ఎన్నిసార్లు ‘తప్పు’లు చేస్తావు ‘బాబూ’…?

245

పాత డైలాగులే మళ్లీ కొత్తగా…
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు  ఎంచుకునే పనిలో ఉన్నారన్నట్లు.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు కూడా.. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను, ప్రతిపక్షంలోకి రాగానే ఏకరవుపెడుతుంటారు. మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పటి హామీలను విజయవంతంగా విస్మరిస్తున్నారు. ఆ సంప్రదాయం ఇప్పుడు కూడా విజయవంతంగా కొనసాగుతోంది. అధికారంలో ఉన్నప్పుడేమో, ఆయన  పార్టీ నేతల కష్టసుఖాల వైపు అస్సలు కన్నెత్తి చూడరు. సూటు-బూటు వేసుకున్న ఆసాములు, పారిశ్రామికవేత్తలను ప్రేమిస్తుంటారు. అధికారులను నెత్తికెక్కించుకుంటారు.

అధికారం పోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మాత్రం ‘నేను అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడే నేపథ్యంలో పార్టీని విస్మరించి తప్పు చేశాను. పార్టీని నిర్లక్ష్యం చేశాను. ఇకపై మీ కోసమే పనిచేస్తా. మళ్లీ మనం అధికారంలోకి రావలసిన అవసరం ఉంది. మళ్లీ అధికారంలోకి వస్తే పార్టీపై దృష్టి సారిస్తా. మీరంతా నా కుటుంబ సభ్యులు’ అనే అరిగిపోయిన డైలాగును వినిపిస్తుంటారు. ఈవిధంగా బాబు చెప్పడం.. తమ్ముళ్లు వినడం టీడీపీలో అలవాటయిపోయింది. ఆవిధంగా చివరకు.. వినేవాడు వె ర్రిపప్పయితే, చెప్పేవాడు చంద్రబాబు నాయుడన్న సామెత ఒకటి టీడీపీ వర్గాల్లో స్థిరపడింది.

ఇప్పుడూ అంతే. తాజా అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో బాబు గారు తన పాత డైలాగును కొత్తగా చెప్పారట.  ‘అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న కాంక్షతో పార్టీని విస్మరించి తప్పు చేశా. ఇకపై అలాంటి తప్పు చేయను. రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్లీ టీడీపీ అధికారం లోకి రావలసిన అవసరం ఉంది. మీరంతా మళ్లీ పట్టుదలతో పనిచేయండి’ అని పిలుపునిచ్చారట. దానితో..  ఎందుకూ.. మళ్లీ కాంట్రాక్టర్లు, రాజకీయ బ్రోకర్లు, పైరవీకారులు, పారిశ్రామికవేత్తలు, ఎన్నికల తర్వాత మాయమై, స్కూళ్లు నడిపే వ్యాపారస్తులకు సీట్లు ఇచ్చుకోవడానికే కదా? మమ్మల్ని బయట కూర్చోబెట్టి సూటుబూటు వేసుకున్న వాళ్లతో మాట్లాడుకోవడానికే కదా? మమ్మల్ని పనికిమాలిన వాళ్లుగా మార్చి అధికారులకు మళ్లీ పెత్తనం ఇవ్వడానికే కదా? అన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తమకు అధికారంలో ఉన్నప్పుడు కంటే ప్రతిపక్షంలోనే ఎక్కువ గౌరవం లభిస్తుందని చెబుతున్నారు.

ప్రతి ఎన్నికల ముందు కార్యకర్తలే నా ప్రాణం. వారంతా నా ప్రాణ సమానులు. నా కుటుంబ సభ్యులు. తమ్ముళ్లూ.. మీరు లేకపోతే నేను లేను. నా చివరి రక్తపుబొట్టు వరకూ మీ కోసమే పనిచేస్తా.. అన్నది చంద్ర బాబు చెప్పే రొటీన్ డైలాగని, కానీ దానిని నిలబెట్టుకున్న దాఖలాలు ఎప్పుడూ లేవని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కార్యకర్తలను పట్టించుకున్న అలవాటు తమ నాయకుడికి ఎప్పుడూ లేదని తముళ్లు  చెబుతున్నారు. పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసే వారిని సైతం.. వారికి అవసరమైనందుకే పార్టీలో పనిచేస్తున్నారు తప్ప మనకోసం కాదన్న భావన- వాళ్లు కాకపోతే మరొకరితో పనిచేయించుకోవచ్చన్న వ్యూహం తప్ప… పార్టీకి పనిచేసిన వారిని ప్రోత్సహించాలన్న నిండైన ఆలోచన ఇప్పటిదాకా తమకు మా సారులో కనిపించలేదని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

సమైక్యాంధ్రప్రదేశ్‌లో మెగా ఇంజనీరింగ్ కంపెనీ కెవిపి రామచంద్రరావు బినామీ అని, ఆ కంపెనీ కోసం వైఎస్ సర్కారు అడ్డగోలుగా దోచిపెడుతోందని అప్పట్లో సోమిరెడ్డి, గాలి ముద్దుకృష్ణబనాయుడు ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఆ కంపెనీని బ్లాక్‌లిస్టులో పెడతామని, ఆ కంపెనీ చేసిన పనుల నాణ్యతపై విజిలె న్స్ విచారణ జరిపిస్తామని ప్రకటించారు. కాకినాడ సెజ్‌పై స్వయంగా బాబు ధర్నా నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయమే విస్మరించారు. కానీ విచిత్రంగా.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. అదే మెగా కృష్ణారెడ్డి కంపెనీకి అన్ని కాంట్రాక్టులు పువ్వుల్లో పెట్టి అప్పగించగా, కాకినాడ సెజ్ నిర్వహకుడు అధకారంలోకి వచ్చిన తర్వాత, బాబు పక్కనే కనిపించిన విషయాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు.

మళ్లీ ఇప్పుడు కూడా అదే డైలాగులను రిపీట్ చేస్తున్నా, ఎవరూ  నమ్మే పరిస్థితిలో లేరన్నది నాయకుల అభిప్రాయం.అందుకు వారు తెలంగాణ నాయకులకు ఇచ్చిన హామీలను ఉదహరిస్తున్నారు. తాను తెలంగాణ నేతలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, మీరు పార్టీని బలోపేతం చేయండని ఇచ్చే పిలుపును ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పటివరకూ బాబు తెలంగాణలో పార్టీని పట్టించుకున్న దాఖలాలే లేవని, అన్నింటా విఫలమైన ఎల్.రమణ  ఇష్టానికే పార్టీని వదిలిపెట్టారని చె బుతున్నారు. బాబు అనుసరిస్తున్న అస్పష్ట వైఖరి వల్ల తెలంగాణలో పార్టీ జెండా ఉందా? పీకే శారా అన్న సందేహం తమకే వస్తుందని పార్టీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. ‘అసలు ఇక్కడ మా పాత్ర ఏమిటో మాకే తెలియదు. కేసీఆర్ సర్కారును విమర్శించాలా? వద్దా? పార్టీ స్టాండేమిటో చెప్పరు. రమణ పార్టీ అధ్యక్షుడిగా పనికిరారని తెలిసినా, నేతలు చెప్పినా ఆయననే కొనసాగిస్తారు. ఒకవేళ ఆయనను తొలగిస్తే పార్టీ మారతారన్న భయం. ఎంతోమంది పార్టీని వీడారు. ఇప్పుడు రమణ పార్టీని వీడితే వచ్చే నష్టమేంటో మాకూ అర్ధం కావడం లేదు. పార్టీ అధినేతగా ఆయనకే ఒక స్పష్టత లేకపోతే ఇక మేం ఎలా పనిచేయాలి? మాకూ వేరే పార్టీల్లో తెరవు లేక ఇక్కడే పనిచేయాల్సి వస్తోంద’ని ఓ అగ్ర నేత వ్యాఖ్యానించారు.

కాబట్టి.. తాను తప్పు చేశానని బాబు ఎన్నిసార్లు చెప్పినా  క్యాడర్  నమ్మే పరిస్థితి లేనందున, ఇకపై అలాంటి పాత డైలాగును కొత్తగా చెప్పకపోవడమే మంచిదని పార్టీ నేతలు సూచిస్తున్నారు. ‘ఆయన మాటలు వినడం మాకు అలవాటయిపోయింది కాబట్టి,  ఈ మాట చెప్పినా ఎప్పుడూ వింటారనుకోవడం సార్ భ్రమ. ఆయన టెలికాన్ఫరెన్స్‌లో చెప్పింది విని సరే అని నటించడం మా వాళ్లకూ అలవాటయింది. మేం నమ్ముతున్నట్లు ఆయన కూడా నటిస్తున్నారు.  మొత్తానికి ఇద్దరం నటిస్తున్నాం’ అని ఓ మాజీ మంత్రి అసలు విషయం బయటపెట్టారు. సో.. తెలుగుదేశం పార్టీలో అంతా కృత్రిమ ప్రేమ సాగుతోందన్న మాట!