కదం తొక్కిన కాషాయ సేన

708

అంతర్వేదిలో అంతా టెన్షన్ టెన్షన్
మంత్రులతో హిందూసైనికుల వాగ్వాదం
భారీగా హిందూ సంస్థల కార్యకర్తల అరెస్ట్
నినాదాలు-నిర్బంధాలతో అట్టుడికిన అంతర్వేది
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

మతపిచ్చగాళ్ల  దుశ్చర్యలో అగ్నికి ఆహుతయిన అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం ఘటన అనంతర పరిణామాలు, జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా మంగళవారం హిందూ సంస్థలు నిర్వహించిన ర్యాలీతో, అంతర్వేది అట్టుడికింది. అటు హిందూ ఉద్యమకారులు-ఇటు మంత్రులు ఒకేసారి అక్కడకు చేరుకోవడంతో, పోలీసులలో టెన్షన్ కనిపించింది. ఓ దశ లో హిందూ ఉద్యమకారులను నియంత్రించడం పోలీసులకు కష్టమయింది. అంతర్వేది తాజా పరిణామాలు, జాతీయ మీడియాలోనూ చర్చనీయాంశమవడం గమనార్హం.

అంతర్వేదిలో రథాన్ని తగులబెట్టిన దుండగుల దుశ్చర్యకు నిరసనగా.. ఆర్‌ఎస్‌ఎస్-బజరంగ్‌దళ్-వీహెచ్‌పీ-ధర్మవీర్ ఆధ్యాత్మిక వేదిక-హిందూ చైతన్య వేదిక-హైందవశక్తి ఆధ్వర్వాన నిర్వహించిన ‘చలో అంతర్వేది’ కార్యక్రమానికి, వేల సంఖ్యలో హిందూ ఉద్యమకారులు తరలివచ్చారు. అయితే, ఆ సమయంలో మంత్రి విశ్వరూప్,  వెల్లంపల్లి, వేణు ఉన్నారు. ఈలోగా ఆందోళనకారులు గుడి లోపలికి వెళ్లేందుకు దూసుకురావడంతో, పోలీసులకు చెమటలు పట్టించింది. బయటకు వస్తున్న మంత్రులను హిందూ సంస్థల నాయకులు నిలదీయడం, దానికి వారు నచ్చచెప్పే ప్రయత్నం చేయడం, మధ్యలో కొందరు హిందూ కార్యకర్తలు నినాదాలు చేయడంతో, ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు- ఆందోళన కారులకు వాగ్వాదం జరిగింది. చివరకు బారికేడ్లు కూడా దాటుకుని, ఆందోళన కారులు తోసుకుని రావడంతో, అక్కడ ఏం జరుగుతోందో తెలియని గందగోళ పరిస్థితి ఏర్పడింది. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, వచ్చే బ్రహ్మోత్సవాల కల్లా కొత్త రథాన్ని ఏర్పాటుచేస్తామని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని, దానిని అడ్డుకుంటామని హెచ్చరించారు.

తొలుత అంతర్వేదికి  ర్యాలీగా  వెళ్లిన వారిని, పాశర్లపూడి బ్రిడ్జిపై పోలీసులు నిలువరించారు. ర్యాలీకి అనుమతి లేదని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దానికి ఆగ్రహించిన హిందూ సంస్థలు ‘రథాన్ని తగులబెట్టిన వాళ్లను వదిలేసి మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఈ ప్రభుత్వంలో హిందువులకు, ఆలయాలకు రక్షణ లేదా?’ అంటూ జైశ్రీరామ్ పేరుతో నినాదాలు చేశారు. ఎట్టకేలకు అక్కడి నుంచి అంతర్వేది ఆలయం వద్దకు చేరుకున్న ఆందోళనకారులను, పోలీసులు మరోసారి అడ్డకునే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా పోలీసులు హిందూ సంస్థల కార్యకర్తలపై లాఠీ చార్జి చేయడాన్ని, పలు హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. హైందైవ సైన్యం వ్యవస్థాపక అధ్యక్షుడు పెనుగొండ దుర్గాప్రసాద్ సహా, పలువురు కార్యకర్తలను పోలీసులు, మకిలిపురం పోలీసుస్టేషన్‌కు తరలించారు. మరికొందరిని ఇంకొన్ని స్టేషన్లకు తరలించారు.

కాగా హిందూ సంస్థల కార్యకర్తలపై పోలీసులు దాడి చేసి అరెస్టు చేయడాన్ని  బీజేపీ ధార్మిక సెల్‌కన్వీనర్ తూములూరి చైతన్య ఖండించారు. ‘పోలీసులకు నిజంగా చిత్తశుద్ధి, ధైర్యం ఉంటే రథం తగులబెట్టిన వారిని పట్టుకుని తమ ప్రతాపమేమిమిటో చూపాల’ని సవాల్ చేశారు. హిందూ దేశంలో హిందువుల ఆలయాలు, రథాలపై దాడులు జరగడం సిగ్గుచేటన్నారు. జరిగిన ఘటనను ప్రతి ఒక్క హిందువు ఖండించాలని కోరారు.

రథం కాలిపోవడంలో కుట్ర కోణం ఉందని పల్లవసేన రాష్ట్ర అధ్యక్షుడు కొల్లాటి బాబూరావు ఆరోపించారు. రాష్ట్ర నేతలు పెడసింగ్ నరసింహారావు, తిరుమలశెట్టి పాండురంగారావుతో కలసి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో హిందువులకు- దేవాలయ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.