ఖాకీవనంలో కలుపుమొక్కలు!

677

అధికారంలో ఉంటే అహంకారమెందుకు?
పాలకులకు కాదు పాలితులకు సేవకులు
ప్రైవేటు సెటిల్‌మెంట్లలో పోతున్న పరువు
నిందితులను ఎత్తుకెళ్లి బాసులకు తలవంపులు
ఆంధ్రాలో కత్తులవంతెన మీద ఖాకీ కొలువు
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

అది విశాఖ జిల్లా చోడవరం పట్టం కో ఆపరేటివ్  కాలనీలో రెడ్డి గోవిందరావు దంపతులు నివసిస్తున్నారు. వారి కొడుకుపై కొందరు పెట్టిన కేసుల కారణంగా.. కొడుకు అరెస్టయి జైలుశిక్ష అనుభవించి, బెయిలుపై విడుదలయ్యాడు. ప్రస్తుతం ఆ కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. అతగాడినే విశాఖ పోలీసులు కొందరి ఒత్తిళ్ల మేరకు అత్యుత్సాహం ప్రదర్శించి, బెజవాడ నుంచి విశాఖకు ఎత్తుకొచ్చిన వ్యవహారంపై హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలయింది.  ఆ చర్యపై ఆగ్రహించిన హైకోర్టు, స్వయంగా డీజీపీని పిలిపించి, గోవిందరావు తనయుడు గౌతమ్‌ను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. ఈనెల 6న ఆయన ఇంటిమీదకు నలుగురు వ్యక్తులు దాడికి దిగి, సీసీ టీవీ కెమెరాలు పగులకొట్టి.. తమ డబ్బులు తమకు ఇవ్వకపోతే ఇల్లు రాసివ్వాలని.. లేకపోతే కిడ్నాప్ చేసి ఇల్లు రాయించుకుంటామన్నది చోడవరం పోలీసులకు ఆ దంపతులు ఇచ్చిన ఫిర్యాదు. నిశితంగా పరిశీలిస్తే ఇది పూర్తిగా ప్రైవేటు వ్యవహారం. ఈ కేసులోనే డీజీపీని పిలిపించారని తెలిసినా స్థానిక పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి, వృద్ధుడికి ఫోను చేసి సెటిల్‌మెంట్ చేసుకోవాలని ఆదేశించడమే విచిత్రం. తనపై దాడికి దిగారని ఫిర్యాదు చేసినా ఇప్పటివరకూ, ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడం మరో విచిత్రం. అయినా కొడుకు చేసిన అప్పులకు, తండ్రి ఎలా బాధ్యుడవుతాడన్నది మెడ మీద తల ఉన్న ఎవరికయినా వచ్చే ప్రశ్న. ఇది పోలీసులకు ఎందుకు రాదు? పోలీసుల మెడ-తల ఏమైంది?‘పోలీసులు ఖాకీ డ్రస్సు వేసుకున్న లైసెన్సుడు గూండాలుగా మారుతున్నార’ని అప్పుడెప్పుడో జస్టిస్ కృష్ణయ్యర్ చేసిన వ్యాఖ్యలను, తమ మారిన పనితీరుతో సమూలంగా చెరిపేసుకునే ప్రయత్నాలు, పోలీసు వ్యవస్థలో ఇప్పటివరకూ జరగడం లేదు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీ ప్రభుత్వ అడుగులకు మడుగులొత్తే ఆర్డర్లీగా మారిన కొందరు పోలీసుల తీరు.. పోస్టింగుల కోసం పాలకపార్టీల ముందు సాగిలబడే కొందరి దిగజారుడు వైఖరి..  తులసివనంలో గంజాయిమొక్కలను గుర్తు చేస్తున్నాయి. అలా అని అంతా ఆ తాను ముక్కలేననుకోవడం సరికాదు. విధి నిర్వహణ కోసం ప్రాణాలు పణంగా పెట్టే పోలీసులు, నిర్మొహమాటంగా వ్యవహరించే పోలీసులూ లేకపోలేదు. అందుకే పోలీసు వ్యవస్థపై ఆపాటి గౌరవమయినా మిగిలింది. ప్రజలు-ముఖ్యంగా బాధితులకు భరోసా ఇవ్వాల్సిన పోలీసుస్టేషన్లు ఇటీవలి కాలంలో శిరోముండనాలు, దాదాగిరి, సెటిల్‌మెంట్ల  కేంద్రాలుగా మారుతుండటం విషాదం. తాజాగా హైకోర్టు సీఐడీ పనితీరుపై చేసిన వ్యాఖ్యలలో, పోలీసుల తీరు మార్చుకోవాలన్న హితవు-హెచ్చరిక స్వరమే కనిపించింది. ఇక మారాల్సింది పోలీసులే. ఖాకీవనంలో విస్తరిస్తున్న గంజాయిమొక్కలను పెకిలించాల్సింది పోలీసు బాసులే!

‘తగిన ఆధారాలు లేకుండా కేసు నమోదు చేయడం, దర్యాప్తు పేరుతో బాధితులను వేధింపులకు గురిచేయడం అరాచకత్వానికి దారితీస్తోంది. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ దానికి సంబంధం లేకుండా పనిచేయాలి. చట్టాల ఉల్లంఘన నుంచి ప్రజలను కాపాడటమే పోలీసుల పని. తాము దారుణమైన పాలన  లేదా సైనిక పాలనలో ఉన్నామన్న భావన ప్రజల్లో కల్పిస్తున్నారు’ – ఇది ఏపీ హైకోర్టు సీఐడీ పోలీసుల పనితీరు-అత్యుత్సాహంపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఇలాంటి ఆగ్రహోదగ్ర వ్యాఖ్యలు, ఖాకీస్ట్రోక్రసీ అనే పదాలు  వినాల్సిరావడాన్ని పోలీసులు అవమానంగానే భావించాలి. ఒకరకంగా ఉన్నతాధికారులు సిగ్గుపడాలి. అందుకు పోలీసు బాసులు దిద్దుబాటుకు దిగకపోతే న్యాయమూర్తుల వ్యాఖ్యలు జన బాహుళ్యంలో స్థిరపడక తప్పదు.

తెలుగువన్ యూట్యూబ్ చానెల్ అధిపతిపై ఏపీ సీఐడి పోలీసులు.. ప్రభుత్వం-సీఎంపైన అసభ్యకరంగా ప్రసారం చేసినందుకు, ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆ కేసుపై తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే.. పోలీసులు ఎవరిని మెప్పించేందుకు, ఎవరి మెహర్బానీలకోసం  ఇలాంటి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో, చిన్నపిల్లాడికీ అర్ధమవుతుంది. ‘ఈ కేసు నమోదు-విచారణతోపాటు,  ఎలక్ట్రానిక్ పరికరాల స్వాధీనం విధానం చూస్తుంటే, అధికారంలో ఉన్న పార్టీని సంతృప్తిపరిచేందుకే అన్నట్లుగా ఉంది. పార్టీలు కొంతకాలం తర్వాత అధికారంలో ఉండవచ్చు. పోవచ్చు. అధికారులు మాత్రం పార్టీలతో నిమిత్తం లేకుండా పనిచేయాలి. చట్టంపై కనీస అవగాహన-శాఖపై పరిపాలనాపరమైన నియంత్రణ లేని అధికారుల వల్ల ఖాకీస్ట్రోక్రసీలో ఉన్నామన్న భావన ప్రజల్లో కల్పిస్తున్నారు. ఇలాంటి వారిని నియంత్రించని పక్షంలో, ప్రజలకు జీవించే హక్కుకు భంగం ఏర్పడుతుంది. చట్టాలను ఉల్లంఘించి ప్రజలను రక్షించడమే సీఐడీ లా అండ్ ఆర్డర్ పోలీసుల విధి. ఈ కేసులో సీఐడీ పోలీసులు ప్రభుత్వానికి సాధనంగా మారి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డార’ని హైకోర్టు చేసిన వ్యాఖ్య.. ఇటీవలి కాలంలో సోషల్‌మీడియా పోస్టింగులతోపాటు, రాజకీయ కారణాలతో చేస్తున్న ఫిర్యాదుపై శరవేగంగా తీసుకుంటున్న అత్యుత్సాహంపై కొరడా లాంటివే!

అసలు సీఐడీకి ఇలాంటి కేసులతో సంబంధం ఏమిటి? నేరాలపై విచారించాల్సిన సీఐడీ, పాలకపార్టీలకు ఆయుధంగా మారటం పోలీసు శాఖకు పరువు తక్కువ కదా? తాజాగా రాజమండ్రిలో వినాయక విగ్రహంపై కొందరు మలవిసర్జన చేసిన ఘటన సంచలనం సృష్టించింది. అయితే దానిని సోషల్‌మీడియాలో వైరల్ చేసే వారిపై, కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసు అధికారి హెచ్చరించడం ఆశ్చర్యం. ఘటన జరిగిందని అంగీకరించిన అధికారి, దానిని ప్రజలకు తెలియచేయడం తప్పెలా అవుతుంది? పైగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తే చర్యలుంటాయని హెచ్చరించడం బట్టి.. చేతిలో అధికారం ఉంటే ఏమైనా చేస్తామని సంకేతాలిస్తున్నారా? సోషల్‌మీడియాలో పాలకపార్టీపై పెడుతున్న పోస్టింగులకు వాయువేగంతో, పక్క రాష్ట్రాలకూ వెళ్లి పట్టుకొస్తున్న సీఐడీ పోలీసులు.. విపక్షాలపై, అధికార పార్టీ సోషల్‌మీడియా దళం పెడుతున్న పోస్టింగులు మాత్రం, బుట్టదాఖలు చేయడం పక్షపాతమే కదా?

 టీవీ5 కి చెందిన మూర్తి, ఇతరులను గంటలపాటు స్టేషన్‌లో విచారణ పేరిట వేధించాలని ఏ చట్టం చెప్పింది? అందాకా ఎందుకు?..హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పోస్టింగులు పెట్టిన వారినే, ఇంతవరకూ పట్టుకోలేకపోవడాన్ని సీఐడీ సమర్ధతగా భావించాలా? సమర్ధతగా భావించాలా? కింది స్థాయి పోలీసుల అత్యుత్సాహం, డీజీపీ స్థాయి అధికారులు కోర్టు గడప ఎక్కడం విచారకరం. హైకోర్టు చెప్పినట్లు.. పార్టీలు అధికారంలో ఉంటాయి. పోతాయి. కానీ వ్యవస్థ మాత్రం శాశ్వతం. అది అర్ధం చేసుకుని పనిచేస్తేనే.. పోలీసు వ్యవస్థకు మర్యాద, మన్నన.  ఏదేమయినా ఏపీలో పోలీసులు..  ఇప్పుడు కత్తులవంతెన మీద నడుస్తున్నారన్నది మనం మనుషులం అన్నంత నిజం!