జె.ఎస్.వి బాపట్ల బదిలీ వెనుక…

346

అంతర్వేది రథ దహనంపై హిందువులు మండిపడుతూ ఆంధ్రరాష్ట్రం అట్టుడుకుతున్న సమయంలోనే రెవిన్యూ డిపార్ట్మెంట్ లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఎండోమెంట్స్) గా ఉన్న నిప్పులాంటి అధికారి జె.ఎస్.వి. ప్రసాద్ గారిని ఆ కీలకబాధ్యత నుంచి తప్పించి , ఆగమేఘాలమీద బాపట్లలో ప్రాముఖ్యం లేని పోస్టుకు బదిలీ చేయటం సహజంగానే అనుమానాలకు తావిస్తుంది. రూలు ప్రకారం పోవటం,చట్టానికి కట్టుబడటం మినహా మరొకటి ఎరుగని కర్మయోగి ప్రసాద్ గారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఎండోమెంట్స్ కమిషనర్ గా ఎంపిక అయిన నాటి నుంచీ ఆయన దేవదాయ శాఖ నిండా ఉన్న అవినీతి పరులకు , అక్రమార్కులకు , దైవద్రోహులకు సింహస్వప్నం. పైవాళ్ళ అండతో పెద్ద గుళ్ళలో పాతుకుపోయిన లంచగొండి సొరచేపల పని వరసబెట్టి పట్టడంతో నాటి ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖరరెడ్డిమీద పెద్ద వత్తిడి తెచ్చి .. 40 ఏళ్ళ వయసు నిండలేదన్న వయోనిబంధన మిషతో కమిషనర్ బాధ్యత నుంచి ఆయనను తప్పించారు.

రాష్ట్ర విభజన తరవాత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రసాద్ గారు రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ( ఎండోమెంట్స్) గా ఉన్నారు. కర్నూలు, హైదరాబాద్ , ఇతర ప్రాంతాల్లో కోట్లు విలువ చేసే ఎండోమెంట్స్ భూములను తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కట్టబెట్టాలని ముఖ్యమంత్రి పేషీ నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా , స్వయానా ముఖ్యమంత్రే కబురంపినా జె.ఎస్.వి. ప్రసాద్ లొంగలేదు. తప్పుడు పని చేయలేదు. దాంతో అప్పటి దేవదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు గారికి కనీసం మాటమాత్రమైనా చెప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జె.ఎస్.వి.ని ఆ స్థానం నుంచి తప్పించి , తమ పని కానిచ్చుకున్నారు.

అప్పటి నుంచీ లూప్ లైనులో ఉన్న జె. ఎస్.వి. ని ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దశలో తితిదే కార్యనిర్వహణాధికారిగా పంపిద్దామనుకున్నారు. ఆ సంగతి అధికారుల.సమావేశంలో తనే ప్రకటించారట కూడా. ఎన్ని నెలలకూ పోస్టింగ్ ఆర్డరు మాత్రం రాలేదు. కారణం: తిరుమల తిరుపతి దేవస్థానాలలో పాతుకుపోయిన లంచగొండి గండభేరుండాలు ఆ అగ్గిరాముడు వద్దు బాబోయ్ అని పైవాళ్ళకు పైవాళ్ళ ద్వారా మొరపెట్టుకుని గండం నుంచి ఎలాగో గట్టెక్కారట.

తరవాత అప్రధాన బాధ్యతల్లో కొంతకాలం ఉన్నాక ఈ మధ్యనే రెవిన్యూలో ఎండోమెంట్స్ అజమాయిషీ బాధ్యత జె.ఎస్.వి.కి అప్పగించారు. అప్పటినుంచీ ఆయన తన పని తాను చేసుకుపోతూ అక్రమాల గ్రంథసాంగులకు కంట్లో నలుసుగా ఉన్నారు. ఏ తాచు తోక తొక్కారో, ఎవరు పుణ్యం కట్టుకున్నారో , లేక అంతర్వేది దహన కాండ దరిమిలా ముందు జాగ్రత్త చర్యగానో ఇంతలోనే మళ్ళీ ఆయన బాపట్ల శంకరగిరి మాన్యానికి తరిమివేయబడ్డారు.

అన్నట్టు చీఫ్ సెక్రటరీ గా ఉండి తిరుమల క్షేత్రం అన్యమతస్థుల అడ్డా కారాదని అన్న మహాపాపానికి ఎల్.వి.సుబ్రహ్మణ్యం గారిని పంపించబూనింది కూడా ఈ బాపట్ల క్వారంటైన్ కే కాదూ ?

స్వతహాగా పరమ వేదాంతి కాబట్టి జె.ఎస్.వి. కి ఏ పోస్టు అయినా ఒక్కటే. కాని ఈ తరుణంలో ఆయన నిష్రమణ దేవదాయ శాఖకూ . ధర్మానికీ ,హిందువుల హితానికీ పెద్ద దెబ్బ.

-ఎం.వి.ఆర్.శాస్త్రి

 

1 COMMENT