సమస్యలు లేకపోవడమే జగన్‌కు అసలు సమస్య!

977

కొంతమందికి సమస్యలంటే మహా భయం. వాటిని వెంటనే ఏదో ఒక విధంగా పరిష్కరించుకుంటారు. మరికొంత మందికి సమస్యలు లేకపోతే నిద్రపట్టదు. వారే సమస్యల వెంట పడుతుంటారు. వాటిని సష్టించుకుని ఆనందం పొందుతారు. సమస్యలంటేవారికిమహాఇష్టం. అసలు సమస్యలు లేకపోవడమే వారికి పెద్ద సమస్య. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిరెండవకోవకు చెందినవ్యక్తి. గత 14 నెలల జగనన్న పాలనలో, ఆయన పనితీరు నిశితంగా పరిశీలించినవారికెవరికయినా అర్ధమయ్యేది ఇదే.

నిజం. ఎందుకంటే తెలుగు రాష్ట్ర రాజకీయ చరిత్రలో, ఆ స్థాయిలో అనితర-అసమాన-అద్భుత విజయం సాధించిన నేతగా జగన్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఆయన సష్టించిన చరిత్ర అలాంటిది మరి! 151 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఘనత ఆయన పార్టీది. మరి అంత అనన్యసామాన్యమైన మెజారిటీ సాధించిన నాయకుడు ఎంత దిలాసాగా, ఎంత బేఫికర్‌గా పరిపాలించాలి? ఎంత నింపాదిగా ఆలోచించాలి? దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉండి, తన దరిదాపులకు వచ్చేందుకే భయపడే విపక్షం విషయంలో ఎలా ఉండాలి? ఆడుతూ, పాడుతూ..మరోముప్ఫయి ఏళ్లు పాలించదగ్గ ఆలోచనలు కదా చేయాల్సింది? తనకు ఓటు వేయని వర్గాలను కూడా దరిచేర్చుకుని, మరో పది సీట్లు అదనంగా సాధించే వ్యూహాలు కదా పన్నాల్సింది? తనకు సరిపడని అధికారులను కూడా దగ్గరకు తీసి, అజాత శత్రువుగా మారేందుకు కదా ప్రణాళిక రచించవలసింది? ఇవి కదా 151 ఎమ్మెల్యేలతో గెలిచి, మరో 30 ఏళ్లు తానే సీఎంగా ఉండాల్సిన నాయకుడు చేయాల్సినవి? మరి జగనన్న అడుగులు అలాగే ఉన్నాయా? శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకునే, తండ్రిగుణాలు ఆయనలో కనిపిస్తున్నాయా? అంటే.. దానికి వచ్చే సమాధానం… లేదు..లేదు!

జగన్మోహన్‌రెడ్డి పాలన, కొన్ని వర్గాలకు చెందిన మీడియాలో కనిపించేంత వ్యతిరేకత ఏమీ లేదు. కింది స్థాయిలో పెద్దగా అవినీతి లేదు. మునుపటి మాదిరిగా చాలా చోట్ల ఎమ్మెల్యేల దోపిడీలేదు. జన్మభూమి నిలువుదోపిడీ లేదు. ఇంకా.. పప్పుబెల్లాల మాదిరిగా నేరుగా లబ్థిదారులకు డబ్బులిస్తూ, వారి పెదవులపై చిరునవ్వులు పూయిస్తున్నారు. డబ్బులు ఆపనంతవరకూ, వారి చిరునవ్వులు అలా పూస్తూనే ఉంటాయి. ఇక ఎస్సీ-రెడ్లలో అభిమానం చెక్కు చెదరలేదు. కాకపోతే.. తమ పార్టీ అధికారంలోకి వస్తే, గత జన్మభూమి కమిటీల మాదిరిగా, వీలయినంత ఎక్కువ భోంచేయవచ్చన్న దురాలోచన-దూరాలోచనతో..గత ఎన్నికల్లో సొంతడబ్బు ఖర్చు చేసిన, కింది స్థాయి రెడ్డి నేతలే కొంత అసంతప్తిగా ఉన్నారు. మైనారిటీలలో కొద్దిగా మార్పులొస్తున్నట్లు కనిపిస్తోంది.

ఎటొచ్చీ..గత ఎన్నికల్లో ‘ఒక్కసారి చాన్సు ఇచ్చి చూద్దాం’ అనుకున్నవాళ్లు, తటస్థులు.. వైసీపీ వర్గాలు పోది చేసిన కమ్మ వ్యతిరేక భావనతో జగన్‌ను చూసి ఓటేసిన వర్గాలు..మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్న వర్గాలు జగనన్న పాలన.. తీరుపై వ్యతిరేకంగా ఉన్నారు. కానీ.. ఆర్ధికపరంగా ఒనగూరుతున్న ప్రయోజనాలతో, కొత్త వర్గాలు జగనన్న వైపు ఆకర్షితులవుతున్నారన్న వాస్తవాన్ని కూడా విస్మరించలేం. పోనీ ప్రతిపక్షమైన టీడీపీ పుంజుకుంటుందా అంటే అదీ లేదు. నాయకులు చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదరయ్యారు. కొందరు వైసీపీ వైపు చూస్తున్నారు. ఇంకొందరు అంటీముట్టనట్లు పనిచేస్తున్నారు. మరికొందరు గత ఎన్నికల్లో చేసిన అప్పులు తీర్చుకునే పనిలో ఉన్నారు. ఇక బీజేపీ పరిస్థితి విగ్రహం పుష్టి-నైవేద్యం నష్టి అన్నట్లుగానే ఉంది. అంటే ఏ కోణంలో చూసినా జగన్ సర్కారు ఇమేజికి వచ్చిన ఢోకా ఏమీ లేనట్లు కనిపిస్తూనే ఉంది.

మరి ఇంతసానుకూల రాజకీయ పరిస్థితిని, పూర్తి సానుకూలంగా మార్చుకునే బదులు..కక్ష సాధింపు, కవ్వింపు, మొండి వైఖరితో ఎందుకు వ్యతిరేకంగా మార్చుకుంటున్నారన్నది ఎవరికీ అర్ధం కాని ప్రశ్న. సహజంగా ఏ సీఎం అయినా కోర్టులతో పెట్టుకోరు. న్యాయమూర్తులను తరచూ మర్యాదపూర్వకంగా కలుస్తుంటారు. రాజకీయాల్లో నిష్ణాతుడు, ఎవరినీ ఖాతరు చేయని నేతగా పేరున్న తెలంగాణ సీఎం కేసీఆర్ అంతటివాడే, ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నారు. మరి కొత్తగా సీఎం అయిన జగన్ ఇంకెంత మర్యాదలు పాటించాలి? కానీ, ఆయన కోర్టులతో ఘర్షణ కోరుకుంటున్నారు. న్యాయమూర్తులపై ఆయన పార్టీ దళాలు సోషల్‌ మీడియాలో బురద చల్లుతుంటే, వారించకుండా మానసిక ఆనందం పొందుతున్నారు. తనకు కోర్టులు వ్యతిరేకంగా ఉన్నాయన్న ప్రచారం ఎంత ఎక్కువవస్తే, తనకు అంత మంచిదన్న విచిత్ర ఆలోచనల్లో ఉన్నారు. దాని వల్ల తనకు వచ్చేదేమిటన్నది ఆయనకే తెలియాలి!

ఇక కమ్మవర్గానికి జగన్ ‌వ్యతిరేకంగా ఉన్నారన్న భావన ఆ వర్గంలో బలంగా నాటుకుపోయింది. నిజానికి కమ్మవర్గం వ్యాపార దృక్పథంతో ఉంటుంది. ఏది లాభం ఉంటే దానినే ఆలోచిస్తుంది. వారికి వ్యాపారాలు ముఖ్యం. పార్టీలు, వ్యక్తులు కాదు. కాకపోతే..మానసికంగా వారి ఆలోచనలు టీడీపీ వైపు చూస్తూ ఉండవచ్చు. కానీ, గత ఎన్నికల్లో ఇదే కమ్మవర్గం కృష్ణా-గుంటూరులో వైసీపీ నిలబెట్టిన కమ్మ అభ్యర్ధులనే గెలిపించిందన్నది మర్చిపోకూడదు. అందుకే కదా… లోకేష్, కోడెల, రాయపాటి, దేవినేని ఉమ, యరపతినేని, ఆలపాటి రాజా, పుల్లారావు, ఆంజనేయులు, నరేంద్ర, చింతమనేని ప్రభాకర్ వంటి కమ్మనేతలంతా ఓడిపోయింది? మరి నిజంగా గత ఎన్నికల్లో కమ్మ వర్గమంతా పట్టుదలతో పనిచేసి ఉంటే, వారంతా ఓడిపోకూడదు కదా? కమ్మవర్గానికి జలనాగరికత ఎక్కువ. ఏదైనా ముందే అంచనావేసి, ఆ మేరకు ఆలోచించే తెలివైన జాతి. అలాంటి జాతిని..కేవలం చంద్రబాబునాయుడుపై ఉన్న వ్యతిరేకత-ఆగ్రహంతో దూరం చేసుకోవడం తెలివైన చర్యనా? వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఆర్ధికంగా దన్నుగా నిలుస్తారన్న అనుమానంతో, ఇప్పటి నుంచే వారిని అణచివేయడం తెలివైన వ్యూహమా? గత ఎన్నికల్లో తన ఓటమికి ఆ వర్గమే కారణమన్న కసితో, ఇప్పుడు ఆ కులాన్ని ఆజన్మశత్రువుగా చూడటం.. మరో 30 ఏళ్లు తానే సీఎంగా ఉండాలని ఆకాంక్షిస్తున్న నాయకుడి లక్షణమా? అన్నది ప్రశ్న.

ఇదే కసితో కొన్ని నెలల పాటు, కమ్మ వర్గానికి చెందిన ఐపిఎస్-ఐఏఎస్‌లకు పోస్టింగులు ఇవ్వలేదు. కోయ ప్రవీణ్ లాంటివారికి ఇటీవలే పోస్టింగ్ ఇస్తే, ఏబీ వెంకటేశ్వరరావు వంటి డిజిస్థాయి అధికారికి ఇంకా పోస్టింగులు ఇవ్వలేదు. ఆ జాబితాలో కమ్మవర్గానికి చెందిన బోలెడు మంది పోలీసు అధికారులు ఉన్నారు. విపక్షంలో ఉన్నప్పుడు, ఏబీ వెంకటేశ్వరరావుతోపాటు, సీఎంఓలో ఉన్న సతీష్‌చంద్ర తన పార్టీ ఎమ్మెల్యేలతో బేరసారాలాడారన్న కసితోనే కదా వారికి పోస్టింగులివ్వకుండా నిలిపివేసింది? మరి అదే పనిచేసిన సతీష్‌చంద్రకు కీలకమైన పోస్టింగు ఇచ్చి, అదే ఏబీ వెంకటేశ్వరరావుకు మాత్రం ఎందుకు ఇవ్వనట్లు?
అంటే.. సతీష్‌చంద్ర ఉత్తరాదివాడు కాబట్టి, తనపై కుట్రలు చేసినా క్షమించారా? ఏబీ వెంకటేశ్వరరావు తెలుగువాడు-కమ్మవాడయినందుకే ఆయనకు శిక్ష విధిస్తున్నారనుకోవాలా? ఉత్తరాదివాళ్లకు ఇలాంటి విషయాల్లో మినహాయింపులు ఉంటాయని అర్ధం చేసుకోవాలేమో మరి? ఇలాంటి కక్షసాధింపు-వివక్ష.. ఒకరకంగా వారిలో తనపై వ్యక్తిగత కసిగా మారుస్తుందన్న విషయాన్ని జగన్ మర్చిపోవడమే విచిత్రం. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునే వైఎస్ తత్వం, గుణాలు అలవరచుకుంటే.. అసలు జగన్‌కు ఎదురే ఉండదన్నది వైసీపేయుల మనోగతం. మరి విషయం ఆయనకు చెప్పే దమ్ము- ధైర్యం ఎవరికి ఉందన్నదే ప్రశ్న.


నిజానికి జగన్ దగ్గర మంచి అధికారుల బృందమే ఉంది. అజయ్‌కల్లం-పివి రమేష్‌కుమార్-ధనుంజయరెడ్డిపై కష్టపడి పనిచేసే అధికారులన్న ముద్ర, గత ప్రభుత్వంలోనూ ఉంది. అందుకే కదా బాబు.. రిటైరయ్యే ముందు అజయ్‌కల్లానికి సీఎస్ ఇచ్చింది? మరి ఏరి కోరి తెచ్చుకున్న కల్లం-రమేష్‌ను ఎందుకు అర్ధంతరంగా వెళ్లగొట్టారో తెలియదు. సమర్ధుడు, నిజాయితీపరుడిగా పేరున్న ఎల్వీ సుబ్రమణ్యంపై ఎందుకు బదిలీ వేటు వేశారో అంతకన్నా తెలియదు. నిజాయితీగల అధికారిగా పేరున్న మాదిరెడ్డి ప్రతాప్ దివంగత మహానేత వైఎస్‌కు అత్యంత విశ్వసనీయుడు. అలాంటి అధికారికి షోకాజ్ నోటీసు ఇవ్వడం జగన్‌కే చెల్లింది. భూపంపిణీ, పంచాయతీ భవనాలకు పార్టీ రంగులు వంటి నిర్ణయాలు మొండిగా ఎందుకు తీసుకుంటున్నారన్నది పార్టీ వాదులకూ అర్ధం కావడంలేదు.

గత పాలకుడి కంటే అన్ని రంగాలలో మెరుగుగా పనిచేస్తున్నారన్న పేరు తెచ్చుకోవాలే తప్ప.. ఆయనకూ-ఈయనకూ తేడా లేనప్పుడు, ఇక ఈయన ప్రత్యేకత ఏముందన్న భావన ప్రజల్లో జనించకూడదు. పదవుల విషయంలో నాడు చంద్రబాబు కమ్మ వారిని అందలమెక్కిస్తే.. ఇప్పుడు జగన్ రెడ్లకు పెద్దపీట వేస్తుండటం వల్ల, సహజంగా ఎవరికయినా ఇలాంటి అభిప్రాయమే ఏర్పడుతుంది. మరి అప్పుడు జగన్.. కమ్మవారి భుజంపై నుంచి చంద్రబాబును కాలిస్తే, ఇప్పుడు చంద్రబాబు.. రెడ్ల భుజంపై తుపాకి పెట్టి జగన్‌కు గురిపెడుతున్నారు. మరి జగన్ కొత్తగా వచ్చి తీసుకువచ్చిన మార్పు.. సాధించిన ప్రగతి ఏమిటన్న సందేహం, బుర్ర-బుద్ధి ఉన్న ఎవరికయినా వస్తుంది కదా? తన నిర్ణయాలు రాజ్యాంగ బద్ధంగా,చట్టబద్ధంగా ఉంటే ఏ కోర్టయినా ఎందుకు తప్పు పడుతుందన్న ఆత్మపరిశీలన ఇప్పటివరకూ జగన్ చేసుకోకపోవడమే, ఈ పరిణామాలకు కారణమని స్పష్టమవుతోంది. ఏదేమైనా.. పదవులు అశాశ్వతం. మనిషి సృష్టించిన చరితే శాశ్వతంగా ఉంటుందని గ్రహించడమే విజ్ఞుల లక్షణం. అలాంటి విజ్ఞత జగన్మోహన్‌రెడ్డి ఇకనయినా ప్రదర్శిస్తారని ఆశించడం తప్పుకాదు.

తన కొలువులో పనిచేస్తున్న ప్రవీణ్‌ప్రకాష్ వల్ల, జగన్‌ఖ్యాతి ఇప్పటికే రాష్ట్ర సరిహద్దులు దాటి, జాతీయ స్థాయికి విస్తరించింది. ప్రవీణ్ ప్రకాష్ వంటి అధికారులుంటే, ఏ ముఖ్యమంత్రి కీర్తి ప్రతిష్ఠలయినా ఇలా గాలి కంటేవేగంగా ఇతర రాష్ట్రాలకు సులభంగా విస్తరిస్తుంది. అలాంటి అధికారి లేనందుకు.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఒడిషా సీఎం పట్నాయక్ దురదృష్టవంతులు. ఆ అదృష్టం ఒక్క జగన్‌కే పట్టింది. ఈ విషయంలో అలాంటి సమర్ధులు తన పీఎంఓలో లేకపోవడం ప్రధాని మోదీకీ ఒకరకంగాలోటేమరి!