రేప్ కేసు సరే.. పోయిన పరువు సంగతేమిటి?

471

మహిళా సంఘాలు ఇప్పుడేమంటాయి?
దుర్వినియోగమవుతున్న చట్టాలు
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఓ గిరిజన యువతిపై ఏకంగా 139 మంది కొన్నేళ్లుగా అత్యాచారం చేశారన్న ఫిర్యాదు సహజంగా సంచలనం కలిగించేదే. ఎందుకంటే ఫిర్యాదు చేసింది గిరిజన యువతి కాబట్టి. బాధితురాలికి అండగా మహిళా సంఘాలు రోడ్డెక్కడం, ఈ వ్యవహారానికి కొంచెం మసాలా దట్టించి, మీడియా దేశం మీదకు వదిలింది కాబట్టి! అంతేతప్ప… కొన్నేళ్ల నుంచి ఒక యువతిపై 139 మంది నిర్నిరోధంగా అత్యాచారం చేయడమేమిటి ? సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతున్న ఫిర్యాదుదారు, ఆ విషయాన్ని ఇన్నేళ్ల తర్వాత ఆ విషయం ఎందుకు బయటపెట్టింది? నిందితుల ఫోన్లను రికార్డు చేసుకునేంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న బాధితురాలు, దానిని అప్పుడే పోలీసులకు ఎందుకు అందివ్వలేదన్న ప్రశ్నలు, మెడ మీద తల ఉన్న ఎవరికయినా వచ్చి తీరాలి. కానీ మన మీడియాకు లేనిది అదే కాబట్టి, ఈ వ్యవహారం నానా రచ్చయింది. చివరాఖరకు.. ముందు వెల్లడించిన నిందితుల్లో కొందరు పునీతులని, మళ్లీ అదే బాధితురాలు వెల్లడించింది. బాధితురాలు కరుణించబట్టి దోషులుగా ఉన్న వారు బయటపడ్డారు. లేకపోతే వారి పరిస్థితి, పోయిన పరువు సంగతేమిటి? మరి మీడియా.. పోయిన వారి పరువును తెచ్చి ఇవ్వగలుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేదెవరు? ఇప్పటికయినా నిజాలను ధైర్యంగా చెప్పి, కొందరి జీవితాలను రక్షించినందుకు బాధితురాలిని అభినందించాల్సిందే.

హైదరాబాద్ పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో ఓ యువతి.. తనపై 139 మంది దాదాపు 5 వేల సార్లు గత పదేళ్ల నుంచి, తనపై అత్యాచారానికి పాల్పడతున్నారన్న కేసు నమోదయింది. యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు సహా, మాజీ ఎంపి కవిత పీఏ, అనేకమంది సెలబ్రిటీలు, ప్రముఖులపై ఓ గిరిజన యువతి చేసిన ఫిర్యాదు తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించింది. దీనిపై తెలుగుచానెళ్లు, వెబ్‌సైట్స్ తమకు తోచిన కథనాలు వండివార్చాయి. ఆ సమయంలో ‘అసలు ఇంత సంచలనమైన వార్తపై మీరెందుకు కథనాలు రాయడం లేద’ని మమ్మల్ని అనేక మంది ప్రశ్నించారు. మరికొందరయితే ప్రియాంకరెడ్డిపై స్పందించిన వారు, ఈ యువతిపై 139 మంది అత్యాచారానికి పాల్పడితే అది మీకు సీరియస్ సంఘటనగా కన్పించడంలేదా? అంటూ లాజిక్కులకు దిగారు. ఆరకంగా ఈ కేసును వారంతా, కేవలం కులం పేరుతోనే చూస్తున్నారన్న విషయం బోధపడింది.

నిజానికి, జరిగే సంఘటనలకు-కేసులకు- బాధితులకు కులంతో సంబంధం ఉండదు. ఫలానా కులం వాడు అగ్రకులం అయినందుకే కేసు పెట్టలేదని కొందరు, ఫలానా కులం వారు దళితులన్న భయంతోనే, పోలీసులు వారి జోలికి పోవడం లేదన్న వ్యాఖ్య-విశ్లేషణలు-ఆరోపణలు వింటుంటాం. కానీ మెదడున్న ఎవరైనా.. జరిగిన ఘోరాన్ని, బాధితుల ఆక్రోశం, దాని వెనుక ఉన్న వాస్తవకోణాన్ని చూడాలే తప్ప.. కులం కోణంలో చూస్తే అనంతర పరిస్థితి ఈ కేసు మాదిరిగానే ఉంటుంది. ఎందుకంటే బాధితురాలు గిరిజన యువతి. ఆమె ఫిర్యాదు త ర్వాత యావత్ సమాజం కుల-మతాలకు అతీతంగా బాసటగా నిలిచింది. కానీ ఇప్పుడు అదే బాధితురాలు.. తాను ఇచ్చిన ఫిర్యాదు తప్పని అంగీకరించింది. ఎవరి ఒత్తిళ్లు-బెదిరింపుల మేరకే ఆరకంగా కేసు పెట్టానని వెల్లడించింది. మరి దీనిని ఏ కోణంలో చూడాలన్నది ప్రశ్న.

నిజమే. అన్యాయానికి గురైన ఏ మహిళకయినా మనసున్న ఎవరైనా దన్నుగా నిలవాల్సిందే. జరిగిన దారుణాన్ని ధైర్యంగా ముందుకొచ్చి, ఫిర్యాదు చేసిన మహిళలకు సమాజం బాసటగా నిలవాల్సిందే. కానీ… 139 మంది, దాదాపు పదేళ్ల నుంచి తనపై అత్యాచారం చేస్తున్నారన్న ఫిర్యాదును విశ్వసించాలా? అసలు అలాంటి పరిస్థితి ఉంటుందా? ఊహించగలమా? సినిమాల్లో మాదిరిగా ఇది నిజజీవితంలో జరుగుతుందా? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా, ఇలాంటి కథలు నమ్మవచ్చా? అన్న విచక్షణ లేకుండా, కేవలం ఫిర్యాదు ఆధారంగానే నిందితులపై బురద చల్లడం అంతకుమించిన అన్యాయం, అధర్మమే అవుతుంది. హేతుబద్ధత- తర్కం-విజ్ఞతలేని ఇలాంటి ఫిర్యాదు ఆధారంగా కథనాలు వండితే.. నిందలు ఎదుర్కొనే వారు, నిజం రుజువయ్యేవరకూ తమ సత్యసంధత ప్రతిరోజూ, ఏదో ఒక చానెళ్లలో చేతులుకట్టుకుని నిరూపించుకోవలసిందే. ఆ సందర్భంలో వారి మానసికవేదన- క్షోభను ఎవరైనా పరిగణనలోకి తీసుకోవసిందే. అందుకే అత్యాచార వార్త విషయంలో మేం ఈ ధర్మం, సంయమనం పాటించామని చెప్పాల్సి వచ్చింది.

నిజానికి.. ఈ నిర్నిరోధ అత్యాచార కేసు వెలుగుచూడగనే, ఆ వార్తను నమ్మిన వారి సంఖ్య బహు తక్కువే. బాధితురాలి పట్ల సానుభూతి చూపిన జనమే, అందులో సవాలక్ష సందేహాలు కూడా వెలిబుచ్చారు. అలాంటి ఘటన సాధ్యమా అని సందేహించిన బుద్ధిజీవులు లక్షల్లోనే ఉంటారు. మరి ఇప్పుడేమయింది? అసలు తనపై అంతమంది అత్యాచారం చేయలేదని, ఈ వ్యవహారంలో యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడుకు ఎలాంటి సంబంధం లేదని, డాలర్ భాయ్ అనేవాడు బెదిరించినందుకే కేసు పెట్టానని, బాధితురాలు చావు కబురు చల్లగా చెప్పడం ఆశ్చర్యమే కాదు, దారుణం కూడా. ‘నన్ను 139 మంది రేప్ చేయలేదు. 44 మంది మాత్రమే రేప్ చేశారు. ప్రదీప్-కృష్ణుడు పేర్లు కావాలనే పెట్టాం. ఇదంతా డాలర్ భాయ్ అలియాస్ రాజశేఖరరెడ్డి నన్ను కొట్టి చేయించిన కుట్ర. వాళ్లిద్దరికీ సారీ చెబుతున్నా. డాలర్ భాయ్ నన్ను చిత్రహింసలు పెట్టి చాలామంది పేర్లు రాయించాడు’ అని మీడియా సాక్షిగా ఇప్పుడు దిద్దుబాటకు దిగటం ఆశ్చర్యం. బాధితురాలు ఇప్పుడయినా మేల్కొని, అసలు విషయం చెప్పబట్టి సరిపోయింది. అదే ఏ ఐదారేళ్లకో, నిందితులు శిక్ష అనుభవించిన తర్వాతనో చెబితే అప్పుడు వారి మానసిక పరిస్థితి ఏమిటి? పోయిన వారి పరువును బాధితురాలు- ఆమెను బెదిరించిన డాలర్ భాయ్ జమిలిగా తిరిగి ఇవ్వగలరా? ఇది .. ఈ ఒక్క కేసులో బాధితురాలికి మాత్రమే కాదు. ఇలాంటి తరహా కేసులు పెట్టే ఫిర్యాదుదారులపై సమాజం సంధిస్తున్న ప్రశ్న!

మరి ఇప్పటివరకూ బాధితురాలి ఫిర్యాదు మేరకు, ఎలాంటి విచారణ లేకుండా, కేసు తీసుకుని ఎఫ్‌ఐఆర్ నమోదుచేసిన పోలీసులేమంటారు? ఫిర్యాదు చేసిన బాధితురాలిని ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత వైద్య పరీక్షలకు ఎందుకు పంపించలేదు? ఈ రేప్ కేసును రకరకాల కోణంలో వండివార్చిన మీడియా-సోషల్‌మీడియా తలకాయలు ఇప్పుడు ఏమంటాయి? ఈ ఉదంతంలో ఎలాంటి సంబంధం లేకపోయినా, కేసులతో మానసిక క్షోభ అనుభవించిన వారి పరువును, తిరిగి ఎవరు తెచ్చిస్తారు? ఇలాంటి మిడిమేళాన్ని జనం మీదకు వదిలి, ఉచిత వినోదం పంచిన మీడియానా? కేసులు పెట్టిన పోలీసులా? నిందితులను అరెస్టు చేయాలంటూ రోడ్డెక్కి, సర్కారు-కొత్వాలుకు వ్యతిరేకంగా విరుచుకుపడిన మహిళా సంఘాలా? ఈ ప్రశ్నలకు బదులిచ్చేదెవరు? అసలు బాధితురాలు తనపై అన్ని వేల సార్లు, 139 మంది పదేళ్ల నుంచి అత్యాచారం చేస్తున్నారంటే.. దానిని విచారించకుండానే పోలీసులు నమ్మడమేమిటి? అప్పటిదాకా బాధితురాలు ఆ హింసను, ఎందుకు భరించిందని ఎవరూ ఆలోచించకపోవడమేమిటి?

ఇప్పుడు అదే బాధితురాలు మందకృష్ణ సమక్షంలో.. తనపై 139 మంది అత్యాచారం చేయలేదని ప్రకటించినప్పుడు.. అంటే మీరు చట్టాన్ని దుర్వినియోగం చేసి, పోలీసులను తప్పుదోవపట్టించారెందుకని ఒక్క మీడియా మొనగాడూ, ఆమెను నోరు తెరచి ప్రశ్నించకపోవడం ఏమిటి? ఈ విషయంలో సీఎం కేసీఆర్-సీపీ సజ్జన్నార్‌ను రచ్చకీడ్చిన మహిళా సంఘాలు క్షమాపణలు చెబుతారా అని ప్రశ్నించకపోవడం ఏమిటి? మీడియాలో వచ్చే ఇలాంటి సంచలనాల ఆధారంగా, బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు పెట్టే పోలీసులు.. మళ్లీ అదే బాధితుల మాట మేరకు, తాము పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటే.. భవిష్యత్తులో పోలీసు కేసులపై ఎవరికయినా నమ్మకం ఉంటుందా? ఫిర్యాదు చేసిన బాధితులపై సానుభూతి ఉంటుందా?

తాజా అత్యాచారం కేసు పరిణామాలు చూసిన తర్వాత.. అనేక సందేహాలు, ప్రశ్నలు సహజంగానే తెరపైకొస్తున్నాయి. ఆ ప్రకారం.. ఇక ఎవరికయినా చట్టాలపై గౌరవం-నమ్మకం ఉంటుందా? నిజంగా రేపు ఎవరైనా నిజంగా అత్యాచారానికి గురైన బాధితులు చేసే ఫిర్యాదుకు విశ్వసనీయత ఉంటుందా? ఈ ప్రకారం.. వరకట్నకేసులు, ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టాలు కూడా దుర్వినియోగం అవుతున్నట్లే కదా? ఇప్పటికే ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రాజకీయ నాయకులు, తమ రాజకీయ ప్రత్యర్ధులపై ప్రయోగిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ప్రధానంగా.. వరకట్న కేసుల్లో సుమారు 90 శాతం ముందు పోలీసుస్టేషన్ వరకూ వెళ్లి, తర్వాత కోర్టు బయట రాజీలతో ముగుస్తున్నవే. అంటే ఆ ప్రకారం.. కేసులకు గురయిన బాధితులు ఏళ్ల తరబడి మానసిక క్షోభ అనుభవించినట్లే కదా? మరి దానికి పరిహారం ఎవరిస్తారు? ఈ తరహా కేసుల్లో బాధితులుగా మగవారే ఎక్కువగా మిగిలిపోతుండటాన్ని చూస్తూనే ఉన్నాం. చట్టాలు చేసేది బాధితుల కోసమే. మరి బాధితులే చట్టాన్ని దుర్వినియోగం చేస్తుంటే చట్టాలకు మళ్లీ పదును పెట్టాల్సింది ఆ చట్టాలు చేసిన ప్రభుత్వాలే కదా?

1 COMMENT