నవ్వుతూ వేసి… ఏడుస్తూ అనుభవించాల్సిందే!

729

‘పన్ను’ పీకించుకుంటున్న పాలితులు
( మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

అనగనగా ఒక దొరగారు.  నేను ఊరందరికీ ఉచితంగా డబ్బులు పంచుతాను రమ్మని దండోరా వేయించారు. పిచ్చి జనం కదా? ఉచితమంటే ఏమైనా చేసే బలహీనత కదా? అంతా కట్టకట్టుకుని దొరగారు రమ్మన్న పేద్ధ స్టేడియానికి  ఉరుకులు పరుగుల మీద వెళ్లారు. దొరగారిచ్చిన సొమ్మును ఆబగా, ఆనందంగా తీసుకుని బయలుదేరారు. బయలుదేరే సమయంలో, జనమంతా దొరగారి దొడ్డ మనసుకు జోహార్లర్పించారు. ఇంత మనసున్న మారాజును గతంలో చూడలేదని పొగిడేశారు. ఆయన చల్లగా ఉండాలని ఆశీర్వదించారు.  ఆలోగా.. అంతకుముందు లేని  ఒక టోల్‌గేట్ ప్రత్యక్షమయింది. జనం కూడా దానిని చేతికి డబ్బులొచ్చిన ఆనందంలో  గమనించలేదు. గ్రామం లోపలికి వెళ్లినా, బయటకు వచ్చినా ఆ టోల్‌గేట్‌లో 4 రూపాయలు చెల్లించాలి. పాపం.. అలా దొరగారి దగ్గర నవ్వుతూ తీసుకున్న ఉచిత సొమ్మును, ఆ గ్రామస్తులు నెలరోజుల్లో  టోల్‌గేట్‌వాడికి ఏడుస్తూ సమర్పించుంటారు.
– ఈ కథ ఇప్పటి తెలుగు రాష్ట్ర ప్రజలకు సరిగ్గా అతుకుతుంది. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో విసిరే ఉచిత వలలో పడి.. ఆనక, తమ ఓట్లతో గద్దెనెక్కిన పాలకులు ఝళిపించే, పన్నుల కొరడా దెబ్బలకు ఇల్లు గుల్లచేసుకుంటున్నారు. నవ్వుతూ తీసుకోవడం-ఏడుస్తూ అనుభవించడం అంటే ఇదే!
* * *
నవ్వుతూ అని ఏడుస్తూ అనుభవించడమనే సామెత ఇప్పుడు కొద్దిగా తిరగబడి.. నవ్వుతూ ఓట్లు  వేసి, ఏడుస్తూ అనుభవించాల్సిందేనన్నట్లు తెలుగు రాష్ట్రాల ప్రజల పరిస్థితి తయారయింది. ఆ మాటకొస్తే, ఇది ఒక్క తెలుగు రాష్ట్రాలకే కాదు.  ఏరి కోరి ఎగబడి మరీ కోరుకున్న పార్టీలకు ఓట్లు వేసుకున్న, అన్ని రాష్ట్రాల ప్రజలకూ వర్తించే సూత్రం! ఇప్పుడు ఆంధ్రాలో పాలితులు.. ‘పన్ను’ను పిడుగులు ఉరుములూ లేకుండానే, పాలకులు పీకిపారేస్తున్న ముచ్చట ఇది. ఇటు తెలంగాణలో కూడా సేమ్ టు సేమ్. కాకపోతే స్కీములే మార్పు. జగనన్నది ఖాళీ ఖజానా వేదనయితే, శేఖరన్నది సంస్కరణల వాదన పేరిట వడ్డన. పేర్లే మార్పు. ఇద్దరిదీ నడ్డివిరగ్గొడటమే అజెండా!

కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థనే చిన్నాభిన్నం చేసింది. ప్రభుత్వాల ఖజానాను డొల్ల చేసింది. అయితే, అమెరికా వంటి దేశాలు వాటికి ప్రత్యామ్నాయం చూపాయి. మన దేశంలో కూడా కేంద్రం 20 లక్షల కోట్ల ప్యాకేజీ అని ఘనంగా ప్రకటించినా, అది ఎవరికి అందిందో,  ఇంతవరకూ ఒక్కడు చెబితే ఒట్టు. అయితే  కరోనా పేరుతో కేంద్రం ఒక్కో రాష్ట్రానికి వందలు-వేల కోట్లు ఇచ్చినట్లు..  కేంద్రమంత్రులు-బీజేపీ నేతలు ప్రచారం చేస్తూ, ఆ నిధులేమయ్యాయని ప్రతిపక్షపాలిత రాష్ట్రాలను నిగ్గదీస్తున్నాయి. అంటే ఆయా రాష్ట్రాలు, కరోనా కోసం ఖర్చు చేసిన సొంత నిధులు సున్నా. ఈలోగా కేంద్రం నుంచి గ్రాంట్లు, రెవిన్యూ లోటు రూపంలో మరికొన్ని వందలు-వేల కోట్లు విడుదలవుతూనే ఉన్నాయి. అయినా రాష్ట్రాలు కరోనా కోసం సొంత గల్లా పెట్టె నుంచి, ఎర్ర యాగాణీ తీసి ఖర్చు పెట్టింది లేదు. పైగా.. కరోనాతో మేం నష్టాలపాలయ్యాం. రావలసిన ఆదాయం కోల్పోయామని గావుకేకలు పెట్టడమే వింత.

గావుకేకలు పెడితే ఫర్వాలేదు. కానీ, ఆ పేరుతో పెడుతున్న పన్నుల వాతలకు పాలితులు హాహాకారాలు చేస్తున్నారు. ఏపీలో జగనన్న సర్కారు తాజాగా గ్యాస్‌పై గతంలో 14.5 శాతం ఉన్న వ్యాట్‌ను, 24.5 శాతానికి పెంచి వినియోగదారులకు షాకిచ్చింది. ఇటీవలే పెట్రో ధరలపై పన్నులేసి, వినియోగదారుల న డ్డివిరిచిన జగనన్న సంక్షేమ సర్కారు.. ఇప్పుడు ఇదే సంక్షేమ సాకుతో మరో భారీ వడ్డింపునకు తెరలేపింది. రైతుభరోసా, వాహనమిత్ర, జగనన్న విద్యాదీవెన, జగనన్న చేదోడు, టెలీమెడిసిన్, జీరో వడ్డీ రుణాలు, అమ్మఒడి, నాడు-నేడు వంటి సంక్షేమ కార్యక్రమాలతో, ఖజానా ఒడిసిపోయినందున.. గ్యాస్ బాదుడు తప్పట్లేదని జగనన్న సర్కారు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే సంక్షేమ పథకాల పేరుతో మీకు ఖజానాను పప్పుబెల్లాల మాదిరిగా పంచుతున్నందున, ఇప్పుడిక మాదగ్గర ఈడ్చితన్నినా ఎర్రయాగాణీ లేదన్నది జగనన్న కవిహృదయమన్నమాట!

అసలు ఆ పథకాలు పెట్టమని ఎవరు ఏడ్చారు? తమకు ఖజానాను దోచిపెట్టమని ఎవరు కాళ్లుపట్టుకున్నారు? మాకు పథకాల పేరుతో పన్ను కట్టేవారి జేబు గుల్ల చేయమని ఎవరు ప్రాధేయపడ్డారు. మీరే కదా..నవరత్నాల పేరుతో ఉచిత విందు భోజనం పెడతామని ఆశపెట్టింది? మీరే కదా.. కదలకుండా కూర్చోబెట్టి కాసుల వర్షం కురిపిస్తామని హామీ ఇచ్చింది? అందుకే కదా.. మీరు కోరినట్లు ఒక్క చాన్సు ఇచ్చాం! మళ్లీ ఇప్పుడు ఈ బాదుడేంది బాసూ.. అని జనం నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు.

అందుకు జగనన్న బృందం చెబుతున్న జవాబు బహు విచిత్రంగా ఉంది. మరి.. అన్నా స్కూలుకు పోతామంటే 15 వేలు, అన్నా.. ఆటో తోలతా అంటే 10 వేలు, అన్నా.. నేను ముసలోడినంటే 2250, అన్నా.. నేను మహిళనంటే  15 వేలు, నేను ఫలానా కులం వాడినంటే 15 వేలు ఊరకనే ఇచ్చారనుకుంటున్నారా? 40 వేల కోట్లు ఉత్తిపుణ్యానికే పంచామనుకుంటున్నారా? ఆ డబ్బులు మీకు ఫలహారం చేస్తేనే కదా ఖజానా ఖాళీ అయింది. మళ్లీ అవి ఎలా పూడ్చుకోవాలి? మిమ్మల్ని బాదితేనే కదా రికవరీ అయ్యేది? లేకపోతే మా జగనన్న ఇంట్లోంచి తీసుకువస్తారా? అప్పుడు చంద్రబాబు కూడా ఇదే కదా చేసింది? మీ జేబు నింపి మళ్లీ మీ జేబు కత్తిరించడమే కదా రాజధర్మం? ఇతర రాష్ట్రాల కంటే లీటరు 4 రూపాయలకు ఎక్కువ పెట్రోలు అమ్మేది..మందు, క్వార్టర్‌కు 300 రూపాయలకు పెంచిందీ మీ సంక్షేమం కోసమే కదా? అసలు ఇవన్నీ పక్కనపెట్టండి. ఏం? మీరు మా పార్టీకి పుణ్యానికి ఓటేశారా? 2 నుంచి 5 వేల రూపాయల డబ్బులు-క్వార్టర్ బాటిళ్లు తీసుకునే కదా ఓట్లేశారు. మరి మీ ఓటుకూ-ఆ డబ్బుకూ బరాబర్ అయింది కదా? ఇక మేమేం చేస్తే మీకెందుకు? అన్నది జగనన్న బృందం, సగటు జనాలకు వేస్తున్న ప్రశ్నలు. మరి నిజమే కదా? ఈ ఏడుపు-పెడబొబ్బలన్నీ ఓట్లు వేసేముందు కదా తీరి కూర్చుని ఆలోచించాల్సింది?! నవ్వుతూ తీసుకుని, ఏడుస్తూ అనుభవించడమంటే ఇదే మాస్టారూ!

ఇటు తెలంగాణలో కూడా సేమ్ టు సేమ్ సిద్ధాంతం. కాకపోతే.. జగనన్న మాదిరిగా బీదరుపులు కాదు. కాస్తంత గంభీరం. ఇంకొంచెం సంస్కరణల వాదం. విషయం మాత్రం ఖజానా నింపుడే. ‘అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం’ పేరుతో ఎల్‌ఆర్‌ఎస్‌ను కేసీఆర్ సర్కారు తెరపైకి తీసుకువచ్చింది. తెలంగాణా రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల నుంచి వేల అనధికార లే అవుట్లు వెలుస్తూనే ఉన్నాయి. అయినా అధికారులు అడ్డుకోలేదు. పైగా అందులోని ప్లాట్లకు, రిజిస్ట్రషన్లు చేసి సర్కారు కోట్లు సంపాదించింది. మళ్లీ  ఇప్పుడు అదే ప్లాట్లకు, ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో లక్షలు వసూలు చేయడంపై జనం గగ్గోలు పెడుతున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ లేకపోతే రిజిస్ట్రేషన్లు చేయవద్దన్న, శేఖరన్న సర్కారు ఉత్తర్వుతో తెలంగాణ జనం ఉడికిపోతున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు వెళితే, స్థలంతోపాటు డబ్బు కూడా లక్షల్లో చెల్లించుకోవాల్సి వస్తోందని గగ్గోలు పెడుతున్నారు. అసలు ఎప్పుడో కొని, రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్న స్థలాలకు ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్ పేరిట డబ్బులు పిండుకోవడమేమిటని, తెలంగాణ జనం నెత్తీనోరు కొట్టుకుంటున్నారు. నవ్వుతో తీసుకుని, ఏడుస్తూ అనుభవించడమంటే ఇదే!