అవును.. తెలంగాణకు ఒక మొనగాడొచ్చాడు!

320

రజాకార్ల అకృత్యాలను మళ్లీ గుర్తుచేస్తున్న బండి సంజయ్
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఆయన చూడ్డానికి సన్నగా-రివటలా కనిపిస్తారు. నుదుట ఎప్పుడూ బొట్టుతో కనిపించే ఆయన పదిమందిలో ఉంటే ఎవరన్నదీ మొన్నటి వరకూ  తెలియదు. మరి ఈ మనిషేనా.. నిజాం నవాబు పాలన-రజాకార్ల అకృత్యాలను గుర్తు చేసే క్రమంలో, కేసీఆర్ సర్కారును దునుమాడుతోంది? ఈ పీలగా ఉండే మనిషేనా పెద్ద గొంతుతో సర్కారును నిలదీస్తోందీ? ఈ బక్కపలచని మనిషేనా.. నయా రజాకారు పాలనంటూ తెరాస-మజ్లిస్‌పై జమిలిగా స్వారీ చేస్తోంది? ఈ కుర్రవాడేనా మజ్లిస్‌ను చూపుడువేలితో ప్రశ్నిస్తూ సవాళ్లు విసురుతోందీ? ఈ నాయకుడిని చూసేనా.. తెలంగాణలో ఎట్టకేలకూ ఒక మొనగాడొచ్చాడని చప్పట్లు కొడుతోందీ?.. ఎస్.. ఆయనే తెలంగాణ బీజేపీ దళపతి-ఎంపీ  బండి సంజయ్!

నిజాం నవాబుల దాస్యశృంఖాలు-రజాకార్ల అరాచక పాలన నుంచి  విముక్తి పొంది… హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడి.. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ… ఇంతవరకూ ఏ ఒక్క నాయకుడూ రజాకార్లపై పోరాడిన సమరయోధుల తలుపు తట్టింది లేదు. భుజం తట్టి కాళ్లు మొక్కిందీ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో భాజపా అధ్యక్షులుగా, కేంద్రమంత్రులుగా పనిచేసిన ఎవరికీ అవి గుర్తుకురాలేదు. కానీ.. ఇప్పుడాపని తెలంగాణ భాజపా దళపతి సంజయ్ చేస్తున్నారు. తెలంగాణ చరిత్ర చెప్పేందుకు యాత్రలతో జనంలోకి దూసుకువెళుతున్నారు. తెలంగాణ అంటే కేసీఆర్ కాదని.. తెలంగాణ అంటే కొమరం భీం, సర్వాయి పాపన్న అని గుర్తుచేస్తున్నారు. అదే ఇప్పుడు వార్త. విశేషం కూడా!

అప్పుడెప్పుడో నిజాం పాలనను మెచ్చుకున్న,  కేసీఆర్ మాటలే ఆయుధంగా దూసుకుపోతున్న సంజయ్.. అదే నిజాం నవాబుల పాలన-రజాకార్ల కిరాతకాలపై సమరశంఖం పూరించిన నాటి సమరయోధుల గడప తొక్కుతున్నారు. అపమరుల సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పిస్తున్నారు.   సమరయోధులు- వారి వారసుల కాళ్లు మొక్కి , వారి దీవెనలందుకుంటున్నారు. ఆ సందర్భంగా రజాకార్ల భుజంపై తుపాకీ పెట్టి.. మజ్లిస్- దానిని ప్రోత్సహిస్తున్న కేసీఆర్‌పై ఎక్కుపెడుతుండటం చర్చనీయాంశమయింది. గత కొద్దిరోజుల నుంచి సంజయ్.. తెలంగాణ జిల్లాల్లో యాత్రలు చేస్తున్నారు.  నాటి నిజాం నవాబుల పాలనకు ఎదురొడ్డి పోరాడిన వీరుల కుటుంబసభ్యులను కలుస్తున్నారు.

ఈ సందర్భంగా నిజాం నవాబులతోపాటు.. మజ్లిస్‌ను వెనుకేసుకుని వస్తున్న కేసీఆర్ తీరును ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. సెప్టెంబర్ 17ను,  అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ, బండి సంజయ్ నిర్వహిస్తున్న యాత్ర హిందూ సమాజంలో సరికొత్త ఆలోచనలకు బీజం వేస్తోంది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఈ స్థాయిలో, ఇంత విస్తృతంగా రజాకార్ల అకృత్యాలను గుర్తు చేస్తున్న నాయకుడు సంజయ్ ఒక్కరే కావడంతో, ఆయన యాత్రలకు అపూర్వ స్పందన లభిస్తోంది.

‘నిజాం గొప్పవాడని కేసీఆర్ అసెంబ్లీలో పొగిడి, ఆయన సమాధి వద్ద మోకరిల్లాడు. కొమరం భీం కంటే నిజాం ఎందులో గొప్పవాడు?  ఇది కొమరం భీంతోపాటు ఎంతమందినో రాక్షసంగా చంపి, తెలంగాణ మహిళలతో నగ్నంగా బతుకమ్మలు ఆడించిన రజాకార్లను సమర్ధించి, తెలంగాణ సమజాన్ని అవమానించడమే. మజ్లిస్ మెప్పు కోసమే కేసీఆర్ విమోచన దినం ప్రకటించేందుకు భయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామ’ని హిందువుల్లో స్పూర్తి రగిలించే ప్రసంగాలు చేస్తున్నారు.

నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఆరుట్ల రాంచంద్రారెడ్డి-కమలాదేవి దంపతులకు నివాళులర్పించిన సంజయ్.. రేణికుంటలో ఉన్న పోరాటయోధుడు చింతలపూడి రాంరెడ్డి కుటుంబం దీవెనలు అందుకున్నారు. కూటిగల్లు, తరిగొప్పుల, అమరధామం గ్రామాలకు వె ళ్లి అక్కడి అమరులకు, బైరాన్‌పల్లి బురుజును సందర్శించి నివాళులర్పించారు. తెలంగాణ చరిత్రను కేసీఆర్ కుటుంబం సొంతం చేసుకునే కుట్రలు చేస్తున్నందుకే, తాము తెలంగాణ చరిత్రను ప్రజలకు గుర్తు చేసేందుకే యాత్రలు చేస్తున్నామంటూ.. సంజయ్ జనంలోకి వెళుతున్నారు. ఆయన వెళ్లిన ప్రతిచోటా రజాకార్ల ప్రతినిధి అయిన మజ్లిస్‌తో కుమ్మక్కయినందుకే, సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించడం లేదన్న ప్రచారానికి పదునుపెడుతున్నారు. ప్రధానంగా.. మహిళలతో నగ్నంగా బతుకమ్మ ఆడించిన రజకార్ల పార్టీ అయిన మజ్లిస్‌తో,  టీఆర్‌ఎస్ కలసి నడుస్తోందన్న నినాదాన్ని, హిందూ సమాజంలోకి బలంగా తీసుకువెళుతుండటం చర్చనీయాంశమయింది.

సంజయ్ యాత్రలు అటు భాజపాలో జోష్ నింపుతుండగా, హిందూ సమాజంలో కొత్త ఆలోచనలతోపాటు.. నాటి రజాకార్ల దురాగతాలు మరోసారి తెరపైకొచ్చేందుకు దోహదపడుతున్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో, సంజయ్ వెళ్లిన గ్రామాల్లో ఆయనకు సాధారణ ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతుండటం విశేషం. సంజయ్ కార్యక్రమాల్లో హిందూ సంస్థల కార్యకర్తలు కూడా భారీగా పాల్గొంటున్నారు. మహిళలతో నగ్నంగా బతుకమ్మ ఆడించిన రజాకార్ల పాలనపై సంజయ్ విరుచుకుపడినప్పుడల్లా స్థానికుల నుంచి భారీ స్పందన వ్యక్తమవుతోంది.