పేదల పాలిట మహారాజు మా రాజన్న…

553

-రవీంద్ర ఇప్పల

మనకు బాగా గుర్తున్న రాజన్న ఫొటో? ఎడం చెయ్యి పైకెత్తి గడియారం చూసుకోవడం. మరి కుడి చెయ్యి? నాకు తెలుసు.. నాకు తెలుసు.. నాకు తెలుసు. ఊ.. చెప్పు.. నీకేం తెలుసో?! కుడి చేత్తో రాజన్న.. నాడి చూస్తూ ఉంటారు. జనం నాడి. దేవుడిచ్చిన సమయం జనం కోసమే అనే స్పృహ ఉన్న మనిషి రాజన్న. ఒక చేత్తో గడియారం.. ఇంకో చేత్తో నాడి. మెడిసిన్‌ చదివితే గుండె ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది కానీ.. గుండె ఎలా చలిస్తుందో తెలుస్తుందా?!

ఈ డాక్టర్‌ పుట్టిందే అందుకు. నీ కోసం.. నా కోసం.. మనందరి కోసం. ప్రతి మనిషి నాడి భిన్నంగా ఉంటుంది. ఇందులో ఆశ్చర్యం ఏముందీ! అన్నదాత నాడి.. పంటా పంటా అనదూ? ఫీజు కట్టాల్సినవాడి నాడి.. బితుకు బితుకుమనదూ? ఆడపడచు నాడి.. అన్నా అన్నా అనదూ? నిరుద్యోగి నాడి.. ఉపాధి ఉపాధి అనదూ? పేదవాడి నాడి.. ఆదుకో ఆదుకో అనదూ? పేషెంటు నాడి.. ఊపిరి.. ఊపిరి అనదూ? వృద్ధుడి నాడి.. పింఛను.. పింఛను అనదూ?

ముసల్మాన్‌ నాడి.. భాయీ భాయీ అనదూ? క్రిస్టియన్‌ నాడి.. ఆమెన్‌ ఆమెన్‌ అనదూ? బావుంది.. బావుంది.. చాలా బావుంది. మరి.. రాజన్న నాడి రాజన్నే చూసుకుంటే? జనం జనం అనదూ? ఇక చదువుతున్న మీరు, నేను.. మన నాడి? రారాజు.. మారాజు అనదూ!

వైఎస్సార్‌ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే కొన్ని ఘట్టాలు

పీక్‌లో ఉన్న మెడికల్‌ ప్రాక్టీస్‌ని, పులివెందులలో తన కోసం తండ్రి రాజారెడ్డి ప్రారంభించిన 70 పడకల ఆసుపత్రినీ మధ్యలోనే వదిలేసి వై.ఎస్‌.ఆర్‌. రాజకీయాల్లోకి వచ్చారు. పట్టుదలకు, దూకుడుకు ఆయన మారుపేరు. అందుకే రాజకీయాల్లో చక్కగా ఇమిడిపోయారు. తొలిసారిగా 1978లో పులివెందుల స్థానానికి ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్‌ శాసన సభలో అడుగుపెట్టినప్పటి నుండి.. చివరి వరకు ఒక్కసారి కూడా ఎన్నికల్లో ఓడిపోని అతి అరుదైన ఘన చరిత్ర ఆంధ్రప్రదేశ్‌ నాయకులలో వై.ఎస్‌.ఆర్‌.దే! ఆయన రాజనీతిజ్ఞతకు, వ్యూహ చతురతకు కొన్ని మచ్చు తునకలివి!

డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి 2004 మే లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకు పదవి కొత్తేమో కానీ, ప్రజాసమస్యలు కొత్తకాదు. వెంటనే పనిలోకి దిగిపోయారు. ఇంకొక సీఎం అయితే ఎన్నికల అలసటను తీర్చుకోడానికి ‘రిలాక్స్‌ మోడ్‌’లోకి వెళ్లిపోయేవారు. వై.ఎస్‌.ఆర్‌. అలా వెళ్లే వ్యక్తి కాదని ప్రమాణ స్వీకార సభలో ఉచిత కరెంటు ఫైలుపై సంతకం చేయడంతోనే నిరూపణ అయింది! ఇచ్చిన హామీలన్నిటినీ వెంటవెంటనే అమలు పరుస్తున్నారు వై.ఎస్‌.ఆర్‌. అధికార యంత్రాంగం ఆఘమేఘాల మీద పనులు చేస్తోంది. అయినా వై.ఎస్‌.ఆర్‌. విశ్రమించలేదు. ఎన్నికలకు ముందు తను చేసిన వాగ్దానాలు ఎలా అమలు అవుతున్నాయో ప్రత్యక్షంగా చూడ్డం కోసం వారంలో రెండు రోజులు (ఆది, బుధ వారాలు) పల్లెల్ని జూన్‌ నుంచే సందర్శించడం మొదలు పెట్టారు. అలా వారానికి కనీసం 30 గ్రామాల్లో పర్యటించారు. పనుల్ని సమీక్షించారు. అయితే ఆ క్రెడిట్‌ను ఆయన తన ఖాతాలో వేసుకోలేదు. పార్టీకి ఇచ్చేశారు. ఆ సమీక్షా పర్యటనలకు ‘రాజీవ్‌ పల్లెబాట’ అని పేరు పెట్టారు. చివరి వరకు అదేబాటలో పయనించారు వై.ఎస్‌.ఆర్‌.

విదేశాలకు వెళ్లితే అక్కడి వాళ్ల టెక్నాలజీ ఏంటో తెలుస్తుంది. ఆ టెక్నాలజీలో మనకు కావలసిన టెక్నాలజీ కోసం వెదికేవారు వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి. 2005 జూలైలో ఆయన ఇజ్రాయెల్‌ వెళ్లినప్పుడు అక్కడ తనను ఆహ్వానించిన వాళ్లందరి దగ్గరికీ వెళ్లలేదు! నీటిలో కరిగిపోయే ఎరువులను, సూక్ష్మ సాగు సాధనాలను తయారు చేసే సంస్థలను మాత్రమే కలుసుకున్నారు! అవి మన రైతులకు ఉపయోగం కనుక. చైనా వెళ్లినప్పుడు కూడా ఆ దేశ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సాగు నీరు పథకాలు, ప్రణాళికలు ఎలాగున్నాయని తెలుసుకోడానికి మాత్రమే వై.ఎస్‌. ప్రాధాన్యం ఇచ్చారు.

వై.ఎస్‌.ఆర్‌. ఉరుకులు పరుగుల నేత. పాదయాత్రలో అస్వస్థతలో వారం రోజుల పాటు విశ్రమించడం మినహా.. ముఖ్యమంత్రి కాక ముందు కానీ, అయ్యాక కానీ ఆయన ప్రజల మధ్యే గడిపారు. పదవిలోకి వచ్చీరాగానే ఏ సమయంలోనైనా, రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా అత్యవసరంగా చేరుకునే విధంగా హెలీపాడ్‌ నిర్మించడానికి ఆదేశాలు కూడా జారీ చేశారు. మాట తప్ప మనిషి నిలకడగా ఉన్న రోజు ఒక్కటీ లేదు. ప్రజల దగ్గరికి పరుగులూ పెడుతూనే ఉన్నాడు.

వై.ఎస్‌.ఆర్‌. సమ్మోహన శక్తి ఎంతటితో.. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే కాకుండా, ఆయన ముఖ్యమంత్రి అయిన 16 నెలల తర్వాత ఆ పార్టీ తొలిసారిగా స్థానిక సంస్థలను ఎదుర్కొని అనూహ్యంగా ఘన విజయం సాధించినప్పుడు కూడా మరోసారి రుజువైంది. రాష్ట్రంలోని 96 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో 74 మున్సిపాలిటీలను, 11 కార్పోరేషన్‌లకు జరిగిన ఎన్నికల్లో 9 కార్పోరేషన్‌లను కాంగ్రెస్‌ తిరుగులేని విధంగా గెలుచుకుంది. అంతకుముందు 2000 సంవత్సరంలో ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్‌ కేవలం 28 మున్సిపాలిటీలు, రెండు కార్పోరేషన్‌లలో మాత్రమే విజయం సాధించగలిగింది.

వై.ఎస్‌.ఆర్‌. పైకి మెతకగా, మృదు స్వభావిగా కనిపిస్తారు. అయితే ఆయనలోని రాజనీతిజ్ఞత, వ్యూహ చతురత పై రెండు గుణాలకు భిన్నమైనవి. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వై.ఎస్‌.ఆర్‌. ఓ పద్ధతి ప్రకారం ప్రజా సమస్యలను లేవనెత్తేవారు. శాసనసభలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మాట్లాడిన సమయం కన్నా రాజశేఖరరెడ్డి మాట్లాడిన సమయమే ఎక్కువ అంటారు.

ప్రతిపక్షాలను వై.ఎస్‌.ఆర్‌. విమర్శించే తీరు హూందాగా ఉంటుంది. కోపంగా విరుచుకు పడరు. నవ్వుతూ అనేస్తారు. నవ్వు ఈయనకు, నొప్పి వాళ్లకు మిగిలిపోతుంది. ఆర్థిక మంత్రి కె.రోశయ్య 2006–07 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించినప్పుడు ఆ బడ్జెట్‌ను ప్రశంసిస్తూ.. ‘‘ఒక కల ఫలించింది. నిజానికి కొందరు ఆ కలను కనడానికి కూడా సాహసించలేదు’’ అని తెలుగుదేశం ప్రభుత్వానికి చురుక్కుమనిపించారు. సాగునీటి రంగానికి 10 వేల కోట్ల రూపాయలు కేటాయించిన బడ్జెట్‌ అది.

వై.ఎస్‌.ఆర్‌. తను వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడమే కాదు, మన దేశానికి సందర్శకులుగా వచ్చే ప్రపంచ దేశాధినేతలకు కూడా వ్యవసాయ రంగానికి మనమెంత ప్రాధాన్యం ఇస్తున్నామో తెలిసేలా చేసేవారు. 2006 మార్చిలో నాటి అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్‌.. హైదరాబాద్‌ రాగానే మొదట ఆయన్ని వై.ఎస్‌.ఆర్‌. తీసుకెళ్లింది ఎక్కడికో తెలుసా? ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి!

మావోయిస్టులపై వై.ఎస్‌.ఆర్‌.కు సానుకూల అభిప్రాయం ఉండేది. మావోయిస్టులతో శాంతి చర్చలకు గతంలో ఏ ముఖ్యమంత్రీ చూపని విధంగా ఆయనే చొరవ చూపారు. కానీ చర్చలకు విఘాతం కలిగించే సంఘటలను జరగడంతో వై.ఎస్‌.ఆర్‌. చూపిన చొరవ నిష్ఫలం అయిపోయింది. దానికి ఆయన ఎంతో ఆవేదన చెందారు. నక్సలైట్‌లను వై.ఎస్‌.ఆర్‌. ‘దారి తప్పిన బిడ్డలు’ అనేవారు. జన జీవన స్రవంతిలోకి వచ్చేయమని పదే పదే కోరేవారు.

రైతుల సంక్షేమం విషయంలో వై.ఎస్‌.ఆర్‌. ఎక్కడా రాజీ పడలేదు. ఈ విషయంలో కేంద్రంలోని సొంత పార్టీతోనూ ఆయన గట్టిగానే ఉన్నారు. ప్రధాన మంత్రి అయ్యాక తొలిసారి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన మన్మోహన్‌ సింగ్‌.. అంతకు మూడు నెలల క్రితమే తొలిసారి ముఖ్యమంత్రి అయిన వై.ఎస్‌.ఆర్‌. కలిసి రైతు కుటుంబాలను సందర్శిస్తున్నప్పుడు వై.ఎస్‌.ఆర్‌. ప్రధానికి అక్కడికక్కడే కొన్ని విజ్ఞప్తులు చేశారు. అయితే ఆ విజ్ఞప్తులు సూచనలు గానో, డిమాండ్‌లుగానో ఉన్నాయి తప్ప నీళ్లు నములుతున్నట్లు లేకపోవడం విశేషం. పంటల బీమా పథకం వల్ల రైతులకు అందుతున్న సహాయం చాలా స్వల్పం కనుక ఆ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్షించాలని వై.ఎస్‌.ఆర్‌. అడిగారు. నీళ్లు పడని బోరుబావులకు నష్టపరిహారం పథకాల్ని ప్రవేశపెట్టాలని కోరారు. అంతేకాదు, కార్లు కొనడానికి రుణాలు 5 శాతం వడ్డీకి లభిస్తుండగా.. ట్రాక్టర్లు, పంటల రుణాలకు మాత్రం 11 నుంచి 12 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తోందని ప్రధానికి చెప్పారు!

విజ్ఞానం డబ్బు సంపాదనకు కాదు, ప్రజల సేవ కోసమే అని నమ్మేవారాయన. డాక్టర్లకు ఏ ముఖ్యమంత్రీ చేయనంత సాయం వైఎస్‌ఆర్‌ చేశారనడానికి డాక్టర్‌ హనుమంత రాయుడు గారి ఉదంతమే గొప్ప ఉదాహరణ. సర్వీసులో ఉండగా పై చదువులు చదవాలంటే ఆ సమయంలో కూడా జీతం వచ్చే ఏర్పాటు చేశారు. సూపర్‌ స్పెషలిస్ట్‌ అయిన తర్వాత సౌదీకి వెళ్ళాలని, ఎన్‌ఓసి ఇప్పించమని వైయస్‌ గారిని అడిగారాయన. అప్పుడు వైఎస్‌… ‘ఆ రోజు మీరు పై చదువులు చదవడానికి ప్రభుత్వంతో పోట్లాడి మీకు జీతం వచ్చేట్లు చేశాను. సూపర్‌ స్పెషలిస్ట్‌లైన తర్వాత డబ్బుకోసం విదేశాలకు వెళితే ఇక్కడ ప్రజలు ఏం కావాలి? ఎట్టి పరిస్థితుల్లోనూ రికమెండ్‌ చెయ్యను’ అని నిర్మొహమాటంగా చెప్పారు… అని హనుమంత రాయుడు ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు.

వైఎస్‌కు ముందున్న పాలకులెవ్వరూ సఫాయి, చర్మకారుల, పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం పట్టించుకున్న పాపాన పోలేదు. వారి సేవలు ప్రతిరోజూ కావాలి, కానీ… జీతాలు మాత్రం నాలుగునెలలకొకసారి ఇచ్చేవాళ్లు. తరతరాలుగా వివక్షకు లోనవుతూన్న పారిశుద్ధ్య కార్మికుల బాధలను ఆయన క్షణాల్లో అర్థం చేసుకున్నారు. వారు వైఎస్‌ను కలిసి విషయం చెప్పిన వెంటనే సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లే వారికీ ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలని ఆదేశాలిచ్చారు. అప్పటివరకూ ఏ ముఖ్యమంత్రీ చేయని పని ఆయన చేశారు.

ఖమ్మం జిల్లాలో పార్టీ కార్యకర్త ఇల్లు ఎలక్ట్రిక్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో కాలిపోయింది. అప్పటి టిడిపి ప్రభుత్వం సహాయం చేయలేదు. ఆ కార్యకర్త వైఎస్‌ఆర్‌ని కలవడానికి కూడా శక్తిలేని నిస్సహాయ స్థితిలో హైదరాబాద్‌లో ఉన్న కొడుక్కు ఫోన్‌చేసి ‘ఓసారి ఆయన్ను కలిస్తే ఏదో ఒక దారి చూపిస్తాడు’ అని చెప్పి పంపాడు. ఆ కుర్రాడు భయభయంగా ‘మా నాన్న…’ అంటూ పేరు చెప్పగానే ‘‘ఏం కావాలి? ఉద్యోగం కోసం వచ్చావా? నాన్న బాగున్నాడా’’ అని ఆ కుర్రాడిని దగ్గరకు తీసుకున్నారు. ఇల్లు కాలిన సంగతి తెలిసి వెంటనే కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వోలకు లెటర్‌లు రాయించి ‘‘నేనున్నానని నాన్నకు చెప్పు. నువ్వు బాగా చదువుకో’’ అని పంపించారు. రెండు వారాల్లో ఆ కుటుంబానికి బెనిఫిట్‌ అందింది. అప్పుడాయన ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఒక నిస్సహాయుడికి అండగా నిలిచారు.

ఎదుటి వాళ్ల కష్టాలకు వైఎస్‌ఆర్‌ కదిలిపోయేవారు. అది 2004, రైతులకు ఉచిత కరెంటు ఇస్తానని ప్రకటించిన నేపథ్యం. ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒక్కరోజు వేతనాన్ని రైతుల కోసం విరాళంగా ఇవ్వడానికి వైఎస్‌ను ఆయన పేషీలో కలిశారు. అప్పటికి ఎవరో తల్లీకూతుళ్లు ఆయనకు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. బిడ్డను అల్లుడు కష్టపెడుతున్న వైనాన్ని ఆ తల్లి చెబుతుంటే వైఎస్‌ కళ్లు చెమర్చాయి. రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి అంటే ఎంత కరకుగా ఉంటారో అనుకోవడం సహజం. ఆయన కన్నీళ్లు చూసి ఆశ్చర్యపోవడం ఉద్యోగుల వంతైంది. ఆ సంఘటన ఉద్యోగుల మధ్య తరచూ చర్చకు వచ్చేది కూడా.

భవన నిర్మాణ రంగ కార్మికులు 2006, అక్టోబర్‌లో వైఎస్‌గారిని కలిసి సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరారు. ‘‘చట్టంలో ఏమున్నదో పరిశీలించి తప్పక సహాయం చేస్తాను’’ అని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే భవననిర్మాణ కార్మికుల చట్టాన్ని కొద్దిరోజుల్లోనే అమలు చేసి చూపించారు. ఆ తర్వాత ఏడాది విశాఖలో మేడే ఉత్సవాల్లో ప్రసంగిస్తూ, ‘బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ బోర్డు’ను ఏర్పాటు చేసి చట్టాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ నిర్ణయం లక్షలాది కార్మికులకు మేలు చేసింది. అసంఘటితంగా ఉన్న కార్మికులను చట్టం అనే గొడుగు కిందకు చేర్చి రక్షణ కల్పించారాయన. అందరికీ గుర్తింపు కార్డులివ్వాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ఇళ్లు కట్టి అందరికీ రక్షణ కల్పించే వారి అభద్రతను తొలగించి చట్టం అనే రక్షణ గొడుగు పట్టారాయన.