మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు అర్థమేంటి? : రఘురామకృష్ణరాజు

455

ఢిల్లీ : అమరావతిలో దళితులకు చోటులేనప్పుడు.. శాసన రాజధాని కూడా ఉంచకుండా మొత్తం విశాఖకు తరలిస్తామన్న మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. ‘అమరావతిపై ప్రభుత్వ వైఖరిని మంత్రి కొడాలి నాని ప్రకటించారు. రాజధానిని పూర్తిస్థాయిలో తరలించాలన్న ఉద్దేశ్యాన్ని బట్టబయలు చేశారు. మొత్తం రాజధానిని విశాఖకు తరలించాలని చూస్తున్నారు. మంత్రి కొడాలి నాని పితృ బాషా ఎక్కువగా వాడుతున్నారు. కోర్టులో కేసులు ఉపసంహరించుకోకుంటే ఉన్న ఈ చిన్న రాజధానిని కూడా తరలిస్తామంటూ కొడాలి నాని బెదిరిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.

రైతులు ఆందోళన చెందుతున్నారు : ‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నదే వైఎస్సార్ ముఖ్య ఉద్దేశ్యం. విద్యుత్ వినియోగం ఎంత జరుగుతుందో లెక్క ఉండాలని కేంద్రం చెప్పింది. రైతులు ఎందుకు ఆందోళన చెందుతున్నారో ప్రభుత్వం ఆలోచించాలి. రాయలసీమలో వ్యవసాయదారుల ఇబ్బందులు అధికం. ట్రాన్స్‌ఫార్మర్లకు మీటరు పెట్టి వచ్చే బిల్లులను సకాలంలో చెల్లిస్తే రైతులకు భరోసా కలిగే అవకాశం ఉంది. ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం శ్రీకాకుళంలో కాకుండా కడపలో ప్రారంభిస్తే ప్రజల స్పందన తెలుస్తుంది. రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’ అని రఘురామ తెలిపారు.

అక్షరాస్యతలో ఆ ర్యాంకు విచారకరం : ‘అక్షరాస్యతలో ఏపీ చివరిస్థానంలో నిలవడం విచారకరం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదటి స్థానంలో నిలవడం గర్వకారణం. రాజ్యాంగాన్ని సమర్థించడాన్ని తప్పుపడుతూ నాపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగానికి అనుగుణంగా మాట్లాడే బాధ్యత నాపై ఉంది. రాజ్యాంగాన్ని గౌరవించేవారికి వైసీపీలో స్థానంలేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. దేవాలయ సంరక్షణకు ఇప్పటికైనా చర్యలు తీసుకోవడం మంచి పరిణామం. హిందూ వ్యతిరేకమనే భావన కొంతమంది ఉన్మాదుల చర్యల మూలంగా కలుగుతోంది. ప్రభుత్వానికి, సీఎంకు హిందూ మత విశ్వాసాలపై అపార గౌరవం ఉంది’ అని రఘురామకృష్ణరాజు కితాబు ఇచ్చారు.