ముగ్గురు భూములిచ్చినా ఫలితం శూన్యం
అందులో ఒక దాతపై సస్పెన్షన్ వేటు
బీజేపీ భలే భలే
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

భారతీయ జనతా పార్టీ. నాడు అటల్ బిహారీ వాజపేయి.. నేడు నరేంద్రమోదీ దేశాన్ని ఏలుతున్న పార్టీకి నాయకులు. దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ అది. కానీ ఏపీలో మాత్రం ఆ పార్టీకి ఉండటానికి సొంత గూడు లేదు. రాష్ట్ర పార్టీకి ఓ సొంత భవనం లేదు. ఇప్పుడున్నది కూడా జిల్లా పార్టీ ఆఫీసు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో అధికారం పంచుకున్న తర్వాత.. ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపీలు, రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకునే పరాయి రాష్ట్ర రాజ్యసభ సభ్యుడు, రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయి కేంద్రమంత్రిగా ఉన్న మరొకరు, నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నా.. సొంత పార్టీ కార్యాలయం నిర్మించుకోకపోవడం ఒక విచిత్రమయితే, ముగ్గురు దాతలు ముందుకొచ్చి స్ధలం ఇచ్చినా, ఒక్క ఇటుక కూడా వేయకపోవడం మరో విచిత్రం. వీటన్నింటి కంటే.. స్థలం ఇచ్చిన నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం మరో చిత్ర విచిత్రం.

ఉమ్మడి రాష్ట్రంలో భాజపాకు, నాంపల్లిలో ప్రభుత్వం ఇచ్చిన భూమిలో పార్టీ కార్యాలయం నిర్మించారు. విభజన తర్వాత ఏర్పడిన కొత్త రాష్ట్రంలో కూడా పార్టీ ఆఫీసు నిర్మించాలని భావించారు. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడు కాకముందు వరకూ, రాష్ట్ర కార్యాలయం బెజవాడలోని అద్దె భవనంలోనే ఉండేది. కన్నా అధ్యక్షుడయిన తర్వాత, గుంటూరు ఏటుకూరు గ్రామ బైపాస్‌లోని జిల్లా పార్టీ ఆఫీసును రాష్ట్ర కార్యాలయంగా మార్చారు. అంతకుముందు.. మంగళగిరి ఎయిమ్స్ వద్ద డాక్టర్ మాదల శ్రీనివాస్ పార్టీ కార్యాలయానికి భూమి ఇచ్చారు. దానికి నాటి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ శంకుస్థాపన చేశారు. కానీ, ఇప్పటికీ దానికి ల్యాండ్ కన్వర్షన్, రోడ్డు సౌకర్యం, సీఆర్డీఏ అనుమతులు లేవు. పైగా ఆ భూమికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు అందిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే తొలి రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు పదవీకాలం ముగిసేముందు.. భవన నిర్మాణానికి కోటి 70 లక్షల కాంట్రాక్టును, భూమి ఇచ్చిన నాయకుడి సోదరుడికే ఇచ్చారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో వినిపించింది. అవి ఏమయ్యాయో, అసలు ఆ కథ ఏమయిందో తమకే తె లియదని, బిల్డింగ్ కమిటీలో ఏం నిర్ణయాలు తీసుకున్నారో తమకూ తెలియదని, వాటిని ఎందుకు రహస్యంగా ఉంచారో తమకే ఇప్పటివరకూ తెలియదని సీనియర్లు సైతం నోరెళ్లబెడుతున్నారు. ఇక నాటి ఎంపి గోకరాజు గంగరాజు, పార్టీ కార్యాలయం కోసం భూమి ఇచ్చారు. అయితే అది వివాదాస్పద భూమి అన్న విషయం తర్వాత తెలిసిందని, పార్టీ నాయకులు చెబుతున్నారు. రివర్ కన్జర్వేషన్‌లో ఉన్న భూమిని గంగరాజు పార్టీకి ప్రచారం కోసం ఇచ్చారన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఆ భూమిలో కూడా శంకుస్థాపన జరగడం మరో ఆశ్చర్యం.

ఇక నిడమానూరులో పార్టీ నేత వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ పార్టీ ఆఫీసు కోసం, వెయ్యి గజాల స్థలం విరాళంగా ఇచ్చారు. దానికి అన్ని అనుమతులూ ఉన్నప్పటికీ, అక్కడ ఎందుకు శంకుస్థాపన చేయలేదో? ఇప్పటివరకూ దానిపై ఎందుకు దృష్టి సారించలేదో తమకూ అర్ధం కాలేదని పార్టీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మాదల ఇచ్చిన లాండ్ కన్వర్షన్ కాని భూమి ఒకటి, గంగరాజు పోటీ పడి ఇచ్చిన రివర్ జోన్ భూమి ఒకటి ప్రస్తుతం మనుగడలో లేదు. ఇక అన్ని అనుమతులు ఉన్న వెలగపూడి స్థలం వైపు చూడటమే లేదు. అమరావతిలో రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వెలగపూడి ప్రవేశం తర్వాతనే, రాజధాని పరిసర ప్రాంత గ్రామాల్లో బీజేపీ బలం పెరగడం ప్రారంభించింది. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడిగా వచ్చిన సోము వీర్రాజు, పార్టీకి స్ధలం ఇచ్చిన అదే వెలగపూడిని సస్పెండ్ చేయడం, పార్టీ వర్గాలను విస్మయపరిచింది. సహజంగా ఏ పార్టీలయినా, తమకు విరాళంగా ఇచ్చే వారిని చాలా గౌరవంగా చూసుకుంటాయి. కానీ స్థలం ఇచ్చిన సొంత పార్టీ నాయకుడిపైనే, సస్పెన్షన్ వేటు వేయడం పార్టీ వర్గాలను విస్తుపోయేలా చేసింది.

ఇంతకూ సదరు వెలగపూడి అనే నాయకుడేమైనా.. పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేశారా? పార్టీ నేతలను వ్యక్తిగతంగా దూషించారా? అంటే అదీ లేదు. బీజేపీ సహా అన్ని పార్టీలూ రైతుల విషయంలో రాజకీయాలు చేయడం మంచిదికాదని చెప్పారు. ఈ విషయంలో ఆయన గత టీడీపీ-ఇప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని సమానంగా విమర్శించారు. బీజేపీని వెనుకేసుకుని వచ్చారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ను, ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం విమర్శించడాన్ని తప్పుపట్టారు. రైతులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. అయితే.. రైతు నాయకుడిగా.. రాజధాని తరలింపు అంశం తమ పరిథిలో లేదన్న వాదనతో విబేధించారు. తమ పార్టీ రాజధాని విషయంలో తప్పు చేస్తే తప్పు అని ఒప్పుకోవాలని, రైతులకు న్యాయం చేస్తామని చెప్పాలని సూచించారు. జీవీఎల్ కూడా రైతులతో మాట్లాడండి. మనం వారికి న్యాయం చేద్దామని తనకు సూచించిన విషయాన్నే వెల్లడించారు. మనకు ఎవరు న్యాయం చేస్తేవాళ్లే దేవుళ్లని అక్కడున్న రైతులకు స్పష్టం చేశారు.

అయితే.. ఆయన తన చెప్పుతో తానే కొట్టుకోవడం.. అది మీడియాలో మరొక విధంగా రావడం, ఆయన వ్యాఖ్యలను మీడియా ఎవరి పాలిసీలకు తగినట్లుగా వారు మలచుకోవడంతో, ఆ ఘటన వివాదాస్పదమయింది. బీజేపీని నమ్మినందుకు తన చెప్పుతో తానే కొట్టుకున్న బీజేపీ నాయకుడిగా ప్రచారం జరిగింది. ఫలితంగా.. కొత్తగా వచ్చిన అధ్యక్షుడు సోము వీర్రాజు.. పూర్వాపరాలు ఆలోచించకుండానే, వెలగపూడికి షోకాజ్ నోటీసు ఇవ్వకుండానే సస్పెన్షన్ చేశారు. ఇది పార్టీ నాయకులను విస్మయపరిచింది.

అసలు ఆరోజు మీడియా సమావేశంలో వెలగపూడి ఏమన్నారంటే.. ‘‘ఏ పార్టీ అయినా దయచేసి పాలిటిక్స్ చేయవద్దు. మిమ్మల్ని నమ్మి రెండు ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టారు. మీరు న్యాయం చేస్తే 542 మంది ఎంపీలు, 175 మంది ఎమ్మెల్యేల కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటాం. అప్పుడు 3 గ్రామాల రైతులు భూమి ఇచ్చినందుకు, నేను వారి కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు చలుకున్నా. అసలు ఈ భూమి ఇచ్చినందుకు, వాళ్ల దగ్గర నమ్మించి తీసుకున్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నా. అప్పుడు రైతులను ఎంత నమ్మించారండీ’ అని వెలగపూడి ఉద్వేగంతో, మీడియా సమక్షంలోనే తన చెప్పుతో తానే కొట్టుకోవడం సంచలనం సృష్టించింది. ఈవిధంగా చేయని తప్పునకు వెలగపూడి సస్పెండ్ కావలసి వచ్చింది.

అయితే.. బీజేపీ నుంచి సస్పెండ్ అయిన వెంటనే, జాతీయ స్ధాయిలో గుర్తింపు ఉన్న.. అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులు కావడం, బీజేపీకి చెంపపెట్టులా పరిణమించింది. రాష్ట్రంలో హిందూ ప్రచార కార్యక్రమాలపై త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని వెలగపూడి ఇటీవలే ప్రకటించారు. కాగా, బీజేపీకి భూమి ఇచ్చిన మాజీ ఎంపి గోకరాజు గంగరాజు కుటుంబం కొద్ది నెలల క్రితమే వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner