పీపీకి భారతరత్న ప్రతిపాదించిన కేసీఆర్
(మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

రాజకీయ ఆత్మహత్యల్లో ఎవరయినా కాంగ్రెస్ పార్టీ తర్వాతనే. అలాంటి అవకాశం ఆ పార్టీ మరొకరికి ఇవ్వదు. దివంగత నేత పీవీ నరసింహారావు వ్యవహారమే అందుకు నిదర్శనం. తెలంగాణ బిడ్డ పీవీకి భారతరత్న ఇవ్వాలని కోరే సమయం-ఓపిక-తీరిక- బుర్ర బుద్ధి లేని కాంగ్రెస్ వీరుల తెలివిని, తెలంగాణ సీఎం కేసీఆర్ లౌక్యం- రాజకీయంగా సొమ్ము చేసుకున్నారు. తానే ఆ తీర్మానం ప్రవేశపెట్టి, పీవీకి కాంగ్రెసోళ్ల కంటే తమకే ఎక్కువ ప్రేమ ఉందన్న సంకేతాలు, తెలంగాణ సమాజంతోపాటు దేశ ప్రజలకూ పంపించారు. ఏదైనా తెలివంటే శేఖరన్నదే!

పీవీకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ శాసనసభ తీర్మానించింది. దానిని తెరాస ప్రభుత్వమే ప్రవేశపెట్టడం ఇంకో విశేషం. నిజానికి ముహదస్తుగా ఇలాంటి రాజకీయ ప్రతిపాదన చేయాల్సింది కాంగ్రెస్ పార్టీనే.  పీవీకి భారతరత్న కోసం తమ పార్టీ విశేషంగా కృషి  చేసిందనే మైలేజీ సాధనకు, కాంగ్రెస్ పార్టీనే ఆ మేరకు చొరవ చూపాల్సి ఉంది. కానీ.. అది కాంగ్రెస్ పార్టీ కదా? పైగా ఇటలీమాత సోనియమ్మకు, అప్పట్లో కంటగింపుగా మారిన పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చే స్తే అమ్మతల్లి అనుగ్రహిస్తుందో? ఆగ్రహిస్తుందో ఎవరికి తెలుసు? వీటికి మించి.. పార్టీ పరంగా తామే ఆ డిమాండ్ తెరపైకి తీసుకువస్తే.. కాషాయదళాలు బాబ్రీ మసీదు కూల్చినా, పీవీ చోద్యం చూశారన్న కడుపుమంటతో ఉన్న ముస్లిములు, పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందన్న మరో భయం.  అందుకే వ్యూహాత్మకంగా అసలా ముచ్చట జోలికే వెళ్లకుండా గప్‌చుప్పయిపోయింది.

కానీ అక్కడ ఉన్నది ఘటనాఘట సమర్ధుడయిన కేసీఆరాయె! ఇలాంటి అవకాశం వస్తే ఆయన గమ్మున కూర్చుంటారా? అసలే పీవీ శతజయంతి పేరిట, దేశంలో ఆకాశమంత అరుగు-భూమంత పల్లకీ వేసి ‘పీవీ తమవాడేనని’ డిక్లరేషన్ ఇచ్చేశారాయె! అందుకే కాంగ్రెస్ చేయాల్సిన పనిని తాను చేసి, దాని మాడు పగలకొట్టారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ, సభలో తీర్మానం ప్రవేశపెట్టి తెలంగాణ సమాజం పెదవులపై చిరునవ్వులు పూయించారు. ఇది కాంగ్రెస్‌కు ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చిట్లయింది. సరే.. ఎలాగూ పీవీకి భారతరత్న ఇవ్వాలని తీర్మానించారు కాబట్టి.. పనిలోపనిగా,  ‘ఎప్పుడూ గలగల మాట్లాడే’ మాజీ ప్రధాని మన్మోహన్ సర్దార్జీకీ, అదే చేతితో భారతరత్న అవార్డు ఇవ్వాలన్న ఓ మాట పడేశారు. రాజకీయాల్లో హత్యలుండవు. ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని కాంగ్రెస్‌ను చూస్తే మరోసారి రుజువయింది. ఫాఫం.. కాంగ్రెస్!

By RJ

Leave a Reply

Close Bitnami banner