జగన్‌కు బ్రహ్మోత్సవాల ఇరకాటం

340

సతీసమేతంగా వెళ్లాలన్న రఘురాముడు
బ్రహ్మోత్సవాలకు భారతీ కూడా వెళతారా?
రాజు సవాలుకు జవాబేదీ?
          (మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

‘అన్ని మతాలను సమానంగా ఆదరించే’.. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పాలనలో, హిందుత్వంపై నలుచెరుగులా దాడులు జరుగుతున్నాయి. రథాలు తగులబడిపోతుండగా, విగ్రహాలకు అవమానాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆయనకు కంట్లో నలుసులా మారిన,  సొంత  పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా లేవనెత్తిన,  ‘సెంటిమెంటు అస్త్రం’ జగనన్నకు ‘మత సంకటం’లా పరిణమించింది. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలలో ఈసారి జగనన్న సతీసమేతంగా పాల్గొనాలని సూచించడం ద్వారా, తన అధినేతను రాజు ధర్మ-మత సంకటంలోకి నెట్టివేసినట్టయింది. ఫలితంగా..  తిరుమల బ్రహోత్సవాలకు జగన్‌తోపాటు, ఆయన  భార్య భారతి కూడా హాజరవుతారా? లేదా? అన్న ఆసక్తికరమైన చర్చకు రాజు చేసిన డిమాండ్ కేంద్రమయింది.

జగన్ స్వతహాగా క్రైస్తవుడయినా.. హిందూ ఆలయాలకు వెళుతుంటారు. విశాఖ పీఠాథిపతి స్వరూపానంద, ఆయనతో పుష్కరస్నానం కూడా చేయించారు. తన ఆశ్రమంలో పూజలు కూడా చేయించారు. జగన్ సీఎం కాకముందు, అయిన తర్వాత కూడా తిరుమలకు వెళ్లారు. విపక్షంలో ఉన్నప్పుడు తనకు హిందూమతంపై విశ్వాసం ఉందని,  అన్యమతస్తులు ఇచ్చే డిక్లరేషన్ ఇవ్వకపోవడం విమర్శలకు దారితీసింది. దీనిని అప్పట్లో స్వరూపానంద తప్పుపట్టారు. జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన పనేమిటని, శిష్యుడి పక్షాన వాదించారు. దానితో కొందరు పీఠాథిపతులు స్వామి తీరుపై విరుచుకుపడ్డారు. విశాఖ పీఠం.. ఆధ్యాత్మిక పీఠం కాదని, అది వైసీపీ కార్యాలయమని బహిరంగంగానే కన్నెర్ర చేశారు. అది వేరే విషయం.

ఇప్పుడు రఘురామకృష్ణంరాజు.. మళ్లీ జగన్ హిందుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించడం ద్వారా, మరో ఆసక్తికరమైన చర్చకు తెరలేపారు. అయితే రాజు ఈసారి కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా, జగనన్నను ఇరకాటంలోకి నెట్టివేశారు. ఇప్పటివరకూ జగనన్న ఏ హిందూ ఆలయానికి వెళ్లినా ఒంటరిగానే వెళ్లారే తప్ప, భార్యతో కలసి వెళ్లలేదు. గతంలో సీఎంలు బ్రహ్మోత్సవాలకు వెళ్లినా, సతీసమేతంగానే వెళ్లే సంప్రదాయం ఉండేది. కానీ జగన్ భార్య భారతి మాత్రం, ఆలయాల్లో జగన్‌తో కలసి వెళ్లకపోవడం ప్రస్తావనార్హం.  పట్టువస్త్రాలను సతీసమేతంగానే  సమర్పించాలన్నది శాస్త్రం చెబుతోంది. బహుశా రఘురాముడు.. ఈ ధర్మశాస్త్రం గుర్తించిన తర్వాతనే, బ్రహ్మోత్సవాల్లో సీఎం భార్యతో కలసి వెళ్లాలని సూచించి, ఆయనను ధర్మసంకటంలోకి నెట్టినట్లు  కనిపిస్తోంది. అంతటితో ఆగని రాజు.. ఇతర మతస్తుల పండుగలకు డబ్బుస్తున్న జగన్ సర్కారు, హిందువుల పండుగలను నిర్లక్ష్యం చేస్తున్నారని, హిందూ మతాన్ని నిర్లక్ష్యం చేసి, ఇతర మతాలను ప్రోత్సహిస్తున్నారన్న సంచలన ఆరోపణ చర్చనీయాంశమయింది.

ఇక తిరుపతి-శ్రీశైలం వంటి పెద్ద ఆలయాల్లో ఉచిత దర్శనాలు తగ్గించి, దర్శనాల రేట్లు పెంచడాన్ని కూడా ఆయన, ‘ఇతర మతాలతో లంకె పెట్టడం’తో కొత్త చర్చకు  తెరలేచింది. భగవంతుడిని భక్తులకు దూరం చేసే వ్యూహాత్మక ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఏపీలో ఆలయాలకు వెళ్లాలంటే డబ్బులు వసూలు చేస్తుండటం దారుణమన్న వ్యాఖ్య, హిందూ సమాజంలో కొత్త ఆలోచనలకు దారితీస్తోంది. చర్చి అద్దాలను పగులకొట్టిన కేసులో 40 మందిపై కేసులు పెట్టిన ప్రభుత్వం, అంతర్వేది ఘటనలో ముద్దాయిలపై ఎందుకు కేసులు పెట్టలేదని నిలదీయడం ద్వారా.. సర్కారు ఒక మతానికి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పినట్టయింది.

ఇక పార్టీపరంగా కూడా రఘురామ కృష్ణంరాజు, వైసీపీ నాయకత్వానికి చికాకు తెప్పిస్తున్నారు. తన రాజీనామా కోరిన మంత్రి బాలినేనితోపాటు, ఇతరులు చేసిన డిమాండ్‌కు స్పందించి..  రాజు చేసిన సవాలుకు ఇప్పటివరకూ మంత్రులుగానీ, గతంలో ఆయనపై కేసులు పెట్టిన ఎమ్మెల్యేలు గానీ జవాబు ఇవ్వలేదు. దీనిని బట్టి.. రాజు సవాలు పార్టీని, ఏ స్థాయిలో ఆత్మరక్షణలో పడేసిందో స్పష్టమవుతోంది. నేను గెలిస్తే అమరావతిని అక్కడే ఉంచుతామని, జగన్మోహన్‌రెడ్డి రాతపూర్వకంగా హామీ ఇస్తారా? ఉప ఎన్నికను రిఫరెండంగా స్వీకరించేందుకు మీ సీఎం సిద్ధమేనా అని రాజు చేసిన ప్రకటనకు.. మంత్రి బాలినేని ఇప్పటిదాకా నోరు మెదపలేదు.  అయితే మంత్రి బొత్స మాత్రం.. ఆయన రాజీనామాతో పార్టీకి ఏం సంబంధం? అదేమైనా రిఫరెండమా? అని ఎదురు ప్రశ్నించారు. దీన్నిబట్టి.. రాజు సవాలుకు జవాబిచ్చేందుకు, వైసీపీ నాయకత్వం భయపడుతున్నట్లు కనిపిస్తోంది. పైగా ఉప ఎన్నిక పెడితే, తాను లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తానని రాజు సరికొత్త సవాల్ విసిరి, వైసీపీ నాయకత్వాన్ని మరింత రెచ్చగొడుతున్నారు.

రాజుకు జగన్ ఎందుకు భయపడుతున్నారో?
అయితే..మన దేశంలో రిఫరెండం సంప్రదాయం లేనందున, తాను రిఫరెండానికి వెళ్లడం లేదన్న జగన్ వ్యాఖ్యపై, పార్టీ వర్గాల్లో సరికొత్త చర్చ జరుగుతోంది. అలాంటి అవకాశం లేకపోయినప్పటికీ.. స్వయంగా తన ఎన్నికనే రిఫరెండంగా స్వీకరించాలన్న రఘురామకృష్ణంరాజు సవాల్‌ను స్వీకరిస్తే, పార్టీ పరిస్థితి ఏమిటన్న వాస్తవం కూడా బయటపడుతుందని వైసీపీ సీనియర్లు చెబుతున్నారు. ‘ రఘురామకృష్ణంరాజు సవాల్ పార్టీకి ఒక అవకాశం. జనంలో పార్టీ పరిస్థితి ఏమిటన్నది తెలుసుకోవడానికి ఆయనే మాకు ఓ చాన్సిచ్చారు. రాజు రాజీనామా తర్వాత వచ్చే ఉప ఎన్నికనే రిఫరెండంగా స్వీకరిస్తామని చెబితే వచ్చే నష్టమేమీ లేదు. ఆయన మొన్నటి ఎన్నికల్లో జగన్ బొమ్మతోనే గెలిచారు. రేపు ఉప ఎన్నికలో ఎవరి బొమ్మ పెట్టుకుంటారు? మా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు గ్రామాలకు చేరువయ్యాయి. ప్రతి కుటుంబం సగటున 60 వేలు లబ్ధిపొందుతోంది. అలాంటప్పుడు నర్సాపురం ఉప ఎన్నిక రిఫరెండమే అని సవాలు స్వీకరిస్తే వచ్చే నష్టమేంటో మాకు అర్ధం కావడం లేదు. ఎవరికీ భయపడని జగన్ గారు రాజుకు భయపడుతుండటమే మాకు ఆశ్చర్యంగా ఉంద’ని పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు.

1 COMMENT