ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్

ఐదు దశాబ్దాల పాటు దేశానికి సేవలు అందించిన ప్రణబ్ ముఖర్జీ

బహుళపార్టీ వ్యవస్ధలో ఏకాభిప్రాయ సాధకునిగా ప్రశంశలు అందుకున్న ముఖర్జీ

ముఖ్యమైన చట్టాల రూపకల్పనలో కీలక భూమికను పోషించిన ప్రణబ్ 

               విజయవాడ, ఆగస్టు 31: మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల  ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేసారు.  13 వ రాష్ట్రపతిగా శ్రీ ప్రణబ్ ముఖర్జీ చేసిన సేవలను గవర్నర్ శ్రీ హరిచందన్ గుర్తుచేసుకున్నారు.  దివంగత ప్రణబ్ ముఖర్జీ ఐదు దశాబ్దాలు పాటు ప్రభుత్వంతో పాటు పార్లమెంటు ద్వారానూ దేశానికి ఆదర్శప్రాయమైన సేవలను అందించారన్నారు. ఈ నేపధ్యంలో సోమవారం గవర్నర్ శ్రీ హరిచందన్ సంతాప సందేశం విడుదల చేస్తూ  స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ విదేశీ, రక్షణ, వాణిజ్యం, ఆర్థిక మంత్రిగా వేర్వేరు సమయాల్లో పనిచేసి అరుదైన ఘనతను కలిగి ఉన్నారని, సమాచార హక్కు, ఉపాధి హక్కు, ఆహార భద్రత, యుఐడిఎఐ ఏర్పాటు వంటి ముఖ్యమైన చట్టాల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారన్నారు. ప్రణబ్ ముఖర్జీ ఒక శక్తివంతమైన వక్త, పండితుడు, మేధావి, అపారమైన రాజకీయ చతురత కలిగిన  నాయకుడని,  కష్టతరమైన జాతీయ సమస్యలపై బహుళ-పార్టీ ప్రజాస్వామ్యంలో భాగమైన రాజకీయ పక్షాల మధ్య ఐక్యతను సాధించి ఏకాభిప్రాయ సాధకునిగా తన భూమికకు ప్రశంసలు అందుకున్నారని బిశ్వ భూషణ్ హరిచందన్ గుర్తుచేసారు. ముఖర్జీ కుటుంబ సభ్యులకు గవర్నర్ తన హృదయపూర్వక సంతాపం తెలిపారు.

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner