పీవీపై ప్రేమ+కేసీఆర్ భక్తి= జాతీయ పార్టీ?

414

(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన తెలుగుజాతిరత్నం పీవీ నరసింహారావును.. చివరి రోజుల్లో సొంత పార్టీనే అనాధను చేసింది. అలాంటి పీవీని టీఆర్‌ఎస్ అధినేత- తెలంగాణ సీఎం కేసీఆర్ ఎత్తుకున్నారు. పీవీ పేరును ఏడాది పొడవునా స్మరించుకునే కార్యక్రమాలు ప్రారంభించారు. తెలుగువాడు, అందునా తెలంగాణ గడ్డపై పుట్టి జాతీయ ఖ్యాతి పొందిన పీవీని సొంతం చేసుకున్న కేసీఆర్‌ను, ప్రతి ఒక్క తెలుగువాడూ మనసారా మెచ్చుకున్నాడు. నంద్యాల ఎంపీగా గెలిచి ప్రధానిగా చేసినప్పటికీ, ఆ పని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేయకపోవడం, కనీసం ఆయనను స్మరించుకోకపోవడాన్ని ప్రతి తెలుగువాడూ నొచ్చుకున్నాడు. అదే సమయంలో కేసీఆర్‌ను మెచ్చుకున్నారు.

నిజానికి కేసీఆర్ ఏ పనిచేసినా దానికో లెక్క ఉంటుంది. సుదీర్ఘ లక్ష్యం ఉంటుంది. ఆ లెక్కల్లో భాగమే పీవీ నామస్మరణ అన్న విషయం ఆలస్యంగా గానీ తెలియలేదు. జమిలి ఎన్నికల పేరుతో, భాజపా వ్యూహం వెనుక అసలు విషయాన్ని గ్రహించిన కేసీఆర్.. జాతీయ పార్టీ స్థాపనకు ప్రయత్నిస్తున్నారని, ఆ మేరకు ఆయన ఎన్నికల సంఘం వద్ద పేరు నమోదు చేయించే పనిలో ఉన్నారన్నది, తాజాగా వినిపిస్తున్న కథనం. గత ఎన్నికల ముందు కూడా కేసీఆర్ ఇలాంటి ప్రయత్నమే చేశారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రాంతీయ పార్టీ అధినేతలను కలిశారు. కేంద్రంలో ఏ పార్టీకీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేనందున, ఫెడరల్ ఫ్రంట్ సాయం తీసుకునే పార్టీ వద్ద.. తనకు ఉప ప్రధాని పదవి ఇస్తే,  మద్దతునిస్తామన్న షరతుతో ప్రభుత్వంలో భాగస్వామి కావాలన్నది, ఆయన పర్యటనల అసలు లక్ష్యమని అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. అదే సమయంలో.. విపక్షాల ఓట్లు చీల్చడం ద్వారా, భాజపాకు సహకరించేందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.

ఇక తాజాగా వచ్చే ఏడాది నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ.. దాదాపు ఏడెనిమిది దశల్లో జమిలి ఎన్నికలు రానున్నాయని, ఆపై మార్చి నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్న బలమైన ప్రచారం భాజపాలో వినిపిస్తోంది. అయితే, అధ్యక్ష తరహా పాలనతో, కేవలం పార్లమెంటుకు జాతీయ పార్టీలు మాత్రమే పోటీ చేసి, ప్రాంతీయ పార్టీలను రాష్ట్రాలకే పరిమితం చేసే వ్యూహంతో భాజపా వెళుతోందన్నది ఇప్పుడు కొత్తగా జరుగుతున్న ఓ ప్రచారం. దానిని ముందే పసిగట్టిన కేసీఆర్.. జాతీయ పార్టీ ఆలోచనకు అంకురార్పణ చేస్తున్నారంటున్నారు. ఇలాంటి  సమీకరణలు.. కూడికలు-తీసివేతలో మొనగాడయిన కేసీఆర్.. ముందు జాగ్రత్తగా పీవీ నరసింహారావును స్మరిస్తున్నారన్నది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల అంచనా.


పీవీ స్మరణకు ఆయన ఎంచుకున్న ప్రచార విధానం కూడా, మిగిలిన వారికి భిన్నంగానే కనిపించింది. ఆయన ఫోటోతోపాటు, తన ఫొటోతో కూడిన ప్రకటనలు జాతీయ మీడియాకూ ఇచ్చారు. హైదరాబాద్ నగరంతోపాటు, ఢిల్లీలో కూడా భారీ హోర్డింగ్స్ ఏర్పాటుచేశారు. తెలంగాణ నుంచి జాతీయ రాజకీయాలకు వెళ్లి, ప్రధాని అయిన పీవీ తర్వాత.. తెలంగాణ నుంచి కేసీఆర్ కూడా, జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారన్న సంకేతాలివ్వడమే, ఆ ప్రచారం అసలు లక్ష్యమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పీవీ నరసింహారావు తర్వాత జాతీయ రాజకీయాల్లో ఆయన వారసుడిగా, తెలంగాణ ప్రతినిధిగా కేసీఆర్ వస్తున్నారన్న ప్రచారానికి తెరలేపడమే, పీవీ స్మరణ వెనుక మతలబని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.