విశాఖలో పచ్చనేతల భూకబ్జాలు

351

(వేణుంబాక విజయసాయిరెడ్డి)

చంద్రబాబు బినామీల భూకబ్జాలతో విశాఖ జిల్లా బెంబేలెత్తిపోయింది. చంద్రబాబు అధికారంలోనున్న 14 ఏళ్లు ముఖ్యంగా చివరి ఐదేళ్లు దందాలు, సెటిల్మెంట్లతో జిల్లాను చెరబట్టారు. వాటిని ఆపేందుకు సేవ్ విశాఖ పేరుతో అప్పట్లో విపక్షంలోనున్న వైఎస్సార్సీపీ ఢిల్లీవరకు ధర్నాలు చేయాల్సివచ్చింది. అప్పటి విశాఖ ఎంపీ హరిబాబు తప్ప బీజేపీ రాష్ట్రనేతలంతా పాల్గొన్నారు. దేశంలోనే అతిపెద్ద భూస్కాంలు ఈ సుందర నగరంలోనే చేశారు పచ్చనేతలు. జగన్ గారు విపక్షంలో ఉన్నప్పుడు విశాఖలో ప్రజాసంకల్ప యాత్ర చేసినప్పుడు ప్రజల నుంచి వచ్చిన కంప్లైంట్లన్నీ లోకేష్ బాబు నుంచి అప్పటి ఒక మహిళా ఎమ్మెల్యే చేసిన భూ కబ్జాలపైనే. అంతెందుకు విశాఖ భూ కబ్జాలపై అప్పటి మీ పార్టనరైన ఒక పార్టీ అధ్యక్షుడే ఫైర్ అయ్యాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

– దివంగత నేత వైఎస్‌రాజశేఖరరెడ్డి హయాంలో ఐటీ సెజ్, సినీ స్టూడియోతోపాటు పలు పర్యాటక, అభివృద్ధిప్రాజెక్టులతో వెలుగులీనిన భీమిలి నియోజకవర్గంలో… భూ కబ్జాలకు తెరలేపారు పచ్చ నేతలు. అత్యంత పురాతన మున్సిపాల్టీ అయిన ఈ పట్టణ ప్రతిష్టను ఆక్రమణలతో మసకబారించారు. చంద్రబాబు సిట్ దర్యాప్తులోనే భీమిలిలో 5వేల ఎకరాలను టీడీపీ నేతలు కబలించారని తేలిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

– రోజూ పచ్చ టీవీ స్టూడియోల్లో మాట్లాడే ఒక విశాఖ నాయకుడు సబ్బం హరి ఏకంగా ప్రభుత్వ పార్కునే కబ్జా చేశాడు. అతను అప్పట్లో చంద్రబాబు పార్టీకాకపోయినా… పెదబాబు, చినబాబు ఆశీస్సులు మెండుగా ఉండేవి. ఆ తర్వాత ఎమ్మెల్యేగా పోటీచేసి చిత్తుగా ఓడిపోయాడు. ఆ అరువు నాయకుడు మాకెందుకయ్యా అని స్థానిక టీడీపీ నేతలు చెప్పినా వినకుండా ఆ కబ్జా రాయుడిని ప్రోత్సహించాడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ.

– జిల్లాలోని పలు మండలాల్లో 533 ఎకరాల పేదల భూములను గతంలో ఒక టీడీపీ మంత్రి కొట్టేశాడు. అతని భూ కబ్జాల పురాణం గరుడ పురాణంకన్నా పెద్దదని స్థానిక తెలుగుదేశం నేతలే చెప్తారు.

– పెందుర్తి మండలం ముదపాలకలోని 955 ఎకరాల అసైన్డ్‌ భూములను పచ్చనేతలు మింగేశారన్నది బహిరంగ రహస్యం.

– రుషికొండలో వేల కోట్ల విలువ చేసే భూమిని చంద్రబాబు దగ్గర చుట్టాలు ఎంవీవీఎస్‌ మూర్తి కుటుంబీకులు కబ్జా చేశారని స్థానికులే చెప్పుకుంటారు.

– అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ . రామవరం భూ కబ్జా కేసులో బుక్కయ్యాడు. ఏకంగా 90 ఎకరాల దేవాదాయ భూముల్ని కొట్టేశాడని సిట్ కేసు నమోదు చేసింది. ఈయనపై చంద్రబాబు వేసిన సిట్ కేసు బుక్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు.

– ఇక జన్మభూమి కమిటీలో భూ కబ్జాల గురించి ఎంత చెప్పినా తక్కువే. విశాఖలో ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ గద్దల్లా వాలిపోయేవారు. మండలాల్లో లేని భూ సమస్యలు సృష్టించేవారు.

– విశాఖ నగరం చుట్టుపక్కల మండలాల్లో ఎమ్మార్వో, ఆర్డీఓ , సబ్ రిజిస్టార్లుగా తనకు నమ్మిన బంటుల్నే నియమించుకుని … ఆయా మండలాల్లో కబ్జాలకు పాల్పడ్డారు అప్పటి టీడీపీ నేతలు. మరికొందరైతే ఆ ప్రాంతాలకు ట్రాన్స్ ఫర్ అయితే భారీగా దండుకోవచ్చని ఆశచూపి… ఉద్యోగుల దగ్గర కోట్లు పిండేశారు.

– చంద్రబాబు సిట్‌కు దాదాపు 3వేల ఫిర్యాదులందాయి. దాదాపు కంప్లైంట్లన్నీ టీడీపీ నేతలపైనే కావడంతో… సిట్ అసమగ్రంగా అరకొర నివేదిక సమర్పించినా… దాన్ని కూడా భూ స్థాపితం చేశాడు చంద్రబాబు. ఎక్కడ తన కుమారుని వరకు వస్తుందని భయపడ్డాడు.

– చంద్రబాబు హయాంలో విశాఖలో చెలరేగిపోయిన తెలుగుదేశం కండువాలకన్నా… తెలంగాణలో ఎన్ కౌంటర్ కు గురైన నయీం చాలా బెటరని ప్రజలు చెప్పుకుంటున్నారంటే … ఎలాంటి బెదిరింపులు, బరితెగింపులకు పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు. హుద్ హుద్ ను విశాఖ తట్టుకుందిగానీ… ఈ భూ బకాసురుల దందాలకు మాత్రం చివురుటాకులా వణికిపోయింది.