అందులో భాగంగానే హిందూ ఆలయాలపై దాడులు:ఐవైఆర్

169

మత ప్రచార వ్యాప్తిలో భాగంగానే హిందూ ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయి
రథం దగ్ధం చిన్న విషయం కాదన్న ఐవైఆర్
ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదని స్పష్టీకరణ
వరుస ఘటనల వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపణ
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో రథం దగ్ధం అయిన ఘటనపై మాజీ ఐఏఎస్ అధికారి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతర్వేదిలో రథం అగ్నికి ఆహుతి కావడం చిన్న విషయమేమీ కాదని తెలిపారు. రథం దగ్ధం ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వరుస దాడి ఘటనల వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపించారు. పథకం ప్రకారమే హిందూ దేవుళ్లు, దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, ఓ మత ప్రచార వ్యాప్తిలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని వివరించారు. ప్రభుత్వం ఓ మత ప్రచార అజెండాతో నడుస్తోందన్న అనుమానాలు బలపడుతున్నాయని ఐవైఆర్ పేర్కొన్నారు. హైందవ విశ్వాసాలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని, ఇలాంటి ఘటనలను ప్రేరేపిస్తున్న వారిపై చర్యలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. పైగా మత విద్వేషాలను రెచ్చగొట్టేవారిని ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జరుగుతున్న ఘటనలపై హిందువులు తగిన రీతిలో స్పందిస్తారని ఐవైఆర్ స్పష్టం చేశారు.