పిట్ట పోరు పిట్ట పోరు ‘ప్రైవేటు’ తీర్చింది!

530

ఆర్టీసీ పోయి ప్రైవేటు బస్సులొచ్చే ఢాం ఢాం ఢాం
(మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపూర్వ సహోదరుల్లాంటి వాళ్లు. రాజకీయంగా ఒకరికి కష్టం వస్తే, మరొకరు తీర్చుకునేంత దోస్తానా వారిది. నీటి పంచాయితీపై తెలంగాణ పార్టీలు విరుచుకుపడుతున్నా, ఏపీ సర్కారుపై సానుభూతి చూపిస్తున్న తెలంగాణ సర్కారు తీరుపై, విపక్షాలు ఆశ్చర్యం-అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి అంత దోస్తానా ఉన్న పాలకులిద్దరూ.. ఆర్టీసీ బస్సులపై ఎందుకు శ్రద్ధ చూపించడం లేదు? కిలోమీటర్ల పంచాయతీ ఇంకా ‘కిలోమీటర్ల కొద్దీ’ ఎందుకు సాగుతోంది? పాలకుల పట్టుదల ప్రైవేటు బస్సులకు ఎందుకు వరంగా మారుతోంది?..ఇప్పుడు ఇవీ తెరపైకొస్తున్న ప్రశ్నలు.

లాక్‌డౌన్ మినహాయింపులలో భాగంగా.. రాష్ట్రాల నడుమ రవాణా సదుపాయాలు పునరుద్ధరించాలని  కేంద్రం నిర్ణయించింది. ఆ ప్రకారంగా దేశంలో రాష్ట్రాల నడుమ బస్సు సర్వీసుల పున రుద్ధరించబడనున్నాయి. కానీ..ఏపీ-తెలంగాణ రాష్ట్రాలు మాత్రం, ఇంకా కిలోమీటర్ల పంచాయతీతోనే కాలం వెళ్లదీస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు లేక ఐదునెలలవడంతో, రెండు రాష్ట్ర ప్రజలు తమ ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌లో నివసించే సీమాంధ్రులు తమ ప్రాంతాలకు వెళ్లలేక, హైదరాబాద్‌లో పనిచేసే కంపెనీలు జీతం ఇవ్వకపోవడంతో బతకలేక,  సతమతమవుతున్నారు.

లాక్‌డౌన్ మినహాయింపు సమయంలో, వలస కార్మికులు వేల సంఖ్యలో ఏపీకి వెళ్లారు. మరికొందరు అంతకుముందే కాలినడకన వెళ్లిపోయారు. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు చెందిన కూలీలు, హైదరాబాద్‌లో భారీ సంఖ్యలో వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. వరంగల్, ఖమ్మం,  నిజామాబాద్ జిల్లాల్లో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. వీరంతా లాక్‌డౌన్ మినహాయింపు సమయంలో, వారి సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు.  కానీ ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వివిధ స్థాయి ఉద్యోగులు మాత్రం, రవాణా సౌకర్యం లేక తెలంగాణలోనే ఉండిపోయారు. వారిలో కృష్ణా-గుంటూరు జిల్లాలకు చెందిన వారు మాత్రం, చాలామంది ద్విచక్రవాహనాల్లో వెళుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో, తాజాగా కేంద్రప్రభుత్వం రవాణా వ్యవస్థపై ఉన్న నిషేధం తొలగించింది. దానిని దేశంలోని అన్ని రాష్ట్ర  ప్రభుత్వాలు వినియోగించుకుంటున్నాయి. కానీ ఏపీ-తెలంగాణ ప్రభుత్వాలు మాత్రం,  ఇంకా ఇప్పటివరకూ దీనిపై తుది నిర్ణయం తీసుకోలేకపోతుండటం విమర్శలకు దారితీస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కిలోమీటర్ల ప్రాతిపదిక అంశాన్ని తెరపైకి తీసుకురావడం- ఏపీ సర్కారు ఆ విషయంలో పూర్తి సానుకూలత ప్రదర్శించకపోవడం, సమస్యగా మారింది. ఏపీ నుంచి హైదరాబాద్‌కు 850 బస్సులు నడుస్తున్నాయి. తెలంగాణలోని ఇతర జిల్లాలకు మరో మరో 150 బస్సులు తిరుగుతున్నాయి. వీటిలో ఆంధ్రా బస్సులు 2.60 లక్షల కిలోమీటర్ల మేరకు  తెలంగాణలో నడుస్తుంటే, ఏపీలో తెలంగాణ బస్సులు 1.60 లక్షల కిలోమీటర్ల మేర మాత్రమే నడుస్తున్నాయి.

అసలు పంచాయతీ అక్కడే మొదలయింది. ఏపీ నడుపుతున్న  2.60 లక్షల కిలోమీటర్లలో, లక్ష కిలోమీటర్లు తగ్గించుకుంటేనే తాము అంగీకరిస్తామని తెలంగాణ ఆర్టీసీ.. ఏపీఎస్ ఆర్టీసీకి తేల్చిచెప్పింది. అయితే తాము 50 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటామని, ఆ మేరకు మీరు పెంచుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ ప్రతిపాదించింది. దానికి తెలంగాణ ఆర్టీసీ ససేమిరా అనడంతో, పంచాయతీ పీటముడిగా మారింది. నిజంగా తెలంగాణ సర్కారు ఏపీఎస్ ఆర్టీసీ ప్రతిపాదనను అంగీకరిస్తే, దాదాపు 350 బస్సులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తెలంగాణ సర్కారు అంత ఆర్ధిక భారం మోసే పరిస్థితిలో లేదు. ఆ ప్రకారంగా.. తెలంగాణ సర్కారు చెప్పినట్లు, ఏపీ సర్కారే తన బస్సుల కిలోమీటర్లను తగ్గించుకోవలసి ఉంటుంది.

ఈలోగా ప్రైవేటు బస్సులు మళ్లీ రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యాయి. రెండు రాష్ట్రాల ఆర్టీసీ యాజమాన్య స్థాయి చర్చలు నిలిచిపోవడం, వాటికి వరంగా మారింది. తెలంగాణ నుంచి ఏపీకి ఎక్కువమంది వెళ్లి వచ్చే వారున్నందున, ఇకపై ప్రైవేటుకు గిరాకీ పెరగనుంది. దానివల్ల తెలంగాణ రాష్ట్రం కంటే, ఏపీఎస్ ఆర్టీసీనే ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది. ప్రైవేటు బస్సుల చార్జీలు, ఆర్టీసి కంటే ఎక్కువగా ఉంటాయి. పండగ సీజన్లలో మరీ దారుణం. ఇప్పుడు రెండు ప్రభుత్వాల ఆర్టీసీలు మొరాయించడంతో, ఆ పరిస్థితిని ప్రైవేటు బస్సు కంపెనీలు, సొమ్ము చేసుకోవడం సహజమే. ఈవిధంగా పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిన ట్లు… ప్రభుత్వాల పంచాయితీని ప్రైవేటు బస్సులు తీర్చనున్నాయి. అంటే తెలంగాణ ఆర్టీసీ ఏపీలో తిప్పలేని ప్రాంతాల్లో,  ఇకపై ప్రైవేటు బస్సులు తిరగనున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ‘కిలోమీటర్ల పంచాయతీ’ ఎన్నిరోజులు, ఎన్ని లక్షల కిలోమీటర్లు సాగితే ‘ప్రైవేటు’కు అంత ఫాయిదా అన్నమాట!