శ్రీకాళహస్తిలో విగ్రహాలకు కాళ్లొచ్చాయ్

173

ఎవరు ప్రతిష్ఠించారో తెలియదట
విశాఖలో విగ్రహాలు కూలుతున్నాయ్
అది ‘మాయా’ంధ్రప్రదేశ్
    (మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

అక్కడ దేవుడి రథాలు అర్ధరాత్రి వేళ ‘వాటంతట అవే’ అగ్గిపుల్లలతో కాల్చుకుంటున్నాయ్.. మనుషులెవరూ లేకుండానే, దేవుడి విగ్రహాలు ‘వాటంతట అవే’ వచ్చి ప్రతిష్ఠించుకుంటున్నాయ్. విగ్రహాలు కూలిపోతున్నాయ్.. దేవతావిగ్రహాలకు చేతులొచ్చి, వాటికి అవే ముక్కు-చెవులు-కాళ్లూ-చేతులు తెగ నరుక్కుంటున్నాయ్.. ఇవన్నీ ఏ విఠలాచార్య సినిమాల్లో సిత్రాలు కాదు. అచ్చంగా ఆంధ్రాలో జరుగుతున్న మాయాదృశ్యాలు. అవునండీ.. ఆంధ్రా ఇప్పుడు గోకర్ణ-గజకర్ణ-టక్కు టమార విద్యల్లో ఆరితేరిన మాయామశ్చీంద్రుల రాష్ట్రంగా మారిపోయింది. కావాలంటే మీరే చూడండి. సర్వమతాలను సమానంగా ప్రేమించే జగనన్న రాజ్యంలో ఇలా జరగటం ఏమిటని నమ్మడం లేదు కదూ? అందులో ఓ సారి ఆ మాయను మీరే దర్శించండి.

మొన్నటికి మొన్న అంతర్వేదిలో అర్ధరాత్రి వేళ స్వామి వారి రథం తగులబడి పోయింది. తేనెపట్టు కోసం వ చ్చిన పిచ్చివాళ్లే ఆపని చేశారట. పోలీసులు చెప్పారు కదా? నమ్మాల్సిందే!  అంతకుముందు పిఠాపురంలో కూడా.. రాముడు శూర్పణఖ ముక్కూ, చెవులూ కోసినట్లు, దేవి దేవతా విగ్రహాల  ముక్కు-చెవులు-కాళ్లను కోసేశారు. తర్వాత అది కూడా పిచ్చివాడి చేష్ట అని పరిశోధనలో తేలిందట. మరి పోలీసులు చెప్పారు కదా? అదీ నమ్మాల్సిందే! అంతకుముందు నెల్లూరులో శ్రీ వెంకటేశ్వరస్వామి రథం, గుంటూరు బస్టాండు వద్ద అమ్మవారి విగ్రహం.. ఇంకా బోలెడన్ని గుళ్లు-రథాలు మానవ ప్రమేయం లేకుండానే, వాటంతట అవే కూలిపోవడం- తగులబడిపోవడమనే మాయా చిత్రాలు ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే దర్శనమిస్తున్నాయి.

ఈ చిత్రవిచిత్రాల పరంపరలో భాగంగా..  తాజాగా శ్రీకాళహస్తిలో ఇంకో మాయాదృశ్యం ఆవిష్కృతమయింది. శ్రీకాళహస్తి ఆలయంలో కాశీలింగం- రామేశ్వరం లింగం పక్కనే… నాగదేవత-నంది విగ్రహాలు హటాత్తుగా ప్రత్యక్షమయ్యాయట. ఆలయ అధికారులకు వాటిని గమనించే ఓపిక-తీరిక లేకపోయినా, పాపం రోజూ వచ్చే పిచ్చి భక్తులు వాటిని చూసి హాశ్చర్యపోయారు. అదేంటీ నిన్నటి వరకూ లేని ఆ విగ్రహాలు, హటాత్తుగా ఎవరు ప్రతిష్ఠించారని ఆలయ అధికారులను ప్రశ్నిస్తే.. పాపం వారేం చెబుతారు? అసలు అవి ఎలా వచ్చాయో వాళ్లకు తెలిస్తే కదా?! చివరాఖరకు ఆ వింతేమిటో ఆలయ అధికారులు భక్తులతో కలసి వెళ్లి చూస్తే.. రెండు కొత్త విగ్రహాలు కనిపించాయట. మరి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ.. రెండో కంటికి.. ఆ మాటకొస్తే మూడోకన్నుగా చెప్పే సిసి కెమెరాలకూ తెలియకుండా, అంత పెద్ద ఆలయంలోని ఆ రెండు విగ్రహాలు ఎలా వచ్చాయి చెప్మా అని, ఆలయ అధికారులు బుగ్గలు నొక్కుకున్నారు.

ఆలయ పండితుడయిన గురుకుల్ స్వామినాథన్ గారేమో.. ఆ విగహ్రాలు ఎలా వచ్చాయో తెలియదని, తప్పయితే జరిగిపోయిందని సెలవిచ్చారు.  ఆతర్వాత ఆలయ సంప్రోక్షణ- జరిగిన అపచారానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నిరసన కార్యక్రమాలు జరిగాయి. సరే.. రేపో మాపో దీనిపై ‘గుళ్ల మంత్రి’ శ్రీనివాసు స్పందించి, అలవాటు ప్రకారం ఏ అవుట్‌సోర్సింగ్ ఆపరేటర్‌నో, ఏ గూర్ఖానో డిస్మిస్ చేసి, ఆలయ ఈఓను ఎలాగూ బదిలీ చేస్తారనుకోండి. అది వేరే విషయం. కానీ.. ఇక్కడ వీళ్లకు తెలియని రహస్యమేమిటంటే.. అసలు ఆ విగ్రహాలకు కాళ్లొచ్చి, శిల్పి చేతి మాయమయి డైరక్టుగా గుడికి చేరాయి. ష్.. ఈ రహస్యం దయచేసి ఎవరికీ చెప్పకండి!


ఇక విశాఖలో మాయలు-మంత్రాలు లేకుండానే ఓ ఆలయంలో పిల్లర్లు కూల్చారు. విశాఖ దుర్గాపురం అభయాంజనేయస్వామి ఆలయంలో పునాది పిల్లర్లతోపాటు, బుద్దుడి విగ్రహాన్ని కూడా కూల్చేశారట. శ్రీనివాసానంద సరస్వతి స్వామి వారు వచ్చి జరిగిన ఘటనపై ధర్మాగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో భక్తులు ఒకందుకు సంతోషించాలి. ఎందుకంటే వీటిని కూల్చిందెవరో తెలుసుకాబట్టి! అయినా రాష్ట్ర రక్షకుడయిన స్వరూపానందుల వారు కొలువుదీరిన, విశాఖ నగరంలో ఇలాంటి కూల్చివేతలు జరగడమేమిటి? స్వామి వారికి ఎంత అవమానం? ఎంత నామర్దా? ఎంత ఇది? ఎంత అది?

అంతర్వేది ఘటనపై.. స్వరూపానందుల వారి స్వరపేటిక పలికినందుకే, శిష్య పరమాణువు దానిపై సీబీఐ విచారణకు ఆదేశించారు. వారి ధర్మాగ్రహానికి భయపడే, జగన్మోహనుల వారు సీబీఐని పిలిపిస్తున్నారు. అంతర్వేదిపై శిష్యపరమాణువు సీబీఐ విచారణకు ఆదేశించిన వెంటనే,  గురువుగారి మనసు హిమాలయమంత  ఉప్పొంగింది. వెంటనే శిష్యుడి నిర్ణయాన్ని అభినందిస్తూ ఓ ప్రకటన ఇచ్చేశారు. జగన్ పాలనను మెచ్చుకున్నారు కూడా! ఫాఫం.. మిగిలిన దేవుళ్లు.. మిగిలిన రథాలు ఏం పాపం చేసుకున్నాయో గానీ.. అప్పుడు కూల్చిన వాటిపై వైజాగ్ సాములోరు ఇంతగా మథనపడలేదు. ఇప్పుడు శిష్యుడు ఎక్కువ కష్టాల్లో ఉన్నందుకే, వారి స్వామి వారి స్వరపేటిక పలికినట్లుంది. రిషికేషులో ఉంటూ కూడా.. రాష్ట్రం కోసం, పాలకుల కోసం ఇంతగా పరితపించే స్వామివారు ఉండటం ఆంధ్రా ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. కాదంటారా?