హస్తినలో రఘురాముడి హిందూ శంఖారావం!

671

దేవాలయాలపై దాడులకు నిరసనగా రఘురామకృషణరాజు దీక్ష
తరలిరానున్న జాతీయ మీడియాతో వైకాపాకు ప్రాణసంకటమే
పార్టీ బహిష్కరణే పరిష్కారమంటున్న వైకాపా ఎంపీలు
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఆయన అధికారంలో ఉన్న జగన్మోహన్‌రెడ్డి పార్టీకి చెందిన ఎంపీ. లెక్క ప్రకారమయితే అందరిలా పార్టీ చెప్పిందే చేయాలి. ఆ భజన మాత్రమే చేయాలి. అందులో రాగం-తాళం శృతి తప్పకూడదు. అధినేతను పోటీలు పడి మరీ పొగడాలి. ఈయనేమో అందుకు విరుద్ధం. కారణాలేమయినా సరే… ఇప్పుడు రాష్ట్రంలో హిందువుల మనోభావాలకు నిఖార్సయిన ప్రతినిధిగా నిలిచారు. హిందుత్వంపై పేటెంటీ ఉందనుకునే బీజేపీ గొంతు సవరించుకోవాలా? వద్దా? అని ఆలోచించుకునేలోపే.. ఆయన స్వరం పెంచుతారు. ఆ దాడులు దేవాలయాలపైనయినా సరే, రథాల దహనకాండపైనయినా సరే..  సొంత సర్కారుపైనే శివమెత్తుతారు. అలా హిందువుల మనోభావాలకు ఏకైక రాజకీయ ప్రతినిధిగా అవతరించారు. ఇప్పుడు ఏకంగా… హిందువుల మనోభావాలను గాయపరుస్తున్న ఉన్మాదచర్యను ఖండిస్తూ.. కేంద్రానికి తన శంఖారావం వినిపించేలా.. జాతీయ మీడియాకు కనిపించేలా.. ఏపీలో హిందుత్వంపై శరపరంపరగా జరుగుతున్న దాడులు దేశ ప్రజలకు తెలిసేలా.. దేశ రాజధానిలో నిరసన దీక్ష నిర్వహించనున్నారు. ఇంతకూ.. దేశ రాజధానిలో హిందూశంఖారావం వినిపించే ఆ యోధుడెవరంటే.. కనుమూరి రఘురామకృష్ణంరాజు.

ఏపీలో జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిత తర్వాత.. హిందూ ఆలయాలపై వరస దాడులు, రథాల దహనకాండ ఘటనలు దేశప్రజల దృష్టికి తీసుకువచ్చేందుకు, వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు రంగంలోకి దిగారు. ఇప్పటికే బీజేపీ కంటే ముందుగానే వివిధ ఘటనలపై స్పందించారు. టీటీడీ భూముల అమ్మకాల నుంచి అంతర్వేది ఘటన వరకూ స్పందించి, జగన్మోహన్‌రెడ్డి సర్కారును ‘రచ్చబండ’లో చాకిరేవు పెడుతున్నారు. ఈవిధంగా హిందుత్వంపై పేటెంటీ ఉందని ప్రచారం చేసుకునే భాజపా కంటే, ముందుగానే స్పందిస్తున్న రఘురామకృష్ణంరాజు తీరు అసలు సిసలు  హిందుసంస్థ నాయకుడిని తలపిస్తోంది. నిజానికి ప్రజలు కూడా.. హిందుత్వంపై దాడుల సమయంలో, పెనువేగంతో స్పందించని భాజపా నేతల మౌనాన్ని చూసి.. వారి కంటే ఒంటరి సైనికుడయినా రఘురాముడే మిన్న అనే భావనతో కనిపిస్తున్నారు.

అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథాన్ని మత ముష్కరులు తగులబెట్టిన ఘటన, రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దీనికి జగన్మోహన్‌రెడ్డి జవాబివ్వాలని భువనేశ్వరి పీఠాథిపతి కమలానంద భారతి స్వామి నుంచి హిందూ సంస్థల వరకూ డిమాండ్ చేస్తున్నారు. దీనికి నిరసనగా జనసేన-భాజపా తాజాగా నిరసనదీక్షలు నిర్వహించగా, టీడీపీ-అఖిల భారత హిందూ మహాసభ ఘటన జరిగిన వెంటనే అంతర్వేదికి వెళ్లాయి. హిందూ సంస్థలయితే పోలీసులు నిషేధాజ్ఞలు ధిక్కరించి, బారికేడ్లను తోసుకుని దేవాలయం వద్దకు చేరుకుని, మంత్రులను నిలదీసిన  వైనం ఉద్రిక్తతకు దారితీసింది. ఆ తర్వాత బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అక్కడికి వెళ్లి, ప్రభుత్వ వైఫల్యాన్ని తూర్పారపట్టారు. అంతకంటే ఎక్కువగా, గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఘటనలు ప్రస్తావించి, అంతర్వేది ఆందోళనకు మద్దతు పలికిన టీడీపీని కూడా తూర్పారపట్టారు. సోము వీర్రాజు విమర్శల్లో 20 శాతం వైకాపాపై ఉంటే, 80 శాతం టీడీపీపైనే ఉండేలా జాగ్రత్తపడుతున్నారన్నది బహిరంగ రహస్యమే.

ఈ నేపథ్యంలో అంతర్వేది ఘటనతోపాటు.. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ, ఇప్పటివరకూ హిందుత్వంపై జరుగుతున్న నిర్నిరోధ దాడులను దేశ ప్రజల దృష్టికి తీసుకువచ్చేందుకు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు శుక్రవారం ఢిల్లీలో, 8 గంటలపాటు దీక్ష నిర్వహించనుండటం ఆసక్తికరంగా మారింది. నిజానికి వామపక్ష-ఇతర మతాల చేతిలో జాతీయ మీడియా సంస్థలు బందీగా ఉండటంతో.. ఏపీలో హిందుత్వంపై జరుగుతున్న దాడులు, దేశప్రజల దృష్టికి వెళ్లడం లేదన్నది హిందూ సంస్థల ఆరోపణ. దీనిని గ్రహించినందుకే రఘురామకృష్ణంరాజు..  ఏపీలో జరుగుతున్న పరిణామాలకు నిరసనగా, ఢిల్లీలో దీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆయన దీక్షపై, జాతీయ మీడియా ప్రతినిధులకు సమాచారం అందింది. పైగా రాజు దీక్షకు ఒక శంకరాచార్య హాజరుకానున్నట్లు సమాచారం.

రఘరాముడి దీక్షతో.. రాష్ట్రంలో దేవాలయ వ్యవస్థ-హిందుత్వంపై జరుగుతున్న దాడులు, జాతీయ మీడియా పుణ్యాన..  కచ్చితంగా దేశవ్యాప్త చర్చకు తెరలేవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రధానంగా.. పార్లమెంటు సమావేశాలకు ముందు దీక్ష నిర్వహిస్తుండటం వల్ల.. అది రాజకీయంగా ఏపీలో అధికార వైకాపా సర్కారుకు, వ్యక్తిగతంగా జగన్మోహన్‌రెడ్డి ఇమేజీకి డ్యామేజీగా మారనుంది. వైకాపా నేతలు కూడా ఇదే అంశంపై ఆందోళన తో కనిపిస్తున్నారు. ‘ఇప్పటివరకూ ఆయన మాపై ఏం మాట్లాడినా వాళ్లతో వీళ్లతో మాట్లాడిస్తున్నాం. కేసులు పెట్టిస్తున్నాం. రాజకీయంగానే ఎదుర్కొంటున్నాం. కానీ ఇప్పుడు రాజు చేస్తున్న దీక్ష సాధారణ అంశంపై కాదు. పూర్తి సెంటిమెంటుతో కూడిన హిందుత్వ అంశం. మరి అప్పుడు ఆయనను ఏవిధంగా విమర్శించాలి? ఆయనను మేం ఏం విమర్శించినా, అది హిందుత్వాన్ని విమర్శించినట్టే అవుతుంది. దానిని ఆయన మళ్లీ అనుకూలంగా మార్చుకుని రచ్చబండ పెడతాడు. ఈ తలనొప్పి ఉంటుందనే మేం, ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని ఎప్పటినుంచో చెబుతున్నాం. కానీ ఎవరికీ భయపడని జగన్ గారు, రాజుకు ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేద’ని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

ఈ ప్రభావం పార్లమెంటు మొదలయిన తర్వాత కూడా.. తమ పార్టీపై ఉంటుందని మరో ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘పార్లమెంటు సమావేశాల్లో మీ మీడియా వాళ్లు మమ్మల్ని వదిలిపెడతారా? ఇతర పార్టీ వాళ్లు మమ్మల్ని అడిగితే ఏం చెప్పాలి? మీ సొంత పార్టీ ఎంపీనే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ప్రస్తావిస్తే, మేం వారికి ఏం సమాధానం చెప్పాలి? అందుకే సమావేశాలకు ముందే,  పార్టీని భ్రష్టుపట్టిస్తున్న రాజును బహిష్కరించడమే సరైన పరిష్కారం’ అని సీమకు చెందిన ఓ ఎంపీ వ్యాఖ్యానించారు. పార్టీలో క్రమశిక్షణ తప్పుతున్నా జగన్ మౌనంగా ఉంటున్నారన్న వ్యాఖ్యలు ఇప్పటికే పార్టీలో అంతర్గతంగా వినిపిస్తున్నాయంటున్నారు.  నిజానికి.. మెజారిటీ పార్టీ  నేతలు కూడా, దాదాపు ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేయడం గమనార్హం.

 ఈ విధంగా ఏపీలో హిందుత్వంపై జరుగుతున్న దాడులను ‘ఒకేఒక్కడు’గా నిలిచి.. మొండిగా జగన్ సర్కారును ఎండగడుతున్న రఘురాముడు,  హిందువుల మనోభావాలకు ప్రతినిధిగామారుతుండటం చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవలసింది భాజపా నాయకత్వమే! ఆ పార్టీకి సుజనాచౌదరి, సీఎం రమేష్, టిజి వెంకటేష్ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఇక యుపి నుంచి ఎన్నికయినా, తరచూ ఏపీ పార్టీ వ్యవహారాల్లో కాళ్లు-వేళ్లు పెట్టే జీవీఎల్‌తో కలిపి, ఆ పార్టీకి నలుగురు ఎంపీలున్నారు. వారెవరికీ రాష్ట్రంలో హిందుత్వంపై జరుగుతున్న దాడులకు నిరసనగా, ఇలాంటి దీక్ష నిర్వహించాలన్న ఆలోచన రాకపోవడమే విస్మయకరం. మరి..  భాజపా సభ్యుడు కాకపోయినా, హిందూ సంస్థల ప్రతినిధి కాకపోయినా.. అధికార వైకాపా సభ్యుడయినప్పటికీ, జగన్మోహన్‌రెడ్డికి ఎదురు నిలిచి, హిందుత్వంపై జరుగుతున్న దాడులకు స్పందించి, ఢిల్లీలో శంఖారావం పూరిస్తున్న రఘురాముడు మొనగాడా? కాదా?