ఇంతకూ తమలపాకు సమరమా? బంతిపూల యుద్ధమా?
వైసీపీ కంటే టీడీపీ పాలనపైనే విమర్శలు
అంతర్వేదిపై బీజేపీ భాష్యం చూతమురారండి
               ( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

‘‘మేం రాష్ట్రంలో నిర్మాణాత్మకపాత్ర పోషించబోతున్నాం. వైసీపీ-టీడీపీకి సమాన దూరం పాటిస్తాం. మాకు అధికారం ఇస్తే 13 జిల్లాలను 13 రాజధానులను చేస్తాం. మా దగ్గర స్కడ్లు ఉన్నాయి. ఇకపై బీజేపీని.. బీజేపీనే నడపబోతోంది’’
– ఆంధ్రప్రదేశ్ భాజపా అధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాత, సోము వీర్రాజు పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలివి. పార్టీకి పాత కాపు అయినప్పటికీ, కొత్తగా అధ్యక్షుడయిన సోమన్న చేసిన గంభీర ప్రకటనలు చూసి.. నిజంగానే సోమన్న, తన దళంతో వైసీపీ సర్కారుపై సమరశంఖం పూరించి, ప్రతిపక్షమైన టీడీపీని భూస్థాపితయ్యేలా చేసి, వచ్చే ఎన్నికల నాటికి కమలం పువ్వును విరబూయిస్తారని ఆ పార్టీ నేతలు సంబరపడ్డారు. కానీ.. ఇప్పటివరకూ ఆయన చేసిన ప్రకటనల బట్టి.. అసలు సోమన్న సారథ్యంలో వైసీపీపై చేస్తున్న పోరాటం తమలపాకులతోనా? బంతిపూలతోనా? అన్నది కమలదళాలకు భేతాళ ప్రశ్నలా మారింది.

సోము వీర్రాజు పార్టీ పగ్గాలు అందుకున్న తర్వాత, ఏపీలో భాజపా పాదరసం-గాలి  కంటే వేగంగా విస్తరిస్తోందట. షోకాజ నోటీసులివ్వకుండానే, ముగ్గురు నలుగురిని సస్పెండ్ చేసినా.. వందలు, వేల సంఖ్యలో తెలుగుదేశం-కాంగ్రెస్-చివరకు కమ్యూనిస్టుల  నుంచి కూడా పోటీలు పడి మరీ కమల తీర్థం తీసుకుంటున్నారట. కేంద్ర నాయకత్వం గుండె కూడా.. రాష్ట్రంలో పార్టీ విధానాలు, ముగ్గురు-నలుగురు నాయకుల వైఖరి చూసి ఉప్పొంగిపోతోందట. రాష్ట్రంలో అధికార పార్టీకి అసలు సిసలు ప్రతిపక్షం వచ్చిందని, విపక్షపార్టీకి చెందిన ప్రభుత్వాన్ని ప్రకాశం పంతులు మాదిరిగా.. గుండెలు-గుండీలు చీల్చి ఎదురొడ్డే అధ్యక్షుడు వచ్చారని సంబరపడిపోతోందట. పూర్వాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా, ఇప్పటి సోము  స్థాయిలో గుండె ధైర్యంతో పోరాడలేక చేతులెత్తేశారని గ్రహించిదట.  ‘రాజీ లేకుండా’ జగన్మోహన్‌రెడ్డి సర్కారుపై రణనినాదం చేస్తున్న సోమన్న నాయకత్వంలోనే, పార్టీ మూడు పువ్వులు-ఆరుకాయలుగా వర్థిల్లి, ఇప్పుడున్న 24శాతం నుంచి 40 శాతం ఓట్ల శాతానికి చేరుకుని, ఖాయంగా గద్దెనెక్కుతుందన్న తీర్మానికి వచ్చింద ట. ఇది  నిజంగా నిఝం!

శాసనసభలో ఎమ్మెల్యేలున్న ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కంటే.. సభలో ఒక్క సీటుకూ తెరవు లేకపోయినా, అనేక అంశాలపై జగన్ సర్కారును ‘మూడుచెరువుల నీళ్లు తాగిస్తున్న’ సోము వీర్రాజు సేనను చూసి, కేంద్ర పార్టీ నాయకత్వం కూడా,  ‘తమ ఎంపిక సరైనదే’నని మురిసిపోతోందట. అసలు ఇంత సమర్ధుడు-నిజాయితీపరుడు-ముక్కుసూటి నాయకుడు- అధికార పార్టీపై రాజీలేకుండా చేగువేరా స్థాయిలో పోరాడే అంకితభావం గల నాయకుడికి, ఆలస్యంగా పగ్గాలప్పగించినందుకు.. అటు కార్యకర్తలు, ఆంధ్రరాష్ట్ర ప్రజలు కూడా జాతీయ పార్టీ నాయకత్వాన్ని తప్పు పడుతున్నారట. ఇది కూడా  నిజంగానే నిఝం!

అంతర్వేది ఆలయ రథం కాలిన తర్వాత.. అన్ని రాజకీయ పార్టీల నేతలూ జగన్మోహన్‌రెడ్డి సర్కారుపై విరుచుకుపడ్డారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. సహజంగా మతాలంటే కిలోమీటర్లు భయపడి పారిపోయే తెలుగుదేశం పార్టీ కూడా, చరిత్రలో తొలిసారిగా తన పంథా మార్చుకుని, హిందూమతానికి వాటిల్లిన ప్రమాదంపై పెదవి విప్పింది. సంఘటనా స్థలానికి టీడీపీ నేతలు వెళ్లి,  పూర్వాపరాలు విచారించారు. దానిపై ప్రభుత్వాన్ని విమర్శించారు. చివరకు ఈ అంశంపై ఢిల్లీలో ఉన్న వైసీపీ ఎంపి రఘురామృష్ణంరాజు కూడా అందరికంటే ముందే గళం విప్పి, హిందూమతంపై జరుగుతున్న దాడులపై నిప్పులు చెరిగారు. హిందూ సంస్థలయితే ఘటన జరిగిన వెంటనే అక్కడికి వెళ్లి, నిరసన స్వరం వినిపించాయి.

ఆ సమయంలో  సోము వీర్రాజు చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన అంత ధైర్యంగా, అంత నిర్భీతిగా ఎలా ప్రకటన చేయగలిగారని అంతా నోరెళ్లబెట్టారు. ప్రతిరోజూ ప్రధాన ప్రతిపక్షంపై విరుచుకుపడి, జగనన్న మెప్పుకోసం పరితపించే అధికార వైసీపీ గళధారులు మాత్రం,  సోమన్న ప్రకటనపై ఈర్ష్యపడ్డారు. తమ కంటే గొప్పగా, తాము చేయాల్సిన విమర్శలకంటే మిన్నగా, ప్రధాన ప్రతిపక్షంపై మాటలదాడి చేసిన సోమన్న ప్రకటనపై వైసీపీ నేతలు తెగ కుళ్లుకున్నారు. వైసీపేయులు అంతగా ఈర్యపడి, కుళ్లుకునేంత స్థాయిలో వీర్రాజు ఏం మాట్లాడారనుకుంటున్నారా? ‘‘ కృష్ణా పుష్కరాల్లో పలు ఆలయాలను నేలమట్టం చేసిన టీడీపీకి అప్పుడు హిందుత్వం గుర్తుకురాలేదా? హిందుత్వంపై దాడులు జరుగుతున్నాయంటూ మాట్లాడే హక్కు టీడీపీకి లేదు. ఆలయాలను కూల్చేసిన చంద్రబాబు ఐదేళ్లలో ఒక్క ఆలయమైనా కట్టారా? అప్పుడు చినరాజప్ప ఎక్కడున్నారు? అప్పుడు మాట్లాడని రాజప్ప, ఇప్పుడు అంతర్వేదిపై ఎలా మాట్లాడతారు? రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన 7200 కోట్లు ఏం చేశారని మీడియా ఎందుకు ప్రశ్నించదు’- ఇదీ సోమన్న స్వరం నుంచి జాలువారిన ఆగ్రహాస్త్రం!

బహుశా.. సోమన్న ఇంకా చంద్రబాబు అనే ఆయన ముఖ్యమంత్రి-జగన్మోహన్‌రెడ్డి ప్రధాన ప్రతిపక్ష  నేతగానే ఉన్నారన్న భ్రమల్లో ఉన్నట్లు, ఆయన మాటలు చెబుతున్నాయి. వాళ్లిద్దరి పాత్రలు మారి 14 నెలలయి, ఇప్పుడు ‘తమ పాత్ర కూడా’ మారిందని  సోమన్న, ఇంకా గ్రహించకపోవడమే ఆశ్చర్యం. పాపం.. చాలామంది పార్టీ నేతలు, అంతర్వేది ఘటన తర్వాతయినా.. వీరన్న, జగనన్న సర్కారుపై విరుచుకుపడి, బీజేపీ ఇప్పుడు ఇంకో పార్టీకి ‘బీ టీము’గా ఉందన్న భ్రమల్లో బతుకున్న తమ కళ్లు తెరిపిస్తారేమోనని ఆశపడ్డారు. ఎందుకంటే.. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, ఆ పార్టీకి బీ టీముగా మారి.. ఇప్పుడు వైసీపీకి బీ టీముగా మారిందన్న నిందలు పడుతున్నారు కాబట్టి! కానీ వీరన్న, సర్కారుపై సమరశంఖం పూరించకుండా, ప్రతిపక్షంపై మరోసారి స్వారీ చేసి, వారి కళ్లు తెరిపించలేకపోయారు.

ఏ ప్రతిపక్షమయినా సహజంగా అధికారంలో ఉన్న పార్టీపై స్వారీ చేస్తుంటుంది. అధికారపార్టీ తప్పులపై కొరడా ఝళిపిస్తుంటుంది. ఏ చిన్న అవకాశం వచ్చినా, పాలకులను ఊపిరాడనీయకుండా ఎదురుదాడి చేస్తుంటుంది. పోరాడేందుకు తగిన అంశం కోసం కాచుకుని కూర్చుంటుంది. అలా నిర్విరామ పోరాటాలతో ప్రజలకు చేరువయి, అధికారంలోకి వచ్చేలా చూసుకుంటుంది. ఏ రాష్ట్రంలోనయినా-ఏ దేశంలోనయినా ప్రతిపక్షాలు చేసేది ఇదే. పదేళ్లు దేశాన్ని పాలించిన యుపిఏపై భాజపా కూడా చేసింది ఇలాంటి పోరాటమే. కానీ- ఏపీలో మాత్రం సీనియర్లకే సీనియర్, 40 ఏళ్ల నుంచి పార్టీ మారకుండా భాజపాలోనే ఉన్న తమ నేత వీర్రాజు నాయకత్వం మాత్రం,  ప్రతిపక్షానికి కొత్త నిర్వచనమీయడం భాజపేయులను నోరెళ్లబెట్టేలా చేస్తోంది. అధికార పార్టీపై స్వారీ చేయకుండా, మరో ప్రతిపక్షంపై పోరాడితే వచ్చేది కంఠశోషతోపాటు.. అధికారపార్టీకి బీ టీముగా మారిందన్న నింద తప్ప, మరొకటి కాదన్నది భాజపేయుల వాదన, వేదన! అంతర్వేది వంటి అంశాన్ని వేదికగా చేసుకుని, సర్కారుపై విరుచుకుపడే బదులు.. ప్రజల చేతిలో శాపగ్రస్థురాలిగా మారిన ప్రతిపక్షపార్టీని ప్రశ్నించడమే, కమలదళాలకు తాము ఎవరి వైపు ఉన్నామన్న కలవరం కలిగిస్తోంది.

అన్ని పార్టీలు- హిందూ సంస్థలు, ఘటన జరిగిన వెంటనే అంతర్వేదికి వెళితే.. భాజపా నాయకత్వం మాత్రం తీరి కూర్చుని, సంఘటన జరిగిన రోజుల తర్వాత చలో అంతర్వేదికి పిలుపునివ్వడం.. పోలీసులు, సోమన్న సహా పార్టీ నేతలను హౌస్ అరెస్టులు చేయడం, రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై కన్నెర్ర చేయడం కామెడీకి ఎక్కువ- సీరియస్‌నెస్‌కు తక్కువగా ఉన్నట్లుందనేది,  ‘మానసికంగా ఏ పార్టీకి ఆరువేలు కాని’ భాజపేయుల వ్యాఖ్య.  బజరంగ్‌దళ్ సహా ఓ అరడజను సంస్థల కార్యకర్తలే, అంతర్వేదిలో పోలీసుల బారికేడ్లు దాటుకుని వెళ్లారు. టీడీపీ- హిందూ మహాసభ నాయకులే అంతర్వేదికి వెళ్లి సంఘటన స్థలాన్ని సందర్శించారు. కానీ రాజమండ్రిలోనే కొలువుదీరిన అధ్యక్షుల వారికి, పక్కనే ఉన్న అంతర్వేదికి వెళ్లేందుకు ఇన్ని రోజులెందుకు పట్టింది చెప్మా? అన్నది భాజపేయుల సందేహం.

ఉపసంహారం: రాష్ట్రంలో పరిస్థితులు ఇలాగే ఉంటే కేంద్రం జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయినప్పటికీ… ఇది కేంద్ర పరిథిలోకి రాదని, ఢిల్లీలో ఉండే ఏపీకి చెందిన యుపి ఎంపి జీవీఎల్ నరసింహారావు ఇప్పటిదాకా తెరపైకి వచ్చి చెప్పకపోవడమే వింత! శాంతిభద్రతల అంశం రాష్ట్ర  పరిథిలోనిదని, అది ప్రభుత్వాలు చట్టపరంగా తీసుకునే నిర్ణయాలు కాబట్టి.. అందులో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటుందని జీవీఎల్ గారు,  ‘అలవాటు ప్రకారం’ ఇంకా ఎందుకు పెదవి విప్పలేదో కమలదళాలకు  అర్ధం కావడం లేదు.

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner