మంటల్లో హిందువుల మనో‘రథం’

991

నిందితులు పిచ్చోళ్లా? మతపిచ్చోళ్లా?
ఏపీలోనే ఎందుకిలా?
పీఠాథిపతులు పడుకున్నారా?
                (మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

పిఠాపురంలో దేవి దేవత విగ్రహాల విధ్వంసం.. నెల్లూరులో ప్రసన్న వెంకటేశ్వరస్వామి రథం.. భీమవరం గునుపూడిలో సోమేశ్వర స్వామి ఆలయ రథం.. ఇప్పుడు అంతర్వేదిలో  నరసింహస్వామి రథం.. ఊరు ఏదైతేనేం?.. ఆలయం ఏదైతేనేం?.. దేవుడు పేరు ఏదైతేనేం?..  ఆంధ్రరాష్ట్రంలో ఏడాదిన్నర నుంచి మంటల్లో కాలుతోంది మాత్రం, హిందువుల మనో‘రథమే’.. మండుతున్నది మాత్రం, హిందువుల మనోభావాలేనన్నది మనం మనుషులం అన్నంత నిజం! అసలు ఆంధ్ర రాష్ట్రానికే ఎందుకీ దౌర్భాగ్యం? డజన్ల సంఖ్యలో పీఠాథిపతులు, ఇంకా ప్రత్యేకించి ‘సర్కారీ పీఠాథిపతులు’న్న ఏపీకే ఎందుకీ దుస్థితి? మెజారిటీ ప్రజల మనోభావాలు ఇలా మంటల్లో పడి కాలి బూడిదవుతుంటే.. కోట్లాదిమంది కొలిచే దేవుడి గూళ్లే నెలల తరబడి విజయవంతంగా అగ్నికి ఆహుతవుతుంటే.. హిందూ ధర్మాన్ని ఉద్ధరిస్తామని బాసలు చేసి కాషాయం కట్టిన పీఠాథితులు, ఈ అధర్మంపై ధర్మాగ్రహం వ్యక్తం చేసి, రోడ్డెక్కకుండా.. ఏసీ రూముల్లో,  బెంజికార్లలో దుప్పటిముసుగేసుకుని పడుకున్నారా? లేక తమ పీఠాల ఖజానా పొట్ట నింపే వీవీఐపి-రాజకీయ భక్తుల సేవలో మునిగి సుఖనిద్రపోతున్నారా? దేవాలయాలనే రక్షించలేని ఈ ముఖాలు, ఇక హిందూ ధర్మాన్నేం రక్షి స్తారు?.. ఇవీ.. కోట్లాదిమంది భక్తులు, హిందూ ధర్మ పరిరక్షణ కోసం గజ్జెకట్టామని ప్రచారం చేసుకునే, పీఠాథిపతులను చూపుడువేలితో నిలదీస్తున్న ప్రశ్నలు! వీటికి జవాబిచ్చే దమ్ము సర్వసంగ పరిత్యాగులైన ఈ రాజకీయ భోగులకు ఉందా?ఇది కూడా చదవండి: హైందవ సైన్యంలో దళితులేరీ?హిందుత్వం అంటే బీజేపీ.. బీజేపీ అంటే హిందుత్వం. ఇది నిజమయినా-అబద్ధమయినా-భ్రమయినా, జనసామాన్యంలో స్థిరపడిన ఓ భావన! అలాంటి పార్టీకి ఒక రాంమాధవ్.. మరో జీవీఎల్.. ఇంకో ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాష్ట్రం నుంచి, జాతీయ స్థాయిలో దివిటీల్లా వెలుగుతున్న నేతలు. వీటికిమించి.. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ, పార్టీలు వేరయినా మానసికంగా కలసి సాగుతున్న.. అనుకూల రాజకీయ నాయకత్వాల ఆలోచనలు!  అయినా సరే.. దేవాలయాల్లో రథాల దహనకాండ నిర్విఘ్నంగా జరిగిపోతూ ఉండటమే ఆశ్చర్యం. ఇంత జరుగుతున్నా కమలస్వరంలో కాఠిన్యం కనిపించకుండా, ఎప్పుడయినా తమలపాకుతో- మరీ మొహమాటమయితే ఈ వికృతచర్యపై బంతిపూలతో యుద్ధం చేస్తుండటం మరో ఆశ్చర్యం. ఇప్పటిదాకా మేం లేస్తే మనుషులం కాదన్నట్లు.. పత్రికా ప్రకటనల యుద్ధమే తప్ప, దేవాలయాలపై దాడులకు నిరసనగా కమలం కన్నెర్ర చేసిన దాఖలాలు, భూతద్దం వేసి వెతికినా కనిపించదు. అన్నట్లు.. ఆంధ్ర రాష్ట్రంలో చీమచిటుక్కుమన్నా, హడావిడిగా హస్తిన నుంచి పరుగున వచ్చే బీజేపీ నరసింహుడు.. గత 15 నెలల నుంచి వరస వెంట వరస, రాష్ట్రంలో ఆలయ రథాలను తగులబెడుతున్నా, చివరకు ఈ అంతర్వేది నరసింహుడి రథం ముష్కరుల చేతిలో కాలిపోయినా, ఇప్పటివరకూ ఎందుకు రాలేదో ఆ నరసింహుడికే ఎరుక? ‘జగన్నాధ’ రథచక్రాల కింద ఇంకా ఎన్ని రథాలు ఆహుతయితే, ఈ నరసింహులు ఉగ్ర నరసింహులవుతారో మరి?!ఇది కూడా చదవండి: హోరెత్తనున్న.. హిందుత్వం?

తూర్పు గోదావరి జిల్లా  సఖినేటిపల్లి మండలం,  అంతర్వేది శ్రీ నరసింహస్వామి ఆలయానికి చెందిన రథం తెల్లవారుఝామున దుండగుల చర్యకు కాలిబూడిదయింది. తగులబడుతున్న రథం దృశ్యాలను కోట్లాదిమంది భక్తులు సోషల్‌మీడియాలో వీక్షించి, విస్మయం చెందారు. ఆ వీడియోలు నిశితంగా పరిశీలిస్తే.. మంటలు కింద నుంచే మొదలయినట్లు కనిపిస్తుంది. అసలు విద్యుత్ సరఫరా అంతంతమాత్రంగా ఉండే ఆ గ్రామంలో, షార్ట్‌సర్క్యూట్ అనేది ఊహించలేమన్నది అక్కడికి వెళ్లి వచ్చిన వారు చెబుతున్న మాట. చుట్టూ తడికలు, పైన షెడ్డు మాత్రమే ఉన్న ఆ ప్రాంతంలో వచ్చే గాలిబీభత్సానికి అగ్ని తోడయితే, దాని తీవ్రతేమిన్నది చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడే విచారణ మొదలయి, శోధనలు, నివేదికలు వచ్చే సరికి ఎంతకాలం పడుతుందో ఆ నరసింహస్వామికీ తెలియదు.

కాకపోతే.. ఈలోగా పోలీసులు, రొటీన్‌గా ఓ మతిభ్రమించిన వాడిని తెరపైకి తీసుకువచ్చి, ఇదంతా సదరు పిచ్చివాడి పనేనని చెప్పినా ఆశ్చర్యం లేదన్నది.. ఇప్పటివరకూ ఉన్న అనుభవాలు చూసిన వారికి వస్తున్న సందేహాలు! కొద్దినెలల క్రితం పిఠాపురం ఆలయంలో, దేవతావిగ్రహాలను విధ్వంసం చేసిన ఘటనలో కూడా, పోలీసుల పరిశోధనలో తేలింది ఇదే కాబట్టి.. అంతర్వేదిలో కూడా అంతకుమించిన ఆశ్చర్య ప్రకటన ఉండబోదన్నది, హిందూ సంస్థల ప్రగాఢ విశ్వాసం! ఇప్పటికే ఓ పిచ్చివాడిని అదుపులోకి తీసుకున్నారన్న వార్తలు వస్తున్నాయి. అటు శాఖాపరమైన విచారణ కూడా మొదలయింది. అందులో సహజంగా ఏ ప్రభుత్వం ఉన్నా.. సర్కారు సంకటంలో పడే నివేదికలు రావన్నది మెడ మీద తల ఉన్న ఎవరికయినా తెలిసిందే. కాబట్టి.. సంసారపక్షమైన నివేదిక మాత్రమే వస్తుందని ఆశించడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు.

రాష్ట్రంలో ఏడాది నుంచి జరుగుతున్న.. ఈ హిందువుల మనోరథ దహనాల వెనుక, అంతా పిచ్చివాళ్లే ఉండటం నిజంగా పిచ్చెక్కించే విషయమే. పాపం ఆ పిచ్చివాళ్లకు పనేమీ లేక, హిందువుల మనోరథాలను తగులబెడుతున్నట్లున్నారు. అదేం విచిత్రం- విడ్డూరమో గానీ.. సదరు పిచ్చిసన్నాసులకు హిందువుల మనోరథాలే కనిపిస్తున్నాయే తప్ప, మరొక మత ఆనవాళ్లు కనిపించడం లేదు. పేరుకు వీళ్లు పిచ్చోళ్లయినా, పోలీసులకు మాత్రం మాబాగా సాయం చేస్తున్నారు. అలాంటి ఘటనలు జరిగిన వెంటనే రంగంలోకి దిగి, విచారణ పేరిట ఏళ్లూ పూండ్లూ చేసే అవకాశం లేకుండా.. ఇదిగో ఆ ముదనష్టపు పని మేమే చేశామని, ఎవరెడీగా పోలీసుల ముందు ప్రత్యక్షం కావడం, వారి విశాల హృదయానికి తార్కాణమే కదా? అసలు ఈ ఘటనలన్నీ చూస్తుంటే.. రాష్ట్రంలో పిచ్చోళ్ల సంఘం ఒకటి వెలిసిందేమోననిపిస్తోంది. అయితే.. అది పిచ్చోళ్ల సంఘమా? మత పిచ్చోళ్ల సంఘమా అన్నదే తేలాల్సి ఉంది.

ఈ విషయాలేమీ తెలియక, రఘురామకృష్ణంరాజు వంటి ఎంపీలు.. దోషులను శిక్షించాలని, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని తెగ ఇదయిపోతున్నారు. అప్ప ఆర్భాటమే గానీ బావ బతికుంది లేద న్నట్లు.. హిందువులపై దాడులకు సంబంధించి రాజు గారు ఎన్ని గావుకేకలు పెట్టినా, ఆ జగన్నాధుడు మాత్రం ఉలకరు. పలకరు! ఈ విషయంలో కమలదళాలు అంతర్వేదిలో హడావిడి మొదలుపెట్టాయి. అధ్యక్షుడు వీర్రాజు కూడా ప్రకటనలోనయినా,  గట్టిగానే గర్జించారు. అయితే, జరిగిన ఘటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసే బదులు, అంతర్వేదికే పరిమితం చేయడమే ఆశ్చర్యం. అయినా..వీర్రాజు గారు మా వ్యూహాలు మాకున్నాయని, మాదగ్గర స్కడ్లు ఉన్నాయని చెప్పారు కాబట్టి.. ఆ వ్యూహమేమిటో, ఆ స్కడ్లు ఎప్పుడు ఎవరిపై వేస్తారన్నది సాధారణ మానవులకు సంబంధం లేని విషయం.

పిఠాపురంలో దేవతా విగ్రహాలు విధ్వంసం చేసిన ఘటనపై శ్రీపీఠాథిపతి పరిపూర్ణానందస్వామి చాలా హడావిడి చేశారు. దోషులను శిక్షించకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించారు. ఆ తర్వాత ఆయన ఆమరణ నిరాహార దీక్ష, ఎక్కడ చేశారన్న వార్త భూతద్దం పెట్టి వెతికినా కనిపించలేదు. చివరాఖరకు ఆయన సొంత చానల్‌లో కూడా కనిపించలేదు.  ఇక సీఎం జగన్మోహన్‌రెడ్డి రాజగురువు, కలియుగ శంకరాచార్య.. స్వరూపానంద వారయితే, అసలు ఇలాంటి వ్యవహారాలకు సహజంగానే దూరంగా ఉంటున్నారు. ఇలాంటి ఘటనలు తలెత్తిన్నప్పుడు ఆయన తామరాకుమీద నీటిబొట్టులా, స్థితప్రజ్ఞత-ప్రాప్తకాలజ్ఞత కలగలిసిన మహామనీషిలా  కనిపిస్తుంటారు. అయితే అంతర్వేది అగ్ని ప్రమాదంలో మాత్రం, స్వాములవారెందుకో నరసింహస్వామిపై దయతలిచారు. దోషులను వెంటనే శిక్షించాలని శిష్యపరమాణువుని కోరారు. స్వామివారి స్వరపేటిక వినిపించడంతో, హిందువుల పుణ్యం పుచ్చిపోయింది. అయినా.. తన తపశ్శక్తి-అతీంద్రియశక్తితో, ఒక సాధారణ నాయకుడినే, పాలకుడిగా మార్చిన విశాఖ స్వాముల వారు.. హిందువుల మనోర థాలను తెలుగు టీవీ సీరియళ్ల మాదిరిగా తగులబెడుతుంటే, వాటిని ఆపలేకపోవడం, వారిని తెలుసుకోలేకపోవడం విడ్డూరంగా లేదూ..?

పాపం.. భువనేశ్వరి పీఠాథిపతి కమలానంద భారతి తపన చూస్తే, హిందువుల ఈతిబాధతలు పట్టించుకునే ఓ స్వామి ఉన్నారన్న భరోసా కనిపిస్తుంటుంది. ఎందుకంటే.. ఆయనకు పాలకులకు ముద్దులు పెట్టే అవసరం లేదు. వారితో పుష్కరస్నానాలు చేయించే అలవాటు లేదు. నేతాశ్రీలకు సలహాలు, పదవులు సిఫార్సు చేసే అవసరం అంతకంటే లేదు. పాలకులతో సన్మానాలు చేయించుకుని, ఒక్క రూపాయితో భూములు కొనుక్కునే తెలివితేటలు అసలు లేవు. ఆయనకు తెలిసిందల్లా.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ధర్మాగ్రహం వ్యక్తం చేసి, సంఘటితమవ్వాలని పిలుపునివ్వడమే!

రచయిత క్రాంతిదేవ్ మిత్ర చెప్పినట్లు.. అయినా మన కులపోడికో.. మన పార్టీ నాయకుడికో.. మన సినిమా హీరోకే.. ఏదైనా దెబ్బతగిలి ఆసుపత్రిలో చేరితే ప్రార్థనలు చేస్తాం. ఒంటి మీద కిరోసిన్ పోసుకుంటాం. వాళ్ల పుట్టినరోజుకు లీటర్లకు లీటర్ల రక్తం ఇచ్చేస్తాం. మరి ఇదేమో ఆఫ్ట్రాల్ గుడి వ్యవహారమాయె! తగలబడింది గుడి గూడే కదా?… కదా మరి!