రెండో ప్రపంచ యుద్ధం ముగిసి నేటికి 75 సంవత్సరాలు….

745

-తోలేటి జగన్మోహనరావు ,9908236747

ఈ మే 9వ తేదీకి ఫాసిస్టు జర్మనీ అంతమై, రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 75 సంవత్సరాలవుతోంది.
ఈ ప్రపంచ యుద్ధంలో 5 కోట్లమంది నశించిపోయారు. అందులో సగం మంది సోవియట్ పౌరులే. యూరోపులో జరిగిన వినాశనంలో సగం సోవియట్ యూనియన్ లోనే జరిగింది.ఉప్పెనలా విరుచుకుపడి ప్రపంచాన్ని ఆక్రమిస్తున్న ఫాసిస్టు జర్మనీ ఎదురుగా ఉక్కుగోడలా నిలిచి, ప్రపంచాన్ని ఫాసిస్టు ప్రమాదం నుండి కాపాడిన సోవియట్ రష్యా చేసిన ఆశేష త్యాగాల గురించి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

జర్మనీ సోవియట్ యూనియన్ మీద దాడి చెయ్యడానికి ముందటి పరిస్థితి

సామ్రాజ్యవాద దశలో పెట్టుబడిదారీ దేశాలు ముడి సరుకులకోసం, మార్కెట్ కోసం, ప్రపంచాన్ని పంచుకోవడానికి తమలో తాము కలహిస్తూ ప్రపంచాన్ని మారణహోమంలోకి నెట్టుతాయి. 20వ శతాబ్దంలో సామ్రాజ్యవాద దేశాల మధ్య కలహాలు రెండు మహా సంగ్రామాలకు దారితీశాయి. ఈ రెండు ప్రపంచ యుద్ధాలలోనూ కోట్లమంది బలైపోయారు.మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుండి 1918 వరకూ జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటన్, ఫ్రాన్స్ ల చేతుల్లో జర్మనీ ఓడిపోయింది. ఓడిపోయిన జర్మనీ, మిత్ర దేశాలు విధించిన అవమానకరమైన షరతులను విధిలేక అంగీకరిస్తూ, 1919 జూన్ లో వెర్సయిల్స్ ఒడంబడిక మీద సంతకం చెయ్యాల్సి వచ్చింది. ఈ సంధిలోనే రెండో ప్రపంచ యుద్ధానికి బీజాలు పడ్డాయి. జర్మన్ ప్రజలలో అధిక భాగం వెర్సయిల్స్ సంధిని కాని, ఆ సంధికి తప్పనిసరి పరిస్థితులలో ఒడబడిన రిపబ్లిక్ ప్రభుత్వాన్ని కాని అంగీకరించలేదు.అవమానంతో రగిలిపోతున్న జర్మన్ ప్రజానీకానికి హిట్లర్ ఒక రక్షకుడిగా కనుపించాడు. వెర్సయిల్స్ సంధి జర్మనీకి వేసిన సంకెళ్ళను తెగ్గొట్టి, మళ్ళీ జర్మనీ సగర్వంగా నిలబడేలా చేసిన హిట్లర్, జర్మన్ ప్రజల దృష్టిలో జర్మనీ ఆత్మ గౌరవాన్ని కాపాడిన మహోన్నత వ్యక్తిగా నిలిచాడు. జర్మన్ల కళ్ళ ముందు నిలిచిన కల – హిట్లర్ నాయకత్వంలో ప్రపంచాధినేత కాబోతున్న జర్మనీ – జర్మన్ ప్రజల కళ్ళకు పొరలు కప్పింది. ఒక నియంతగా హిట్లర్ సర్వాధికారాలు తన చేతుల్లో కేంద్రీకరించి జర్మనీని వినాశకర మార్గం వైపుకు తీసుకు వెడుతున్నాడని గ్రహించలేకపోయారు.

వెర్సయిల్స్ సంధి షరతులను ఒక్కొక్కటే ఉల్లంఘిస్తూ హిట్లర్ జర్మనీని సాయుధం చేస్తుంటే, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు అతన్ని ఆపడానికి ప్రయత్నించలేదు సరికదా, కమ్యూనిస్టు రష్యా మీదకు ఉసిగొల్పేందుకు కుట్రలు చెయ్యసాగాయి. రైన్ లాండ్, ఆస్ట్రియాలను హిట్లర్ ఆక్రమిస్తుంటే ప్రేక్షకుడిలా చూస్తూ ఉండిపోయాయి.అంతే కాదు, జకోస్లేవేకియాను ఆక్రమించడంలో ఈ రెండు దేశాలూ హిట్లర్ కు సహకరించాయి. 50 శాతం కంటే ఎక్కువమంది జర్మన్లు ఉన్న ప్రాంతాలను జర్మనీకి అప్పగించాలనీ, లేకపోతే యుద్ధం తప్పదనీ బ్రిటన్, ఫ్రాన్స్ లు జకోస్లోవేకియా మీద ఒత్తిడి తీసుకువచ్చాయి. 1938 సెప్టెంబరులో మ్యూనిచ్ నగరంలో జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ దేశాల మధ్య దీనికి సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. ఈ సిగ్గుమాలిన ఒప్పందం మ్యూనిచ్ ఒడంబడికగా చరిత్రలో అపఖ్యాతి పాలయింది. తన భవిష్యత్తు నిర్ణయించబడిన ఈ సమావేశంలో జకోస్లోవేకియా లేదు. జకోస్లోవేకియా, ఫ్రాన్స్, రష్యాల మధ్య సైనిక సహాయానికి సంబంధించి ఒక ఒడంబడిక ఉన్నా ఈ మ్యూనిచ్ సమావేశాన్నుంచి రష్యాను వెలివేయడం జరిగింది.హిట్లర్ ఆకలి జకోస్లోవేకియాతో తీరేది కాదు. జకోస్లోవేకియా తర్వాత – రైన్ లాండ్, ఆస్త్రియాల ఆక్రమించడంలో, జకోస్లోవేకియాను హత్య చెయ్యడంలో, హిట్లర్ కు సహకరించిన పోలెండు వంతు వచ్చింది.

సోవియట్ ప్రభుత్వం యూరోపులో క్రమ్ముకు వస్తున్న యుద్ధ మేఘాలను గమనించి ఆందోళన పడింది. జర్మనీ ఆస్ట్రియాను ఆక్రమించిన తర్వాత, జర్మనీకి వ్యతిరేకంగా బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలు సమిష్టి రక్షణకు వెంటనే సంసిద్ధమవ్వాలని సోవియట్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. కాని బ్రిటన్, ఫ్రాన్స్ లు అంగీకరించలేదు. పోలెండ్ ప్రమాదంలో పడ్డాకా 1939 మార్చ్ లో బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్ యూనియన్, టర్కీ, రుమేనియాలు హిట్లరును సమిష్టిగా ప్రతిఘటించాలని సోవియట్ ప్రభుత్వం మరో ప్రతిపాదన చేసింది.బ్రిటన్, ఫ్రాన్స్ లు ఈ ప్రతిపాదనను కూడా అంగీకరించలేదు. బ్రిటన్ ఒక పక్క సోవియట్ ప్రభుత్వంతో సైనిక సంప్రదింపులు జరుపుతూ, మరో పక్క సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా జర్మనీతో చేతులు కలిపి కుట్ర పన్నుతోంది. గూఢచారుల ద్వారా స్టాలిన్ కు ఈ సమాచారం అందుతూనే ఉంది.బ్రిటన్ తో రహస్య సంప్రదింపులు జరుపుతున్న జర్మనీ, మరోపక్క సోవియట్ యూనియన్ కు నిరాక్రమణ సంధి ప్రతిపాదన చేస్తోంది.

సోవియట్ యూనియన్, ఈ జర్మన్ ప్రతిపాదనను మొదట తిరస్కరించినా, చివరకు అంగీకరించేలా ఒత్తిడి చేసిన మరో విషయం ఒకటి ఉంది. 1939 ఆగస్టులో రష్యా తూరుపు సరిహద్దుల్లో, జపాన్ కూ రష్యాకూ మధ్య ఒక చిన్న సైజు యుద్ధం జరుగుతోంది. రోజు రోజుకు మరింత ఎక్కువ సైన్యంతో జపాన్ దాడి చేస్తోంది. ఈ యుద్ధం స్టాలిన్ కు ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమాన్నుంచి జర్మనీ, తూర్పునుంచి జపాన్ – రెండు దేశాలూ ఏక కాలంలో దాడి చేసే ప్రమాదం ఎదురవుతోంది. సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ – అన్నీ ఏకమయ్యే ప్రమాదం ఏర్పడుతోంది.

ఇటువంటి పరిస్థితులలో, 1939 ఆగస్టులో సోవియట్ యూనియన్ జర్మనీతో నిరాక్రమణ సంధి చేసుకుంది. జర్మనీతో రష్యా కుదుర్చుకున్న ఈ నిరాక్రమణ సంధి జర్మనీ మిత్రదేశమైన జపాన్ ను నిరుత్సాహపరిచింది. అంతే కాదు, రష్యన్ సైనిక శక్తి జపాన్ అనుభవంలోకి వచ్చి వెనక్కు తగ్గింది. ఈ సంధి వలన సోవియట్ యూనియన్ కు యుద్ధానికి సిద్ధమవడానికి ఒకటిన్నర సంవత్సరాల వ్యవధి లభించింది.జర్మనీతో నిరాక్రమణ సంధికి అంగీకరించడం తప్పు అని ఈ నాటికీ అనేకమంది కమ్యూనిస్టులు స్టాలిన్ ను విమర్శిస్తుంటారు. కాని ఆ నాటి పరిస్థితులలో ఇది అత్యంత వాస్తవికమైన చర్య.

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లు రష్యాను ఏకాకిని చేసి జర్మనీతో పోరాడేలా చెయ్యాలని ఎన్ని కుట్రలు పన్నినా ఈ యుద్ధం చివరకు పెట్టుబడిదారీ దేశాల మధ్య యుద్ధంగానే పరిణమించింది. 1941లో సోవియట్ యూనియన్ మీద జర్మనీ దాడి చేసినప్పుడు అమెరికా, బ్రిటన్ లు, జర్మనీకి వ్యతిరేకంగా సోవియట్ యూనియన్ తో చేతులు కలపవలసి వచ్చింది. ఇది సోవియట్ యూనియన్ దౌత్య నైపుణ్యానికి ఒక నిదర్శనంగా నిలుస్తుంది.

1939 సెప్టెంబరు 1న జర్మనీ పోలెండు మీద దాడి చేసింది. దీనితో ప్రపంచ యుద్ధానికి అంకురార్పణ జరిగింది. పోలెండు మీద జర్మనీ దాడి చేసినప్పుడు బ్రిటన్, ఫ్రాన్స్ లు, జర్మనీ మీద యుద్ధ ప్రకటన చేశాయి కాని ఈ యుద్ధం చాలా ‘శాంతియుతంగా’ సాగింది.

జర్మన్ సైన్యం నిరాటంకంగా పోలెండునంతా ఆక్రమిస్తూ రష్యా సరిహద్దులకు చేరి రష్యాకు ప్రమాదంగా మారబోతున్న తరుణంలో, సోవియట్ సైన్యం తూర్పు వైపునుండి తూర్పు పోలెండులోకి ప్రవేశించింది. ఈ తూర్పు పోలెండులో ప్రధానంగా యుక్రెయిన్లూ, బెలోరష్యన్లూ నివసిస్తారు. 1920లో పోలెండు కమ్యూనిస్టు రష్యా మీద దాడి చేసి ఆక్రమించిన ఈ భూభాగాన్ని రష్యా తిరిగి స్వాధీనం చేసుకుంది. పోలెండులో ఇలా రష్యన్ సైన్యాలు ప్రవేశించడం హిట్లర్ తో చేతులు కలపడంగా బూర్జువా చరిత్రకారులు చెబుతుంటారు, కాని జార్జ్ బెర్నార్డ్ షా రష్యా పోలెండులో హిట్లర్ ను అడ్డుకున్నందుకు అభినందిస్తూ లండన్ టైమ్స్ లో రాశారు.

1940లో రష్యా-ఫిన్లాండు దేశాల మధ్య సరిహద్దు యుద్ధం ఒకటి జరిగింది. 1920లో జర్మనీ తదితర దేశాలతో చేతులు కలిపి ఫిన్లాండు కమ్యూనిస్టు రష్యా మీద దాడి చేసింది. బలహీనంగా ఉన్న కమ్యూనిస్టు రష్యా ఫిన్లాండుతో కఠినమైన షరతులతో ఒక సంధి కుదుర్చుకోవలసి వచ్చింది. ఈ షరతులలో ఒకటి రష్యన్-ఫిన్నిష్ సరిహద్దు విభజన. ఈ సరిహద్దు పునర్విభజనతో సరిహద్దు లెనిన్ గ్రాడ్ నగరానికి 18 మైళ్ళ సమీపానికి చేరింది. లెనిన్ గ్రాడ్ కు రక్షణ లేకుండా పోయింది. యుద్ధం అనివార్యమవుతున్న పరిస్థితులలో లెనిన్ గ్రాడ్ రక్షణ గురించి ఆందోళన పడుతున్న రష్యా, 1920లో నిర్ణయించబడిన సరిహద్దులను తిరిగి నిర్ణయించాలని కోరింది. ఫిన్లాండు ఈ ప్రతిపాదనను నిరాకరించి యుద్ధానికి సన్నద్ధం కాసాగింది.

జర్మనీతో ‘శాంతియుత యుద్ధం’ చేస్తున్న బ్రిటన్, ఫ్రాన్స్ లు, రష్యా మీద యుద్ధం చెయ్యడానికి ఫాసిస్టు ఇటలీ, అమెరికాలతో చేతులు కలిపి ఫిన్లాండుకు భారీ సంఖ్యలో ఆయుధాలు సరఫరా చేశాయి. ఫ్రాన్స్, 50,000 సైన్యంతో సైనిక దాడికీ, రష్యన్ చమురు గనుల మీద విమాన దాడికీ సిద్ధమైంది. రష్యాతో యుద్ధం చెయ్యడానికి ఒక లక్షమంది సైనికులను పంపుతానని బ్రిటన్ ప్రకటించింది.

ఈ లోగా రష్యా-ఫిన్నిష్ సరిహద్దు యుద్ధం ముగిసింది. రష్యాతో ఫిన్లాండు చేసుకున్న సంధి ప్రకారం సోవియట్ యూనియన్ లెనిన్ గ్రాడ్ రక్షణకు అవసరమైన కొన్ని దీవులను, భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది.

పోలెండుతోనూ, ఫిన్లాండుతో జరిగిన ఈ సరిహద్దు సంఘర్షణలను సోవియట్ దురాక్రమణ యుద్ధంగా చిత్రిస్తాయి పెట్టుబడిదారీ దేశాలు. కాని ఒక మహా యుద్ధం అనివార్యమవుతున్న పరిస్థితులలో రష్యా తన రక్షణను బలపరుచుకోవడానికి తీసుకున్న చర్యలుగానే వీటిని చూడడం సమంజసంగా ఉంటుంది. “బాల్టిక్ రాజ్యాలనుంచి నల్ల సముద్రం వరకూ రష్యా ఒక బ్రహ్మాండమైన రక్షణ రేఖను నిర్మిస్తోందన్న విషయం రోజురోజుకు స్పష్టమవుతోంది” అని రాశాడు, ప్రముఖ పాత్రికేయుడు వాల్టర్ లిప్ మేన్.

బలిమీద బలి ఇస్తూ హిట్లర్ ను సంతృప్తి పరిచి రష్యా మీదకు ఉసిగొల్పాలని చూస్తున్న బ్రిటన్, ఫ్రాన్స్ లు తాము తీసుకున్న గోతిలో తామే పడ్డాయి. ‘శాంతియుత యుద్ధం’ నిజం యుద్ధంగా మారి జర్మనీ – డెన్మార్క్, నార్వే, బెల్జియం, హాలెండు, లగ్జెంబర్క్ లను ఆక్రమించడమే కాకుండా, ఆరువారాల యుద్ధంలో యూరోపులో అతి శక్తివంతమైన దేశంగా పేరు పడ్డ ఫ్రాన్స్ ను కూడా ఓడించింది. ఫ్రాన్స్ లో ఉన్న బ్రిటిష్ సైన్యం ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని బ్రిటన్ కు పలాయనం చిత్తగించింది.

యూరోపునంతా ఆక్రమించిన తర్వాత బ్రిటన్ తో సంధి చేసుకుని రష్యా మీదకు మళ్ళాలని హిట్లర్ ఆలోచన. బ్రిటన్ తో సంప్రదింపులు జరపడానికి నాజీ పార్టీలో మూడో స్థానంలో ఉన్న రుడాల్ఫ్ హెస్ ను రహస్యంగా చిన్న విమానంలో ఇంగ్లండు పంపించాడు. హెస్ మతి చలించి ఇంగ్లండు వెళ్ళాడనీ, అతనొక మానసిక రోగి అనీ జర్మనీ ప్రచారం చేసింది, కాని స్టాలిన్ ఈ కట్టుకధలు నమ్మలేదు. జర్మనీ బ్రిటన్ తో సంధి చేసుకుని రష్యా మీదకు మళ్ళాలని ప్రయత్నిస్తోందనీ, చర్చిల్, హిట్లర్ లు ఇద్దరూ రష్యాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారనీ అతను గ్రహించాడు. ఒంటరిగానే సోవియట్ యూనియన్ జర్మనీతో తలపడాలని అతనికి అర్థమైంది.

సోవియట్ రష్యా మీద జర్మన్ దాడి

రష్యా మీద జర్మనీ దాడి చెయ్యడానికి వేసిన పథకం పేరు ఆపరేషన్ బార్బరోస్సా. రష్యాను ఒక సైనిక శక్తిగా, ఒక ఆర్థిక శక్తిగా నామరూపాలు లేకుండా చెయ్యడం మాత్రమే కాదు, రష్యాను ఒక దేశంగా కూడా మిగలనివ్వకూడదు. రష్యన్లు జర్మన్లకు బానిసలుగా మాత్రమే, జర్మన్లకు సంపద సృష్టించడానికి మాత్రమే జీవించాలి – ఇదీ ఆపరేషన్ బార్బరోసా లక్ష్యం.

“రష్యాతో జరిగే ఈ యుద్ధం పెద్ద మనుషుల మధ్య జరిగే యుద్ధం లాంటిది కాదు. రెండు సిద్ధాంతాల మధ్యా, రెండు జాతుల మధ్యా జరిగే యుద్ధం.” అన్నాడు హిట్లర్.

జూన్ 22వ తేదీ తెల్లవారగట్ల 3.30 నిమిషాలకు 37 లక్షల సైన్యంతో, 6000 మోటారు వాహనాలతో, 3648 టాంకులతో, 2,700 విమానాలతో జర్మనీ హఠాత్తుగా దాడి చేసింది. దానితో రష్యన్ల ప్రతిఘటనా యుద్ధం కూడా ప్రారంభమైంది. రష్యన్లు ఈ ప్రతిఘటనా యుద్ధాన్ని దేశభక్తి ప్రపూరిత మహా యుద్ధం (The Great Patriotic War) అని అంటారు.

ఈ యుద్ధం నిజంగా అకస్మాత్తుగా ప్రారంభమైందా? జర్మన్ దాడి గురించి హెచ్చరికలు లేవా? అంటే యుద్ధం రాబోతోందని హెచ్చరికలూ ఉన్నాయి, యుద్ధం హఠాత్తుగానూ ప్రారంభమైంది. రెండూ వాస్తవమే. ఎప్పుడెప్పుడా అని ఎంతో కాలంగా ప్రతీ ఒక్కరూ ఎదురు చూస్తున్న యుద్ధం ఆకాశంలోంచి పిడుగు పడ్డట్లు హఠాత్తుగా మీద పడింది.

జర్మన్లు దాడి చేసే ఈ పద్ధతిని బ్లిట్జ్ క్రీగ్ – మెరుపు దాడి – అంటారు. జర్మన్ సైన్యం హఠాత్తుగా వేల టాంకులతో, విమానాలతో, లక్షల సైన్యంతో తను ఎంచుకున్న ప్రాంతంలో దాడి చేసి, శత్రువు ఒక క్రమ పద్ధతిలో తిరోగమించకుండా చెల్లా చెదరు చేస్తూ, శత్రువు వెనుక వైపు చేరి చుట్టుముట్టి, వెనుక తట్టునుంచి సరఫరాలు అందకుండా అడ్డుకుని నాశనం చేసేది. జర్మన్ వైమానిక దళం పట్టణాల మీద, రైల్వే జంక్షన్ల మీదా, రవాణా మార్గాల మీదా, వంతెనల మీద, ప్రజల మీదా బాంబుల వర్షం కురిపిస్తూ భీభత్సం సృష్టించేది. ఈ జర్మన్ మెరుపుదాడిని ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రభుత్వాలూ, సైన్యాలూ స్తంభించిపోయేవి. పోలెండ్, ఫ్రాన్సులు ఈ ఎత్తుగడను ఎదుర్కోలేక వారాలలో కూలిపోయాయి. ‘మానవ శక్తి ఏదీ దీన్ని తట్టుకోలేదు’ అని బెర్లిన్ లోని అమెరికన్ రాయబారి తనతో అన్నట్లు అన్నా లూయీ స్ట్రాంగ్ ‘స్టాలిన్ యుగం’ అన్న పుస్తకంలో రాసింది.

రష్యా ఆంతరంగిక ఘర్షణలతో శిధిలమైపోయి, ఒక తాపు తంతే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నదనే, జర్మనీతో యుద్ధంలో తొలి అపజయాలు స్టాలిన్ మీద ఒక సైనిక, రాజకీయ తిరుగుబాటుకు దారి తీస్తాయనే, ఆలోచన మీద జర్మన్ మెరుపు దాడి ప్రధానంగా ఆధారపడింది. స్టాలినిస్టు రష్యా గురించి అబద్ధాలు చెప్పి చెప్పి, చివరకు తన అబద్ధాలను తానే నమ్మే స్థితికి చేరాడు హిట్లర్. ఒకవేళ అతను ఆశించినట్లు తొలి అపజయాలు స్టాలిన్ మీద తిరుగుబాటుకు దారి తియ్యకపోతే? ఈ యుద్ధం దీర్ఘ కాలిక యుద్ధంగా పరిణమిస్తే? దీర్ఘకాలిక యుద్ధానికి సన్నద్ధంగా లేని జర్మనీ సర్వ నాశనానికి గురయ్యే ప్రమాదం ఉంది. హిట్లర్ కు ఇది తెలుసు. కాని ఒక జూదగాడిలా మెరుపుదాడి మీద ఆధారపడి గెలుపును ఆశించాడు హిట్లర్.

జూన్ 22న జర్మన్ సైన్యం మూడు దిశలుగా – ఉత్తరాన లెనిన్ గ్రాడ్ వైపు, మధ్య రంగంలో మాస్కో వైపు, దక్షిణ రంగంలో రష్యన్ ధాన్యాగారమైన యుక్రెయిన్ వైపు దాడి చేసింది. మొదటి రోజునే జర్మన్ వైమానిక బలగం పశ్చిమ రష్యాలోని సోవియట్ వైమానిక బలగాన్ని తుడిచి పెట్టేసింది. ఆ రోజు మధ్యాహ్నానికి 1200 రష్యన్ విమానాలు నాశనమయ్యాయి. ఎదురులేకుండా పట్టణాల మీదా, సైన్యం మీదా, రోడ్లమీదా, రైలు మార్గాల మీదా, ప్రజల మీదా బాంబుల వర్షం కురిపించింది. నేల మీద వేల జర్మన్ టాంకులు రోజుకు 30-40 మైళ్ళ వేగంతో సరిహద్దు దాటి పరుగులు తీశాయి. రష్యాలో కూడా జర్మన్ మెరుపుదాడి ఎత్తుగడ విజయవంతమైనట్లే కనుపించింది. ఆ నాడు ప్రపంచంలో ఉన్న యుద్ధ నిపుణులందరూ రష్యా కొన్ని వారాలలో, లేదా కొన్ని నెలలలో కూలిపోవడం తథ్యమని భావించారు.

కాని జర్మన్లకు ఈ యుద్ధంలో. పశ్చిమ రంగంలో ఫ్రాన్స్ మొదలైన దేశాలతో యుద్ధ రంగంలో ఎదురుకాని అనుభవం ఎదురైంది. తాము విపరీతమైన నష్టాలకు గురవుతున్నా, రష్యన్లు తొలి ఘడియలనుంచీ జర్మన్ సైన్యాలను తీవ్రంగా ప్రతిఘటిస్తూ పోరాడసాగారు.

‘ఈ మొట్టమొదటి యుద్ధంలోనే రష్యన్ సైన్యాలు యుద్ధం చేసిన తీరు పోలెండు, పశ్చిమ దేశాల సైన్యం యుద్ధం చేసిన తీరుకు చాలా భిన్నంగా ఉంది…..చుట్టుముట్టబడినప్పుడు కూడా రష్యన్లు లొంగిపోకుండా పోరాడుతున్నారు…’ అన్నాడు జర్మన్ జనరల్ బ్లూమింట్రిట్.

‘యుద్ధం ప్రారంభమైన వెంటనే రష్యా గురించి చేసిన ప్రచారమంతా అర్థరహితమని నేను తెలుసుకున్నాను….’ అన్నాడు మరో జనరల్ రుండెస్టెట్.

‘…..మేమందరం – నాయకత్వంతో ప్రారంభించి సామాన్య సైనికుడి వరకూ – రష్యన్ సైనికుడి గురించీ, అపారమైన అతని ఆయుధాల గురించీ తక్కువ అంచనా వేశాం…. రష్యన్ల దగ్గర అన్ని రకాల ఆయుధాలు అంతులేకుండా ఉన్నట్లు కనుపిస్తోంది…’ అని హేన్స్ రోత్ అనే జర్మన్ సైనికుడు సెప్టెంబరు 30న తన డైరీలో రాసుకున్నాడు.

‘గోడ వెనుకన దాగి ఒక రష్యన్ సైనికుడు మా మీద కాల్పులు ప్రారంభించాడు. నేను అతని వెనుక చేరి వెనుక నుండి కాల్చాను. అతను నేలకూలిపోయాడు. మరణించిన ఆ సైనికుడి దగ్గరకు వెళ్ళి చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ సైనికుడు ఒక స్త్రీ…. నేను స్త్రీ సైనికుడిని చూడడం అదే మొదటి సారి.’ అని తన డైరీలో రాసుకున్నాడు మరో జర్మన్ సైనికుడు.

జర్మనీకి రష్యా సైనిక శక్తి గురించి కాని, ఆర్థిక శక్తి గురించి కాని, రవాణా సామర్థ్యం గురించి కాని, సోషలిస్టు వ్యవస్థ సోవియట్ ప్రజలలో కలిగించిన నూతన చైతన్యం గురించి కాని ఏ మాత్రం అవగాహన లేదు. జర్మన్ గూఢచార శాఖ పూర్తిగా విఫలమయింది. యుద్ధ ప్రారంభంలో రష్యన్ బలగాలు 200 డివిజన్లు అని జర్మనీ అంచనా వేసింది. కాని ఆగస్టు నాటికే జర్మన్లు 360 డివిజన్లను లెక్కించారు. సైనిక దళాల విషయంలోనే కాదు, ఆయుధాల విషయంలో కూడా జర్మన్లు అంచనా వెయ్యలేకపోయారు. యుద్ధ రంగంలో రష్యన్ టి-34 టాంకు జర్మన్లను భయాందోళనకు గురిచేసింది. ఇటువంటి టాంకు రష్యన్ల దగ్గర ఉందని జర్మన్లకు యుద్ధ రంగంలో ఆ టాంకు ఎదురయ్యేవరకూ తెలియదు. అలాగే రష్యన్ కాట్యూషా రాకెట్ల గురించి కూడా, రష్యా ఆ రాకెట్లను యుద్ధ రంగంలో ప్రయోగించేదాకా జర్మన్లకు తెలియదు. తొలి ఘడియలలోనే పశ్చిమాన ఉన్న వైమానిక బలగం పూర్తిగా నాశనమైనా, జర్మన్లు లోనికి వెళ్ళిన కొలదీ అత్యాధునిక రష్యన్ విమానాలు ఎదురై అడ్డగించసాగాయి.

రష్యన్లు అనుకోని విధంగా తీవ్రంగా ప్రతిఘటించడం వలన ఆపరేషన్ బార్బరోసా ప్రధాన లక్ష్యం – రష్యన్ ప్రధాన సైనిక బలగాలు నీపర్ నది దాటి తూర్పు వైపుకు తిరోగమించకుండా నదికి పశ్చిమాననే నాశనం చెయ్యడం – సాధ్యం కాలేదు. రెండు నెలలలో జర్మన్ పదాతి సైన్యం 4 లక్షలమంది సైనికులనూ ఆఫీసర్లనూ కోల్పోయింది. ఈ యుద్ధ రంగానికి ఆవల పశ్చిమ రంగంలో, బ్రిటన్, ఫ్రాన్స్ లతో జరుగుతున్న యుద్ధంలో, జూన్-డిసెంబరుల మధ్య ఆరు నెలల కాలంలో, జర్మనీ కేవలం 9000 మంది సైనికులను మాత్రమే నష్టపోయింది అన్న వాస్తవాన్ని గమనిస్తే, జర్మనీ రష్యాలో ఎంత తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవలసి వచ్చిందో మనకు స్పష్టమవుతుంది.

జర్మనీ యూరోపియన్ రష్యా భూభాగాన్ని ఆక్రమిస్తే రష్యాకు చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుందని భావించిన సోవియట్ ప్రభుత్వం, యుద్ధ రంగానికి వేలమైళ్ళ దూరంలో తూర్పు రష్యాలో రెండో పారిశ్రామిక రక్షణ రేఖను సిద్ధం చెయ్యాలని జులై 4న ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి అనుగుణంగా యుద్ధం జరుగుతుండగానే జర్మన్ ఆక్రమణ ప్రమాదానికి గురవుతున్న ప్రాంతాలనుండి 1941 జులై-నవంబరు కాలంలో 1360 భారీ యుద్ధ పరిశ్రమలతో సహా 1523 పరిశ్రమలను అతి తక్కువ కాలంలో తూర్పుకు తరలించడం జరిగింది. ఈ ఫాక్టరీలను తరలించడానికి 15 లక్షల రైల్వే వేగన్లు కావలసి వచ్చాయి. ప్రపంచంలో కనీవినీ ఎరుగని విధంగా సోవియట్ ప్రభుత్వం అనేక కష్టనష్టాలకు ఓర్చి కీలక పరిశ్రమలను జర్మన్ ప్రమాదం ఎదురైన ప్రాంతాలనుండి సైబీరియా, యురల్స్ ప్రాంతాలకు తరలించడం విస్మయపరిచే గొప్ప చర్య. యుద్ధంలో అంతిమ విజయానికి ఈ తరలింపు తోడ్పడింది.

పారిశ్రామికంగా తూర్పు మీద ఆధారపడినట్లుగానే ఆహార ధాన్యాలకు కూడా రష్యా తూర్పు మీద ఆధారపడవలసి వచ్చింది. తూర్పు ప్రాంతాలకు కోట్లమంది గ్రామీణ ప్రజలను తరలించారు. వ్యవసాయ యంత్రాలనూ, లక్షల టన్నుల ఆహార ధాన్యాలనూ, 24 లక్షల పశువులనూ, 51 లక్షల గొర్రెలనూ, 8 లక్షల గుర్రాలనూ కూడా తరలించారు. తూర్పున 50 లక్షల ఎకరాల భూమిని కొత్తగా సాగులోకి తీసుకు వచ్చారు.
ఉత్పత్తి సాధనాలూ, భూమీ వ్యక్తిగత ఆస్తిగా లేని సోషలిస్టు వ్యవస్థలోనే ఇలా భారీ ఎత్తున ప్రజలనూ, ఫాక్టరీలనూ, సంపదనూ తరలించడం సాధ్యమవుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఈ ప్రజలను ఎక్కడ ఉంచాలి? ఎవరు పోషిస్తారు? అనే ఆలోచనా ధోరణి ఇటువంటి తరలింపుకు అడ్డుపడుతుంది. వ్యక్తిగత ఆస్థి పునాదిగా గల పెట్టుబడిదారీ వ్యవస్థ కంటే ఉత్పత్తి సాధనాలు సామాజిక పరమైన సోషలిస్టు వ్యవస్థ ఉన్నతమైనదని మనకు ఈ అనుభవం నేర్పుతుంది.

రష్యన్ సైన్యాన్ని విపరీతమైన నష్టాలకు గురి చేస్తూ, తాను విపరీతంగా నష్టపోతూ జర్మన్ సైన్యం నవంబరు నాటికి మాస్కో సమీపానికి చేరింది. మాస్కో పతనం తథ్యమని ప్రపంచమంతా భావిస్తున్న తరుణంలో, డిసెంబరు 5న అనూహ్యంగా రష్యా 560 మైళ్ళ యుద్ధ రంగంలో ఎదురు దాడి చేసి జర్మన్లను తరిమికొట్టింది. ఎర్ర సైన్యం ఇంత బలంగా దాడి చెయ్యగలదని జర్మన్లు కలలో కూడా ఊహించలేదు. ఈ యుద్ధంలో జర్మనీ 5 లక్షలమంది సైనికులనూ, 1300 టాంకులనూ ఇతర ఆయుధ సామగ్రినీ కోల్పోయింది. జర్మన్ జనరల్ వెస్ట్ ఫాల్ ‘ఒకప్పుడు అజేయమని భావించబడిన జర్మన్ సైన్యం ఇప్పుడు నాశనానికి సిద్ధంగా ఉంది’ అన్నాడు.

మాస్కో యుద్ధంలో జర్మన్ పరాజయం అంతర్జాతీయంగా కూడా ప్రాముఖ్యత గలది. జర్మన్ సైన్యం అజేయం కాదని ప్రపంచం గ్రహించింది. మరో ముఖ్య పరిణామం ఏమిటంటే, మాస్కో యుద్ధంలో రష్యా ఓడిపోతే తూర్పునుంచి మళ్ళీ దాడి చేద్దామని ఎదురు చూస్తున్న జపాన్ రష్యా శక్తిని గమనించి వెనక్కు తగ్గింది.

ఈ కాలంలోనే లెనిన్ గ్రాడ్ నగరం జర్మన్ల దిగ్బంధంలో చిక్కుకుంది. ఎన్ని దాడులు చేసినా జర్మన్లు ఈ వీర నగరాన్ని ఆక్రమించలేకపోయారు కాని దిగ్బంధంలో బిగించగలిగారు. 900 రోజుల సాగిన ఈ దిగ్బంధం తొలి నెలలలో, బయటినుంచి ఆహారం అందే మార్గం లేక 30 లక్షల లెనిన్ గ్రాడ్ నగర జనాభాలో మూడో వంతు మంది, దాదాపు 10 లక్షలు, ఆకలితో చనిపోయారు. 900 రోజుల దిగ్బంధం తర్వాత చివరకు 1943 జనవరిలో లెనిన్ గ్రాడ్ విముక్తి చెయ్యబడింది. లెనిన్ గ్రాడ్ పోరాటం సువర్ణాక్షరాలతో లిఖించవలసిన మరొక పోరాటం.

మాస్కో యుద్ధంలో గాయపడిన జర్మనీ, 1942 వేసవి కాలంలో కొత్త సైన్యాలతో మళ్ళీ దాడి ప్రారంభించింది. 1941లో లాగానే రష్యన్ సైన్యాలను చెల్లా చెదరు చేస్తూ స్టాలిన్ గ్రాడ్ నగరాన్ని చేరింది. ఆగస్టు 23న 600 విమానాలతో 2000 విమాన దాడులు చేసి ఈ నగరాన్ని నేలమట్టం చేసింది. ఈ దాడులలో 40,000 మంది పౌరుల చనిపోయారు. అయినా రష్యన్లు లొంగలేదు. శిధిలమైన ఈ నగరంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన వీధి పోరాటం ప్రారంభమైంది. ప్రతీ భవనం కోసం, ప్రతీ నేలమాళిగ కోసం, ప్రతీ ఇటుక గుట్టకోసం భయంకర పోరాటం జరిగింది. నవంబరు 19న రష్యన్లు ఎదురు దాడి చేసి, స్టాలిన్ గ్రాడ్ ప్రాంతంలో ఉన్న మూడు లక్షల జర్మన్ సైన్యాన్ని చుట్టు ముట్టారు. హిట్లర్ ఈ జర్మన్ సైన్యాన్ని విడిపించడానికి ప్రయత్నించాడు కాని అది సాధ్యం కాలేదు. చివరకు ఫీల్డ్ మార్షల్ పౌలస్, 24 మంది జనరల్స్ తో సహా 91000 జర్మన్ సైన్యం రష్యన్లకు ఖైదీలుగా చిక్కింది. 1941 వేసవి కాలం నుండీ డాన్, వోల్గా, స్టాలిన్ గ్రాడ్ ప్రాంతాలలో జరిగిన ఈ యుద్ధంలో జర్మనీ 15 లక్షల సైన్యాన్నీ, 3500 టాంకులనూ, 3,000 విమానాలనూ ఇతర యుద్ధ సామగ్రినీ కోల్పోయింది. ఈ ఘోర పరాజయం తర్వాత హిట్లర్ జర్మనీ అంతం దగ్గరపడుతోంది అన్న భావన ప్రపంచంలో కలిగింది.

1943లో కుర్క్స్ ప్రాంతంలో రెండో ప్రపంచ యుద్ధంలో అతి పెద్ద టాంకు యుద్ధంగా పరిగణించబడే యుద్ధం జరిగింది. కొద్దిపాటి ప్రదేశంలో ఇరుపక్షాల నుండి దాదాపు 6,000 టాంకులు ఈ యుద్ధంలో తలపడ్డాయి. ఈ యుద్ధంలో జర్మనీ 5 లక్షల సైనికులనూ, 2000 టాంకులనూ, 3700 విమానాలనూ ఇతర యుద్ధ సామగ్రినీ కోల్పోయింది. ఆ తర్వాత జర్మనీ, మరి ఎదురు దాడి చెయ్యగల శక్తిలేక రక్షణ యుద్ధాలలో తనను తాను రక్షించుకుంటూ బెర్లిన్ వైపుగా తిరోగమించింది.

దేశ భక్తి ప్రపూరిత మహా యుద్ధం గురించి మాట్లాడుకునేటప్పుడు మనం పార్టిజాన్ల (గెరిల్లాలు) గురించి కూడా మాట్లాడుకోవాలి.

1941 జూన్ లో, యుద్ధ ప్రారంభంలో జర్మన్ సైన్యం రష్యన్ సైన్యాలను చెల్లాచెదరు చేస్తూ లోలోపలికి చొచ్చుకుపోతున్నప్పుడు, చుట్టుముట్టబడిన సైన్యాలను నుంచి తప్పించుకున్న కొంతమంది సైనికులు స్థానిక కమ్యూనిస్టులతో కలిసి, పార్టిజాన్లుగా (గెరిల్లాలుగా) అడవుల్లో, కొండల్లో, చిత్తడి నేలల్లో, పార్టిజాన్ యుద్ధానికి అనువైన ప్రాంతాలలో, రక్షణ తీసుకుంటూ, వెనుక తట్టులో జర్మన్ సైన్యం మీదా, రవాణా మార్గాల మీదా పార్టిజాన్ యుద్ధం ప్రారంభించారు. జులై 3న స్టాలిన్ శత్రు ఆక్రమిత ప్రాంతాలలో పార్టిజాన్ యుద్ధానికి పిలుపునిచ్చిన తర్వాత ఈ పార్టిజాన్ ఉద్యమం వ్యాపించింది. మాస్కో యుద్ధ సమయంలో 10000 మంది పార్టిజాన్లు జర్మన్ రైళ్ళ మీదా, మోటారు వాహనాల మీదా, సైన్యం మీదా దాడి చేసి నష్టం కలిగించారు. స్టాలిన్ గ్రాడ్ యుద్ధ కాలంలో పార్టిజాన్లు 3000 రైళ్ళను ధ్వంసం చేశారు. 1942లో పార్టిజాన్ ప్రాంతాలలో పార్టిజాన్లు సోవియట్ ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. 1943-44 నాటికి ఈ పార్టిజాన్ల సంఖ్య 5 లక్షలుండేది. జర్మన్లు ఎంతో క్రూరంగా ఈ పార్టిజాన్ ఉద్యమాన్ని అణచి వెయ్యడానికి ప్రయత్నించారు. ఒక్క బెలో రష్యాలోనే 10 లక్షలమంది పార్టిజాన్లను, వారి సానుభూతి పరులనూ, జర్మన్లు చంపేశారని ఒక అంచనా. ఈ పార్టిజాన్ ఉద్యమం ప్రజా ఉద్యమం. ప్రజలందరి సహకారం లేకపోతే, ఇంత నిర్బంధాన్ని తట్టుకుని, ఇంత పెద్ద ఎత్తున పార్టిజాన్ యుద్ధం సాధ్యమయ్యేది కాదు.

రష్యా జర్మనీని ఒంటరిగా తరిమికొడుతున్న సమయంలో, తాము రంగంలోకి దిగకుంటే యూరోపు అంతా ‘ఎర్రబడుతుందన్న’ భయంతో – గోడమీద పిల్లుల్లా, గోతికాడ నక్కల్లా ఎదురు చూస్తున్న అమెరికా, బ్రిటన్ లు – సంవత్సరాలుగా వాయిదా వేస్తూ పోతున్న రెండో యుద్ధ రంగాన్ని తెరిచాయి. 1944 జూన్ 6న మిత్రదేశాల సైన్యం ఫ్రాన్స్ లో దిగింది. ఈ డి-డే నాడు మిత్ర దేశాల నష్టం కేవలం 10,000 మాత్రమే.

1944లో ఎర్ర సైన్యం నాజీ ఆక్రమణ నుంచి పోలెండు, రుమేనియా, బల్గేరియా, హంగరీ లాంటి దేశాలను విముక్తి చేస్తూ జర్మనీలో ప్రవేశించి 1945 ఏప్రిల్ లో బెర్లిన్ నగరాన్ని చుట్టు ముట్టింది. యుద్ధం ముగుస్తుండగా బెర్లిన్ నగరం మీద దాడిలోనూ, నగర శివార్లలోనూ, నగరంలోనూ జరిగిన యుద్ధంలో, కేవలం రెండు మూడు వారాలలో, సోవియట్ రష్యా 3 లక్షల మంది సైనికులను కోల్పోయింది.

ప్రపంచం ముందు నేరస్తుడిగా నిలబడాల్సి వస్తుందన్న భయంతో హిట్లర్ ఏప్రిల్ 30న రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెయ్యి సంవత్సరాలు వెలుగుతుందన్న ఫాసిస్టు జర్మనీ శిధిలాల మధ్య అంతమైంది. జర్మనీ మే 9న లొంగిపోయింది. ఆగస్టులో జపాన్ లొంగిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది.

రెండో ప్రపంచ యుద్ధంలో, జపాన్ రంగంతో సహా అన్ని రంగాలలోనూ, అమెరికా 4 లక్షలమంది సైనికులను కోల్పోయింది. పౌరులను నష్టపోలేదు. బ్రిటన్ 3,30,000 మంది సైనికులను, 62,000 మంది పౌరులను కోల్పోయింది.
సోవియట్ యూనియన్ 90 లక్షలమంది సైనికులనూ, ఒక కోటి 80 లక్షలమంది పౌరులనూ కోల్పోయింది. ప్రతీ 7 గురు సోవియట్ పౌరులలోనూ ఒకరు మరణించారు. 1700 నగరాలూ, 70,000 గ్రామాలూ, 32,000 పరిశ్రమలూ నేలమట్టమయ్యాయి. 5 కోట్ల 64 లక్షలమంది క్షతగాత్రులయ్యారు.
ఈ వాస్తవాలు పరిశీలిస్తే ఫాసిస్టు జర్మనీని ఓడించినది ప్రధానంగా రష్యా అని మనకు స్పష్టమవుతుంది.

ఈ యుద్ధంలో స్టాలిన్ పాత్ర గురించి ఎన్నో అసత్యాలతో కూడిన ఎంతో దుష్ప్రచారం జరుగుతోంది. యుద్ధం ప్రారంభం కాగానే స్టాలిన్ చెమటలు పట్టి కూలిపోయాడనీ, దేశాన్ని యుద్ధానికి సన్నద్ధం చెయ్యలేదనీ, ఎన్ని హెచ్చరికలు వస్తున్నా పట్టించుకోలేదనీ, సైనిక వ్యవహారాలలో కలుగజేసుకుని తన మూర్ఖత్వంతో లక్షలమంది సైనికుల మరణాలకు కారణమయ్యాడనీ – ఇలా ఎంతో అసత్య ప్రచారం జరుగుతోంది.

దేశ రక్షణకు స్టాలిన్ తనకున్న స్వల్ప వ్యవధిలో ఏం చేశాడో గమనిస్తే ఇదంతా అసత్యమని మనకు అర్థమవుతుంది.
1931లో రష్యా ఏ కారణాల వలన అత్యంత వేగంగా పారిశ్రామిక దేశంగా అభివృద్ధి చెందాలో చెబుతూ స్టాలిన్, ‘మనం అభివృద్ధి చెందిన దేశాల కంటే ఏఙై, వంద సంవత్సరాలు వెనుకబడి ఉన్నాం. ఈ అంతరాన్ని మనం ఒక దశాబ్దంలో అధిగమించాలి….ఇది చెయ్యకపోతే శత్రువు మనల్ని నాశనం చేస్తాడు…’ అని హెచ్చరించాడు. అతని సారధ్యంలో 1928-1940ల మధ్య అనేక యుద్ధ పరిశ్రమలతో సహా 9,000 ఫాక్టరీల నిర్మించబడి, ఏభై సంవత్సరాల అంతరాన్ని పది సంవత్సరాలలో అధిగమించడం జరిగింది.

ఊహించ సాధ్యం కాని కష్టాలు అనుభవిస్తూ రష్యన్ కార్మిక వర్గం నాలుగు సంవత్సరాల యుద్ధ కాలంలో 4,90,000 ఫిరంగులు, మోర్టార్లు; 1,20,000 టాంకులు, స్వయంచలిత ఫిరంగులు, 1,37,000 యుద్ధ విమానాలు ఉత్పత్తి చేసింది. సైన్యానికి అవసరమైన మందుగుండు తయారు చేసి నిరంతరాయంగా అందేలా చూసింది. ఎంతో ముందుచూపుతో స్టాలిన్ వేసిన ఈ పారిశ్రామిక పునాది లేకపోతే యుద్ధంలో విజయం సాధ్యమయ్యేది కాదు.

అలాగే చాలా స్వల్పకాలంలో, విద్యా, వైద్య, సాంకేతిక, సాంస్కృతిక రంగాలలో సోవియట్ యూనియన్ అద్భుతమైన ప్రగతిని సాధించలేకపోతే జర్మనీని ప్రతిఘటించడం సాధ్యమయ్యేది కాదు. సోవియట్ ప్రజల జీవితాలలో ఈ ప్రగతి ఒక మహత్తరమైన మార్పుకు దారి తీసింది. జారిస్టు రష్యాలో కుటుంబానికే పరిమితమైన స్త్రీలు, సోషలిస్టు రష్యాలో సైన్యంతో సహా అన్ని రంగాలలోనూ ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. మగవాళ్ళంతా యుద్ధానికి పోయిన పరిస్థితులలో వ్యవసాయభారమంతా స్త్రీలే భరించవలసి వచ్చింది. ఫాక్టరీలలో కూడా సగానికి పైగా స్త్రీలే ఉండేవారు.

భవిష్యత్తులో జరగబోయే భయంకర యుద్ధంలో విజయం సాధించాలంటే చైతన్యవంతులైన ప్రజలందరి సహకారం కావాలనే మార్క్సిస్టు అవగాహనతో సోవియట్ ప్రభుత్వం యుద్ధానికి ముందే కోట్లమంది ప్రజలకు – స్త్రీ పురుషులకు – సైనిక శిక్షణ ఇచ్చింది. గురిచూసి తుపాకీ పేల్చడంలో, గుర్రపు స్వారీలో, పేరాషూట్ సహాయంతో విమానంలోంచి దూకడంలో, మంచు మీద స్కీయింగ్ లో శిక్షణ ఇచ్చింది. ఆ కారణంగానే యుద్ధం ప్రారంభమైన తొలి నెలలలోనే 30 లక్షలమంది సోవియట్ సైనికులు జర్మన్ సైన్యానికి బందీలుగా పట్టుబడినా, స్వల్పకాలంలో, అసంఖ్యాకంగా, అంతరాయం లేకుండా సైన్యాన్ని యుద్ధ రంగాలలోకి దించడం సాధ్యమైంది.

హిట్లర్ ప్రభుత్వంలోని ప్రచార శాఖ అధిపతి గోబెల్స్, 1943 జనవరిలో మాట్లాడుతూ ‘….ఏదో అద్భుతం జరిగింది. కొత్త సైన్యాలూ, నూతన ఆయుధాలూ విశాలమైన స్టెప్పీనుంచి వస్తూనే ఉన్నాయి. ఒక గొప్ప ఇంద్రజాలికుడు యురల్స్ మట్టిని అసంఖ్యాకమైన బోల్షివిక్ సైనికులుగానూ, ఆయుధాలుగానూ మారుస్తున్నట్టు అనిపిస్తోంది…’ అని ఆశ్చర్యపోయాడు.
ఈ రష్యన్ అద్భుతం వెనుకనున్న రహస్యం సోషలిస్టు వ్యవస్థ. కార్మికులలో, కర్షకులలో పీడిత ప్రజల్లో ఈ వ్యవస్థ సృష్టించిన నూతన చైతన్యం. బోల్షివిక్ రష్యాను ఒక రాక్షస వ్యవస్థగా చిత్రించే పెట్టుబడిదారీ దేశాల మేథావులకు ఈ ‘ఇంద్రజాలం’ ఎప్పటికీ అర్థం కాదు.

రష్యన్ ప్రజలను చైతన్యవంతులను చేసి, జీవించడానికీ, పోరాడడానికీ, పోరాటంలో ప్రాణాలను తృణ ప్రాయంగా త్యాగం చెయ్యడానికీ పురిగొల్పిన ఉన్నత ఆదర్శం సోషలిజం. కేపిటలిజం తమను ఎంత క్రూరంగా దోచుకుందో, స్టాలిన్ నాయకత్వంలో సోవియట్ ప్రభుత్వం తమకు ఏ మేలు చేసిందో, హిట్లర్ జర్మనీ సోవియట్ రష్యాను ఓడించి కేపిటలిజాన్ని పునరుద్ధరిస్తే తాము ఎటువంటి దుర్భర జీవితం గడపాల్సి వస్తుందో గ్రహించారు కనుకనే ప్రజలు ‘స్టాలిన్ కోసం, దేశం కోసం ప్రాణాలిస్తాం’ అంటూ సింహాల్లా పోరాడారు. స్టాలిన్ ను ఒక రక్త పిపాసిగా, నియంతగా; సోషలిజాన్ని ఒక అసమర్థ, నిరంకుశ వ్యవస్థగా ప్రచారం చేసే బూర్జువా మేథావులూ, చరిత్రకారులూ దాచి పుచ్చడానికి ప్రయత్నించే వాస్తవం ఇది.

బూర్జువా చరిత్రకారులు ప్రచారం చేస్తున్నట్లు స్టాలిన్ నరరూప రాక్షసుడే అయితే, రష్యాలో ప్రజాస్వామ్యం అన్నది లేక నియంతృత్వం ప్రజలందరినీ అణచి వేస్తుంటే, ప్రజలు ఈ ‘నియంతృత్వాన్ని’ కాపాడుకోవడానికి ఎందుకు పోరాడారు అన్న ప్రశ్న మన ముందు నిలుస్తుంది.

నియంత అంటే ప్రజా వ్యతిరేకి. ప్రజల అండదండలు లేని వాడు, ప్రజలంటే భయపడే వాడు. తనకు విశ్వాస పాత్రంగా ఉండే అల్ప సంఖ్యాక అధికార వర్గ సహాయంతోనూ, సైన్యం సహాయంతోనూ ప్రజలను అణచి వేస్తూ పాలిస్తాడు. స్టాలిన్ నియంత అయితే నిర్భయంగా కోట్ల మంది సామాన్య ప్రజలను సాయుధం చేసేవాడా? ఇలా కోట్లమంది సామాన్య ప్రజలను నిర్భయంగా సాయుధం చేసేవాడు నియంత అవుతాడా? ఈ బూర్జువా ప్రచారానికి లోనవుతున్న వారు మరొకసారి ఆలోచించాలి.

రెండున్నర కోట్ల మందిని కోల్పోయి ఫాసిస్టు జర్మనీ మీద రష్యా సాధించిన ఈ విజయం వలన ప్రపంచం ఎటువంటి ఘోర విపత్తు నుంచి తప్పించుకుందో కూడా మనం తెలుసుకోవాలి.

హిట్లర్ జర్మనీ ప్రపంచంలో నెలకొల్పదలిచిన వ్యవస్థను నూతన వ్యవస్థ (New Order) అంటారు. ఈ నూతన వ్యవస్థ ఏమిటో ఎక్కడా వివరంగా వ్రాతపూర్వకంగా లేదు. కాని హిట్లర్ కలలు కన్న ఈ నూతన వ్యవస్థ ప్రపంచానికి ఒక పీడకల. ఈ నూతన వ్యవస్థలో యూరోపు అంతా నాజీ ఆక్రమణలో ఉంటుంది. ఆర్యులైన జర్మన్లకు మిగిలిన జాతులన్నీ బానిసలై బ్రతకాలి. అన్ని దేశాల వనరులూ, సంపదా జర్మన్ల అవసరాలను తీర్చాలి. స్లావ్ జాతులలాంటివి మానవ జాతి అనిపించుకోవడానికి అనర్హమైన, అంవాంఛనీయమైన జాతులు – ఈ జాతులను భౌతికంగా అంతం చెయ్యాలి. ఈ జాతుల్లో మేధావి వర్గం పూర్తిగా తుడిచివెయ్యబడుతుంది. రష్యా, పోలెండుల సంస్కృతి పూర్తిగా నాశనం చెయ్యబడుతుంది. ఆ దేశాల పరిశ్రమలన్నీ జర్మనీకి తరలించబడతాయి. ఆ దేశాల ప్రజలు పొలాల్లో, గనుల్లో, జర్మన్ యజమానుల బానిసలుగా, కూలీలుగా పని చేస్తూ జర్మనీకి సంపద సృష్టించాలి. యూదు మతస్తులను పూర్తిగా నిర్మూలించాలి. లెనిన్ గ్రాడ్, వార్సా, మాస్కో లాంటి నగరాలను ప్రపంచ పటం నుంచి తుడిచి వెయ్యాలి. హిట్లర్ జర్మనీ, 60 లక్షలమంది యూదు మతస్తులను విషవాయువుతో చంపి మృత్యుకర్మాగారాలలో బూడిద చేసింది. 40 లక్షలమంది సోవియట్ పౌరులను జర్మనీలో పని చెయ్యడానికి బానిసలుగా తరలించింది. యుద్ధంలో పట్టుబడ్డ 53 లక్షల సైనికులనూ దారుణంగా హింసించి బానిసలుగా చేసింది. లక్షల మందిని హత్య చేసింది. యూరోపులోనే ఇంత హత్యాకాండ చేసిన జర్మనీ, మన దేశం లాంటి దేశాలను ఆక్రమిస్తే, మన జాతులను జంతువుల కంటే హీనంగా గుర్తించి మృత్యుకర్మాగారాల్లో కోట్లమందిని బూడిద చేసేది. చరిత్ర ఒకటి వంద, రెండు వందల సంవత్సరాలు తిరోగమించేది.

ఫాసిస్టు జర్మనీ అంతమై 75 సంవత్సరాలు గడచిన ఈ సందర్భంలో, అశేష త్యాగాలు చేసి ఇటువంటి ఘోర విపత్తునుంచి ప్రపంచాన్ని కాపాడిన సోవియట్ రష్యానూ, ఆ నాటి సోవియట్ రష్యా ను నడిపించిన బోల్షివిక్ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన్నీ, ఆ పార్టీ నాయకుడు ఉక్కుమనిషి స్టాలిన్ నూ, మనమందరం ఒకసారి స్మరించుకుని కృతజ్ఞతలు తెలుపుకుందాం!