విభజన చట్టం మార్చాల్సిందే

452

ఏపీ రాజధానులకు విభజన చట్టం మార్చాల్సిందే- తెరపైకి కొత్త వాదన- ఇరుకున పడ్డ కేంద్రం…

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వైసీపీ ప్రభుత్వం ఎంత వేగంగా ప్రయత్నాలు చేస్తుంటే అంతే వేగంగా న్యాయస్ధానాల్లో బ్రేకులు పడుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభిస్తున్నా మూడు రాజధానుల ఏర్పాటులో ఏర్పడుతున్న చిక్కుముడుల వెనుక మరో ప్రధాన కారణం ఏపీ పునర్విభజన చట్టమే. ఇందులో పేర్కొన్న క్లాజుల ఆధారంగానే రాజధానులను వ్యతిరేకిస్తున్న వారి వాదనకు బలం చేకూరురుతోంది. అదే సమయంలో రాజధాని కేసుల్లో వాదించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుమార్తెతో పాటు మరో న్యాయమూర్తి కుమారుడు కూడా రంగంలో దిగడం ఆసక్తి రేపుతోంది. అంతిమంగా ఈ వ్యవహారం ఇప్పట్లో తేలే అవకాశాల్లేవనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

మూడు ముక్కలాట…

ఏపీలో వికేంద్రీకరణ పేరుతో సరైన కసరత్తు లేకుండా మూడు రాజధానుల ప్రక్రియకు తెరలేపిన వైసీపీ సర్కారు అందుకు తగ్గ ఫలితాన్ని అనుభవిస్తోంది. ముఖ్యంగా రాజధానుల ఏర్పాటుకు ఏపీ పునర్విభజన చట్టంలో అవకాశం ఉందా లేదా అంశాన్ని కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు అదే విభజన చట్టంలో క్లాజులను ప్రస్తావిస్తూ ప్రత్యర్ధులు న్యాయస్ధానాల్లో వాజ్యాలు దాఖలు చేయడంతో పాటు వాటిలో లొసుగులను సైతం ప్రస్తావిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ఇప్పటికే 9 నెలలుగా సాగుతున్న ఈ తంతు ఇప్పట్లో తేలుతుందా లేదా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. అయినా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.

విభజన చట్టం ఏం చెబుతోంది ?

విభజన చట్టం ప్రకారం మూడు రాజధానుల ఏర్పాటుకు కానీ, రాజధాని పేరు మార్పుకు కానీ అవకాశం లేదని, రాష్ట్రపతి, కేంద్రం నోటిఫై చేస్తేనే కానీ మార్పులు చేయడం కుదరదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా అమరావతిలో హైకోర్టు సాధన సమితి నిర్వహించిన చర్చాగోష్టిలో పాల్గొన్న సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీనివాసరావు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారం శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్ధలు ఒకే చోట ఉండాలని ఉందని, రాజధాని మార్చాలంటే ముందుగా కేంద్రం విభజన చట్టంలో నోటిఫై చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆర్టికల్‌ 4 ప్రకారం పాలన ఎక్కడి నుంచి జరగాలనేది రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. వికేంద్రీకరణ చట్టం ప్రకారం మాత్రమే రాజధాని తరలింపు కుదరదన్నారు.

కేంద్రానివి రాజకీయ కారణాలేనా ?

ఏపీ విభజన చట్టానికి కొత్త భాష్యాలు చెబుతూ మూడు రాజధానులకు అవకాశం ఉందంటూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయడాన్ని కూడా న్యాయనిపుణులు తప్పుబడుతున్నారు. కేంద్రం కావాలనుకుంటే విభజన చట్టంలో మార్పులు చేసుకునే అవకాశమున్నా దానికి వక్రభాష్యం చెబుతూ మూడు రాజధానులకు వంతపాడటం సరికాదని సీనియర్‌ న్యాయవాది,, బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు సుంకర రాజేంద్రనాథ్‌ అభిప్రాయపడ్డారు. కేంద్రం తాజా చర్యలు రాజకీయ కారణాలతో తీసుకుంటున్న నిర్ణయాలే అన్న వాదన పెరుగుతోంది. దీంతో అమరావతి విషయంలో కేంద్రం వేస్తున్న అడుగులు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్నాయి. రాజకీయ కారణాలతో మూడు రాజధానులను సమర్ధించినా అంతిమంగా విభజన చట్టంలో మార్పులు మాత్రం తప్పనిసరి అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

రంగంలోకి సుప్రీం జడ్జీల పిల్లలు..

మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు, విపక్షాలు చేస్తున్న న్యాయపోరాటంలోకి తాజాగా సుప్రీం జడ్జీల కుమారులు, కుమార్తెలు కూడా ఎంట్రీ ఇచ్చారు. రాజధాని రైతుల తరఫున దాఖలైన పిటిషన్లను వారు హైకోర్టులో వాదిస్తున్నారు. దీంతో ఓ దశలో తమ పిల్లలు హైకోర్టులో రాజధాని కేసులను వాదిస్తున్నారు కాబట్టి సుప్రీంలో ఇవే కేసులపై తాము విచారణ చేయడం సరికాదంటూ
ఛీఫ్‌ జస్టిస్‌ బాబ్డేతో పాటు నారిమన్‌ కూడా తప్పుకోవడం సంచలనంగా మారింది. మరోవైపు రాజధాని కేసుల్లో విభజన చట్టం ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తుందనే వీరు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఏకంగా సుప్రీం జడ్జీల కుటుంబ సభ్యులే రంగంలోకి దిగడంతో మూడు రాజధానుల కేసుల విచారణ ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది.