జగన్ నిర్ణయానికి జయహో!

489

‘సీబీఐ’ నిర్ణయంతో బంతి బీజేపీ కోర్టులో
విపక్షాలకు ఆయుధం దూరం చేసిన సీఎం
ఇంతకూ గెలిచిందెవరు? ఓడిందెవరు?
అంతర్వేది కథ సుఖాంతమేనా?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

అంతర్వేది ఘటన ఏపీని అతలాకులతం చేసి, ఆ అంశాన్ని వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు తన దీక్ష ద్వారా జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన నేపథ్యంలో.. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం, ప్రతిపక్షాలకు ఆయుధాన్ని దూరం చేసినట్టయింది. అంతర్వేది స్వామి వారి రథాన్ని తగులబెట్టిన వైనంపై.. సీబీఐతో దర్యాప్తు చేయించాలని టీడీపీ సహా, విపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో అందుకు అంగీకరించడం ద్వారా.. జగన్ విపక్షాలకు చావు దెబ్బతీసినట్టయింది. అదే సమయంలో.. బంతిని వ్యూహాత్మకంగా బీజేపీ కోర్టులోకి నెట్టివేసి, ఆ పార్టీని కూడా రక్షణాత్మక స్థితిలోకి నెట్టివేసి, అంతర్వేది కథను సుఖాంతం చేయడంలో జగన్ విజయం సాధించారు. జగన్ నిర్ణయంపై అన్ని వర్గాల్లో సానుకూలత వ్యక్తమవుతోంది.

దశాబ్దాల చరిత్ర గల అంతర్వేది స్వామివారి రథాన్ని తగులబెట్టిన వైనాన్ని, రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు  టీడీపీ-బీజేపీ పోటీలు పడ్డాయి. ఈ పోటీలో అందరికంటే ఒక మెట్టు  పైన ఉండాల్సిన భాజపా.. రాజకీయ మొహమాటంతో వెనకబడిపోగా, హిందూ సంస్థలు-టీడీపీ ముందుండటం విశేషం. అయితే.. తన ప్రభుత్వ ప్రమేయంతోనే ఈ ఘటన జరిగిందన్న భావన విస్తృతమవడాన్ని గ్రహించిన సీఎం జగన్.. ఎవరూ ఊహించని విధంగా సీబీఐ విచారణకు ఆదేశించి, ప్రతిపక్షాలను చావు దెబ్బతీయడం ఆశ్చర్యకరం. జగన్ తన నిర్ణయం ద్వారా… అంతర్వేది ఘటనలో తన ప్రభుత్వ ప్రమేయం లేదని, ఒకవేళ ఉంటే సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశిస్తారన్న చర్చకు తెరలేపారు. ఏ ప్రభుత్వమైనా, ఒక మతంపై వ్యతిరేకంగా- మరో మతానికి అనుకూలంగా వ్యవహరించి, తన పతనాన్ని తానే ఎందుకు కోరుకుంటుందన్న ప్రశ్నను ఓ చర్చగా మార్చారు. దానికి తగినట్లుగానే.. సీబీఐ విచారణకు ఆదేశించి, అందులో ప్రభుత్వ ప్రమేయం లేదన్న సంకేతాలివ్వడం ప్రస్తావనార్హం.

అంతర్వేది ఘటనపై విచారణకు సీబీఐతో విచారణకు ఆదేశించడం ద్వారా… ఇకపై ఆ అంశంపై మాట్లాడేందుకు, విపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చేయడంలో జగన్ విజయం సాధించినట్టయింది. ఎలాగూ సీబీఐ విచారణకు ఆదేశించినందున, ఇక ఆ అంశంలో సహజంగా దానిపై మాట్లాడేందుకు ఎవరికీ అవకాశం ఉండదు. వైఎస్ వివేకానంద హత్యకు ముందు, విపక్షంలో ఉన్న జగన్ నానా యాగీ చేశారు. చంద్రబాబే హత్య చేయించారని, దానిపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరారు. అయితే విచిత్రంగా.. అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న సీబీఐ దర్యాప్తుపై, అదే జగన్ అండ్ కో మౌనంగా ఉంటోంది. టీడీపీ కూడా సీబీఐ విచారణ తర్వాత, పెద్దగా పెదవి విప్పడం లేదు. దానితో ఆ కేసును అందరూ మర్చిపోయారు. రేపు.. అంతర్వేది ఘటన కూడా ఆ జాబితాలోనే చేరడం ఖాయం.

అయితే… ఈ కేసులో గెలిచిందెవరు? ఓడిందెవరన్నదే ఆసక్తికర చర్చ. అంతర్వేది ఘటనపై క్షేత్రస్థాయిలో పోరాడిన హిందూ సంస్థలు-టీడీపీ-వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు-బీజేపీ,  దానిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణకు డిమాండ్ చేశాయి. అసలు ఎప్పుడూ మతాల జోలికి వెళ్లని టీడీపీ, అంతర్వేది ఘటనపై బీజేపీ కంటే దూకుడుగా వెళ్లడం ఆశ్చర్యం కలిగించింది. ఆ ప్రకారంగా… ఆ పార్టీ చేసిన డిమాండును అంగీకరించేలా చేయడంలో టీడీపీ నైతికంగా విజయం సాధించినట్లే లెక్క. ఇక హిందూ సంస్థలు కూడా.. దాదాపు అలాంటి డిమాండునే చేసినందున, వారి డిమాండు కూడా నెరవేరినట్లే భావించక తప్పదు. ఆలస్యంగా కళ్లు తెరిచినా, చివరాఖరులో బీజేపీ కూడా హడావిడి చేసి, విచారణకు డిమాండ్ చేసినందున, ఆ పార్టీ డిమాండును కూడా జగన్ తీర్చినట్లుగానే భావించక తప్పదు. సో.. విపక్షాల డిమాండ్లకు, సీఎం జగన్మోహన్‌రెడ్డి తొలిసారి తలొగ్గారనే భావించాల్సి ఉంది.

వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన  పరిటాల హత్యలో..  జగన్ ప్రమేయం ఉన్నందున, దానిపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ డిమాండ్ చేసింది. అందుకు వైఎస్ అంగీకరించి, సీబీఐ విచారణకు ఆదేశించారు. కాకపోతే అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. ఇప్పుడు జగన్ మద్దతునిస్తున్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ అధికారంలో ఉంది. ఈ విషయంలో అదే తేడా! విచారణ వ్యవహారంలో జగన్ కూడా,  తండ్రి బాటలోనే పయనించినట్లు ఈ ఆదేశంతో స్పష్టమవుతోంది. ఒకరకంగా ఇది వైకాపా ప్రచారాస్త్రంగా కూడా అక్కరకు రానుంది. తమకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే సీబీఐకి ఆదేశించామని.. గోదావరి పుష్కరాలలో జరిగిన ఘటనపై తాము సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తే, చంద్రబాబు తోకముడిచిపారిపోయారన్న రాజకీయ అస్త్రాన్ని తన అంబులపొదిలో చేర్చుకుంది. కాబట్టి ఈ అంశంలో వైకాపా సర్కారు కూడా విజయం సాధించినట్లే లెక్క.

చివరకు బంతిని బీజేపీ కోర్టులో నేర్పుగా నెట్టివేయడం ద్వారా, జగన్ ఆ పార్టీని వ్యూహాత్మకంగా ఇరికించినట్టయింది. సీబీఐ విచారణ వ్యవహారమంటే, పూర్తిగా కేంద్రం చెప్పుచేతల్లో ఉంటుందన్నది, మెడ మీద తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది. గతంలో జగన్ సీబీఐ విచారణ ఎదుర్కొన్న సందర్భంలో… కేంద్రం తనపై సీబీఐ-ఈడీని ఉసిగొల్పిందని, సీబీఐ కేంద్ర ప్రభుత్వ తొత్తుగా పనిచేస్తోందని విరుచుకుపడ్డారు.  కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మక్కయిందని ఆరోపించారు. ఆయన పార్టీ మీడియా సైతం.. సీబీఐతో కాంగ్రెస్-టీడీపీకి ఉన్న సంబంధాన్ని ఏకిపారేసింది. ప్రధానంగా నాటి సీబీఐ జాయింట్ డైరక్టర్ లక్ష్మీనారాయణ పచ్చ మీడియాకు,  విచారణ లీకులిస్తున్నారని ఆరోపించింది. ఆ ప్రకారంగా చూస్తే.. సీబీఐ విచారణ కేంద్ర కనుసన్నలలోనే ఉంటుందని భావించక తప్పదు. తాజాగా ఓ జాతీయ ఆంగ్ల పత్రికకు సీఎం జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో… తాను రాష్ట్ర ప్రయోజనాల కోసమే, బీజేపీకి అంశాల వారీ మద్దతునిస్తున్నట్లు స్పష్ట ం చేశారు. సో.. అంతర్వేదిపై సీబీఐ విచారణ ఫలితాలు ఎలా ఉంటాయో మీరే ఊహించుకోవచ్చు. అప్పటివరకూ బాలచందర్ సినిమా మాదిరిగా,  ఎవరి భాష్యం వారు ప్రవచించుకోవచ్చు.