ఘటనలు యాధృచ్ఛికాలు కావు:పవన్ కల్యాణ్

183

మొన్న పిఠాపురం.. కొండబిట్రగుంట… ఇప్పుడు అంతర్వేది ఘటనలు యాధృచ్ఛికాలు కావు
• ఎన్ని విగ్రహాల ధ్వంసాలు… రథాల దహనాలు యాధృచ్ఛికంగా జరుగుతాయి
• మతిస్థిమితం లేనివారి పని.. తేనె పట్టు కోసం చేసిన పని అంటే పిల్లలు కూడా నవ్వుతారు
• పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం సమయంలోనే సరిగా స్పందిస్తే ఇలాంటివి జరిగేవా?
• విశ్వాసాలను దెబ్బతీస్తున్న తీరుపై ఆడపడుచులందరూ మంగళ, శుక్రవారాల్లో హారతులిస్తూ తమ నిరసన తెలపాలి
• ఇతర మతాల పెద్దలూ ఈ ఘటనలను ఖండించాలి
• పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదు… హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేయించాలి
• వైసీపీ ప్రభుత్వం స్పందించకుంటే సి.బి.ఐ. దర్యాప్తు కోసం కేంద్రాన్ని కోరతాం
• ఉగ్రవాద కోణం ఉంటే ఎన్.ఐ.ఏ. దృష్టి సారించాలి
• హిందూ క్షేత్రాల్లో అన్యమత ప్రచారాన్ని కచ్చితంగా ఆపాలి

దేవాలయాలు, మత విశ్వాసాలకు సంబంధించిన ఘటనలు ఏవైనా చాలా సున్నితమైన అంశాలు. గత కొద్ది నెలలుగా వరుస క్రమంలో జరిగిన అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పిఠాపురంలో దుర్గాదేవి, వినాయకుడు, సాయిబాబా విగ్రహాలను ధ్వంసం చేసిన విధానం, విజయవాడలోని శ్రీ కాశీవిశ్వేశ్వరాలయం భూములకు సంబంధించి, సింహాచలం మాన్సాస్ ట్రస్ట్ కి సంబంధించిన వివాదంగానీ, నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని తీసుకువెళ్లే రథాన్ని తగులబెట్టేయడం గురించి కచ్చితంగా మాట్లాడాలి. ఇది ఆలయాలను, ధార్మిక కేంద్రాలను అపవిత్రం చేసే విధానమే.

హిందూ మతం విషయంలో ఎందుకు స్పందించరు?
ప్రార్ధనా మందిరాలను అంటే ఏ మత ప్రార్ధనా మందిరాలను అయినా సరే ఇలా అపవిత్రం చేస్తే అందరూ ఇబ్బంది లేకుండా మాట్లాడుతారు. కానీ హిందూ దేవాలయాలకు సంబంధించిగానీ, హిందూ మతానికి సంబంధించిగానీ మాట్లాడాలి అంటే మనల్ని మతవాదులు అనేస్తారా అన్న ఒక భావజాలాన్ని ప్రవేశ పెట్టారు. ఇది చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను.
రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు ఇచ్చింది. మానవ హక్కులనేవి ప్రతి ఒక్కరికీ సమానం. ఏ మతానికి కానీ , ఏ కులానికి చెందిన వారైనా అందరికీ సమానంగా ఇచ్చారు. సెక్యులరిజం అంటే అందర్నీ సమానంగా చూడటమే. కొంత మందిని ఎక్కువ సమానంగా చూడమని కాదు కదా. ఈ క్రమంలో మెహర్బానీ రాజకీయాలు ఎక్కువైపోయాయి. హిందూ ధర్మాన్ని వెనుకేసుకొస్తే నువ్వు లౌకికవాదివి కాదు అంటారు. హిందూ ధర్మంపై దాడి జరిగినప్పుడు ఖండిస్తే నువ్వు సెక్యులర్ వాదివి కాదు అంటారు. మరే మతం మీద దాడి జరిగినా విగ్రహాలను పాడు చేసినా, ప్రార్ధనా మందిరాలను అపవిత్రం చేసినా… నువ్వు గొంతేసుకుని నిలబడితేనే సెక్యులర్ వాదివి. ఇలాంటి మౌఢ్యంతో కూడిన పడికట్టు భావజాలాలు పెరిగిపోతూ ఉన్నాయి.

• ఈ కారణాలు నమ్మశక్యమేనా?
ఇది ఒక సంఘటనో రెండు సంఘటనలో అయితే చిన్న స్థాయిలో స్పందించి వదిలేసేవాడిని. కానీ వరుస క్రమంలో జరుగుతూ ఉంటే మౌనంగా ఉండలేం. పిఠాపురంలో మొదలయ్యింది. సాక్షాత్తూ దత్తాత్రేయ స్వరూపుడయిన శ్రీపాద శ్రీ వల్లభుడు పుట్టిన ఊరది. అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పీఠం అది. అలాంటి చోట దుర్గాదేవి విగ్రహాలను, గణపతి విగ్రహాలను, సాయిబాబా విగ్రహాలను ధ్వంసం చేసేశారు. అది ఎవరు చేశారు అంటే ఒక మతిస్థిమితం లేని వ్యక్తి చేశాడు అన్నారు. ఆహ…అనుకున్నాం. నెల్లూరు జిల్లాలోని కొండ బిట్రగుంటలో స్వామి వారి రథాన్ని తగులబెట్టేస్తే దాన్ని కూడా మతిస్థిమితం లేని వాడు తగులపెట్టేశాడన్నారు. నాకేం అర్ధం కాలేదు. ఓహో ఇలా జరుగుతాయా అనుకున్నా.
ఇప్పుడు అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో 40 అడుగుల పవిత్ర రథంపైన ఏదో తేనె పట్టు ఉందంట.. ఆ తేనె పట్టుని తీయడం కోసం వీళ్లు తగులపెట్టేశారంట. అలాకాకుండా ఇప్పుడు ఒక మతిస్థిమితం లేని వ్యక్తులెవరో చేసిన పనేమో అంటున్నారు. ఇదీ ఆ జాబితాలో చేర్చారు. యాదృచ్చికంగా జరిగినవంటున్నారు. ఎన్ని జరుగుతాయి యాదృచ్చికంగా..?
ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం దీని మీద చాలా బలంగా స్పందించాలి. నాణాలు విసిరేస్తే ఏడుకొండలవాడి పింక్ డైమండ్ పగిలిపోయింది. ముక్కలు చెల్లాచెదురైపోయాయి. అలాగే స్వామివారి రథాలు కాలిపోతున్నా, విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా ఎవరో పిచ్చివాళ్లు చేసిన పని అని చెబుతుంటే స్కూల్ కి వెళ్లే చిన్న పిల్లలు కూడా నవ్వుతారు. తాము చెబుతున్న కారణాలు అసలు నమ్మశక్యంగా ఉన్నాయా లేదా అన్నది వాళ్ళే ఆలోచించుకోవాలి. దీని మీద నేను కోరుకునేది ఒకటే. సమగ్ర విచారణ జరపాలి. మీరు చెప్పినట్టు మతిస్థిమితం లేని వాళ్లు అనేది కాకుండా పకడ్బందీ కారణాలతో సాగుతున్నాయా అనే కోణంలో విచారించాలి.

• భక్తులు మౌనంగా భరిస్తూ ఇబ్బందిపడుతున్నారు
ఏ సంప్రదాయాన్ని ఎవరూ కించపర్చకూడదు. అయితే హిందువుల విశ్వాసాన్ని, సంప్రదాయాన్ని ఎవరు తిట్టినా మాట్లాడరు. ఇతర మతాల
సంప్రదాయాన్ని, విశ్వాసాల్ని ఎవరో ఎక్కడో అమెరికాలోనో, యూరప్ దేశాల్లోనో అగౌరవపరిస్తే నిరసనలు ఉవ్వెత్తున ఉంటాయి. కానీ మనకి ఇక్కడ పిఠాపురంలో జరిగినా, కొండబిట్రగుంటలో జరిగినా, అంతర్వేది రథం దగ్ధం జరిగినా స్పందించడానికి ఇబ్బందిపడతారు.
ఉదాహరణకు శబరిమల అయ్యప్పస్వామి గుడికి ఒక సంప్రదాయం ఉంది. నియమాలు ఉన్నాయి. ప్రతి మతానికి ఒక సంప్రదాయం ఉంది. ప్రతి పుణ్యక్షేత్రానికీ ఒక సంప్రదాయం ఉంది. సంప్రదాయం దాటి వెళ్లం. కానీ అలాంటి విశ్వాసాల్ని, నియమాల్ని ఛాలెంజ్ చేస్తారు. వేరే మతంలో ఓ పదిమంది బాధపడితే గగ్గోలుపెట్టేసే వాళ్లు. ఇన్ని కోట్ల మంది ప్రజల విశ్వాసాలను దెబ్బతీసే సంఘటనలు జరుగుతుంటే ఎందుకు నోరు మెదపరు. భక్తులు కూడా మౌనంగా ఇబ్బందిపడతారు. ఇదే వేరే ఏ మతం అయినా ఏ స్థాయిలో గొడవలు జరిగి ఉండేవో మనం ఊహించుకోగలం. కానీ మనకి ఇన్ని వరుస సంఘటనలు జరిగినా చెప్పడానికి, నోరు మెదపడానికి భయం. ఎందుకంటే మనం లౌకికవాదులం అనుకోరేమోనని.

• సమగ్రంగా దర్యాప్తు చేయించాలి
మానవ నైజాన్ని ఆవిష్కరింప చేసే కొన్ని పుస్తకాలు చదివినప్పుడు ఏన్షియంట్ గ్రీస్ లో వాళ్లు ఆరాధించే విగ్రహాన్ని ఒకతను
ధ్వంసం చేస్తా ఉంటాడు. అతన్ని పట్టుకుంటే అందరూ నన్ను గుర్తించాలని నేను ధ్వంసం చేస్తున్నాను అంటాడు. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే.. ఒక వేళ ఈ విధ్వంసం చేస్తున్న వాళ్లు తమ ఉనికి కోసం చేస్తున్నారా? వాళ్లు ఏ మతస్తులు… ఏ కారణాలతో చేస్తున్నారు… వాళ్ళ
వెనకాల ఎవరైనా ఉన్నారా? అని తేల్చాలి. వారికి ఉగ్రవాద నేపథ్యం ఉందా గొడవలు రేపేసి మతకలహాలు రేపేసి తద్వారా అస్థిరత సృష్టించడానికి ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నారా? దీని వెనుక ఉగ్రవాదుల చర్యలు ఏమైనా ఉన్నాయా? ఆ కోణం నుంచి కూడా చూడాలి… జనసేన పార్టీ చాలా తీవ్రంగా తీసుకుంటుంది. ఇన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే దుర్గాదేవి, గణపతి, సాయిబాబా విగ్రహాలు ధ్వంసం చేస్తూ.. స్వామి వారిని ఊరేగించే రథాల్ని దగ్ధం చేస్తుంటే… ఏమనుకోవాలి. ఖచ్చితంగా దీని వెనుక ఉగ్రవాద కోణం ఉందా? సంఘవిద్రోహులెవరైనా ఉన్నారా? లేదంటే రాజకీయ లబ్ది పొందడానికి ఎవరైనా చేస్తున్నారా? వీటన్నింటినీ అన్ని కోణాల్లో చూసి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది.
వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.. ఒక మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించండి. ఎందుకంటే పోలీసుల మీద ప్రజలకు నమ్మకం లేదు. ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరిగినా అది మతిస్థిమితం లేని వ్యక్తి మీద పెడతారు. అతను మాట్లాడలేడు. అతని ఉనికె అతనికి తెలియదు. కొద్ది రోజుల్లో సరైన చర్యలు లేకపోతే కచ్చితంగా సిబిఐ దర్యాప్తు కోసం, ఉగ్రవాద కోణం ఉన్నదనిపిస్తే ఎన్.ఐ.ఎ. వారిని కూడా దృష్టి సారించేలా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతాము.
హిందూ ధర్మ పరిరక్షణ విషయంలో వైసీపీ ప్రభుత్వం మాత్రమే కాదు గత ప్రభుత్వాలు కూడా చాలా తప్పులు చేశాయి. కోట్ల మంది ప్రజల మనోభావాలే దెబ్బ తింటాయి. ఎందుకంటే అది వాళ్ల ఓట్ బ్యాంక్ లెక్కల్లో భాగం. మెజారిటీ హిందువుల మనోభావాలు వీరికి అవసరం లేదు. మేం చెబుతున్నాం ఈ రోజున మేము మాత్రం ఇస్లాంకి ఎంత గౌరవం ఇస్తామో.. క్రిస్టియానిటీకి ఎంత గౌరవం ఇస్తామో.. హిందూ సమాజానికి కూడా మేము అంతే గౌరవం ఇస్తాము. ఆ విశ్వాసాలను దెబ్బతీసే ఏ ప్రయత్నం జరిగినా జనసేన దాన్ని చాలా తీవ్రంగా తీసుకుంటుంది.

• విజయనగరం మాన్సాస్ ట్రస్టులో సంప్రదాయానికి భిన్నంగా వెళ్లారు
పోరాట యాత్రలో వెళ్తున్నప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటిస్తూ ఉంటే మాన్సాస్ ట్రస్ట్ భూములు అని చెబుతూ ఉండే వారు. అవి చాలా అన్యాక్రాంతం అవుతున్నాయి. కొంత పట్టించుకోవడం లేదు. ఆ ట్రస్ట్ కి సంబంధించి సంప్రదాయాలకు భిన్నంగా వెళ్ళి ట్రస్టీలను మార్చేసిన విధంగా వేరే మతాలకు సంబంధించిన విశ్వాసాలు, ట్రస్టుల్లో చేయగలరా? హిందూ మతం కాకుండా ఏమతమైనా చేసే ధైర్యం ఉంటుందా? చేస్తే అది ఎలాంటి ప్రతికూలమైన వాతావరణం ఉంటుంది. పోనీ కొత్త ట్రస్టీలు వచ్చారు అనుకుందాం? వాళ్లేదైనా చేశారా… గోమాతలకు కడుపు మాడ్చకుండా ఉంచగలిగారా? సింహాచలంలో స్వామివారి సేవకు ఉద్దేశించిన గోశాలలో గోవులు ఆకలితో మాడిపోతుంటే జనసేన నాయకులు, శ్రేణులు, బీజేపీ నాయకులు వెళ్తేగాని స్పందన రాలేదు. అసలు ముందు హిందూ ఆలయాలకు సంబంధించి, ఆలయ భూములకు సంబంధించి సమగ్రంగా విచారణ జరిపించాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేం అడిగేది ఏంటంటే అన్ని ఆలయాలకు సంబంధించి అసలు ఎంత భూమి ఉంది అనేదానిపై ఒక సమగ్ర రిపోర్టు ఇవ్వండి. ఎంత అన్యాక్రాంతం అయ్యింది. అన్యాక్రాంతం అయిన భూములపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఎంతెంత ఆదాయాలు వస్తున్నాయి.

• అన్యమత ప్రచారం వద్దన్నందుకే ఎల్వీని బదిలీ చేశారా?
హిందూ ఆలయాల విషయంలో దేవాదాయ శాఖలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా చూడాలి. హిందూ ఆలయాల పరిధిలో, పుణ్య క్షేత్రాల్లో అన్యమత
ప్రచారం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని దేవాదాయ శాఖ వెల్లడించాలి. గతంలో చీఫ్ సెక్రటరీ హోదాలో ఎల్.వి.సుబ్రహ్మణ్యం అన్యమత ప్రచారం హిందూ దేవాలయాల్లో ఉండకూడదు, అన్య మతస్తులు ఉండకూడదు అన్నారు. ఆ మాట అన్న కొద్ది రోజులకే శ్రీ సుబ్రమణ్యం గారిని బదిలీ చేశారు. ఇవన్నీ కాకతాళీయంగానే జరిగాయా..? ఆయన ఆ మాటన్నారు కాబట్టే జరిగిందా అనేది కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ముందుగా దత్తాత్రేయుడి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు పుట్టిన పిఠాపురంలో ఒక సంఘటన జరిగింది. అక్కడ దుర్గాదేవి విగ్రహాలను, గణపతి స్వామి విగ్రహాలను, సాయిబాబ విగ్రహాలను ధ్వంసం చేశారు. ఆ రోజే గనుక సరైన నిందితుల్ని పట్టుకుని ఉంటే ఈ రోజు ఈ దుస్థితి వచ్చేది కాదు.

• తిరుమల పింక్ డైమండ్ గురించి ఇప్పుడు మాట్లాడరేమి?
మన దౌర్భాగ్యం, దురదృష్టం ఏంటంటే ఒక్కో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్కోలా మాట్లాడుతారు అందరూ.. ఉదాహరణకు టీటీడీ ఆలయానికి సంబంధించి పింక్ డైమండ్ కనబడడం లేదు. అన్నారు. ప్రభుత్వాలు మారిన తర్వాత మళ్లీ వాటి ఊసెవరూ ఎత్తరు. వైసీపీ ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఏంటంటే.. అన్నీ మీరు రివర్స్ టెండరింగ్ పెట్టారు కదా.. గత ప్రభుత్వం చేసిన తప్పులని రివర్స్ టెండరింగ్ పెట్టారు కదా.. అలాగే టీటీడీలో ఏమేమి తప్పులు జరిగాయి. పింక్ డైమండ్ ఏలా పోయింది? అనేది తేల్చాలి. వజ్రం చాలా కఠినమైంది అంటారు. అలాంటి వజ్రం మీద నాణెం విసిరేస్తే పగిలిపోయింది అంటూ ఒక హాస్యాస్పదమైన వివరణ ఇచ్చేసి తప్పించుకుంటే ఎలా. భవిష్యత్తులో కూడా ఇలాంటివి పునరావృతం కారాదు. కచ్చితంగా జనసేనను రేపు ప్రజలు ఎన్నుకుని తీసుకువస్తే ఇలాంటి వాటన్నింటినీ చాలా తీవ్రంగా తీసుకుంటాం.
మీరు ప్రజల మనోభావాలకు గానీ, మతవిశ్వాసాలను ఎవరైనా తప్పుదోవ పట్టించి కించపర్చే చర్యలకు పాల్పడితే వారిపై చాలా బలమైన చర్యలు ఉండాలి. వైసీపీకి ఇప్పుడు దీన్ని సరిదిద్దుకునేందుకు బలమైన అవకాశం ఉంది. సరిదిద్ది ప్రజల మనోభావాలను మీరు కాపాలి. ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా హిందూ మత విశ్వాసాలకు సంబంధించిన అన్ని దేవాలయాల్లో అన్యమత ప్రచారం జరగకుండా చూడాలి. ఈ రోజు దీన్ని నిర్లక్ష్యంగా వదిలేస్తే.. రేపు కొన్ని ఇతర ప్రార్దనా మందిరాల దగ్గర ఇలాంటివి చేస్తే వివాదం అవుతాయి. గొడవలు కూడా అవుతాయి. అందుకే ముందుగా అటువంటివి జరగకుండా ఆపాలంటే.. హిందూ క్షేత్రాల్లో అన్యమత ప్రచారాలు ఆపండి. అలాగే హిందూ మతవిశ్వాసాలు లేని వారిని అక్కడ నియమించి భక్తులను కించపర్చకండి.

• అంతర్వేది ఎంతో ప్రత్యేకం
రాజోలు జనసేన మొదట గెలిచిన స్థానం అది. మా పార్టీ ప్రత్యేకించి ఎక్కువగా దాని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. అందరికంటే ఎక్కువ బాధ్యత ఉంది. నేను అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి కూడా వెళ్లాను. ఆ స్వామి వారు జనసేనకు మొదట గెలుపునిచ్చిన స్థానం అది. దాదాపు 200 సంవత్సరాల క్రితం వెలసిన గుడి ఇది. నారసింహ క్షేత్రాలు కొండలపై ఉంటే ఇది మాత్రం నదీ తీరాన ఉంటుంది. గోదావరి నది సాగర సంగమ ప్రాంతం అది. చాలా విశిష్టత ఉంది. అగ్నికుల క్షత్రియులకు ఆరాధ్య దైవం. అగ్నికుల క్షత్రియులు కొప్పనాతి కృష్ణమ్మ గారు 200 ఏళ్ల కిందట కట్టిన పవిత్ర దేవాలయం అది. అంతర్వేది రథోత్సవంలో అగ్నికుల క్షత్రియులకు ప్రత్యేక స్థానం ఉంది. అంతర్వేదికి సంబంధించి.. ముఖ్యంగా చాలా దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిపోయాయి. అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ఆస్తులు ఉన్నాయి. అలాగే అంతర్వేదిలో ఒక పురాతన శివాలయంలో పూజలు కూడా అందటం లేదు. ఆ ఆలయాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు. ఇలాంటి కోణాలు ఉన్నాయి. ఈ విశ్వాసాలు వెనకేసుకొస్తే మాకు మతం అంటగడతారు అనే భయాలు మాకు లేవు. వైసీపీ ప్రభుత్వం దీన్ని చాలా తీవ్రంగా తీసుకోవాలి. 151 సభ్యులున్న మీకు సంపూర్ణమైన అధికారం ఉంది. మీరు న్యాయం చేయలేని పక్షంలో కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి జనసేన పార్టీ తీసుకువెళ్తుంది.

• హిందువుల మనోభావాలు దెబ్బతినవా?
ముక్కోటి దేవతలు ఉన్న పవిత్ర దేశం మనది. చెట్టూ పుట్ట అన్నింటినీ గౌరవించి కొలిచే సంప్రదాయం ఉన్న నేల ఇది. మిగతా దేశాలకు వెళ్తే వారి విశ్వాసానికి ప్రథమ స్థానం ఇచ్చి మిగతా విశ్వాసాలకు ద్వితీయ స్థానం ఇస్తారు. కానీ భారత దేశం విషయానికి వస్తే మీరు ఎవరి సంస్కృతిని వారు గౌరవించుకోండి ఎవరి మత విశ్వాసాన్ని వారు గౌరవించుకోండంటారు. ఇది ప్రజల్లో ఉదాసీనత కాదు, భయం కాదు – ధర్మం పట్ల ఉన్న గౌరవం అది. ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే చేతకానితనంగా, మనకెందుకులే అన్న ధోరణి కనిపిస్తుందిగానీ వాస్తవానికి ఎవరూ గాయపడకుండా ఉండాలన్న భావనే. ఉదాహరణకు మంగళవారం, శుక్రవారం దుర్గాదేవి పూజలు చేసే ఆడపడుచులు, తల్లులు ఉంటారు. వారి మనోభావాలకు ఇబ్బందులు కలగవా? పిఠాపురంలో దుర్గాదేవి విగ్రహాన్ని ధ్వంసం చేసేశారు? వారి మనోభావాలు దెబ్బతింటాయి . కానీ వారు ఎవరికీ చెప్పుకోలేరు. ఎంతో బాధ పడతారు. ఇలాంటి సమయంలో రాజకీయ నాయకులు ఎవరూ అండగా రారు. నాలాంటి వారు మాట్లాడుతారు. కొన్ని హిందూ ధర్మ సంస్థలు, కొన్ని పార్టీలే మాట్లాడుతాయి. అలాంటిది ఒక గుడి మీద, దుర్గాదేవి విగ్రహాన్ని విధ్వంసం చేసినా, స్వామి వారి రథాన్ని ధ్వంసం చేసేసినా ఎవరూ బయటకురారేంటి? భయపడతారేంటి? మాట్లాడితే మనోభావాలు దెబ్బతింటాయి అంటే. హిందువుల మనోభావాలు దెబ్బతినవా? ఆడపడుచుల మనోభావాలు దెబ్బతినవా? సాయిబాబా భక్తుల మనోభావాలు దెబ్బతినవా? వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినవా?

• ఆడపడుచులే ధైర్యం ఇవ్వాలి
మనకి ఎవరైతే ఓట్లు అనుకుంటారో వారి మనోభావాలే ముఖ్యమా? మిగతా వారంతా మన దేశ ప్రజలు కారా? వాళ్లను ఒక రూ. 2000 ఇచ్చి కొనేసుకోవచ్చా? ఈ ఆలోచన ఇది మారాలి అంటే ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం రావాలి. ఇంట్లో దీపం వెలిగించే ప్రతి భక్తుడు తమ విశ్వాసాలను కాపాడుకోవాలి. మా మనోభావాలు దెబ్బ తిన్నాయి అని ప్రజలే చెప్పాలి. ఆడపడుచులు చెప్పాలి. మీరు పూజలు, వ్రతాలు చేస్తారు. మీరే ధైర్యంగా మాట్లాడాలి. మంగళ, శుక్రవారాల్లో హారతులు ఇస్తూ మన ధర్మాన్ని రక్షించుకొనే దిశగా అడుగులు వేయాలి. ఆడపడుచులు ప్రత్యేకించి మంగళవారాలు, శుక్రవారాల్లో ఆడపడుచులంతా నిరసన తెలపాలి. మీరు బయటకు రాకపోతే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. దుర్గామాతను పూజించే నేల ఇది. ఆడపడుచులే ధైర్యం ఇవ్వాలని సంపూర్ణంగా కోరుకుంటున్నాను. దయచేసి ఇలాంటి దుశ్చర్యలు జరిగినప్పుడు మీరు వచ్చి మీమీ స్థాయిల్లో మనస్ఫూర్తిగా మీ నిరసనల్ని బాహాటంగా తెలియచేయాలని కోరుకుంటున్నాను.
ఈ ఘటనల గురించి ఇస్లాం మత పెద్దలు, క్రిస్టియన్ మత పెద్దలు ఖండించాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మౌనంగా ఉంటే రేపు ఇతర మతాల ప్రార్థన మందిరాలపైకి వస్తారు. అందుకే అందరూ కలిసి ఏ ప్రార్ధనా మందిరం మీద దాడి జరిగినా, ఏ దేవతా విగ్రహాలు ధ్వంసం చేసినా అన్ని మతాల పెద్దలు దీన్ని సమష్టిగా ఖండించకపోతే దుష్ఫలితాలు వస్తాయి.

• ‘రఘుపతి రాఘవ రాజారాం…’లో మార్పే మన సహనానికి ప్రతీక
నిజమైన లౌకిక వాదం ఏంటంటే- నేను హిందూ మతాన్ని పాటించేవాడిని, భారతీయతను సంపూర్ణంగా అర్ధం చేసుకున్నవాడిని . గౌరవించేవాడిని. నేను హిందువుని. కానీ ఇస్లాంని గౌరవిస్తాను. క్రిస్టియానిటీని గౌరవిస్తాను. భారత దేశంలోని ప్రతి మతాన్ని, ప్రపంచంలోని ప్రతి మతాన్ని, ప్రతి సంస్కృతిని గౌరవించే వ్యక్తిని. నేనే సభలకు వెళ్లినప్పుడు ఇస్లాం పాటించే నా అభిమానులు క్యాప్ బహూకరించినప్పుడు నేను హిందువుని అయినప్పటికీ క్యాప్ ఎందుకు నెత్తి మీద పెట్టుకుంటాను అంటే మీ విశ్వాసం పట్ల గౌరవాన్ని కలిగి ఉన్నాను అని చెప్పేందుకు. నా మత విశ్వాసాన్ని ఇంకొకరి మీద రుద్దను. ఇంకొకరి మతవిశ్వాసాన్ని నేను ఎందుకు తీసుకోగలను అంటే.. నేను పాటించిన భారతీయ ధర్మం అలాంటిది..
రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం… ఈశ్వర్ అల్లా తేరే నామ్ అని చిన్నప్పటి నుంచి పాడుకుంటూ ఉంటాం. రాముల వారిని కీర్తించే భజన తీసుకుంటే ఒరిజినల్ గా ఉన్నది ఏంటంటే ‘రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం… సుందర విగ్రహ మేఘ శ్యామ..’ ఇలా ఉంటుంది. రెండో లైన్ తీసి ఈశ్వర్ అల్లా తేరే నామ్ అని పెట్టారు. ఇలా చేస్తే వేరే ఏ సంస్క్రృతి అయినా ఒప్పుకుంటుందా? భారత దేశ సంస్క్రతి ఎందుకు ఒప్పుకుంటుంది అంటే కృష్ణ పరమాత్మ చెప్పినట్టు నువ్వు ఏ రూపంలో నన్ను ప్రార్ధించినా నేను నీకు చేరువవుతాను అని ఉంటుంది. గాంధీజీ గారు లాంటి పెద్దలు ఈశ్వర్ అల్లా తేరే నామ్ అని ఎందుకు పెట్టారంటే ఆ సహనశక్తి చూపడానికి. బలవంతుడికే ఆ సహన శక్తి ఉంటుందిగానీ బలహీనుడికి ఉండదు. దేశం తాలూకు గొప్ప లక్షణం అది. మనం ఏమీ మాట్లాడకపోతే మనోభావాలు దెబ్బతినవని రాజకీయ పార్టీలు అనుకోవచ్చుగానీ అత్యధిక ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి అనే విషయాన్ని గ్రహించాలి. దీన్ని ఖచ్చితంగా నిలువరించాల్సిన అవసరం ఉందని వారు అర్ధం చేసుకోవాలి.

– పవన్ కల్యాణ్
అధ్యక్షులు, జనసేన