దోషులెవరో తెలిసిందిగా..ఇక సీబీఐ ఎందుకు?

462

సెక్షన్ 91 నోటీసుపై ఉత్కంఠ
నాడు బాబుకు నోటీసు ఇచ్చిన పోలీసులు
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

రాష్ట్రంలో మతపరమైన ఒక ఘటన జరిగింది. దోషులను పట్టుకోవాలని విపక్షాలు నినదించాయి. ఆ ఘటన రాష్ట్రాన్ని అట్టుడికించడంతో, సర్కారు  చివరాఖరకు సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే.. అసలు దోషులెవరో అధికార పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడే తేల్చేశారు. మరి ఆ దోషిని పట్టుకుని, జైల్లో వేయాలి కదా? ఇదిగో ఈయనే ఆ పనిచేసిన తుంటరి అని నిరూపించి, కోర్టు ద్వారా శిక్ష విధించాలి కదా? మరి ఆ పని చేయకుండా, సీబీఐ విచారణకు ఆదేశించడం ఎందుకు? ఆ సీబీఐ విచారణ ఎన్నాళ్లు సాగి.. ఎన్నేళ్లకు తేలుతుందో? ఈలోగా ఎంపి గారి వద్ద ఉన్న ఆధారాలు తీసుకుని, దోషులను పోలీసులే అరెస్టు చేయవచ్చు కదా? అది చేయకుండా.. తెలుగు టీవీ సీరియల్ జీడిపాకం మాదిరిగా, ఈ సాగదీత ఎందుకు?
– అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రథాన్ని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడే నిప్పుపెట్టారని.. వైసీపీలో నెంబర్ టూ నేత, ఆ పార్టీ పార్లమెంటరీపార్టీ నేత విజయసాయిరెడ్డి ట్వీట్ చూసిన వారికెవరికయినా వచ్చే సందేహమే ఇది!

రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి, జగనన్న సర్కారుపై మచ్చగా మారిన అంతర్వేది రథ దహనకాండ జాతీయ అంశంగా మారింది. దానిపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఢిల్లీలో దీక్ష నిర్వహించడంతో, అదికాస్తా జాతీయ మీడియాకెక్కింది. తర్వాత దిద్దుబాటుకు దిగిన జగనన్న సర్కారు.. ఆ ఘటనపై సీబీఐ విచారణ కోరాలని డీజీపీని ఆదేశించడం, ఆయన సీబీఐకి మెయిల్ పంపడం చకచకా జరిగిపోయింది. ఇక్కడ సీబీఐ విచారణ కోరారంటే, స్వరూపానంద వారి భాష్యం ప్రకారం సమస్య పరిష్కారమయినట్లు కాదు అర్ధం. తమ పోలీసుల వల్ల కాదు కాబట్టి, దోషులెవరో కనుక్కునే బాధ్యత మీకు అప్పగిస్తున్నామని అర్ధం. అయినా.. పాలకులకు వ్యతిరేకంగా పోస్టింగులు పెడుతున్న, ఎక్కడో ఉన్న సోషల్‌మీడియా తుంటరులను, దుర్భిణి వేసి పట్టుకుంటున్న మహా నేర పరిశోధన సంస్థ అయిన సీఐడి ఉండగా.. సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించినట్లో అర్ధం కావడం లేదు. బహుశా సీఐడీ మీద నమ్మకం లేకనా? లేక సీబీఐ అయితే, కావలసిన కార్యం గంధర్వులే చూసుకుంటారన్న ముందుచూపా? ఏదో ఒకటి లెండి. మొత్తానికి విచారణకయితే ఆదేశించారు. అంతవరకూ సంతోషం.

మరి.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణను ఎలా తేలుస్తారు? ఎప్పుడు తేలుస్తారన్నది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే.. అంతర్వేది రథానికి చంద్రబాబే నిప్పు పెట్టారని విజయసాయి ట్వీట్ చేశారు. కాబట్టి అది ఆరోపణ కిందే లెక్క. మరి ఆ ప్రకారంగా, విజయసాయి వద్ద ఉన్న ఆధారాలేమిటో పోలీసులు కనుక్కోవలసి ఉంది. ఆ మేరకు ఆయనకు పోలీసు సీఆర్పీసీ సెక్షన్ 91 కింద నోటీసు ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే.. ‘తునిలో రైతులు, అమరావతిలో తోటలు తగులబెట్టించి, విజయవాడలో గుడులు కూల్చి, అమరేశ్వరుడి భూములు మింగి, పుష్కరాల్లో 7 వేల కోట్లు ఆరగించి, దుర్గమ్మ గుడిలో క్షుద్రపూజలు చేయించి అంతర్వేదిలో రథానికి నిప్పు పెట్టించాడు. పాతభీతి, దైవభక్తి ఏనాడూ లేనివాడు. ఆ బాబే హిందుత్వంపై దాడులకు మూలకారకుడు’ అని విజయసాయి ట్విట్టర్ ఖాతా నుంచే ట్వీట్ చేశారు కాబట్టి. దీన్నిబట్టి.. ఆయన వద్ద రథానికి సంబంధించి, పూర్తి  సాక్ష్యాలు ఉన్నాయని అర్ధమవుతోంది.

సో.. మొన్నామధ్య, చంద్రబాబునాయుడుకు ఇదేమాదిరిగా..  చిత్తూరు జిల్లా పుంగనూరులో దళిత యువకుడు ఓంప్రతాప్ ఆత్మహత్య విషయంలో ఆదారాలివ్వాలని కోరుతూ, సీఆర్‌పీసీ సెక్షన్ 91 ప్రకారం నోటీసులు జారీ చేశారు. నిజానికి ఓం ప్రతాప్ ఆత్మహత్య  ఘటనపై, ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని కోరుతూ చంద్రబాబు,  డీజీపీ గౌతంసవాంగ్‌కు లేఖ రాశారు. దానికి స్పందించిన మదనపల్లి పోలీసులు… చంద్రబాబు వద్ద ఉన్న ఆధారాలను చూపాలని కోరుతూ, ఆయనకు నోటీసులివ్వడంపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. డీజీపీకి లేఖ రాస్తే, కింది స్థాయి పోలీసులు ప్రతిపక్ష నేతకు, నోటీసులివ్వడమేమిటని మండిపడ్డారు. గతంలో జగన్ నంద్యాల ఉప ఎన్నికలో, సీఎంగా ఉన్న చంద్రబాబును కాల్చేయాలని పిలుపునిస్తేప్పుడెందుకు ఆయనకు నోటీసులివ్వలేదని నిలదీశారు.

సరే. టీడీపీ ఆరోపణలు-ఆగ్రహాలు పక్కనపెడితే.. ఇప్పుడు పుంగనూరు పోలీసుల సిద్ధాంతం ప్రకారమే.. విజయసాయికి అలాంటి నోటీసులే ఇవ్వాలి కదా అన్నది తెరపైకొచ్చిన లాజిక్కు. అందుకే టీడీపీ నేత వర్ల రామయ్య ‘విజయసాయికి కూడా చంద్రబాబుకు ఇచ్చినట్లే నోటీసులిస్తారా? లేక మన పార్టీ ఎంపీనే కదా వదిలేస్తారా’ అని ప్రశ్నించారు. నిజంగా ఇది పోలీసుబాసులకు సంకట పరిస్థితే. ఆత్మహత్యపై లేఖ రాసిన చంద్రబాబుకు ఇచ్చినట్లే..  రథం దహనకాండపై విజయసాయి, టీడీపీ అధినేతపై చేసిన ఆరోపణలకూ ఆధారాలు చూపాలని.. అదే సెక్షను ప్రకారం విజయసాయికీ నోటీసులివ్వాల్సి ఉంది. అలా నోటీసులివ్వకపోతే.. పోలీసులపై పక్షపాత ముద్ర పడుతుంది. ఇప్పటికే హైకోర్టు పోలీసు పనితీరుపై తలంటుతోంది. ఏదేమైనా  పోలీసుల పరిస్థితి.. కరవమంటే కప్పకు-విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా మారింది. పాపం పోలీస్!