పిచ్చివాళ్ళ స్వర్గం!

339

-ఎం.వి.ఆర్.శాస్త్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిచ్చోళ్ళ బారిన పడ్డట్టు కనిపిస్తున్నది. ఇంతకుముందు కడప జిల్లా రాజంపేటలో,  నెల్లూరు జిల్లా బిట్రగుంటలో దేవుడిరథాలను పిచ్చివాళ్ళు తగల పెట్టినట్టు పోలీసులు కనిపెట్టారు. తరవాత తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం లో దేవతా విగ్రహాలనూ పిచ్చివాళ్ళే ధ్వంసం చేశారనీ సర్కారువారు దివ్యదృష్టితో కనుక్కున్నారు. ఇప్పుడు కొత్తగా అంతర్వేది దేవస్థానంలో పవిత్ర రథాన్నీ గుర్తు తెలియని పిచ్చివాళ్ళే పని గట్టుకుని దగ్ధం చేశారనీ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, పోలీసులు , మరియు పార్టీ పెద్దలు రెడీమేడ్ నిర్ణయాన్ని జనం మీద రుద్దుతున్నారు.

అంతర్వేదిలో అర్ధరాత్రి హిందూ వ్యతిరేక పిచ్చి ప్రకోపించ బోతున్నదని ముందేతెలిసి, ఆ ఘోరాన్ని చూడలేక సి. సి. కెమేరాలు చాలా కాలం ముందే కళ్ళు పొడుచుకున్నాయట!! 50 అడుగులపైగా ఎత్తు ఉండే రథశాల  పైన ఎక్కడో ఎవరికీ కనపడని చోట నిద్రపోతున్న తేనెటీగలకు కూడా సరిగ్గా అదే అర్ధరాత్రి పిచ్చి లేచిందట! ఎవరో ప్రభుదాసులను పిలుచుకొచ్చి ఓపొట్టి గడతో తమ పట్టును తగలబెట్టించుకుని ఆ తేనెటీగలు ఆనందంగా ఆత్మాహుతి చేసుకుంటూ తమతో పాటు తాటిచెట్టంత రథాన్ని కూడా కాకతాళీయంగా మంటలలో  మసి చేశాయట! ఈ దేవ రహస్యాన్ని అంజనం వేయకుండానే కనుగొన్న బాధ్యత గల పెద్దలను ఏ పిచ్చాసుపత్రిలో చేర్చాలో వెంటనే తేల్చకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  మునుముందు చాలా ప్రమాదం!ఈ రకమైన పిచ్చి వాగుళ్ళను సహించి ఊరుకుంటే ఆంధ్రప్రదేశ్ త్వరలోనే పిచ్చివాళ్ళ స్వర్గం గా మారిపోవచ్చు. హిందూ మతం మీద,హిందూ దేవస్థానాల మీద , ఎవరి జోలికీ వెళ్ళని హిందువుల విశ్వాసాల మీద,  సెంటిమెంట్లమీద, మనో భావాలమీద పగబట్టి , వరసగా నీచ , నికృష్ట   దాడులకు తెగబడుతున్న వారి ఆగడాలను వెంటనే అణచి వేయకపోతే రాష్ట్రంలో శాంతికి,  ప్రజా భద్రతకు, మత సామరస్యానికీ పెను ముప్పు తప్పదు.

ఉగ్రనారసింహుడు ఊరుకోడు! 

మహావిష్ణువు అవతారాలన్నిటిలోకీ మహోగ్రమైనది నారసింహావతారం. కోట్లాది హిందువులకు పరమపవిత్ర దివ్యక్షేత్రమైన అంతర్వేదిలో  నరసింహస్వామి దివ్యరథాన్ని దగ్ధం చేసిన వారు, చేయించిన వారు , వారిని ప్రేరేపించినవారు , కాపాడుతున్నవారు , దైవద్రోహంలో పాలు పంచుకునేవారు ఎవరైనా, ఎంతటివారైనా నామరూపాలులేకుండా మాడి మసికావటం తథ్యం.  ఉగ్రనారసింహుడు ఇప్పటికే హిందూ భక్తకోటిని పూనాడు. స్వతహాగాఎవరి జోలికీ వెళ్ళక , అవమానాలను,అపచారాలను మౌనంగా భరించే హిందువులకు ఓరిమి నశించింది. హిందూ సమాజం భగభగమండుతున్నది. ప్రకంపన మొదలైంది. అది మెల్లిగా పెను భూకంపంగా మారుతుంది. సింహం నిద్ర లేచేంతవరకే నక్కల , పిచ్చికుక్కల ఆట !

శభాష్  పవన్ కల్యాణ్ !! 

ఈ సందర్భంలో ఇంకో ముఖ్య విశేషమేమిటంటే హిందూసమాజం వాణిని , మనోగతాన్ని బలంగా స్ఫుటంగా వినిపించేందుకు తెలుగునాట ఒక గట్టి నాయకుడు  కనపడ్డాడు. అంతర్వేది దురాగతంపై జనసేనాధిపతి , పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెలువరించిన ఈ వీడియో రెండు నాల్కల కుహనా లౌకికవాద రాజకీయ గోమాయువులకు దిమ్మతిరిగే చెంపపెట్టు.ఇందులో పవన్ కల్యాణ్ చెప్పిన విషయాలలో
పునరుక్తి లాంటి దోషాలు ఉండవచ్చు. వీటిని ఇంతకంటే బాగా  , ఇంకా దృఢంగా , రసవత్తరంగా ఎందరో పెద్దలు చెప్పి ఉండవచ్చు. కాని సంఘ్ పరివార్ కు , దాని అనుబంధ , సోదర సంస్థలకు వెలుపల ఒక మెయిన్ స్ట్రీమ్ సెక్యులర్ రాజకీయ పార్టీ అధి నాయకుడు ఈ దేశ  రాజకీయాలను పిశాచంలా పట్టిన బూటకపు లౌకికవాదపు బండారాన్ని ఈ స్థాయిలో  బట్టబయలు చేయటం నాకు తెలిసినంతలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఇటీవలి దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఇదే మొదలు.  ఇతరమతాలవారికి కించిత్తు అసౌకర్యం కలిగినా గుండెలు బాదుకుని లబలబలాడే రాజకియపార్టీలవారు మెజారిటీ ప్రజల మతవిశ్వాసాలకు , సెంటిమెంట్లకు ఎంతటి అపచారం , విఘాతం జరిగినా ఎందుకు పట్టించుకోరన్న ప్రశ్న మతి తిన్నగా ఉన్నవారందరూ ఎప్పుడూ అడిగేదే . కాని అదే సవాలు  ఒక సెక్యులర్ పార్టీ అధినేత నుంచి వెలువడటం ఇక్కడ విశేషం. దేవీదేవతలకు జరిగే అపచారాలను సహించి ఊరుకొనరాదనీ , ఆ దేవతామూర్తులను ఆరాధించే కోట్లాది హిందువులు , ముఖ్యంగా హైందవ మహిళలు దైవద్రోహుల భరతం పట్టేందుకు వీథుల్లోకి రావాలని హిందూ సంస్థల పరివారానికి చెందని ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు పిలుపునివ్వటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక పరిణామం.   లక్షల సంఖ్యలో వీరాభిమానులుండి , ఇంకా అనేక లక్షలమందిని కదిలించగలిగిన   పవర్ స్టార్ ఇంత స్ఫుటంగా, దృఢంగా గళమెత్తటం హిందువుల చిరకాల, నిరంతర  ధర్మ పోరాటానికి  కొత్త దన్ను.