జగన్ సార్.. జగనంతే…!

198

ఇప్పుడు కిక్కు కోసమే రేట్లు తగ్గించారా సారూ?
మందు రేట్లు తగ్గించినా ఆ కిక్కే రావడం లేదప్పా..
మడమతిప్పని యోధుడి రాజ్యంలో మారిన ‘మాట’
( మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

చెప్పేవాడు చంద్రబాబయితే వినేవాడు వెర్రిమాలోకమన్న సామెత టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వినిపించేది. కానీ 15 నెలలకే ఆ సామెత రివర్సయి.. ‘అనేది జగనన్నయితే వినేది వెర్రి పుష్పాలన్నది’ బాగా జనబాహుళ్యంలోకి వెళ్లింది. మద్య నిషేధానికి మంగళం పలికే తొలి అడుగులో భాగంగానే, మందు బాటిల్ పట్టుకుంటేనే షాక్ కొట్టేలా ధరలు పెంచామని జగనన్న సర్కారు గొప్పలు చెప్పుకుంది. ఆ పార్టీ మాటల మరాఠా అంబటి రాంబాబయితే.. మేం చంద్రబాబులా ఎక్కడా ఎవరినీ మోసం చేయడం లేదు. మద్యం ముట్టుకుంటేనే షాక్ కొట్టేంతగా కావాలనే రేట్లు పెంచాం. ఎక్కువ ధరలు పెట్టడం ద్వారా.. మద్యం తాగే అలవాటును తగ్గించాలన్నదే, తమ ప్రభుత్వ లక్ష్యమని.. తామెందుకు మందు ధరలు పెంచామో నిండు సభలో కుండబద్దలు కొట్టారు.

స్టేట్మెంట్లు మార్చని వాడు పొలిటీషియనే కాదు పొమ్మన్న గిరీశానికి, జగనన్న గుగ్గురువుగా అవతరించారు. ఎంతగా అంటే.. గిరీశమే ఈర్ష్యపడేంత! మద్యం మాన్పించేందుకే రేట్లు ఎక్కువ పెట్టామని గతంలో ప్రవచించిన అదే జగనన్న, ఇప్పుడు అదే మందు ధరలు తగ్గించింది.. మందు అలవాటును ప్రోత్సహించేందుకేనని అదే నోటితో చెబితే, ప్రజల జీవితాలు కూడా ధన్యమయ్యేవి కదా? మాటతప్పని-మడమ తిప్పని యోధుడిగా, జగనన్న పేరు హిమాలయమంత ఎత్తున,  క్రేన్లు లేకుండానే పెరిగేది కదా? మరి ఈ డొంక తిరుగుడు ఉపన్యాసాలు-ఉపోద్ఘాతాలూ, చచ్చు పుచ్చు ఇచ్చకాలూ ఎందుకన్నది బుద్ధిజీవుల ప్రశ్న.

సరే.. ఇప్పుడు ఆంధ్రదేశంలో మందు రేట్లు తగ్గించారు కాబట్టి, ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఉన్న మందును కాదని, మందుబాబులేమైనా పరాయి మందు తాగడం మానుకుంటారా? అన్న గ్యారంటీ ఉందా అంటే అదీ లేదు. బంగారం లాంటి ఆంధ్రా బ్రాండ్లు ఉంచుకుని, పక్కచూపులు చూసే మందుబాబుల అమాయత్వాన్ని చూసి జగనన్న అండ్ కో ఆశ్చర్యపోతోంది. అప్పటికీ.. గత ఎన్నికల్లో శ్రమదానం చేసిన తనవాళ్లకు మేళ్లు చేసేందుకే బ్రాండెడ్ కంపెనీలను తరిమేసి, ‘ప్రెసిడెంట్ మెడల్’ వంటి ప్రపంచస్థాయి బ్రాండ్లను తీసుకువచ్చారు. వాటి అమ్మకాల కోసమే, పక్క రాష్ట్రాల్లో ఉన్న పరాయి మందు,  తమ రాష్ట్రంలో రాకుండా.. సరిహద్దులన్నీ మూసేసి, ‘జగగన్న బాసట’ పథకాన్ని అమలు చేస్తున్నారు. అయినా, మద్యం పరవళ్లెత్తుతోందాయె! ఇప్పుడు హైకోర్టు తీర్పు పుణ్యాన, మందుబాబులు సరిహద్దులు దాటి ఓ మూడు బాటిళ్లు,  ఎంచక్కా చంకలో పెట్టుకుని రావచ్చు.

మరి మందుబాబులు గుంపులుగా సరిహద్దులు దాటి, ఒక్కొక్కరు మూడేసి బాటిళ్లు ఎత్తుకొస్తే,  ఇక ప్రపంచస్థాయి ఆంధ్రా బ్రాండ్లను కొనే దిక్కెవరు? పాపం ఏపీలో ఉన్న డిస్టలరీలను గంపగుత్తగా లీజుకు తీసుకుని, మందు తయారుచేస్తున్న నేతాశ్రీల ఉపాథి సంగతేమిటి?.. ఇలా పరిపరివిధాల ఆలోచించిన జగనన్న, మందు ధరలు తగ్గించాలన్న మహత్తర నిర్ణయం తీసుకున్నారు.

మరి ఆ ప్రకారం.. మందు తాగడాన్ని ప్రోత్సహించేందుకే రేట్లు తగ్గించామని, అంబటి రాంబాబు అదే అసెంబ్లీలో మళ్లీ నాలుక మడతేస్తారా? ప్రజల ఆరోగ్యాన్ని మళ్లీ ఆసుపత్రుల పాలుచేసేందుకే, మందు రేట్లు తగ్గించామని జగనన్న ఆత్మాహుతిదళాలు కొత్త ప్రచారానికి తెరలేపుతాయా? ఇవన్నీ కాకపోతే.. ఎక్కువ రేట్లు పెట్టి ప్రపంచస్థాయి బ్రాండ్లు తాగలేక, శానిటైజర్లు తాగి జనం చచ్చిపోతున్నారు కాబట్టి, మందుబాబుల కష్టం చూడలేక రేట్లు తగ్గించామని చెబుతారా? ఇవన్నీ పక్కకుపెడితే.. ఎలాగూ రేట్లు తగ్గించి, మందు తాగడాన్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి, మద్యనిషేధం కోసం వేసిన కమిటీని కొనసాగిస్తారా? లేక ఆ కమిటీతో చేతిచమురు ఎందుకని ఆ కమిటీని ఎత్తేస్తారా? చూడాలి. ఏదైనా జగన్ సార్.. జగన్ అంతే!