చంద్రబాబు స్కూలు మార్చారు!

353

హిందూ కార్డు ఎత్తుకున్న టీడీపీ
గుళ్లలో పూజలతో నిరసనలు
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

‘రాష్ట్రంలో ప్రతి పుణ్యక్షేత్రం ప్రతిష్ఠను ప్రభుత్వం దెబ్బతీస్తోంది. టీటీడీ, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, దుర్గమ్మగుడి, సింహాచలం అప్పన్న, ఇప్పుడు అంతర్వేది ఆలయాల్లో అరాచకాలు చేస్తోంది. భక్తుల విశ్వాసాలు దెబ్బతీస్తోంది. వీటిపై సీబీఐ దర్యాప్తు చేయాలి.  రాష్ట్రంలో మత మార్పిళ్ల గురించి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలి’
– టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు

‘హిందువుల మనోభావాలు దెబ్బతినేలా రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఇది రాష్ట్రానికి అరిష్టమని పండితులు ఘోషిస్తున్నారు. వీటిపై సీబీఐ విచారణ జరిపించాలి’
-టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

‘జగన్ ప్రభుత్వంలో ఆలయాలపై వ్యూహాత్మకంగా దాడులు జరుగుతున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. దీనిపై సీఎం పెదవి విప్పాలి. ఆలయాలు, ప్రజలకు రక్షణ కల్పించలేని ఈ అసమర్ధ ప్రభుత్వ వైఖరి సిగ్గుచేటు’– హోం శాఖ మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, గొల్లపల్లి సూర్యారావు

అనుభవమయితే గానీ తత్వం బోధపడదన్నది ఓ సామెత. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఎన్నిసార్లు అనుభవమయినా తత్వం బోధపడకపోవడంతో, ‘ఇక ఆయన మారడు’ అని తమ్ముళ్లు తీర్మానించుకున్నారు. కానీ కాలం అందరికంటే గొప్పది కదా? అవసరాలు అంతకంటే ఇంకా గొప్పవి కదా? అందుకే.. బాబు తన స్కూలు మార్చేశారు. ఇప్పటివరకూ కులాలనే పట్టుకుని, దాని ఆధారంగానే రాజకీయాలు కొనసాగిస్తున్న  బాబు.. ఇప్పుడు  సమస్యల తీవ్రత-అంశాల వారీ రాజకీయాలకు తెరలేపారు. కులాన్ని నమ్ముకుంటే ఏమీ ఫాయిదా లేదని, చివరకు సొంత కులం వారే తన కొంప ముంచారన్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన బాబు.. ఇప్పుడు నేలవిడిచి సాము చేయకుండా, నేలమీద నిలబడి నిర్ణయాలు తీసుకోవడంపై, తమ్ముళ్లు ఖుషీ అవుతున్నారు.

కాలంతో పాటు మనిషి మారాల్సిందే. లేకపోతే వెనకబడిపోతారు. కొండ మహమ్మదు దగ్గరకు రాకపోతే, మహమ్మదే కొండ దగ్గరకు వెళ్లాలి. ఈ సత్యాన్ని చంద్రబాబు చాలా ఆలస్యంగా గ్రహించినట్లున్నారు. కులాల లెక్కలలో మాస్టర్ డిగ్రీ చేసిన బాబు వేసే, కూడిక-తీసివేతలు పనిచేయడం మానేశాయి. ఆయన లెక్కలు అడ్డం తిరిగాయి. అందుకే స్కూలు మార్చకతప్పలేదు. అవును. చంద్రబాబు ఇప్పుడు పొలిటికల్ స్కూలు మార్చేశారు. తాను తయారుచేసిన సిలబస్‌తో గట్టెక్కడం కష్టమని అనుభవంతో గుర్తించారు. రాజన్నకు-జగనన్నకూ బోలెడు తేడా ఉందని తెలుసుకున్నారు. అందుకే ఇప్పటి సిలబస్‌నే ఫాలో అవుతున్నారు. అంటే మొన్నటి మాదిరిగా కులం సిలబస్‌ను వదిలి, ఇప్పుడు మతం సిలబస్‌లోకి వచ్చేశారన్నమాట! ఒక్కముక్కలో చెప్పాలంటే, చంద్రబాబు క్రికెట్ గ్రౌండ్‌లో క్రికెట్టే ఆడుతున్నారు.

ఆదివారం- సూర్యదేవాలయాల్లో పూజలు
సోమవారం- శివాలయాల్లో పూజలు
మంగళవారం- ఆంజనేయస్వామి/కుమారస్వామి దేవాలయాల్లో పూజలు
బుధవారం-అయ్యప్ప/గణపతి దేవాలయాల్లో పూజలు
గురువారం- సాయిబాబా ఆలయాల్లో పూజలు
శుక్రవారం-  కనకదుర్గ అమ్మవారి ఆలయాల్లో పూజలు
శనివారం- వైష్ణవాలయాల్లో పూజలు

ఏమిటీ పూజా కార్యక్రమాల జాబితా అనుకుంటున్నారా? ఇదేదో సర్కారీ రాజగురువైన విశాఖ పీఠాథిపతి స్వరూపానందుల వారు, తన శిష్యుడైన జగన్మోహన్‌రెడ్డి దీర్ఘకాలం పాలించాలన్న ఆకాంక్షతో, దేవాలయాల్లో జరిపిస్తున్న పూజలనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా పప్పులో కాలేసినట్లే! ఇవి.. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు-రథాల దహనకాండకు నిరసనగా తెలుగుదేశం అనే సెక్కులర్ పార్టీ.. తమ కార్యకర్తలతోపాటు, రాష్ట్రంలోని హిందువులకు ఇచ్చిన పిలుపు.  ఇది నమ్మకపోయినా ముమ్మాటికీ నిఝం.

ఎస్.  అసలు మతం పేరెత్తితేనే వందల కిలోమీటర్లు పరుగెత్తే చంద్రబాబు, ఇప్పుడు హిందూజపం చేస్తున్నారు. ఒక మతం గురించి మాట్లాడితే, మరో మతం వారు ఎక్కడ దూరమవుతారేమోనన్న భయంతో, మతం గురించి మాట్లాడేందుకే చంద్రబాబు  భయపడేవారు. మరి ఇప్పుడు? హిందూ ధర్మం గురించి, దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురించి ధైర్యంగా మాట్లాడుతున్నారు. తమ పార్టీ ప్రతినిధులను, అందరికంటే ముందుగానే సంఘటనా స్థలాలకు పంపిస్తున్నారు. అంతర్వేది ఘటన తర్వాత జనం మూడ్‌ను గమనించిన బాబు.. ఆ మేరకు తన స్కూలు సిలబస్‌ను అర్జెంటుగా మార్చేసుకుని, హిందూ కాలేజీలో చేరిపోయారు. బాబును చిరకాలం నుంచీ చూస్తున్న వారికి ఇది ఆశ్చర్యపోయే అంశమే!

ఎందుకంటే.. రాష్ట్రంలో గత 15 నెలల నుంచి దేవాలయాలపై దాడులు, విగ్రహాలకు అవమానాలు, రథాల దహనకాండ జరుగుతున్నాయి. వైసీపీ సర్కారుతో ఉన్న తెరచాటు బంధం- రాజ్యసభ బలం-రాజకీయ మొహమాటాల కారణంతో, భాజపా తన హిందుత్వ విధానాన్ని ‘మళ్లీ ఢిల్లీ ఆదేశాలు’ వచ్చేవరకూ జమ్మిచెట్టు మీద ఎక్కించేసింది. కాంగ్రెస్-కమ్యూనిస్టులు వాటిపై మాట్లాడలేవు. వైసీపీ సర్కారుపై తమలపాకు-బంతిపూల యుద్ధం చేస్తున్న బీజేపీపై, హిందువులు కారాలుమిరియాలు నూరుతున్నారు. హిందూ సంస్థలు చేసే ఆందోళనలో ‘నాలుగైదు పార్టీ జెండాలు పెట్టినా’ జనం బీజేపీని నమ్మడం లేదు. మరి మెజారిటీ ప్రజల మనోభావాలు ఎవరు పట్టింకుంటారు? జగన్ ఎవరికీ భయపడటం లేదు. ఒక్క మతానికి తప్ప! అందుకే అంతర్వేది ఘటన మరింత రచ్చకాకూడదన్న భయంతోనే సీబీఐ వేశారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినా జగనన్న చలించలేదు. ఇప్పుడు తాను రంగప్రవేశం చేసినందుకే జగనన్న భయపడి, సీబీఐకి ఆర్డరేశారు. ఇదీ టీడీపీ అంచనా! హిందూ మతానికి ప్రతినిధిగా ఉందనుకుంటున్న భాజపానేమో, అనేకానేక మొహమాటాలతో జగనన్న ఇబ్బందిపడకుండా చూస్తోంది. సో.. అదే మతాన్ని ఎత్తుకుని తామే అస్త్రంగా సంధిస్తే సరి. ఇదీ టీడీపీ వేస్తున్న తాజా లెక్క!

తాను అధికారంలో ఉండగా, ముస్లిం-క్రైస్తవులకు ఎంత చేసినా, ఆ వర్గాల వారికి ఎన్ని పదవులిచ్చినా, వారు గత ఎన్నికల్లో జగనన్నకే జై కొట్టారు. మరి ఇప్పుడూ అదే పాలిసీ కొనసాగిస్తే.. ఉన్నదీ-ఉంచుకున్నదీ పోయినట్లు, ఉభయ భ్రష్ఠత్వం తప్పదు. అందుకే.. రోమ్‌లో రోమన్ మాదిరిగా ఉండాలన్న సిద్ధాంతాన్ని అమలుచేసేందుకు, బాబు రెడీ అయిపోయారు. అందుకే స్కూలు మార్చి, కొత్త పొలిటికల్ స్కూల్‌లో చేరిపోయారు.  వారం పాటు దేవాలయాల్లో పూజలు చేయడం ద్వారా.. తమ నిరసన ప్రకటించాలని పిలుపునిచ్చారు.

మరి బాబు అధికారంలోనే ఉన్నప్పుడే, విజయవాడలో పుష్కరాల సమయంలో 46 ఆలయాలు కూల్చేశారు కదా? అలాంటి పార్టీకి హిందువుల గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిదని సోమువీర్రాజు లాంటి వాళ్లు నిలదీస్తున్నారు. నిజమే. మరి అప్పుడు గుళ్ల శాఖకు మంత్రిగా ఉన్నది భాజపా నాయకుడే కదా? మరి అప్పటి వైఫల్యంలో భాజపా భాగస్వామ్యం కూడా ఉంది కదా! మరి అప్పుడు గుళ్ల మంత్రి ఎందుకు రాజీనామా చేయలేదు? అన్న ఎదురుదాడికి తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు. తాము మోదీ సర్కారులో భాగస్వామిగా ఉన్నప్పటి కాలంలో.. ఆ ప్రభుత్వ విజయాలతోపాటు, వైఫల్యాలకూ భాగస్వామిగానే ఉన్నందున, అదే సూత్రం.. రాష్ట్రంలో తమతో అధికారం పంచుకున్న భాజపాకూ వర్తిస్తుందన్నది ఇప్పుడు తమ్ముళ్లు కొత్తగా తెరపైకి తీసుకువస్తున్న వాదన.

కొత్తగా హిందూ కార్డు మీదేసుకుంటే.. మిగిలిన మతాలు దూరం కావా? అన్నది మరో సందేహం. అయితే.. ఇప్పటికే ఎలాగూ రాజకీయంగా నష్టపోయినందున, దానివల్ల ఇప్పుడు కొత్తగా వచ్చే నష్టమేమీ లేదు. ఇంకా ఏమైనా ఉంటే లాభమేనన్నది బాబుగారి ఆలోచనలా ఉంది. లాభం ఎలాగంటే.. కనీసం హిందువులయినా, గంపగుత్తగా తన దరికి చేరతారన్న ఆశట! బీజేపీ మొహమాటాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నది మరో వ్యూహంగా కనిపిస్తోంది. అలాగని దళితులను వదిలేయడం కదా? రాష్ట్రంలో దళితులపై శరపరంపరగా జరుగుతున్న దాడులకు నిరసనగా ఎలాగూ పోరాడుతున్నందున, వారిని దూరం చేసుకునే సమస్య ఉండదన్నది మరో సూత్రీకరణ.

బీజేపీ హిందుత్వ కాడిని కిందిపడేసినందున, దానిని తాము ఎత్తుకోవడం ద్వారా.. ఆ పార్టీ ఆయువుపట్టును దెబ్బతీయాలన్న వ్యూహం, టీడీపీ ఎత్తగడలో కనిపిస్తోంది. ఎందుకంటే, బీజేపీ భుజాలకెత్తుకోవలసిన అజెండాను తాము తీసుకున్నందున, మెజారిటీ ప్రజలు వాస్తవాలేమిటో గ్రహిస్తారన్నది టీడీపీ అంచనా. యంత్రాంగం- నాయకులు- పార్టీ నిర్మాణ వ్యవస్థ ఉన్నందుకే, అంతర్వేది అంశంలో తాము చేసిన సీబీఐ డిమాండును, జగన్ సర్కారు ఆమోదించిందని టీడీపీ భావిస్తోంది. పైగా బీజేపీ నేతల కంటే ముందుగానే, తమ పార్టీ నేతలు అక్కడికి వెళ్లడం-బీజేపీ నేతలు కొద్దిరోజుల తర్వాత వెళ్లడంతో.. హిందువులు బీజేపీ ఎటు వైపు ఉందన్న అంచనాకు రావడం ద్వారా, తమ చిత్తశుద్ధి గమనిస్తారన్నది తెలుగుదేశీయుల అంచనా. మొత్తానికి తెలుగుదేశం మఠాథిపతి చంద్రబాబునాయుడు స్వామి వారు, హిందువుల మనోభావాలు రక్షించాలని కోరుతూ, తన భక్తులతో వారం రోజుల పాటు పూజలు చేయిస్తున్నారు. మంచిదే!