మళ్లీ ఇంకో రెడ్డిగారొచ్చేశారోచ్!

406

జగనన్న పాలనలో రెడ్లకు జయమే జయం
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

స్టేట్‌మెంట్లు మార్చని వాడు ఉఠ్ఠి వెధవాయిలోయ్ అని.. కన్యాశుల్కంలో గిరీశం చెప్పిన ఉపదేశాన్ని, అక్షరం పొల్లుపోకుండా అమలుచేస్తున్న మన జగనన్న పాలనను చూసి..పైన రంగస్థలంపై నటనలో బిజీగా ఉన్న గిరీశం గుండె, ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. తన ఏకలవ్య శిష్యుడు తనకంటే, ఓ ఏడెనిమిది వందల ఆకులు ఎక్కువే చదివినందుకు, గిరీశం మనసు పులకరించిపోతున్నట్లు యుశ్రారైకా సర్కారు మీడియా గెజిట్‌లో నేడు వచ్చిన బ్యానర్ వార్త. కడప జిల్లాకు చెందిన అంబటి కృష్ణారెడ్డికి వ్యవసాయ సలహాదారుగా నియమించిన జగన్మోహన్‌రెడ్డికి, రెడ్డిసమాజం ఏడొందలోసారి జయజయధ్వానాలు పలికింది.

విపక్షంలో ఉన్నప్పుడు.. పైన అమ్మవారు- కింద కమ్మవారంటూ.. కమ్మ సామాజికవర్గాన్ని నానా భ్రష్ఠు పట్టించిన రెడ్డిదొరలు, ఇప్పుడు కాలు మారినా అదే చెప్పులో కాలుబెట్టి, వీర‘కుల’ విహారం చేస్తుండటమే విచిత్రం. కోడలికి బుద్ధి చెప్పిన అత్త తెడ్డు నాకిందట. జగనన్న దళం ఇప్పుడు చేస్తున్న కులయాగం అలాగే ఉంది మరి! పొద్దున పేపర్ తిరగేస్తే, ఏదో ఒక పెద్దారెడ్డికి ఫలానా పోస్టు ఇచ్చిన వార్త దర్శనమిస్తుంది. ఏ చానెల్ తిప్పినా ఫలానా నెల్లూరు పెద్దారెడ్డికో, ఫలానా కడప పెద్దారెడ్డికో గవర్నమెంటు పోస్టు ఇచ్చినట్లు స్క్రోలింగు కనిపిస్తుంటుంది. బహుశా.. తమకు తాము న్యాయం చేయలేని వాళ్లు, ఇతరులకేం న్యాయం చేస్తారని ఎవరైనా అడుగుతారేమోనని.. జగనన్న ముందుజాగ్రత్తగా ‘తమ వాళ్లకు న్యాయం చేసే’ సూత్రాన్ని పాటిస్తున్నారేమో? తనకు మాలిన ధర్మం పనికిరాదంటే ఇదే అనుకున్నట్లున్నారు.

పైగా క్యాబినెట్‌లో మా పెద్దారెడ్లు ఎంతమంది ఉన్నారు? అదే మీ టీడీపీ జమానాలో కృష్ణా జిల్లా చౌదరి గార్లు, గుంటూరు జిల్లా చౌదరి గార్లు, అనంతపురం చౌదరి గార్లు ఎంతమంది ఉన్నారో ఓ సారి చూసుకోండి అన్న లాజిక్కును రెడ్డిదొరలు తెరపైకి తీసుకువస్తున్నారు. నిజమే మరి. బాబు క్యాబినెట్‌లో కమ్మ జనాభాకు మించి ఆ కులం వారికి పదవులిచ్చారు. డబ్బులొచ్చే పోస్టులన్నీ వాళ్లకే ఇచ్చారు. కంపెనీలు, కాంట్రాక్టులు, మీడియా యాడ్లన్నీ వాళ్లకే ఇచ్చారు. కానీ మిగిలిన మెజారిటీ పోస్టులన్నీ కమ్మకాని వాళ్లకూ ఇచ్చారు. ఆ విషయంలో ఆయనదో లాజిక్కు మరి! జగనన్న మాత్రం క్యాబినెట్‌లో రెడ్లను తగ్గించి, మిగిలిన అన్ని పోస్టులకూ రెడ్డికార్పెట్ వేస్తున్నారు. ఏవో కొన్ని పోస్టులు మిగిలిన కులాల వారికి ఇస్తున్నారు. బాబు గారు మీడియాలో తన వారికి సామాజిక న్యాయం చేసుకుంటే.. జగనన్న ఇప్పుడు తన మీడియా విషయంలో ‘స్వధర్మం’ పాటిస్తున్నారు. ఇది ఈయన లాజిక్కు మరి! ఏం చేస్తాం. ఎవరి లెక్క వారిది!!!

తాజాగా కడప పెద్దారెడ్డికి ఇచ్చిన సలహాదారు పదవితో కలపి.. రెడ్ల జాబితా, ఒక ఏడెనిమిదొందలు దాటి ఉంటుంది. ప్రస్తుతం ఈ కడప పెద్దారెడ్డిగారు వ్యవసాయంపై ఇచ్చే సలహాలతో, రాష్ట్రం పంజాబ్-పంజాబ్-హర్యానా కంటే వ్యవసాయంలో మించిపోతుందట. బహుశా రైతులకు వ్యవసాయం ఎలా చేయాలి? కాళ్లకు బురద అంటకుండానే వ్యవసాయం ఎలా చేయాలి? గడ్డి వేయకుండానే గేదెలు ఎలా పాలివ్వాలి? అసలు నీళ్లు లేకుండనే పంటలు ఎలా పండాలి? పెస్టిసైడ్లు, ఎరువులు లేకుండా పంటలు ఎలా పండించాలన్న మహత్తర ఆలోచనలను ఇస్తారేమో! ఇప్పుడున్న ఐదారు డజన్ల సలహాదార్లు ఇచ్చిన సలహాలతోనే, రాష్ట్రం ఇంత దివ్యంగా వెలిగిపోతోంది. వ్యవసాయరంగంలో నిష్ణాతుడైన, మరో పెద్దారెడ్డి గారు కూడా సలహాదారుగా వచ్చారు కాబట్టి.. ఇక రాష్ర్టం అభివృద్ధి విషయంలో, పంచకల్యాణి గుర్రం కూడా ఈర్ష్యపడేలా పరుగులు పెడుతుందని ఆశించడంలో తప్పేమీలేదు.

ఎందుకంటే అన్ని తెలివితేటలు, సలహాలిచ్చే స్థాయి పెద్దారెడ్లకు తప్ప, మిగిలిన కులాలకు లేదని జగనన్న ఖాయం చేసినందున.. ఇక ఆ విషయంలో ఎవరూ ఏమీ చేయలేరు. స్వయంగా జగనన్నే.. పెద్దారెడ్లు తప్ప మిగిలిన కులాలు ఏ విషయంలోనూ పనికిరాని వారని, వారికి రెడ్లకు ఉన్నంత బలమైన ‘సామాజిక’ స్పృహ లేదని తీర్మానించిన తర్వాత, ఇక అనుకునేది ఏముంది? ఇలాంటి బలమైన ‘సామాజిక’ న్యాయం చేసిన బాబును ఐదేళ్లు ఎలా భరించారో.. తనదైన ‘సామాజిక’ న్యాయం అమలుచేస్తున్న జగనన్ననూ, ఇంకో మూడున్నరేళ్లు భరించాల్సిందే! చేసుకున్న వాడికి చేసుకున్నంత!! ఏమంటారు?