సునీల్..కన్నా.. ఓ భూమన!

232

విజయసాయిని దియోథర్ విస్మరించారేం?
అంటే కన్నాపై ఆరోపణలు చేసినా ఫర్వాలేదా ఏంటి?
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

తిరుపతి యుశ్రారైకా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అప్పుడెప్పుడో.. వరవరరావు వయసును దృష్టిలో ఉంచుకుని, ఆయనను విడుదల చేయాలని లేఖ రాశారు. దానిపై నిన్నటి వరకూ ఒక్క భాజపేయుడూ నోరు విప్పలేదు. కాకపోతే ఏబీవీపీ నేతలు, సంఘపరివార అనుబంధ సోషల్‌మీడియా మాత్రం.. నాటి వరవరరావు హిందూ-బీజేపీ వ్యతిరేక-నక్సల్స్ అనుకూల వ్యాఖ్యలు గుర్తు చేసింది. ప్రధానిని హత్య చేసేందుకు జరిపిన కుట్రలో, వరవరరావును మహారాష్ర్ట పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టారు. ఆయన విడుదల కోసం లేఖ రాసిన భూమన ఏమో.. ఒకప్పటి రాడికల్స్ విద్యార్థి సంఘ వ్యవస్థాపక నేతల్లో ఒకరు. ప్రధానిని హత్య చేసేందుకు ప్రయత్నించిన వరవరరావును విడుదల చేయాలని భూమన ఎలా లేఖ రాస్తారు? కాబట్టి ఆయనపై తక్షణం చర్య తీసుకోండి. లేకపోతే ఇది జగన్ అనుమతితోనే రాసిన లేఖగా భావించాల్సి ఉంటుందన్నది ఏపీ భాజపా ఇన్చార్జి సునీల్ దియోథర్ చేసిన ట్వీట్. ఇదీ అసలు నేపథ్యం!

బాగానే ఉంది సంబడం. తమ నాయకుడు, దేశ ప్రధానిపై కుట్రకు పాల్పడిన వరవరరావును విడుదల చేయాలని, భూమన అప్పుడెప్పుడో లేఖ రాస్తే, ఆ విషయం ఇప్పుడే అర్జెంటుగా గుర్తుకు రావడం ఏమిటి..? అందుకు భూమనను శిక్షించాలని ఇప్పుడు డిమాండ్ చేయడమేమిటి? లేకపోతే అందుకు, జగనే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించడమేమిటి? ఆంధ్రాలో బీజేపీని ఉద్ధరించేందుకు వచ్చిన సునీల్ దియోథర్ అనే నాయకుడి తీరు చూస్తే, ఎవరికయినా నవ్వు-ఆశ్చర్యం ఒకేసారి రాక తప్పదు. సునీల్ ఈ వారంలోనే ఏపీ భాజపాలో అడుగుపెట్టిన నాయకుడేమీ కాదు. గత ఎన్నికల్లో పార్టీకి, మొత్తం ఇండిపెండెంట్ల ఓట్ల కంటే తక్కువ ఓట్లు తీసుకువచ్చేందుకు, చాలా కష్టపడ్డ నాయకుడు. మరి అంత ఘనత సాధించిన ఆయనను ఇంకా ఎందుకు తొలగించలేదన్నది అప్రస్తుతం. మరి అప్పటి నుంచి నిర్విఘ్నంగా పార్టీని నడిపిస్తున్న ఈ రథసారధికి భూమన అప్పుడెప్పుడో రాసిన లేఖ ఇప్పుడే గుర్తుకు వచ్చి, ఆయనపై కారాలు మిరియాలు నూరడం కామెడీ కదూ? అంటే ఇప్పటివరకూ సునీలన్నకు మోదీగారి ప్రాణాల విలువ తెలియలేదా? లేక ఎవరైనా కేంద్రపార్టీకి ఫిర్యాదు చేస్తే, ఆగమేఘాలపై స్పందించారో తెలియదు.

మరి భూమన ఏమైనా తక్కువోడా ఏంటి? అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు.. భూమన కూడా దానికి కొంచెం ఘాటుగా, ఇంకొంచెం లౌక్యంగా, మరికొంచెం గంభీరంగా, ఇంకొంచెం చురకతో తిరుగుజాబు రాశారు. తన మూలాలు ఆర్‌ఎస్‌ఎస్ అని, హంతకులను తానెప్పుడూ సమర్ధించనని తన లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబుపై అలిపిరిలో నక్సల్స్ దాడి చేసినప్పుడు, అందుకు నిరసనగా వైఎస్‌తో ధర్నా చేయించానని గుర్తు చేశారు. సనాతన ధర్మం-విలువలను గౌరవిస్తానని చెప్పారు. వరవరరావు కోసం లేఖ రాసిన వారందనీ దేశబహిష్కారం చేయమని అడగటం న్యాయమా? భారతీయ సంస్కృతి నేర్పిన క్షమాగుణం-న్యాయం-ధర్మం వైపు మనిషి నిలబడటమే నేరమయితే.. ఆ నేరం తాను నిరంతరం చేస్తూనే ఉంటానని విస్పష్టంగా ప్రకటించారు. నా వ్యక్తిగత అభిప్రాయానికి- మా ముఖ్యమంత్రి గారితో మీరు ముడిపెడుతూ, మీరు ట్విట్టర్‌లో రాయడం బాధ-నవ్వు తెప్పించాయని సుతిమెత్తగా చురక కూడా అంటించారు.

ఈ విషయంలో భూమన, సమయస్ఫూర్తిగానే వ్యవహరించారని చెప్పాలి. తన భుజంపై తుపాకి పెట్టి, జగన్‌ను గురిచేసేందుకు భాజపాలో.. ఏదో ఒక మూల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నట్లు, భూమన పసిగట్టినట్లున్నారు. తన వల్ల, తన చర్యల వల్ల.. తన నాయకుడు ఇరుకున పడకూడదన్న విశ్వాసమే, భూమన లేఖలో కనిపించింది.
అంతా బాగానే ఉంది. అప్పుడెప్పుడో భూమన రాసిన లేఖకు సునీల్ ఇప్పుడు స్పందించడం ఒక విచిత్రమయితే.. గతంలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై చేసిన ఆరోపణకూ సునీల్ ఇదే స్థాయిలో స్పందించి, విజయసాయికి లేఖ రాయకపోవడం మరో వైచిత్రి. మోదీ-కన్నా ఇద్దరూ భాజపా నాయకులే. ఒకరు కేంద్ర స్థాయి నాయకులయితే, మరొకరు రాష్ట్ర స్థాయి నాయకులు. మరి అప్పుడు.. నాటి బీజేపీ చీఫ్ కన్నాలక్ష్మీనారాయణ.. ఎంపీ సుజనాచౌదరి ద్వారా 20 కోట్లు తీసుకున్నారని, వైసీపీ ఎంపీ- ఆ పార్టీలో నెంబర్ టూ నేత విజయసాయిరెడ్డి ఆరోపిస్తే.. అది జగన్ అనుమతి మేరకు చేసిన ఆరోపణగా సునీల్‌కు కనిపించకపోవడం ఒక వింత.

అప్పుడు కూడా ఇప్పటి మాదిరిగానే.. కన్నాపై ఆరోపణలు చేసిన విజయసాయిపై చర్యలు తీసుకుని, క్షమాపణ చెప్పించకపోతే, అది జగన్ అనుమతితో చేసిన ఆరోపణగా భావిస్తామని.. ఇదే సునీల్ దియోథర్ ట్వీట్ చేయకపోవడం మరో వింత. అంటే నాయకుల స్థాయిని బట్టి పార్టీ స్పందన ఉంటుందని భావించాలేమో? ఆనాడు కన్నాపై విజయసాయి ఆరోపణలు చేసిన చాలారోజుల తర్వాత, మా పార్టీ అంతర్గత విషయాలు మరొకరికి అనవసరం అని ట్వీట్ చేశారే తప్ప.. కన్నాపై ఆరోపణ చేసిన విజయసాయిపై చర్యలు తీసుకోవాలని.. భూమన స్థాయిలో సునీల్ డిమాండ్ చేయకపోవడం ప్రస్తావనార్హం.

ఇంకోవైపేమో.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, తన వ్యాసంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ గురించి ప్రస్తావిస్తే, దానికి జీవీఎల్‌కు బదులు సోము వీర్రాలు తిరుగులేఖ రాస్తారు. బీజేపీలో ఎవరు ఎవరికి అధికార ప్రతినిధులుగా పనిచేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి కనిపిస్తోంది. అదేమంటే.. మా పార్టీ మా ఇష్టం. మేం ఏం మాట్లాడితే మీకెందుకు? మేం ఎవరితో కలిస్తే మీకెందుకని వీర్రాజు గారు లాపాయింట్లు తీస్తారు. హేమిటో.. ఫాఫం కమలనాధులు!