడు వంశీ అక్కడే ఉన్నామని కొందరు, ఉమా ఇంట్లోనే తాము వంశీకి డబ్బులిచ్చామని ఇంకొందరు తమ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

కాగా, బాధితులను తొలుత.. మీడియా ముందు ప్రవేశపెట్టి, తర్వాత పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాలని సదరు వైసీపీ ఎమ్మెల్యే నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న, దేవినేని ఉమ దూకుడుకు బ్రేకులు వేయడంతోపాటు.. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఉమ కాన్వాయ్‌లోనే ఉంటూ, మేనలుడ్లిగా ప్రచారంలో ఉన్న వంశీ చేసిన అక్రమాలను వెలుగులోకి తీసుకురావడం ద్వారా, ఉమపై రాజకీయంగా ఉచ్చు బిగించాలన్న వ్యూహంతో వెళుతున్నారు. దీనికి సంబంధించి సదరు వైసీపీ ఎమ్మెల్యే, గత కొద్దిరోజుల క్రితమే జగన్‌ను కలసి ఆయన అనుమతి తీసుకున్నట్లు సమాచారం. ఆ మేరకు ఒక సలహాదారుకు ఉమా వ్యవహారం అప్పగించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వంశీ డబ్బులు తీసుకున్న వారి కళ్లుగప్పి, విజయవాడలోనే తిరుగుతున్నట్లు బాధితులు వైసీపీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం.  ఇదికూడా చదవండి.. దేవినేని ఉమ పేరుతో జేబు దోపిడీ

1 COMMENT