దుబ్బాక పోరులో రాములమ్మ?

145

హైదరాబాద్: కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్, మాజీ ఎంపి విజయశాంతి దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆకస్మిక మృతితో, దుబ్బాకలో ఉప ఎన్నికలు అనివార్యం కానున్నాయి. స్థానికంగా రామలింగారెడ్డి కుటుంబసభ్యులు బరిలోకి దిగనున్నారన్న వార్తలు, టీఆర్‌ఎస్ వర్గాల్లో వ్యతిరేకతకు కారణమవుతోంది. ఆయన కుటుంబసభ్యులు పోటీ చేయడాన్ని స్థానిక నేతలు అంగీకరించడం లేదు. టీఆర్‌ఎస్‌లో ఈ అంతర్గత క లహాలను సద్వినియోగం చేసుకోవాలంటే, సినిమా గ్లామర్ ఉన్న విజయశాంతిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ నాయకత్వంసూత్రప్రాయంగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గతంలో టీఆర్‌ఎస్ ఎంపీగా ఉన్నప్పుడు, విజయశాంతి మెదక్ జిల్లాలో దండిగా ప్రజాభిమానం సంపాదించుకున్నారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఆమె రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో అంతర్గత కలహాలు, బీజేపీకి పెద్దగా పట్టులేని పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలంటే, ప్రజాభిమానం దండిగా ఉన్న విజయశాంతిని బరిలోకి దింపడమే మంచిదని, కాంగ్రెస్ నాయకత్వం కూడా సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఒకవేళ రామలింగారెడ్డి కుటుంబసభ్యులను తెరాస బరిలోకి దింపినా.. విజయశాంతి ప్రత్యర్ధిగా ఉంటే ఆ సానుభూతి ప్రభావం పనిచేయదన్నది కాంగ్రెస్ అంచనా. గత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు మూడవ స్థానం దక్కింది. ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే, ఆ ప్రభావం- ఉత్సాహం తెలంగాణ రాష్ట్రంలోని పార్టీ శ్రేణుల్లో కచ్చితంగా ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది.