‘ఢిల్లీ’కి తాకనున్న ‘అంతర్వేది’ సెగ?

516

దహనంపై కుట్ర కోణం ఉందంటున్న హిందూ సంస్థలు
వైఎస్ హయాంలో మూలవిరాట్టును కదిలించే యత్నంపై నిరసన
రంగంలోకి హిందూ మహాసభ నాయకులు
తొలిసారి పెదవి విప్పిన టీడీపీ
తెరపైకి అఖిల భారత క్షత్రియ మహాసభ, కర్ణిసేన
బజరంగ్‌దళ్-శ్రీరాంసేన ‘చలో అంతర్వేది’
సీబీఐ విచారణకు పెరుగుతున్న డిమాండ్
అట్టుడుకుతున్న ‘అంతర్వేది’ అగ్నిగుండం
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఏపీలో సంచలనం సృష్టించిన అంతర్వేది నరసింహ స్వామి ఆలయ రథ నిప్పుల సెగ ఢిల్లీకి తాకనుంది. ఇప్పటికే ఈ ఘటనపై నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీ వేదికగా మీడియా సమావేశం నిర్వహించి, కుట్రకోణాన్ని ఆవిష్కరించారు. అఖిల భారత క్షత్రియ మహాసభ-కర్ణిసేన కూడా ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో ఉద్యమించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే గోదావరి జిల్లాలకు చెందిన బజరంగ్‌దళ్ శాఖలు మంగళవారం ‘చలో అంతర్వేది’కి పిలుపునివ్వడం, విశ్వహిందూ పరిషత్ సోమవారం ధర్నాలు నిర్వహించడంతో, అంతర్వేది పరిణామాలు వేడెక్కాయి. ప్రధానంగా.. గత ఆరునెలల నుంచి సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, కొత్తగా తేనెటీగల కథ తెరపైకి రావడం కొత్త అనుమానాలకు తెరలేచినట్టయింది. ఈ నేపథ్యంలో అంతర్వేది కుట్రపై సీబీఐతో విచారణ జరిపించాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఇది కూడా చదవండి.. మంటల్లో హిందువుల మనో‘రథం’

అంతర్వేది ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రథాన్ని, ముష్కరులు తగులబెట్టడం హిందువులనోభావాలను గాయపరిచిన ట్టయింది. దీనికి సంబంధించి,  పీఠాథిపతుల మౌనంపై హిందూ సమాజం ఆగ్రహంతో రగిలిపోతుండగా.. ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ, హిందూ ధార్మిక సంస్థలు  ప్రత్యక్ష కార్యాచరణకు దిగనున్నాయి.  వీటిని పరిశీలిస్తే, రాష్ట్రంలో హిందూమతం కేంద్రంగా, కొత్త పరిణామాలకు తెరలేవనున్నాయన్న సంకేతాలిస్తోంది. ఇందులో భాగంగానే.. అంతర్వేది పరిణామాలను జాతీయ స్థాయిలో చర్చించి, ఉద్యమించేందుకు అఖిల భారత క్షత్రియ మహాసభ- కర్ణిసేన సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనిపై ఆ సంస్థలకు చెందిన జాతీయ నేతలు ఆదివారం సాయంత్రమే రాష్ట్రంలోని కొందరు నేతలకు ఫోన్లు చేసి, పూర్తి సమాచారం తెప్పించుకున్నుట్లు తెలుస్తోంది.

ఇప్పటికే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, అంతర్వేది ఘటనపై జాతీయ మీడియాలో మాట్లాడారు. ‘సీఎం జగన్‌ను ప్రసన్నం చేసుకునేందుకు కొందరు పిచ్చిగా మాట్లాడుతున్నారు. చర్యలు తీసుకోవాలన్న వాళ్లు మీ మంత్రులకు పిచ్చివాళ్లుగా కనిపిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకునేందుకు ఎందుకు వెనుకాడుతున్నారు? హిందూ దేవాలయంటే మీకు లెక్క లేదా? మీకు హిందూ పురాణాలు తెలియవు. అసలు మీ విధానమేంటి? ఒక మతం మీద దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నారు?  అసలు ఆ శాఖకు చెందిన వారితో విచారణ జరిపించడం ఏమిటి? ఆలయంలో సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయడం లేద’ని జగన్ సర్కారుపై శరపరంపరగా ప్రశ్నాస్త్రాలు సంధించారు. దీనితో ఆ ఘటన జాతీయ మీడియా దృష్టికి వెళ్లినట్టయింది.

అటు బజరంగ్‌దళ్-హిందూ చైతన్యవేదిక-జై హనుమాన్ సేవా సమితి-ధర్మవీర్ ఆధ్మాత్మిక చైతన్యవేదిక-హైందవ అగ్నికుల క్షత్రియ సంఘాలు సోమవారం ‘చలో అంతర్వేది’ ర్యాలీకి పిలుపునిచ్చాయి. గోదావరి జిల్లాల్లో మత మార్పిళ్లను ప్రత్యక్షంగా అడ్డుకునే ఈ సంఘాలన్నీ ఏకమై, ప్రత్యక్ష కార్యాచరణకు దిగనుండటం ఆసక్తికరంగా మారింది. పార్లమెంటు సమావేశాల ప్రారంభ నేపథ్యంలో.. అంతర్వేది ఘటన జాతీయ స్థాయిలో రచ్చయితే, జగన్మోహన్‌రెడ్డి సర్కారు చిక్కుల్లో పడటం తప్పదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. చివరకు ఈ ఘటన తీవ్రతపై తమిళ మీడియాలో కూడా చర్చ ప్రారంభమవడం పరిశీలిస్తే, అంతర్వేది అగ్నికీలలు రాష్ట్ర సరిహద్దులు దాటాయని స్పష్టమవుతోంది.

ముష్కరమూకల వికృత చర్యలకు కాలిబూడిదయిన రథాన్ని.. అఖిల భారత హిందూ మహాసభ ఏపీ దళపతి, వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ నేతృత్వంలోని బృందం సోమవారం పరిశీలించింది. స్థానికులతో ఆరా తీసింది. దీనివెనుక కుట్రకోణం ఉందని, హిందువుల మనోభావాలు దెబ్బతింటే, హిందూ మహాసభ ఉపేక్షించేది లేదని ఘాటుగా హెచ్చరించారు. జరిగిన ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని, స్థానిక పోలీసులపై తమకు నమ్మకం లేదని డిమాండ్ చేశారు. కాగా ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని..  అఖిల భారత హిందూమహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి జీవీఆర్ శాస్త్రి, ఇప్పటికే కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే అధికారం ఇతరులకు ఎవరిచ్చారు? ఆలయాలు, రథాలపై దాడులు జరుగుతుంటే ఏపీ ప్రభుత్వం ఏం చేస్తోందని శాస్త్రి విరుచుకుపడ్డారు.

కాగా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా, తొలిసారిగా ఇలాంటి పరిణామాలపై స్పందించడం విశేషం. గత 15 నెలల నుంచి రాష్ట్రంలోని పలు  దేవాలయాలపై దాడులు, రథాల కాల్చివేత వంటి ఘటనలు జరిగినా, టీడీపీ పెద్దగా స్పందించలేదు. కారణం మతాల జోలికి వెళితే, మరొక మతం వారు దూరమవుతారన్న భయం!  అందుకే హిందువులకు సంబంధించిన అంశాలను, ఆ పార్టీకి చెందిన బ్రాహ్మణ సంఘాలతోనే మాట్లాడించేది. కానీ ఇప్పుడు నేరుగా పార్టీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి, అంతర్వేది ఘటనపై నిజనిర్ధారణ కమిటీ వేశారు. దానితో హోం శాఖ మాజీ మంత్రి నిమ్మకాలయ చినరాజప్ప ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం, సోమవారం అంతర్వేదిలో బూడిదయిన రథాన్ని పరిశీలించింది. ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని రాజప్ప ఆరోపించారు.

కాగా, పురాతన అంతర్వేది నరసింహస్వామి ఆలయంపై కుట్రలు ఇప్పుడు కొత్త కాది హిందూ సంస్థలు చెబుతున్నారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో  ఆలయ మూలవిరాట్టును కదిలించేందుకు ప్రయత్నించగా, స్థానికులు నెలల తరబడి ప్రతిఘటించిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. అంతర్వేది, పరిసర గ్రామాల్లో కొన్నేళ్ల నుంచి నిర్నిరోధంగా మత మార్పిళ్లు జరుగుతున్నాయని, హిందువులు.. ప్రధానంగా తీరప్రాంత వాసులే లక్ష్యంగా మత మార్పిళ్లు జరుగుతున్నాయని హిందూ సంస్ధలు ఆరోపిస్తున్నాయి. వీటిపై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మతమార్పిళ్లు మూడింతలు శరవేగంతో పెరుగుతున్నాయని హిందూ ధార్మిక సంస్థల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి సుదీర్ఘ లక్ష్యంతో జరుగుతున్న దాడులే: వెలగపూడి

రాష్ట్రంలో హిందూ దేవాలయాలు, రథాలపై జరుగుతున్న దాడుల వెనుక సుదీర్ఘ లక్ష్యం ఉందని, అఖిల భారత హిందూ మహాసభ ఏపీ అధ్యక్షుడు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ ఆరోపించారు. ఇలాంటి దాడులు గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదని, పక్క రాష్ట్రాల్లో కూడా జరుగుతున్న దాఖలాలు లేవని గుర్తు చేశారు. గత 14 నెలల కాలంలో పక్కా ప్రణాళికతో, మెజారిటీ వర్గం లక్ష్యంగా జరుగుతున్న ఈ దాడులను అరికట్టడంలో, ప్రభుత్వం విఫలమయిందని విరుచుకుపడ్డారు. దీనిపై గవర్నను కలసి ఫిర్యాదు చేస్తామని, తక్షణం ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీజేపీ గతంలో హామీ ఇచ్చినట్లు మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ఇతర  మతాలపై దాడులు, మతమార్పిళ్లు  మంచిదికాదని, ఎవరి మతాన్ని వారు గౌరవించుకోవాలే తప్ప, ఇతర మతాల దాడులు ఏ మతానికీ మంచిది కాదని హితవు పలికారు.  ఆలయాలను, హిందూధర్మాన్ని హిందూ మహాసభ కాపాడుతుందని, దానికోసం ప్రత్యక్ష కార్యాచరణ రూపొందిస్తున్నామని వెలగపూడి వెల్లడించారు.