పవన్ తిక్కకు లెక్క ఏమిటి?

668

-రవీంద్ర ఇప్పల

‘నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది’ – పవన్‌ కల్యాణ్‌ నటించిన గబ్బర్‌ సింగ్‌ సినిమాలో ఓ డైలాగ్‌. సినిమాలో ఆయన పాత్రకు ఈ డైలాగ్‌ బాగా కనెక్ట్‌ అయ్యింది. పవన్‌ కల్యాణ్‌ పాపులర్‌ హీరో కాబట్టి డైలాగ్‌ కూడా బాగా పాపులర్‌ అయ్యింది. కొంచెం శాడిజంతో కూడుకున్న గబ్బర్‌ సింగ్‌ పాత్ర వింత ప్రవర్తన కేవలం తిక్క మాత్రమే కాదని, ఆ తిక్క వెనుక ఒక కచ్చితమైన లెక్క వుందని అర్థం చేసుకోవడానికి ఈ డైలాగ్‌ ఉపయోగపడింది. జనసేన పార్టీని 2014 ఎన్నికల ముందు స్థాపించినప్పటికీ, అంతకు ఐదారేళ్ల ముందునుంచే పవన్‌కు రాజకీయాలతో సంబంధం ఉంది. పెద్దన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పని చేశారు.

అప్పట్లో ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన ఒక రాజ కీయ విశ్లేషకుడు పవన్‌ గురించి ఒక ఆసక్తికరమైన కామెంట్‌ చేశాడు. ‘పవన్‌ కల్యాణ్‌ది ఊయల వేగం. ఊయల ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో అంతే వేగంగా వెనక్కు వస్తుంది. ఆయన రాజకీయశైలీ అంతే. అసందర్భంగా ఆవేశపడి ప్రసంగాలు చేయడం, ధర్నాలకు దిగడం వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం ఆయన నైజం’ అన్నాడు. పవన్‌ కల్యాణ్‌ రాజకీయ జీవితంతో ముడిపడి వున్న సందర్భాలను ఒకసారి పరిశీలనగా చూస్తే ఈ కామెంట్‌ సమంజసంగానే తోస్తున్నది. ప్రజారాజ్యం టైమ్‌లోనే ఒకసారి ఏదో సభలో పాల్గొన్న పవన్‌ కల్యాణ్‌ హఠాత్తుగా ఆవేశపడిపోయి ‘కాంగ్రెస్‌ నేతల పంచెలూడదీయండి’ అంటూ ఊగిపోవడాన్ని టీవీ లైవ్‌లో చూసిన చిరంజీవి హతాశుడయ్యాడని అప్పుడాయనతో కలిసి పనిచేసిన వాళ్లు చెబుతారు.

స్వయంగా జనసేన పార్టీ స్థాపించిన తర్వాత కూడా ఆయన వ్యవహారశైలి సంప్రదాయ రాజకీయనేతల శైలికి కొంచెం తేడాగానే కనిపిస్తున్నది. కాన్వాయ్‌లో వెళ్తుంటాడు. రోడ్లమీద అభిమానులు జైకొడుతూ కారు చుట్టూ గుమికూడుతారు. ఆయన కారు అద్దాన్ని కిందికి దించి చేతిని గాల్లో ఊపుతూ అభివాదం చేస్తాడు. అప్పుడా చేతి నిండా ఐదారు పుస్తకాల మడత వుంటుంది. ఆ పుస్తకాలు అభిమానులకు స్పష్టంగా కనిపిస్తాయి. అంత సందడిలో అభిమానుల కేరింతల నడుమ అన్ని పుస్తకాలు ఎలా చదువుతారో అనే అనుమానం సాధారణ ప్రజలకు మాత్రమే వస్తుంది. ఏమో ఆ పుస్తక ప్రదర్శన వల్ల తమ నాయకుడు బాగా చదువుకున్న గొప్ప మేధావి అనే కిక్కు అభిమానుల కెక్కుతుందేమో! పిల్లవాడి చేతిలో పుస్తకం కనిపించినప్పుడు తల్లిదండ్రులు సంబరపడటం సహజం.

పవన్‌ తరచూ తిరగేసే పుస్తకాల్లో గుంటూరు శేషేంద్రశర్మ రచనలు తప్పనిసరిగా కనిపిస్తాయని ఆయనకు దగ్గరైనవాళ్లు చెప్పారు. శేషేంద్ర ఒకచోట ఇలా అంటాడు ‘నా వాక్యం ఒక పిల్లనగ్రోవి, లోపల గాలి తప్ప అర్థం వుండదు’ అని. పవన్‌ కల్యాణ్‌ ఆవేశ ప్రసంగాలు చేస్తున్నప్పుడు చాలామంది ఇలాగే అనుకుంటారు. కానీ, పవన్‌కూ, కొద్దిమందికి మాత్రం ఆ పిల్లనగ్రోవి పాటకు అర్థం ఏమిటో తెలుసు.

లాటిన్‌ అమెరికన్‌ విప్లవకారుడు చేగువేరా అంటే పవన్‌కు చచ్చేంత అభిమానమని ఆయన చేపట్టిన చర్యల ద్వారా మనకు అర్థమవుతున్నది. ప్రపంచంలో వున్న లక్షలాదిమందికి వున్న క్రేజ్‌ మాదిరిగానే గువేరా బొమ్మ వున్న టీ షర్టులంటే పవన్‌కూ ఇష్టమే. ఆయన ఆఫీసుల్లో, వేదికల మీదా గువేరా బొమ్మ తరచుగా కనిపిస్తుంది. చేగువేరా మీద వచ్చిన పుస్తకాలు కూడా ఆయన దగ్గర చాలా వుండొచ్చు. చేగువేరా బొమ్మను దాచుకున్నంత మాత్రాన విప్లవ వీరుడిగా జనం గుర్తిస్తారా? చేగువేరా సైద్ధాంతిక పునాదికీ, పవన్‌ రాజకీయ రాద్ధాంతాలకు మధ్యన బీరకాయ పీచు చుట్టరికం ఏమైనా వుందేమో నిపుణులే తేల్చాలి.

సర్దార్‌ భగత్‌సింగ్‌ ఇరవయ్యేళ్ల వయసులో అరెస్టయినప్పుడు జైలు ఆవరణలో ఆరుబయట ఓ కుక్కి మంచం మీద కూర్చుని వుంటాడు. ఆ దృశ్యం వున్న ఒక ఫొటో బయటకు వచ్చింది. ఇప్పటికీ చాలామంది భద్రంగా దాచుకుంటారు. పవన్‌ కల్యాణ్‌ ఇటువంటి సీన్‌ను కూడా తన ఎన్నికల ప్రచారంలో రీక్రియేట్‌ చేశాడు. సభ ముగిసిన తర్వాత విశాలమైన ఒక ఇంటి ఆవరణలో ఒక కుక్కి మంచంపై కూర్చొని తానొక్కడే. చేతిలో ఒక పుస్తకం. ఫొటో పత్రికలకు విడుదలయ్యేది. పత్రికలు అచ్చువేసేవి. ఇటువంటి సినిమాటిక్‌ ఇమిటేషన్‌ల ద్వారా తాను ఆశిస్తున్న ఇమేజ్‌కూ, తన రాజకీయ ఆచరణకు మధ్య సంబంధం ఏమైనా వుందా? పరస్పర విరుద్ధాలైన ఈ రెండు చర్యలను అనుసంధానిస్తున్న అదృశ్య శక్తి ఏమైనా వుందా? ఈ చిక్కుముడి వెనుక లెక్క ఏమైనా వుందా?

నాలుగైదు దశాబ్దాలకు పూర్వం… కులవ్యవస్థ గడ్డకట్టి వున్న రోజుల్లో ‘ఆశ్రిత కులాలు’గా ముద్రపడిన కొన్ని సమూహాలు ఉండేవి. ప్రధాన కులాల మీద ఆధారపడి ఆశ్రిత కులాల జీవిక సాగేది. ఏడాదికోమారు ప్రధాన కులం వారి సమక్షంలో వారి పురాణాన్ని విని పించడం, వారి గత వైభవాన్ని ఊరించి చెప్పడం. పూర్వం మీ కులంవారు రాజ్యాలేలారని కల్పించి చెప్పడం వారిని సంతోష పెట్టడం ఆశ్రిత కులాల పని. క్రమంగా కులవృత్తులు విచ్ఛిన్నమవడంతో, ఆ వృత్తులపై బతికినవాళ్లు చెల్లాచెదురయ్యారు. ఆశ్రిత కులాలు అంతర్థాన దశకు చేరుకున్నాయి. ప్రపంచీకరణ పుణ్యమా అని మరో సరికొత్త ఆశ్రిత వర్గం తెరపైకి వచ్చింది. ఇది యాచించేది కాదు. శాసించేది. దానినే ఆశ్రిత పెట్టుబడిదారీ వర్గం లేదా క్రోనీ కేపిటలిజం అంటున్నాము. దేశంలో ఆర్థిక సంస్కరణలకు అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు తెరతీసిన తర్వాత, రాష్ట్రాల్లో అధికారంలో వున్నవాళ్లు ఆశ్రిత పెట్టుబడిదారీ వర్గానికి జన్మనిచ్చారు.

తొలితరం ఆర్థిక సంస్కరణల రోజుల్లో సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇక్కడి ఆశ్రిత పెట్టుబడిదారీ వర్గానికి పురుడుపోసి, పెంచి పెద్ద చేశాడు. ప్రభుత్వ వనరులు, కాంట్రాక్టులు, గనులూ ఆశ్రిత పెట్టుబడిదారులకు చేరువయ్యాయి. కళ్లు చెదిరే సంపాదనను ఈ వర్గం మూటకట్టుకున్నది. చేరదీసిన రాజకీయ పార్టీ అవసరాలను కూడా ఈ ఆశ్రితవర్గం చూసుకోవడం మొదలైంది. పోగు పడుతున్న సంపదతో ఓట్లను కొనుగోలు చేయడం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, అధికారాన్ని కొనుగోలు చేయడం ఈ దశలోనే ప్రారంభమైంది. సామాన్యులు, సంఘ సేవకులు ‘పోటీ’ పడలేక రాజకీయాలకు దూరమయ్యారు. కరెన్సీ దూకుడును ఎదుర్కోలేక కమిట్‌మెంట్‌ రాజకీయ పార్టీలు చతికిలపడ్డాయి. దేశీయ మార్కెట్‌ను పిడికెడుమంది ‘క్రోనీ’లు నియంత్రించే అలిగోపొలి (oligopoly) వైపు ఆర్థికవ్యవస్థ పతనం మొదలైంది. ఈ ప్రస్థానాన్ని ఇంతటితో ఆపకపోతే మన రాజకీయ వ్యవస్థ మూకస్వామ్యం (oligarchy) స్థాయికి దిగజారే దుస్థితి ఎంతో దూరం ఉండదు.

తెలుగునాట ఆశ్రిత పెట్టుబడిదారీ వర్గానికి నారుపోసి నీరుపెట్టిన చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత మరో ఆశ్రిత వ్యవస్థను రంగంలోకి దించారు. అదే ఆశ్రిత రాజకీయం లేదా క్రోనీ పాలిటిక్స్‌. తన రాజకీయ వ్యూహంలో భాగంగా ఇండిపెండెంట్‌గా కనిపించే ఒక క్రోనీ పొలిటికల్‌ పార్టీ బాబుకు అవసరమైంది. పవన్‌ కల్యాణ్‌లో ఉన్న ఊయల మార్కు ఆవేశంలో పిల్లనగ్రోవి బ్రాండ్‌ ప్రసంగాల్లో తన క్రోనీని చంద్రబాబు చూడగలిగాడు. గడచిన ఐదేళ్లలో చంద్రబాబు ప్రయోజనాలకు అనుగుణంగా పవన్‌ కల్యాణ్‌ వ్యవహరించాడని చెప్పడానికి వంద ఉదాహరణలను పేర్కొనవచ్చు. ఏపీలో ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు నాయుడు పొరుగు రాష్ట్రంలో ఎమ్మెల్యేల వోట్లను కొనుగోలు చేస్తూ ఆడియో సాక్షిగా, వీడియో సాక్షిగా రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోతే ‘చంద్రబాబూ గద్దెదిగు’ అని గర్జించలేని వ్యక్తిలో చేగువేరా ఆదర్శం, భగత్‌సింగ్‌ ఆవేశం ఉన్నాయంటే నమ్మగలమా?

తన సొంత సామాజిక వర్గం, ఒక పెద్ద వర్గం. ఆ వర్గంలో ఒక పెద్దాయన. ముద్రగడ పద్మనాభం ఇంటిపై పడి, పరువు మర్యాదలే ప్రాణప్రదంగా భావించే ఆ కుటుంబ సభ్యులను దారుణంగా అవమానిస్తే, ఇది తప్పూ, వారికి నేను అండగా ఉన్నానంటూ నిలబడలేని నిస్సహాయత దేనికి సంకేతం. అరచేతిలో వైకుంఠాన్ని చూపి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ హామీనీ నెరవేర్చకపోయినా ఐదేళ్లూ కిమ్మన్నాస్తిగా ఉండిపోయిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి 400 రోజుల పాలనపై నివేదికలు విడుదల చేయడం వెనుక వున్న రహస్య ఒడంబడిక ఏమిటి?

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత కిడ్నీ బాధిత ప్రాంతమైన ఉద్దానంలో ఆఫ్ట్‌రాల్‌ ఒక ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేస్తానని ప్రకటిస్తేనే, కరకట్ట నివాసానికి పరుగెత్తుకెళ్లి కృతజ్ఞతాంజలులు ఘటించి వచ్చిన పవన్‌కల్యాణ్‌కు… జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు మాసాల్లోనే ఉద్దానంలో 680 కోట్లతో మంచినీటి పథక నిర్మాణానికి శంకుస్థాపన చేసి, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పనులను ప్రారంభిస్తే కనిపించనంత అంధకారం ఏ కారణం వల్ల సంప్రాప్తించినది? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆగడాలకు ఎదురొడ్డిన మహిళా ఎమ్మార్వో వనజాక్షిని దారుణంగా అవమానిస్తే… విజయవాడలో టీడీపీ నేతల ఆధ్వర్యంలో నడిచిన కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లో నిస్సహాయ స్థితిలో అక్కాచెల్లెళ్లు, మానమర్యాదలు కోల్పోతే, ప్రాణాలు తీసుకుంటే… ఒక్కమాట… పన్నెత్తి ఒక్కమాట అడగలేని వ్యక్తి, శ్రీధరరెడ్డి అనే ఎమ్మెల్యే మీద ఒక్క ఆరోపణ వస్తేనే జైల్లో పెట్టించిన జగన్‌ పైన విమర్శలు చేయడం వెనుక జరిగిన లావాదేవీలు ఏమిటి?

అధికారంలోకి వస్తున్నానంటూ ఎన్నికల్లో పోటీచేసి, ప్రచారాంకంలో వున్న సమయంలో ఈనాడు పత్రికకు ఇంటర్వ్యూనిచ్చి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానంటూ కేసీఆర్‌ చేసిన ప్రకటన కారణంగా చంద్రబాబు అధికారంలోకి రాబోతున్నాడని చెప్పడం వెనుక ఏ రిటర్న్‌ గిఫ్ట్‌ దాగి వున్నది? ఇలా ప్రశ్నిస్తూ పోతే ఒక పుస్తకాన్నే వేయవచ్చు. తెలుగుదేశం పార్టీకి ఆశ్రిత రాజకీయ పార్టీగా జనసేన వ్యవహరిస్తున్నదని జనం నమ్మిన కారణంగానే, ఆ పార్టీకి దారుణమైన ఓటమి సంభవించింది. అయినా కూడా జనసేనాపతి వైఖరిలో మార్పు రాకపోవడాన్ని తెలుగు సమాజం గమనిస్తున్నది. తెలుగుదేశం పార్టీ చేస్తున్న సంతగోలకు మద్దతుగా పవన్‌ కల్యాణ్‌ ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటించడాన్ని ‘క్రోనీ వాకర్‌ లాంగ్‌ మార్చ్‌’గా జనం పరిగణిస్తే తప్పేమిటి?

చివర్లో చిన్న డౌటు. అధికారంలో ఉండగా చేసిన పాపాలపై ఎక్కడ కేసులు పడతాయోనని వణికిపోతున్న చంద్రబాబు ఇప్పటికే తన పార్టీలోని చతురంగ బలాలను బీజేపీలోకి పంపిస్తానని ఆఫర్‌ చేసినట్టు తెలుస్తున్నది. అందరూ పోగా అవశేష శ్రేణులతో మిగిలిన తన పార్టీని తోకపార్టీగా స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు భోగట్టా. తానే తోకగా మిగిలిపోతే తన ఆశ్రిత పార్టీ పరిస్థితి ఏమి కానున్నది? తెనాలి రామకృష్ణుని పద్యం గుర్తుకొస్తున్నది. ‘‘మేక తోకకు తోక, తోకమేకకుతోకమేకతోక…’’ ఇలా నడుస్తుంది పద్యం. మేక, తోక తప్ప మూడో మాట వుండదు. బహుశా రామకృష్ణ కవి ఇలాంటి సందర్భాన్ని ఊహించే చెప్పి వుంటారు.